Previous Page Next Page 
గర్ల్ ఫ్రండ్ పేజి 12

    "దిగులుపడకండి! మన అబ్బాయి తప్పకుండా బాగుపడతాడు-" అంది. వెంటనే వేద చెంప ఛెళ్ళుమంది. జయపాల్ కోపంతో ఊగిపోతూ, "ఏమన్నావ్? మన కొడుకా? స్టే ఇన్ యువర్ ప్లేస్! నీకూ నాకూ వావివరుసలేమిటి? యు ఆర్ జస్టు మై గరల్ ఫ్రెండ్! దట్సాల్!" అన్నాడు గట్టిగా అరుస్తూ.
    ఆనాటివరకూ ఎన్నెన్నో అవమానాలను, కన్నీటిబొట్టు రాల్చకుండా రోషంతో మండిపడుతూ ఎదుర్కోగలిగిన వేద, ఆనాడు మాత్రం కుమిలికుమిలి ఏడ్చింది. ఏమీ చెయ్యలేని గీత తన చేతితో ఆ కన్నీళ్ళు తుడవబోయింది. ఆ చెయ్యి గట్టిగా పట్టుకొని "గీతా! నీకుమాత్రం యిలాంటి దౌర్భాగ్యం కలగనీయను. ఒక్కనాటికీ కలగనీయను-" అంది కన్నీళ్ళ మధ్య.
                                       8
    "అర్ధమయిందా?" అరమోడ్పు కనులతో ఒకవిధమయిన తన్మయత్వంతో తననే చూస్తూ తనమాటలు వింటున్న నీరద్ ని అడిగింది గీత.
    'అర్ధమైంది' మత్తుగా వినిపించిన అతని కంఠానికి ఆశ్చర్యపోతూ "ఏమిటి?" అంది.
    "మాట్లాడుతున్నప్పుడు నీ కంఠం ఎంతో బాగుంటుంది. ఏదో సంగీతం పాడుతున్నట్లు, నీ కళ్ళు నవ్వుతున్నప్పుడు పరుగెత్తే లేడిపిల్ల కళ్ళలా వున్నాయి. చెమ్మగిలినపుడు నీటిలో ఈదే చేపపిల్లలా వున్నాయి. నీ పెదవులు నీ మాటల సంగీతానికి లయబద్ధంగా నాట్యంచేస్తూ...."
    "స్టాపిట్ ...." కోపంగా అతడి ముఖంలోకి చూడబోయి, అమాయకంగా తననే చూస్తున్న అతణ్ణి చూసి నవ్వేసింది. కోపం నిలుపుకోలేక ఆ మెరిసే చూపుల ఆకర్షణనుంచి తప్పుకోలేక__
    కారు విండోలోంచి బయటకు చూసింది. ఎదురుగా బిర్లామందిర్, ఎత్తుగా లైట్లకాంతిలో తెల్లగా తళతళ మెరిసిపోతోంది.
    "అదేమిటి? ఎక్కడికొచ్చాం!" కంగారుగా అడిగింది.
    "మిమ్మల్ని వెంటనే ఇంటిదగ్గర దిగబెడితే మీ కథంతా ఎలా వినగలను? అందుకే రోడ్లన్నీ తిప్పుతున్నాను."
    "భలేవారే? చీకటిపడిపోయింది."
    "అవును!"
    "లైట్లు వెలుగుతున్నాయి!"
    "అదేబాధ!"
    "ఆ?"
    "అదే! ఇంత పొద్దుబోయిందని బాధ!"
    "సరే! ఇక ఇంటిదగ్గర దింపెయ్యండి!"
    "అప్పుడేనా?"
    "అంటే?"
    "ఇంక చెప్పవలసినదేమీ లేదా?"
    గీత కొంచెంసేపు మాట్లాడలేకపోయింది. పొంగివస్తున్న నవ్వును ఆపుకోవటానికి శ్రమపడవలసి వచ్చింది.
    "ఉంది!"
    "ఆ! చెప్పండి. ప్లీజ్!"   
    "ఇంకమీదట నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి!"
    "వాట్?"
    గీత మాట్లాడలేదు.
    "ఇటీజ్ ఇంపాసిబుల్!"
    "ఎందుకని?"
    "నీతో మాట్లాడకుండా నేనుండలేను."
    "నేను మాట్లాడనంటే!"
    "మాట్లాడేలా నేను చేస్తాను.
    "బలాత్కారమా?"
    కాదు. కాదు! బ్రతిమాలుకుంటాను, ప్రాధేయపడతాను."
    "అప్పటికీ వినకపోతే?"
    "సత్యాగ్రహం చేస్తాను."
    "అప్పటికీ వినకపోతే?"
    "అప్పుడిక__ఎత్తుకుపోతాను" అల్లరిగా నవ్వాడు. ఆ నవ్వు చూస్తోంటే ఉత్సాహంతో హృదయం గంతులేస్తోందే తప్ప కోపం రావటం లేదు గీతకి.
    "చెప్పండి! రేపు మీ కాలేజీదగ్గరకి ఎన్నిగంటలకి రాను?"
    "మా అక్కనడిగి చెప్తాను!"
    "నాకు మీ అక్కగారంటే చాలా గౌరవం!"
    "ఎంత?"
    "మీకెంత?"
    "చెప్పలేనంత!"
    "నాకు నువ్వు చెప్పగలిగినంత! నువ్వు చెప్పలేనిది ఆవిడగురించి నాకు తెలియదుగా మరి?"
    మళ్ళీ నవ్వులు.
    "అదిగో, మా ఇల్లు! ఆపేయండి దిగిపోతాను."
    వెంటనే కారు ఆపేశాడు నీరద్. డోర్ తెలుస్తూ "రేపు నాలుగున్నరకి వస్తాను మీ కాలేజీ దగ్గరకి. మీకోసం కాలేజిబయట ఎదురుచూస్తూ ఉంటాను" అన్నాడు. ఏం మాట్లాడకుండా చెయ్యి ఊపి ఇంటివైపు నడిచింది గీత.
    ఆలస్యంగా వచ్చిన గీతను చూసి, ఆరాటంగా, ఆప్యాయంగా, "ఇంత ఆలస్యమైందేమమ్మా! ఇప్పుడే మీ కాలేజికి బయలుదేరి వద్దామనుకుంటున్నాను" అంది వేద.
    గీత బొమ్మలా నిలపడిబోయింది. అబద్దమాడటానికి నోరురాలేదు.
    "అలా నిలబడిపోయావేం? ఏం జరిగింది!"
    "అక్కా! నీరద్ గారు నన్ను బలవంతాన కారులో కూచోబెట్టుకుని హోటలుకి తీసికెళ్ళి__నాకు తెలియకుండా రోడ్లన్నీ తిప్పేసి ఇంటిదగ్గిర దిగబెట్టారు. అందుకే ఆలస్యమైంది."
    "ఛీ! దుర్మార్గుడు! ఉండు వాడిపని...."
    "ఆ! ఆ! ఆయననేమి అనకక్కా! ఆయన చాలా మంచి మనిషి. వాళ్ళ నాన్నలాంటివాడు కాడు."
    మెరుపుకొట్టినట్లయింది వేదకి. చెల్లెలి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. చివరిమాట అనాలోచితంగా అంది గీత. అక్క ముఖంచూసి కలవరపడిపోయింది. "అక్కా!" అంది బేలగా.
    "ముందు బట్టలు మార్చుకురా! అన్నం తిందాం!" శాంతంగా అంది వేద, అక్కచెల్లెళ్ళిద్దరూ కలిసి భోజనం చేస్తున్నారన్నమాటేకాని, ఇద్దరూ ఎవరిలోకంలో వాళ్ళున్నారు. గీత నాలుగయిదుసార్లు తనలో తను నవ్వుకోవటం, గీత లేతబుగ్గలు ఎర్రబడటం, చాలాసార్లు గమనించింది వేద. భోజనాలయ్యాక, చెల్లెలిపక్కగా మరో మంచంమీద పడుకుని "గీతా! నువ్వు చిన్నపిల్లవి - లోకం తెలియదు. నీరద్ కి దూరంగా ఉండమ్మా!" అంది.
    గీత లేచికూచుని అమాయకంగా కళ్ళు పెద్దవిచేసి "నేను మాట్లాడననే అన్నానక్కా! ఒట్టు!" అని తలమీద చెయ్యిపెట్టుకుంది.
    "గుడ్! అదే నాకు కావలసింది." వేద కళ్ళు మూసుకోబోయింది, గీత ఊరుకోలేకపోయింది.
    "కానీ....కానీ....మాట్లాడకపోతే ఆయన నన్ను ఎత్తుకుపోతానన్నారు!" ఆ మాటలు గీత భయంగా అనాలని ప్రయత్నించినా, ఆ పెదవులు నవ్వుతున్నాయి. కళ్ళు మెరుపులు విరజిమ్ముతున్నాయి. చిన్న చిన్న సొట్టలుపడ్డ చెక్కిళ్ళు ఎర్రగులాబీలలా ముచ్చట గొలుపుతున్నాయి.
    "ఆ సంగతి నేను చూసుకుంటానులే! నువ్వు పడుకో," అటుతిరిగి కళ్ళుమూసుకుని పడుకుంది వేద.
    ఏ పరిస్థితి గీతకు రాకూడదని తపస్సు చేస్తోందో అదే విచిత్రంగా మరింత వికృతంగా ఎదుట నిలిచి భయపెడుతోంది. దీనిని మొగ్గలోనే తుంచాలి.
    ఆ మరునాడు జయపాల్ సీసాలుముందు పెట్టుకోకముందే, "మీకొక విషయం చెప్పాలి!" అంది సీసాలు దూరంగా లాగుతూ. ఆ సీసాలు గొంతుకలో పడితే అతను మనిషి కాడు. ఏం మాట్లాడుతాడో అతనికే తెలియదు. ఆ సమయంలో అతను మాట్లాడినవి మరునాటికి గుర్తుండవు సామాన్యంగా!

 Previous Page Next Page