సినిమా చూపిస్త మామ
నాకు చిన్నప్పట్నుంచీ సినిమాల పిచ్చి. కాకపోతే టిక్కెట్లు సంపాదించడం, సినిమాచూడడం అన్నది ఓ పెద్దఆర్ట్, సైన్సు నా ఉద్దేశంలో. ఆ రోజుల్లో బాపట్లలో రెండు సినిమా హాల్స్ ఉండేవి. ఒకటి చిత్రకళామందిరం, రెండోది దుర్గకళా మందిరం.
ఒకటి వినపడదు, రెండోది కనపడదు అని ఆ రోజుల్లో అందరూ అనుకునే వాళ్ళు. దుర్గకళా మందిరం రైలుపట్టాల అవతల ఉండేది. నేను, మా అమ్మ సినిమాకి వెళ్తే రిక్షాలో వెళ్ళేవాళ్ళం.
దారిలో రైలుగేటు పడిపోయేది. నాకు గుండెల్లో బాధ సినిమా మొదలైపోతుందేమో అని. తర్వాత శ్రీనివాస మహల్ అనే కొత్తసినిమా హాల్ వచ్చింది. ఆరోజుల్లో నేల,బెంచి,కుర్చీ,రిజర్వుడు 4 క్లాస్లు ఉండేవి. మన క్లాసు చెప్పేదేముంది నేలే కదా!
ఆ రోజుల్లో ఎవరన్నా డాక్టర్ గారు సినిమాకి వస్తే మధ్యలో ఆయనకోసం పేషెంట్లువచ్చారని స్లైడ్ వేసేవాళ్ళు, సినిమా ఆపి.
నేను అప్పుడే ఫిక్స్ అయిపోయా నా స్లైడ్ కూడావేయించుకోవాలని. గుంటూరులో సినిమా హాల్స్ ఎక్కువగా ఎయిర్ కూల్డ్ అంటే పేదవాళ్ళ ఎయిర్ కండిషన్ అన్నమాట. సినిమా అయ్యేసరికి చొక్కాలన్నీ తడితడి. ఒక్కోసారి ఎండాకాలంలో ఏసీపనిచేయకపోతే పిండుకోవాల్సివచ్చేది. ఇంకో కర్మ చొక్కాలు అన్నీ సిగరెట్టు కంపు.
మాపితృదేవుడు ఇంటికి రాగానే దగ్గరకిపిలిచి వాటేసుకున్నట్లు ప్రేమగా చొక్కా వాసన చూసేవాడు. మనమేం తక్కువ తిన్నామా స్పేర్ షర్టు మనదగ్గర ఎప్పుడూ హాజరుకదా. తెల్లచొక్కాలు వాటిఉపయోగాలు మరోసారి మాట్లాడుకుందాం.
మెడికల్ కాలేజీకి చాలామంది కుర్రవెధవలు వస్తుంటారు. కానీ నా లాంటి కొద్దిమంది మాత్రమే అమ్మాయిల గుండెల్లో బాహుబలిలాంటి స్థానాన్ని సంపాదిస్తారు. అదేమీ అంత తేలికైన పనికాదు అండి బాబోయ్.
కాలేజీలో స్టేటస్ పెరగాలంటే మొట్టమొదటిగా కమలహాసన్ సినిమా మొదటిరోజు మొదటిఆట కనీసం పదిమంది అమ్మాయిలకి టిక్కెట్లు సంపాదించి నువ్వు వెనక్కి వచ్చేయాలి.
"మన్మథలీల, వయసు పిలిచింది, అందమైన అనుభవం, ఆకలి రాజ్యం" ఇలాంటి సినిమాల ప్రయాణంలో మన టిక్కెట్లు సంపాదించే నైపుణ్యత మరో లెవెల్ కి ఎదిగి మన ప్రతిభాపాటవాలు లేడీస్ హాస్టల్ లో హాట్ టాపిక్ గా అయ్యింది అంటే మీరు నమ్మక తప్పదు. మా కాలేజీ పక్కనే ఉన్న రంగ మహల్ లో. ఆ సినిమాహాలు లోపలికి ఎలా వెళ్ళాలో బయటికి ఎలారావాలో ఎవరికీతెలియదు అందుకే రంగమహల్ రహస్యం అనేవాళ్ళు దాన్ని.
'సొమ్మొకడిది-సోకొకడిది' సినిమా రిలీజైన రోజు యథాతధంగా ఉదయాన్నే ఆసుపత్రి ఎగ్గొట్టి మనకున్న రాజకీయంతో 10 టిక్కెట్లు సంపాదించి అమ్మాయిలు అందర్నీ పోగేశాను. టిక్కెట్లు లాఘవంగా సంపాదించిన నా అసిస్టెంటు రంగమహల్ రహస్యాన్ని చేధించలేకపోయాడు. మొదటి అంతస్తులో ఇరుక్కుపోయి అక్కడినుంచి తుఫాను ఆహార పొట్లాలు విసిరినట్లు టిక్కెట్లు కిందికి విసిరేశాడు.
ఇక చూడండి నిజమైన తుఫానులో వెంటపడ్డట్టు తలా ఒక టిక్కెట్టు తీసేసుకున్నారు దొరికినవాళ్ళు. నా మహిళా బృందానికి ఒక్కటిక్కెట్ దొరికితే ఒట్టు. కన్ను తెరిచే లోపల ఆ పదిమంది లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళకు నేను ఏ రోజునో రుణం ఉండి ఉంటాను. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే టిక్కెట్లు పోయె, డబ్బులుపోయే అమ్మాయిల ముందు పరపతిపోయె. 'సొమ్మొకడిది సోకొకడిది' సినిమా పేరు ఖచ్చితంగా సరిపోయింది.
మళ్ళీ లేడీస్ హాస్టల్ లో మన పేరు చిరస్థాయిగా నిలవడానికి మూడునెలలు రాత్రనకా, పగలనకా కష్టపడి ఓ సంఘం స్థాపించి నా వనిత స్నేహితులందరికీ నాకు చేతనైనంత సహాయం చేసి బోల్డంత పుణ్యం సంపాదించుకున్నానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను ఆ రోజు స్థాపించిన సంఘం 40 ఏళ్ళ తర్వాతకూడా ప్రతి మెడికల్ కాలేజీలో 3 matinee లు, 6 ఫస్ట్ షోలు లాగా వర్ధిల్లుతోంది.
ఇంతకీ ఆ సంఘం పేరు ఆ.వి.టి సంఘం...సారీ అ.సి.టి సంఘం...అమ్మాయిల సినిమా టిక్కెట్ల సంఘం. కాలేజీలో ముందుకుపోతున్నకొద్దీ కొంచెం మెళుకువలు నేర్చుకుని చివరకు అమ్మాయిలతోనే టిక్కెట్లు తెప్పించుకునే సదుపాయం సంపాదించ గలిగాను. చదువులన్నీ దాటి, సినిమా టిక్కెట్లు తీసుకున్న అమ్మాయిల ఆశీస్సులతో ఓ సంసారం, ఉద్యోగం, ఆసుపత్రి సంపాదించుకున్న తర్వాత కూడా సినిమా పిచ్చి అయితే వదల్లేదు.
గత 20 ఏళ్ళుగా హైదరాబాదులో 90 శాతం ఐమాక్స్ లోనే సినిమాలు చూడటం జరుగుతోంది. అ.సి.టి సంఘంద్వారా నేను చేసిన మంచి పనులు దేవుడు గుర్తించి ఈ రోజు నాకు ఓ అద్భుతమైన వ్యక్తి వసంత ప్రసాద్ గారిని పరిచయం చేశాడు. వసంత ప్రసాద్ గారు ఐమాక్స్ సినిమా థియేటర్లకి జనరల్ మేనేజర్.
ఆయన కుటుంబంలో ఒక వ్యక్తిలాగా ఎంతో ఆప్యాయంగా, సినిమాకి వెళ్ళాలి అంటే చాలు, ఏ రోజైనా ఎంత లేట్ అయినా టిక్కెట్లు రెడీచేసి పెడతారు ఇంతకంటే ఇంకేం కావాలి నాలాంటి సినిమా పిచ్చోడికి. అందుకనే వసంత ప్రసాద్ గారితో ఒకసారి అన్నాను.... ఈ ఇరవైఏళ్ళ హైదరాబాద్ జీవితంలో నాకు అత్యంతగా సహాయం చేసి నా గుండెల్లో పీట వేసుకుని కూర్చున్న ఓ ఐదుగురు పేర్లు చెప్పమంటే దాంట్లో మీరు ఉంటారు సార్ అని.
నా చిన్నప్పుడు 'లక్ష్మీ నివాసం' సినిమాలో మొదటి ఆటకు టిక్కెట్లు దొరకలేదని కోటీశ్వరుడు కృష్ణ రెండో ఆట సినిమా హాల్ మొత్తం బుక్ చేసి తను తన స్నేహితులు చూస్తారా సినిమా.
ఇప్పుడు మనకి అంత రేంజ్ లేకపోయినా సినిమా డైరెక్టర్లు, బంధువులు అవడంవల్ల హాస్పిటల్ స్టాఫ్ మొత్తానికి సినిమా హాల్ బుక్ చేసి సినిమా చూపించడం వీలవుతుంది.
ఇంకా కావాలంటే CUBE హోమ్ థియేటర్ లో పెట్టుకుని కొత్త సినిమా ఇంట్లోనే చూడొచ్చు. మీరు ఎన్నైనా చెప్పండి ఆ రోజుల్లో పరిగెత్తి శెనక్కాయలు తింటూ నేలలో కూర్చుని 'రౌడీ రాణి' చూసిన ఆనందం ఇప్పుడు రావడం లేదు.
* * * * *