"అత్తయ్యకు నమస్కరించి వ్రాయునది. మావయ్యగారికి ఒంట్లో బాగోలేదని సరళ చీటికీ మాటికీ పుట్టింటికివచ్చి వారాలతరబడి అక్కడే తిష్టవేయడంతో హోటలు భోజనం మూలంగా నా ఆరోగ్యం చెడిపోతూంది. రేపు మీ దగ్గరకొస్తున్నాను. సరళకి యీలోగా మీరు కాస్త నచ్చచెప్పండి. లేదా ఆ బాధ్యత సోదరి పావనికి అప్పచెప్పండి. దాంపత్యానికి సరైన నిర్వచనం తెలిసిన అరుదైన స్త్రీగా ఆమె నాకు సహకరించగలదన్న నమ్మకముంది. అసలు బయలుదేరి ఇప్పటికి పదిరోజులయిందే, ఇన్నాళ్ళూ అక్కడేం చేస్తున్నట్టు..."
కోడలూ, నానీ అప్పటికే గుడికెళ్ళడంతో సరళని ఓ మూలకి తీసుకుపోయి "జవాబు చెప్పవేం" అంటూ నిలదీసింది.
సరళ తలవంచుకునే అంది. "ఇంటినుంచి బయలుదేరాక ఓ ఎనిమిది రోజులుపాటు రాజారావుతో కలిసి హోటల్లో వున్నానమ్మా."
తలపట్టుక్కూర్చుందిపోయింది కాంతమ్మ.
ఇప్పుడేం చేయాలి? ఆమెను కలతపెడుతున్నది కూతురి బ్రష్టిత్వం కాదు.
పావనిమీద ఇంత గౌరవభావంగల సుదర్శన్ పదిరోజులక్రిందటే సరళ బయలుదేరిందన్న ప్రసక్తి తీసుకువస్తే చాటుగానైనా రహస్యాన్ని బయటపెట్టి కొంపముంచకుండా వుంటుందా అని...
నిన్నటితరానికి చెందినదైనా కాంతమ్మ అవగాహన లేనిమనిషి. అందుకే పావని అవకాశం తీసుకుంటుందని భయపడింది.
వైయక్తిక జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి సాంఘిక జీవనానికి ఎదురు తిరగడం చేతకాని తెలివైన నిన్నటితరానికి చెందిన ఆడదిమాత్రమే అని పావనిగురించి ఆలోచించకపోవడం కాంతమ్మ చేసుకున్న దురదృష్టమే.
అందుకే వెంటనే గుర్తుచేసుకుంది. భర్తని కాదు... కొడుకుని.
తల్లీ కొడుకులు ఒక కోణంలో ఆలోచించడంతో ఆ దేవాలయంలో అణువంతైనా మిగిలివున్న దైవత్వం సమాధి కావడానికి తొలి అంకురం ఏర్పడిపోయింది అప్పుడే.
సరిగ్గా ఆ క్షణంలోనే...
* * *
ఎవరూ పట్టించుకోని నానీ పుట్టినరోజునాడు కొడుకు పేరున ఆలయంలో అర్చన చేయిస్తున్నప్పుడే పావని కుడికన్ను అదిరింది.
అదికూడా కాదు ఆమెను మరింత ఆందోళనకి గురిచేసింది.
దేవుడి హారతి పళ్లాన్ని పూజారి తన ముందుంచినప్పుడు కళ్ళకద్దుకుంటుంటే దైవికంగా అతని చేయిజారి పళ్ళెం నేలపై పడిపోయింది.
ప్రపంచంగురించి పూర్తిగా తెలీని నానీ ఇది మామూలుగా తీసుకున్నా పావని మాత్రం రెప్పవాల్చకుండా గర్భగుడిలోని రాముడిని చూసింది.
నీళ్ళునిండిన కళ్ళతో సీతమ్మ విగ్రహాన్ని గమనిస్తూ "నేను బంగారులేడిని కోరడంలేదమ్మా... వున్న ఒక్క పసికందు నూరేళ్ళు నిశ్చింతగా బ్రతికేట్టు ఆశీర్వదించమంటున్నాను. గుండెలు పగలగొట్టుకుని నిన్ను అక్కున చేర్చుకున్న భూదేవిలాంటి అమ్మ లేదు నాకు. కాని అంతశక్తిగల అమ్మగా నా బిడ్డను రక్షించుకోవాలనుకుంటున్నాను. పోనీ శక్తికూడా వద్దు. ఆమాత్రం అదృష్టం దక్కించు చాలు" అనుకుంది మనసారా చేతులు జోడించి.
కళ్ళు తిరిగినట్టయి గుడివారన ధ్వజస్థంభం దగ్గర చతికిలబడిపోయింది.
"ఏమైందమ్మా" భయంగా అడిగాడు నానీ అమ్మకళ్ళలోకి చూస్తూ.
ఏమౌతున్నదో తెలీని శంకతో కుమిలిపోతున్న పావని కొడుక్కేమని జవాబు చెప్పగలదు!
"నాన్నా నానీ..." ఆర్తిగా కొడుకును గుండెలకు హత్తుకుంది. "నేను నేర్పిన కథలన్నీ నీకు గుర్తు వున్నాయి కదూ ."
"ఓ" కళ్ళను వెడల్పు చేసుకుంటూ జవాబు చెప్పాడు.
"అపరాత్రివేళ భయమేస్తే..." స్వప్నంలోలా అడుగుతూంది.
"వెయ్యదమ్మా... నువ్వుంటావుగా."
"నేను లేను అనుకో" ఆమెగొంతు వణికింది.
"ఎందుకనుకోవాలి?"
"మంచి నానీవి కాబట్టి" అదే అమ్మ ఉపయోగించే చివరి అస్త్రం...
"దేవుడిపాట పాడుకుంటా భయమెయ్యకుండా."
"వేళకి అన్నం పెట్టకపోతే."
"ఆకలిపాట పాడుకుంటాను."
"ఎవరూ నిన్ను దగ్గరకు తీసుకొని ముద్దాడలేదనుకో."
"అమ్మ పాట పాడుకుంటా."
"ఏడుపొస్తే..."
"నవ్వుపాట పాడుకుంటాను" ఒక్కో జవాబుకి నానీ కళ్ళఅంచుల నుంచి ఒక్కో నీటిబొట్టు రాలుతుంటే ఇక నిభాయించుకోలేనట్టు ఉద్వేగంగా నానీని దగ్గరకు తీసుకుని చెంపలనీ, నుదురునీ, తలనీ ముద్దులతో ముంచేసింది.
అమ్మకళ్ళు తుడుస్తూ "ఇప్పుడా పాటలన్నీ ఎందుకమ్మా" అడిగాడు దిగులుగా.
"గుర్తున్నాయో లేదో అని."
"మరిచిపోనుగా..." ఒఅ క్షణం విప్పారిత నేత్రాలతో తల్లిని చూసి "ఇప్పుడేమైందని" అన్నాడు.
"పొద్దుగూకేట్టుంది" మేఘావృతమైన ఆకాశాన్ని, ఏదో ఆందోళన్ని కలిగిస్తున్న ప్రకృతినీ చూస్తూ జవాబిచ్చింది.
"అయితే వెళ్ళిపోదామా"
లేచింది... గుడిప్రాంగణం దాటి బయటికొచ్చాక వెనక్కి తిరిగి మరోమారు చూసింది. గర్భగుడివేపు. ఆ చూపులో తిరిగి వస్తానో మళ్ళీ ఎప్పుడైనా చూడగలగుతానో తెలీని అపనమ్మకం... రాకపోతే నాని జాగ్రత్త అంటూ సీతమ్మకు చెప్పే చివరి విన్నపం.
ఇంటికొచ్చేసరికి ఇల్లంతా బోసిపోయినట్లయింది.
సరళగాని, అత్తయ్యగాని ఎవరూ కనిపించలేదు పావనికి.
వాళ్ళుకాదు నానీకి ముఖ్యులు.
దేవుడి ప్రసాదాన్ని అందుకుని సరాసరి తాతగదిలోకి పరుగెత్తాడు.
"ఏంట్రా నానీ భడవా... నీ పుట్టినరోజునాడు ఇంతసేపు నన్నొదిలి బయట తిరుగుతున్నావా" ప్రేమగా మందలించాడు.
"అయ్యో. నేను బయట తిరగటంలేదు తాతయ్యా. రాముడి గుడికెళ్ళాను అమ్మతో.."
"దేవుడ్ని ఆశీర్వదించమన్నావా?"
"అదంతా అమ్మ చూసుకుంది. నేనేమో రాముడికి నీ గురించి చెప్పాను."