"కాదు-"
"మరి నేను వస్తానని ఎందుకనుకున్నావు?"
"నాకు నా అదృష్టం మీద నమ్మకం..."
ముక్త మాట్లాడలేదు.
"నీకు తెలియను. నువ్వు నాకొక అపూర్వ వరానివి..."
"కానీ నువ్వేనాకు వరమిస్తున్నావు"
"నీకు వరమివ్వగలగడం నా అదృష్టం..."
మంచానికి కాస్త దూరంగా కుర్చీలో కూర్చుందామె.
"అలా కూర్చో-" అంటూ మంచం చూపించాడతడు.
"అప్పుడే కాదు-" అందామె.
"ఎప్పుడైనా ఫరవాలేదు- అసలంటూ ఉంటే..."
"నేనంటే నీ కెందుకింత ఆకర్షణ?"
"నువ్వెందుకింత ఆకర్షణీయంగా ఉన్నావని అడిగితే ఏం చెబుతావు?"
"నాకేం తెలుసు?"
"నావిషయమూ అంతే!"
ఇద్దరూ కాసేపు మాట్లాడుకోలేదు.
"నీకు నేనంటేకాదు - ఆడవాళ్ళంటే ఆకర్షణ! అందుకే రమ తెలివిని మెచ్చుకుని నా తెలివిని ప్రోత్సహించావు..."
భానుప్రకాష్ ముఖం గంభీరంగా అయిపోయింది- "ఇప్పుడలాంటి కబుర్లు వద్దు సరదాగా మాట్లాడుకుందాం!
"సంధ్య ఏం చేస్తోంది?"
"నిద్రపోతుంది. లేవడానికి కనీసంమింకో మూడు గంటలు పడుతుంది-"
"ఇంట్లో ఎవరున్నారు?"
"పని వాళ్ళుకూడాలేరు. సంధ్య కాక మనమిద్దరమే..."
"జరిగింది సంధ్యకు తెలిస్తే...."
"సంధ్యకు తెలియకూడనిది జరుగుతుందా?"
"నేను వచ్చానుగా-" అంది ముక్త ఆమె కళ్ళలో నీళ్ళున్నాయి.
భానుప్రకాష్ ముఖం గంభీరంగా అయిపోయింది- "నేను ముందే చెప్పాను నువ్వు మనస్పూర్తిగా ఇక్కడికి రావాలని!"
"మనస్పూర్తిగానే వచ్చాను....."
"మరి కనులలో నీళ్ళు..."
ముక్త కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుని -"ఇవి ఆనంద బాష్పాలు, నాకు ప్రమోషన్ వస్తుందని!" అంది.
"ముక్తా! బాగా ఆలోచించుకో....నేను కసాయివాడినికాను. నీకిష్టం నిన్ను సమీపించను. నీ భర్తకు ప్రమోషన్ కావాలి. నీకు వైభవం కావాలి. అందుకోసం నీకైనీవే నాదగ్గరకు వచ్చావు. నేను నీభర్తకే అపకారమూ చేయను అతడెప్పటిలాగే ఉంటాడు. అతడి ఉన్నతిని కోరుకుంటే తప్ప నీకిక్కడ నాతో అవసరం లేదు. ఉన్నదానికి మించిన ఆశ నిను నా వైపు నడిపిస్తోంది. ఈ అభిప్రాయంతో నాకు చేరువైతేనే నాకు తృప్తి.." అన్నాడు భానుప్రకాష్.
"ఎందుకిప్పుడివన్నీ?" అంది ముక్త.
"నా సంస్కారాన్నర్ధం చేసుకో. నీతో ఏకాంతం లభించింది గెస్ట్ హౌస్ లో. అది నేనుపయోగించుకోలేదు. నీ అసహాయతనుపయోగించుకోవడం నా అభిమతం కాదు. నాకు నీ తనువు కాదు. నువ్వు కావాలి. నిండు మనసుతో నువ్వు నన్నాదరించాలి. అందుకే నేను నీకు టైమిచ్చాను. నీఅంతట నీవే నా యింటికి రావాలన్నాను. ఇప్పుడుకూడా చెబుతున్నాను...విను...నీకు నీభర్త ప్రగతి అవసరం లేదనుకుంటే వెంటనే తిరిగి వెళ్ళిపో. బాలచంద్రరావు అతడికి బాస్ కావచ్చు. కానీ నీభర్త జీతం తగ్గదు. ఆఫీసులో నేనల్లరి పెట్టడం, అవమానించటం జరగదు. ఆలోచించుకో నీ నిర్ణయంమీద నీ భవిష్యత్తాధారపడి ఉంది. భవిష్యత్తును ప్రకాశవంతంగా చేసుకోవాలనుకుంటేనే యిక్కడుండు.... లేకుంటే..."
ఆలోచిస్తోంది ముక్త.
కారు, బంగ్లా....
"నా అదృష్టదేవతవు నువ్వు..." అని పొగుడుతున్న గౌతమ్.
"నేను నా యిష్టంమీదనే వచ్చాను. నాభర్తకు ప్రమోషన్, వైభవం-అన్నీ కావాలి..."
భానుప్రకాష్ తను వెళ్ళి మంచంమీద కూర్చున్నాడు.
"ఇలా వచ్చి కూర్చో!" అన్నాడతడు.
ముక్త తటపటాయిస్తూనే వెళ్ళి మంచంమీద అతడికికాస్త దూరంగా కూర్చుంది.
"నాకు నువ్వంటే గౌరవం నీ పొందు నా అదృష్టమన్న భావం....ఇవన్నీ మరోసారి నిన్ను కోరవచ్చు. ఇదీ రోజుతో ఆగకపోవచ్చు...."
"ఒక సారికే తప్పు....ఆ తర్వాతెన్నిసార్లు జరిగినా ఆ తప్పు కొత్తది కాదు పాతదే అవుతుంది...."
"చాలా తెలుసుకున్నావు..."
"నీ పరిచయం నా ఆలోచనల స్వరూపాన్ని మార్చేసింది. జీవితంలో పైకి రావడమే నా ఆశయం...."
"చాలా సంతోషం....అయితే ఇక తప్పు చేస్తానన్న భావం విడిచిపెట్టు...."అన్నాడు భానుప్రకాష్.
"అదెప్పుడో వదిలిపెట్టేశాను. కాబట్టే ఇక్కడకు రాగలిగాను."
"సరే - నాకానమ్మకం కలగాలికదా! నేను నిన్ను తాక బోయే ముందు నాలో ధైర్యం కలగాలంటే - కాసేపు - నువ్వీ మంచంమీద పడుకో... ఈగది ఈమంచం అంతానీదే నన్నట్లు ఫ్రీగా...."
అతడి నోటిమాట పూర్తి కాగానే ముక్త పక్కకు జరిగింది. కాసేపామె ఇబ్బందిగా ఫీలయింది.
కాసేపు భానుప్రకాష్ కూడా మంచం మీదనే కూర్చున్నాడు. తర్వాత తనూ పడుకున్నాడు.
ఒకే మంచంమీద-ఒకరికొకరు అభిముఖంగా అతడు - ఆమె!
ఇద్దరూ వివాహితులే....కానీ...
అతడామెకు భర్తకాదు. ఆమె అతడికి భార్యకాదు.
ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు.
సంప్రదాయంలో పుట్టి పెరిగిన ముక్త - సంప్రదాయాన్నికాదని - భర్తకు బదులు పరాయి పురుషుడి పొందుకోరుతుంది.
ఇద్దరూ ఒకరినొకరు చూసుకొంటున్నారు.
మెత్తటి పరుపులు...విరిసిన మల్లెలు....
అతడు...ఆమె...
ఇప్పుడామె తప్పును గురించి ఆలోచించడంలేదు. ఆమె కళ్ళు భానుప్రకాష్ లో పురుషున్ని చూస్తున్నాయి.
ఆమె శరీరంలో సంచలనం ప్రారంభమయింది.
స్త్రీకి పురుషున్ని చూస్తే కలిగే సంచలనమది!
కొద్ది క్షణాల క్రితం వరకు ఉన్న ద్వైదీ భావాలామెలోలేవు.
అతడు తనచేతినామే నడుంమీద వేశాడు.
ఆమె అతడికి దగ్గరగా జరిగింది.
అతడు ఆమెకు దగ్గరగా జరిగాడు.
కౌగిలి....ఉక్కుసంకెలలా యిద్దర్నీ బిగించింది...
అతడి వీపు పడక గది గుమ్మానికభిముఖంగా ఉంది. ఆమె ముఖానికతడి ముఖం అడ్డు.
వెచ్చని ఊపిరి...
ఇద్దరూ కూడా గుమ్మంవద్దనిలబడిన సంధ్యను చూడ్డం లేదు.
సంధ్య అదృశ్యాన్నే చూస్తూ గుమ్మం దగ్గర నిలబడిపోయింది. ఆమె నిశ్చేష్టురాలయిందేమో!
కుసుమకోమలమైన ఆమె చేతులతన్ని తనలోకలుపుకోవాలన్న కోర్కెబలంతో వీపును హత్తుకుంటే....
"ఎవరూ?" అంది సంధ్య.
జంట ఉలిక్కిపడి విడిపోయింది. అయిష్టంగానే ఇద్దరూ లేచికూర్చున్నారు.
ఇద్దరూ సంధ్యను చూశారు.
భానుప్రకాష్ మంచం దిగి తప్పుచేసిన వాడిలా తలవంచుకున్నాడు.
చెదిరిన పైటను సవరించుకుంది ముక్త.
సంధ్య వారిని సమీపించి- "ఏమిటిది?" అంది. ముక్తను పరీక్షగా చూస్తూ "నువ్విలాంటి దానివను కోలేదు...." అంది.
ముక్త మాట్లాడలేదు.
"నీకేమయింది? వళ్ళు కావరమెక్కిందా? డబ్బు కావాల్సొచ్చిందా?" అంది సంధ్య.
"మీవారినడుగు..."
"వారిసంగతినాకు తెలుసు. నీకైనువ్వు వారిని వలలో వేసుకోవాలనుకోకపోతే - ఇలా మాయింటి రావుగదా..."
ముక్త కేమనాలో తెలియలేదు.
తనిలాపట్టుబడి సంజాయిషీ యిచ్చుకోవాల్సుంటుందని ఆమె ఊహించుకోలేదు. అతడు తనను మోసగించాడనీ- ప్రోత్సహించాడనీ ఎలా రుజువు చేయగలదు. తనే వాళ్ళింటికి వచ్చి అతడి పడగ్గదిలో...
జరిగింది తల్చుకుంటుంటే జుగుప్సతో ఆమె శరీరం వణికిపోతోంది. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"ఎందుకీ కల్ల బొల్లి ఏడ్పులు....నాకాపురంలో నిప్పులు పోయాలని చూశావు కదూ!"అ నది సంధ్య.
ముక్త మంచందిగి నిలబడింది.
"ముందు చీర సరిచేసుకో -" అంది సంధ్య.
ముక్త చీరసరిచేసుకోలేదు. ఆమె ముఖం రెండు చేతులతోటీ కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్వసాగింది.
"ఏడుపులో నీ తప్పును కప్పిపుచ్చుకోలేవు..." అంది సంధ్య.
ముక్త తప్పును కప్పిపుచ్చుకోవాలని ఏడ్వడం లేదు. బాధ గొంతులోంచి ఏడుపు రూపంలో బైట పడుతోంది.
హఠాత్తుగా తనలో బలహీనత ప్రవేశించి తనతన్ని కోరిందని ఆమెకర్ధమయింది. తానలా ఎలా మారిపోయిందో తెలియక తన్నుతానే అసహ్యించుకుంటూ బాధపడుతోందామె.
కాసేపటికామె ఏడుపు ఆగింది.
"అక్కా! నావల్ల తప్పు జరిగింది కానీ తప్పు నాదికాదు. ఈ విషయం మీ వారినే అడుగు...." అంది ముక్త
"మావారు నీయింట్లో పట్టుబడితే అది వారితప్పు. నువ్వు మా యింట్లో పట్టుబడితే అది నీతప్పే అవుతుంది..."
"నన్ను క్షమించక్కా!"
"నీవంటివారిని క్షమించడం నాకలవాటే-కానీ నిన్ను నీవి క్షమించుకోగలవో లేదో ఆలోచించుకో...."
ముక్త మాట్లాడలేదు.
"అసహాయతతో తప్పుచేసిన పావనిని నువ్వు క్షమించలేవు. బలహీనతతో తప్పుచేసిన నిన్ను క్షమించుకోగలవా?"
చెళ్ళున కొట్టినట్లయింది ముక్తకు.
"ఆడతనం పడుచుతనం - రెండూ కలిస్తే మగాడికి భరించలేనంత ఆకర్షణ. ఆ ఆకర్షణను విచ్చల విడిగా కొనసాగిస్తే - ఈ సమాజం క్రమశిక్షణను కోల్పోయి ఆటవిక సామ్రాజ్యంగా మారిపోతోంది. స్త్రీ పురుష సంబంధాన్ని క్రమబద్దం చేయడానికి పెళ్ళి అనే సంప్రదాయం ఏర్పడింది. ఆ పెళ్ళి పవిత్రమైనది. స్త్రీ పురుష సంబంధాన్ని కేవలం ఒక జంటకే పరిమితం చెస్థొఇఒ నియమాలేర్పరచింది. మన సంప్రదాయమ్లో పెళ్ళికాని ఆడపిల్ల కొందరికే ఆడపడుచు - పెళ్ళయిన ఆడపిల్ల అందరికీ ఆడపడుచు. ఆడతనాన్నీ పడుచుతనాన్నీ కలిపి ఆడపడుచు అనే పదం తాయారు కావడం మన సంప్రదాయంలోని ప్రత్యేక విశేషం. పెళ్ళయిన ఆడది ఇతర స్త్రీలందర్నీ ఆడపడుచులుగా భావించి సానుభూతితో అర్ధం చేసుకోవాలి. భర్త తప్ప తక్కిన పురుషులందరికీ ఆడపడుచు కావాలి. ఇదీ మన సంప్రదాయం చెబుతుంది. స్వార్ధపరులు మనచుట్టూ వలలు పన్నుతూండే ఈ సమాజంలో, స్వార్ధం మనను దేనికైనా ప్రోత్సహించే ఈ వాతావరణంలో - సంప్రదాయాన్ని పాటించడమెంతో కష్టమైన విశేషం. అది గ్రహించి సంప్రదాయం పాటించలేక పోయిన సాటివారిని సానుభూతితో అర్ధం అర్ధం చేసుకోవాలి. సంప్రదాయం పాటించడానికి మనం కఠోర ప్రయత్నాలు చేయాలి. మన స్నేహం ఎప్పటిలాగే కొనసాగుతుంది. పావని నాదరించినట్లే నేను నిన్నూ ఆదరిస్తాను. నీ తప్పుకితరులను తప్పు పట్టకు. జరిగింది మర్చిపోయి ఇకముందిలాంటిది జరక్కుండా జాగ్రత్తపడు. ఈ ఒక్కరోజులో నీవు పాపాత్మురాలివి కాలేదు. ఈ రోజుకు ముందు నీవు పుణ్యాత్మురాలివీ కావు. అది గుర్తుంచుకుని మసల గలిగితే చాలు. ఇక నీవు వెళ్ళొచ్చు..."
ముక్త చీర సవరించుకుంది, నిండుగా పైట కప్పుకుంది. భారంగా అడుగులు వేస్తూ అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
కార్లో లిఫ్టిస్తానని భానుప్రకాష్ అనలేదు.
కావాలని ముక్త అడగలేదు.
ఆమె వెళ్ళిపోగానే సంధ్య భర్త పాదాలకు వంగి నమస్కరించింది. అతడామెను లేవదీస్తూ - "ఏమిటిది?" అన్నాడు.
"మీవంటిమహాత్ముడి పాదాలకు వంగి నమస్కరించడానికి ముక్త వెళ్లేవరకూ ఆగాల్సొచ్చిందని బాధగా ఉంది-" అంది సంధ్య.