ఆ రాత్రి జరిగిన సంఘటనలు మహా విచిత్రమైనవి. హాస్యస్ఫోరకమైనవి కూడా. "నీకు కోపంవచ్చిందా?" రవి అడిగాడు. ఆమె తల ఊపింది. ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. అతను దుఃఖాతిశయంతో వాటిని తుడిచాడు. కొందరు వుండీ కాలవశాన పరాయిఊళ్ళో ఏదో గదిలోవుండి చదువుకునే యువకుడి బ్రతుకు కన్నా, అందరూ లేక వంటరిగా గడిపే యువతి బ్రతుకు ఎంత క్షుద్రమో గ్రహించాడు. నిజానికి ఆలోచిస్తే ఆమె తనకు ఏమీకాదు. కానీ సముద్రంలో పడిపోవడానికి వచ్చిన ఓ స్త్రీని తన ధైర్యసాహసాలతో రక్షించిన ఏ యువకుడైనా ఈ మాటలంటే ఒప్పుకుంటాడా?
4
` ఉదయం పదిగంటలకు కాచిన ఎండచూచి ఈవేళ నిన్నటికన్నా తీక్షణంగా వుంటుందని అంతా అనుకున్నారు. దిగులు చెందేవాళ్ళు దిగులు చెందారు.
కానీ చప్పు చప్పున ఆకాశమంతా మబ్బులు క్రమ్మివేసి ముసురుపట్టేసింది. కొన్ని కొన్ని వీధులలో చినుకులుకూడా పడ్డాయి. మధ్యాహ్నం మూడయేసరికి వాతావరణం చాలా రమ్యంగా, శీతలంగా వుంది.
ఆరోజు ఆదివారం. తెల్లవారుఝామున నాలుగున్నరకు గదికి తిరిగివచ్చి, అప్పుడే వచ్చిన పనిమనిషి కేకలువేసి ఇంటివారిచేత తలుపులు తీయించి సహాయపడగా, గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించి, ఎనిమిదింటికి లేచాడు. మనసంతా చాలా ఉల్లాసంగా వుంది.
మధ్యాహ్నం మూడయేసరికల్లా సామాన్లు శుభ్రంగా సర్దుకోవటం పూర్తి చేశాడు. గదికి తాళంవేసి శశి ఇంటికి బయలుదేరాడు.
ఇంజనీరుగారు డ్రాయింగురూములో కూర్చుని ముద్దులకుక్కతో కబుర్లు చెబుతున్నాడు.
"నీ పేరు జాకీ కదూ?" అన్నాడు ఇంజనీరుగారు.
కుక్క తల ఊపింది.
"నీ పేరు టామీ కాదు కదూ?"
కుక్క మళ్ళీ తల ఊపింది.
"నేను తప్ప ఇంకెవరన్నా ఇష్టంలేదు కదూ?"
కుక్క తల ఊపటంలో ఈసారి చురుకు చూపించింది. ప్రశ్న కొంచెం పొడవుగా వుండటంవల్లనేమో!
"రండి రండి" అన్నాడాయన లోపలకు ప్రవేశిస్తున్న రవిని చూసి. "మా జాకీకి నేను తప్ప ఇంకెవరన్నా ఇష్టంలేదని చెబుతోంది."
"కుక్క చాలా విశ్వాసమైన జంతువు."
"అసలు ఈ జాతికి ఇంత విశ్వాసమెందుకు వచ్చిందంటారు?"
శశి లోపలినుంచి బయటకు వచ్చి కూర్చుంది కాబట్టి సంభాషణ చాలా చురుకుగా సాగిపోయింది.
ఇంజనీరుగారు "పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన వస్తువు" అన్నారు.
శశీ, రవీ నవ్వటం గుర్తించి "అదే సమస్య" అన్నాడు.
"నిజమే. మీకు వయస్సూ అదేమీ మీరిపోలేదు. అదీగాక మిమ్మల్ని యంగ్ మెన్ గా అందరూ ఒప్పుకుంటారు."
శశి అతనివంక ఓరగా, కోపంగా చూసి "ఆయన మాటలు నమ్మకు నాన్నా!" అంది.
"అయితే నేను ముసలివాడినే అంటావా తల్లీ?" అన్నాడు కించపడుతూ.
శశి చాలా సంకటంలో పడింది. "ఇప్పుడా ప్రసక్తి ఎందుకు నాన్నా?" అంది.
ఇంజనీరుగారు నవ్వి- "నేనెక్కడ మళ్ళీ పెళ్ళి చేసుకుంటానో అని తల్లికి కోపం! అటు సూర్యుడు ఇటు పడినా ఈపని జరిగేది కాదని దానికి తెలియదు."
"ఊరుకో నాన్నా! ఆ కబుర్లంటే నాకు అభిరుచి లేదు."
ఇంజనీరుగారు అక్కడ్నుంచి లోపలకు వెళ్ళి, అక్కడ్నుంచి అర్జంటు పని వుందంటూ ఖంగారుపడుతూ బయటికి వెళ్ళిపోయాక "ఈ సాయంత్రం వెళ్ళి పోతున్నానని చెప్పటానికి వచ్చాను శశీ!" అన్నాడు రవి.
శశి దీర్ఘంగా నిట్టూర్చి "నన్ను గుర్తు పెట్టుకున్నందుకు థాంక్స్" అంది.
"శశీ! మనం మళ్ళీ ఎంతకాలానికి కలుసుకుంటామో?" అన్నాడు.
ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. కానీ చాలా ఖిన్నురాలయిందని అతను తెలుసుకున్నాడు.
"ఒకసారి మా ఊరు రావూ శశీ!" అన్నాడు రవి ప్రాధేయపడుతున్నట్లుగా.
"ఒక్కసారేనా?" అని చప్పున నోరువిడిచి పాలిపోయిన ముఖంలోనికి చిరునవ్వును రప్పించుకోక పూర్వమే అతను పసికట్టి నిశ్చేష్ఠుడైపోయాడు.
"శశీ! ఏమయినా బాధ కలిగించానా?" అని ప్రశ్నించాడు.
"ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. స్త్రీ సిగ్గు విడిస్తే ఇతరులు అసహ్యించుకుంటారా?"
"ఆనందిస్తారేమో కొంతమంది!"
"సిగ్గు విడవడమంటే ఏమర్ధం చేసుకున్నావు?" అందామె దెబ్బతిని.
"మరి నువ్వు విపులీకరించి చెప్పకపోతే నాకెలా తెలుస్తుందీ?"
శశి చాలా ఇబ్బందిలో పడింది. "ఇప్పుడు కాదు" అనుకుంది. కానీ ఈ ఉద్వేగాన్ని అణిచిపెట్టుకోవటం అసాధ్యం. ఈ ఎదుటిమనిషేమయినా సామాన్యుడా? అవతలివాళ్ళను చలింపచేస్తాడు. తాను చలించడు. తుదివరకూ ఇలాగే కొనసాగిస్తాడన్నంత నిగ్రహం ప్రదర్శిస్తాడు. అతని చూపుల లోతులు కనుక్కోవటం ఎవరితరం? కానీ అతను తనకన్నా దుర్భల మనస్కుడనీ, చపలచిత్తుడనీ ఊహించే ఓర్పు ఆమె నిలబెట్టుకోలేకపోయింది.
ఆఖరికి "నిన్నో విషయం అడగనా?" అని అనగలిగింది.
"ఏమిటో?"
"సరియైన జవాబు ఆశించవచ్చా?"
"తెలిస్తేగా?"
"రవీ!" అంది శశి. పెదవులు అదిరాయి. ఆమె నయనాలలో వెల్లివిరిసిన తారళ్యం అతనికి కనిపించీ కనిపించకముందే "పో, నేను చెప్పను" అని ఏదో తప్పు చేసినట్లు నాలిక కొరుక్కుంది.
"ఈసారి వచ్చినప్పుడు చెబుదువుగానిలే. నాకు టైమయింది" అని రవి లేచాడు. ఆమె కన్నులలో ఆశ్రువులు నిలిచాయి.
"శశీ! కంట్లో ఏమయినా పడిందా?" అని రవి ఆదుర్దాతో ప్రశ్నించాడు.
ఆమె తల ఊపింది నిస్పృహగా.
"ఊదనా?"