Previous Page Next Page 
ఒకే రక్తం ఒకే మనుషులు పేజి 10


    "అనుకుంటున్నదే అనుకో ఎప్పుడో అప్పుడు చేసెయ్యాలిగా మళ్ళీ మూఢం వస్తోంది అదీగాక సుందరం నాటకాలపిచ్చి నీకు తెలియనిది కాదుగా ఆ నాటకాల్లో వేషాలేసే అమ్మాయిలూ వాళ్ళూ చనువుగా వుండటం అదీ చూస్తే ఒక్కోసారి భయమేస్తుంది. తొందరగా ముడిపెట్టేస్తే ఎందుకైనా మంచిదని..."
    
    "ఏం వాడేమన్నా కలాపంలో పడ్డాడేమిటి?"
    
    "అబ్బే! అదేం లేదనుకో మనం ముందుగానే జాగ్రత్తపడితే మంచిదికదా?"
    
    ముందుజాగ్రత్త విషయంలో పుండరీకాక్షయ్యగైర్కి అశ్రద్ద ఏమీలేదు. సుందరంమీద ఆయనకీ చిన్నప్పట్నుంఛీ ప్రేమాభిమానాలు ఎక్కువ. లక్ష్మీపతి బావకి ఆస్తిపాస్తులేం తక్కువలేవు. పైగా నిష్కల్మషమైన హృదయం గల మనిషి సుందరం, బేబీలకి ఈడు జోడు.
    
    "దాన్దేముందమ్మా? మనం ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే బావని రమ్మని వైరియ్యి ముహూర్తం పెట్టించేద్దాం."
    
    యశోద ముఖం చాటంతయింది. ఈ వార్త వదినగారితో చెప్పటానికి గబగబా లోపలికెళ్ళింది.
    
                                                           * * *
    
    గిరిజ కాలేజీ విడిచిపెట్టేశాక సరోజకి టాటా చెప్పి బస్సులో యింటికి బయల్దేరింది. లోపల చాలామంది బాయ్ స్టూడెంట్సున్నారు. వాళ్ళచూపులనీ అల్లరినీ అలవాటు ప్రకారం భరిస్తూ ఆమె తాను దిగాల్సిన చోటువరకూ ప్రయాణం చేసింది. అక్కడ్నుంచి ఇంటికి ఫర్లాంగుకి పైగా నడవాలి.
    
    కాలంతా నొప్పిగానే వుంది. అడుగులు జాగ్రత్తగా పట్టి పట్టి వేయాల్సి వస్తోంది. తేడా కనిపెట్టేసి వెనక నడుస్తున్న స్టూడెంట్లు ఎగతాళి చేస్తారేమోనని మామూలుగా కనిపించటానికి ప్రయత్నిస్తోంది.
    
    ఇంతలో "బేబీ!" అంటూ ఎటువైపునుంచి వచ్చాడోగాని సుందరం ప్రక్కకి చేరాడు.
    
    గిరిజకి ప్రాణం చచ్చిపోయినట్లయింది. ఇంట్లో చనువుగా ఎంతో సన్నిహితంగా వుండే ఈ బావే యిప్పుడు కొత్తగా, భయపడేటట్లుగా కనిపించాడు.
    
    "రోడ్డుమీదేమిటి బావా! దూరంగా వెళ్ళిపో" అంది కంగారుగా.
    
    "రోడ్దయితే తప్పేమిటి? నేను పరాయివాడ్నా?" అన్నాడు సుందరం పెంకెగా.
    
    సుందరంకూడా స్టూడెంటే. బి.ఏ. ఫైనలియర్ చదువుతున్నాడు. నాటకాల మీద వ్యామోహంవల్ల చదువాలస్యమయింది. అయినా కుర్రాడిలాగే వుంటాడు. చురుగ్గా, అందంగా, ముఖంమీదపడే జుట్టుతో కులాసాగా కనిపిస్తాడు. ఇతను తనతో అంత దగ్గరగా మాట్లాడుతూంటే వెనకాలే నడచి వస్తోన్న స్టూడెంట్లేమనుకుంటారు?
    
    "పరాయివాళ్ళం కాదులే అయినా యింట్లో మాట్లాడుకోవచ్చుగా! ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?" అంది తొందర తొందరగా నడవటానికి ప్రయత్నిస్తూ.
    
    "ఇంట్లో మాట్లాడుకోవటానికి అస్సలు వీలుండటంలేదు. నీతో కొంచెం మాట్లాడాలి."
    
    ఆమె ఓసారి తల అటూ ఇటూ త్రిప్పి బెదురుగా చూసింది. వెనక వస్తోన్న కాలేజీ కుర్రాళ్ళు తప్పిస్తే తెలిసిన వాళ్ళెవరూ కనిపించలేదు.
    
    "ఏం మాట్లాడతావో తొందరగా చెప్పు" అంది కోపంగా.
    
    "నామీద కోపం పోయిందా లేదా చెప్పు?"
    
    "ఇదేనా నువ్వు మాట్లాడేది?"
        
    "ఇంకా వుందిలే, చెప్పవా?"
    
    "ఆఁ, పోయిందిలే" అన్నది ప్రాణం విసిగి.
    
    వెనకనుంచి నవ్వులూ, అల్లరిమాటలూ వినిపిస్తున్నాయి.
    
    "నీకేం నువ్వు బాగానే వుంటావు. వెనకనుంచి చూశావా వాళ్ళగోల. రేపట్నుంచీ నన్నాట పట్టిస్తారు" అంది మళ్ళీ.
    
    "ఏడిశారు" అన్నాడు నిర్లక్ష్యంగా.
    
    "చూడు ఈసారి నేను మామూలుగా రాలేదు. ఓ కొత్తమార్పు తీసుకురావడానికి వచ్చాను. అర్ధమయిందా?"
    
    "ఏమిటో ఆ మార్పు?"
    
    "మరదలుపిల్లని పెళ్ళాంగా మార్చెయ్యదలిచాను."
    
    "అబ్బో! ఆశ?" అంది చప్పున గిరిజ.
    
    "ఏం? నీ మొగుడిగా వుండటానికి నేను తగనా?"
    
    "ఉహుఁ! తగవు. నువ్వు మామూలు కుర్రాడిలా వున్నావు. నీకేం ఒడ్డూ పొడుగూ, పెద్ద పర్సనాలిటీ, మీసాలు యివేంలేవు నువ్వు నా కళ్ళకి పెళ్ళికొడుకులా కనబడటంలేదు."
    
    "మరెలా కనిపిస్తున్నాను?"
    
    "ఒట్టి బావవిలా కనిపిస్తున్నావు."
    
    "హాస్యం కాదు బేబీ! నేను సీరియస్ గా చెబుతున్నాను. మనిద్దరికీ పెళ్ళి జరగబోతోంది."
    
    "నేనూ సీరియస్ గానే చెబుతున్నాను. మనిద్దరికీ పెళ్ళి జరగదు."
    
    "ఎందుకూ?"
    
    "అంతకంటే యింకా దగ్గరగా ఏదో ఇదిగా వున్నావు. అంత దగ్గరగా వున్నవాడివి మొగుడివిగా పనికి రావనిపిస్తోంది."
    
    లోపల్నుంచి ఏదో ప్రేరణలాంటిది వచ్చి అనేసిందిగాని ఆ మాటలకర్ధం ఆమెకూ సరిగ్గా తెలియటంలేదు. అంతకంటే అతనికీ బోధపడలేదు.
    
    "నువ్వు భలే గమ్మత్తుగా మాట్లాడతావు బేబీ! పెద్ద దానవయిపోయావులే."
    
    ఇంతలో ఇల్లు దగ్గర కావడంవల్ల సుందరం ప్రక్కసందులోకి తిరిగి గబగబా వెళ్ళిపోయాడు.
    
    గిరిజ ఆలోచించుకుంటూ మెల్లిగా నడుస్తోంది. ఇద్దరూ నవ్వుతున్నట్లు కులాసాగానే మాట్లాడుకున్నారు. గంభీరత్వం ఏమీలేదు. అయినా అర్ధంకానిది. అసంపూర్తిగా మిగిలిపోయింది. గుప్తంగా వుండిపోయింది ఏదో వుంది.
    
    వెనకనుంచి కాలేజీ కుర్రాళ్ళు నవ్వుతూ ఆమెప్రక్కగా వచ్చి దాటుకుంటూ వెళ్ళిపోయారు. 'అబ్బో! స్ట్రీట్ ఎఫెయిర్స్ చాలా వున్నాయే' అన్నమాటలు ఆమె చెవుల్లో గింగురుమంటున్నాయి.

 Previous Page Next Page