Previous Page Next Page 
గ్రాండ్ మాస్టర్ పేజి 11


    "చెప్పు"

 

    "శమంత్ కి సహాయపడింది నువ్వేకదూ."

 

    శ్రీహర్షకి అర్థమౌతుంది క్రమంగా.

 

    "అయితే"

 

    "చూస్తుంటే వూరికి కొత్తవాడిలా వున్నావ్"

 

    "సంగతేమిటో చెప్పు."

 

    "ఈ దేశంలో పదికాలాలపాటు బ్రతకాలనుకున్నవాడెవడూ మహేంద్రకి వ్యతిరేకంగా నడవడు."

 

    "ఇక పరిచయాలు చాలు". కోపాన్ని నిభాయించుకుంటూ "సంగతేమిటో చెప్పు" అన్నాడు శ్రీహర్ష.

 

    "కంగారుపడకు. విషయాన్ని యిలా సూటిగా మాట్లాడగల సత్తు వున్నవాళ్ళం. మా అయిదుగురు వ్యక్తులూ యిప్పుడు పోలీసు కస్టడీలో ట్రీట్ మెంటు తీసుకుంటున్నారు. ఆ స్పాట్ కి సిద్ధపడింది వాళ్ళే అని నువ్వు గుర్తుపట్టి సాక్ష్యం చెప్పకూడదు. అదేదో పెద్ద ప్రమాదమని కాదు. నీ ఆరోగ్యానికి మంచిదికాదు. అంతే."

 

    శ్రీహర్ష నిగ్రహాన్ని కోల్పోయిందిక్కడే.

 

    అయినా తమాయించుకుంటూ అభినందనలూ చేతిని శంకర్ భుజంపై వేసాడు. అది అతడు విడిపించుకునేలోగానే అతడి మెడని చేరుకుంది.

 

    "యూసీ మిస్టర్ శంకర్" మృదువుగా అన్నాడు. "నీ గురించి నువ్వు పరిచయం చేసుకున్నావ్. ఇట్స్ నైస్." పిడికిలికాదు. శ్రీహర్ష బొటనవ్రేలు చూపుడువేలు కొద్దిగా బిగుసుకున్నాయి.

 

    ఆమాత్రం పట్టుకే నరాలు జివ్వుమన్నాయి శంకర్ కి. "చుట్టూ పోలీసులు ఉన్నారు కాబట్టి యిక్కడ నా బలాన్ని ప్రదర్శించదలుచుకోలేదు."

 

    శంకర్ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.

 

    "నిజానికి నేనీ వూరివాడ్ని కాదు. ఈ వూరిలో పది కాలాలపాటు బ్రతకాలన్న ఆశ కూడా నాకులేదు. అంతకుమించి పోలీసుల్ని, చట్టాల్ని నమ్మి వాటి ఆధారంతో ఏదో చేయాలన్న ఆలోచన కూడా నాకు లేదు. కాబట్టి నేను అలాంటి సాక్ష్యాలకు సిద్ధపడను. ఇకపోతే నన్ను హెచ్చరించావు కాబట్టి నా మాట కూడా విను. "ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ డిప్యూటీ ప్రైం మినిస్టర్ అండ్ హిజ్ సన్" నేను కావాలి అనుకుంటే యిలా నీ మెడుల్లా అబ్లాంగేటా లాగి నిన్ను లిప్తల్లో నేలకూల్చగలను" పట్టు మరింత బిగుసుకుంది.

 

    ముందుకు రాబోయిన శంకర్ అనుచరుల్ని చూస్తూ అన్నాడు నెమ్మదిగా "అక్కడే ఆగండి. లేకపోతే యీ సీను చుట్టూవున్న పోలీసుల దృష్టిలో పడే ప్రమాదముంది. అది మీకూ మంచిది కాదు."

 

    ఆగిపోయారంతా.

 

    శ్రీహర్ష చేతిని వెనక్కి తీసుకున్నాడు.

 

    "శాంపుల్ గా యిది చూపించాను నేస్తం. సో... వెళ్ళి నీ మహేంద్రకి చెప్పు. నా జీవితం నాది. నా మార్గం నాది. నన్ను బలవంతంగా ఆ ముగ్గులోకి లాక్కండి. అలా అయితే నీ ఉపప్రధాన మంత్రి తొడలు విరిచేయగలను. పంతంలాంటిది వస్తే అతని పుర్రెని లాగి ప్రధానమంత్రికి పార్శిల్ గా పంపగలను. వెళ్ళండి. మళ్ళీ నా దారిలోకి రాకండి."

 

    శ్రీహర్ష ఎవరో అక్కడెవరికి తెలీదు. అతడేస్థాయి నేరస్థుడో వారి వూహకి సైతం అందనిది. ఓ అంతర్జాతీయ నేరస్థుడిగా మూడు కాంటినెట్స్ పోలీసులకి నోటెడ్ కాగలిగిన శ్రీహర్ష యిక్కడ చాలా సాత్వికతని ప్రదర్శించినా...

 

    అతడు సామాన్యుడు కాడని, అతడ్ని దారిలోకి రప్పించడం సాధ్యంకాదని బోధపడింది.

 

    ఈ కథ యిలాంటి మలుపులు తిరగటానికి శ్రీహర్ష అసలు బాధ్యుడు కాదు. కాని చాలా యాదృచ్చికంగా చిత్రమైన వలయాల్లో ఇరుక్కుపోతున్నాడు.

 

    నిజానికి యిక్కడ వ్యవస్థల్ని సంస్కరించాలని లేదతడికి.  

 

    అయినా ఒక బలమైన వ్యవస్థకి ప్రత్యర్థిగా మారిపోయాడు.

 

    "నీ ఫ్రెండా అంకుల్?"

 

    లల్లూ వచ్చింది మధ్యలోకి.

 

    వెళ్ళిపోతున్న వ్యక్తుల్ని చూస్తూ అన్నాడు శ్రీహర్ష "అవునమ్మా౧ ప్రాణ స్నేహితులు."

 

    "అంటే."

 

    "మీ డాడీ ప్రాణం తీయాలనుకున్నవాళ్ళు. యిప్పుడు నాకోసం స్నేహంగా ప్రాణం యివ్వాలనుకుంటున్నవాళ్ళు" అనలేదు. అనుకున్నాడు వెళుతున్న జీప్ ని చూస్తూ.

 

    "మీ డాడీ ఎలా వున్నారు?" అడిగాడు ప్రసక్తిని మళ్ళిస్తూ.

 

    "ఇంకా కళ్ళు మూసుకునే పడుకున్నారు" అన్యమనస్కంగా అంది. నీకు తెలుసా అంకుల్. "మా డాడీ మంచిడాడీ."

 

    "నిజమా"

 

    "మరేం. కాని ఎక్కువ అబద్ధాలు చెబుతారు"

 

    "అదేమిటీ" విస్మయాన్ని నటించాడు శ్రీహర్ష.

 

    "మరేమో ఈసారి హైద్రాబాద్ వెళ్ళినపుడు బోలెడన్ని టాయ్స్ కొంటానన్నాడుగా..."

 

    మనసు చివుక్కుమంది శ్రీహర్షకి. ట్రైన్ లో బొమ్మల్ని చుట్టూ పేర్చుకుని ఎంత అపురూపంగా వాటిగురించి చెప్పింది గుర్తుకొచ్చింది.

 

    "చాలా కొన్నారు లల్లూ, కాని అన్నీ ట్రయిన్ లోనే వుండిపోయాయి.

 

    "ప్రామిస్."

 

    లల్లూ చేతిలో చేయివేసాడు.

 

    "భద్రంగా తెచ్చి ఉండాల్సింది అంకుల్."

 

    "డాడీని తీసుకొచ్చారుగా లల్లూ" రేవతి జోక్యం చేసుకుంది. ఆ వాక్యం అనేటప్పుడు రేవతి కళ్ళలో గిర్రున తిరిగిన నీళ్ళను చూస్తూ తల తిప్పుకున్నాడు శ్రీహర్ష.

 

    "అవునన్నయ్యా, మీరేలేకపోతే" దుఃఖాన్ని నిగ్రహించుకునే ఆమె ప్రయత్నం వెక్కిళ్ళరూపంలో వినిపిస్తూంది "ఆయన ఏమయ్యేవారు. మా బ్రతుకులేమయ్యేవి."

 

    "ఒక్కసారికాదు. వందసార్లయినా చెప్పాను. మీరొక్కరు నిజాయితీగా ఉంటే దేశం వుద్ధరింపబడదూ అంటూ నెత్తీనోరు బాదుకున్నాను. కాని ఆయన వినరు. మొండితనాన్ని ప్రదర్శిస్తూ శత్రువుల్ని పెంచుకున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని వూహిస్తూనే వున్నాను. మీకు తెలీదన్నయ్యా. ఆయనపై ఏ స్థాయివ్యక్తులు పగ పెంచుకున్నదీ మీరూహించలేరు..."

 

    చాలా స్పష్టంగా కొన్ని క్షణాల క్రితమే అతడికి బోధపడిపోయింది.

 

    "నేరస్తులు విచ్చలవిడిగా తిరుగుతూ ఈ నగరంలో ఎలాంటి దారుణాలు చేయగలుగుతున్నదీ ప్రతి పోలీసాఫీసరుకీ తెలుసు. ప్రతి మనిషికీ తెలుసు. అయినా ఎవరూ అడ్డంపడరు. కారణం యిక్కడ నేరవ్యవస్థలు చట్టాన్ని శాసిస్తుంటాయి కాబట్టి."

 Previous Page Next Page