"మంజు ఆత్మహత్య చేసుకుంది!"
మంచంలో పడుకున్న మురళి ఉలిక్కిపడి లేచాడు-ఎదురుగా నిలబడ్డ రాజా కంగారుగా గాభరాగా "మంజు ఆత్మహత్య చేసుకుందిట! అందరూ చంద్రశేఖరం సార్ ఇంటికి వెళ్తున్నారు-నీకు చెప్పాలని వచ్చాను-నేను వెళ్తున్నా-" అనేసి వెళ్ళిపోయాడు.
"మంజు ఆత్మహత్య చేసుకుంది! 'ఆత్మహత్య'-'ఆత్మహత్య' 'ఆత్మహత్య'.... ...."
తల గిర్రున తిరిగింది మురళికి. కూర్చున్నవాడు వెనక్కి పడిపోయాడు-మళ్ళీ లేచి కూచున్నాడు-లేచి నిలబడ్డాడు, అంతలో కూచున్నాడు.
"అందరూ చంద్రశేఖరం సార్ ఇంటికి వెళ్తున్నారు-" తను వెళ్ళగలడా? వెళ్ళకుండా ఎలా ఉండగలడు? ఆయన ముఖం చూడగలడా? చూసి ఏం మాట్లాడగలడు? తన మనసులో రగులుతోన్న ఈ అగ్నిని వ్యక్తంచేసే భాష ఎక్కడుంది? తనను చంద్రశేఖరం సార్ క్షమించగలరా? అసలు మానవ మాత్రులెవరైనా క్షమించగలరా? దేవతలైనా క్షమించగలరా?
మూడు రోజులుగా మతిపోయినా వాడిలా మంచంమీద పడి గడుపుతున్నాడు మురళి-తనకు తిండి ఎవరు పెట్టారో, ఏం పెట్టారో, ఎలా తిన్నాడో, ఎప్పుడు స్నానం చేశాడో, ఏం కట్టుకున్నాడో, ఆ ధ్యాసే లేకుండా గడుపుతున్నాడు-తలా, గెడ్డమూ, మాసిఉన్నాయి. ముఖం పీక్కుపోయి ఉంది. బట్టలు నలిగిపోయి ఉన్నాయి-అలాగే లేచి చంద్రశేఖరం సార్ ఇంటికి వచ్చేశాడు. అప్పటికే చంద్రశేఖరం సార్ ఇంటిముందు చాలామంది జనం గుమిగూడి ఉన్నారు.
"మంజులత ఆత్మహత్య చేసుకుందిట!"
"అయ్యో, పాపం! పట్టుమని పదహారేళ్ళు కూడా ఉండవు."
"ఈ కాలంలో పిల్లలు మరీ బరితెగించి పోతున్నారు."
"పాపం, మంజుల బుద్ధిమంతు రాలేనమ్మా!"
"ఆ!, బయట పడనంతవరకూ అందరూ బుద్ధిమంతులే!"
"ఇంతకూ దహనం ఎక్కడ చేశారు? ఎలా చచ్చిపోయింది?"
"పెద్దమ్మ గారింటికి వెళ్ళి వస్తానని బయలు దేరిందిట? ఈ పరిస్థితుల్లో కొన్నాళ్ళు అక్కడ ఉండటమే మేలని అక్కడికి పంపించారుట? తీరా ఈ పిల్ల అక్కడికిపోయి ఆత్మహత్య చేసుకుందిట! పెద్దమ్మ టెలిగ్రాం ఇస్తే, చంద్రశేఖరం సార్ ఆయన భార్య, ఇద్దరు వెళ్ళారట! అక్కడే దహనం చేసి వచ్చేశారుట!"
"మనలో మన మాట! నిజంగా ఆత్మహత్య చేసుకుందో? లేదో?"
"అయ్యో! నిజంగా ఆత్మహత్య చేసుకోకపోతే, అలా ఎందుకంటారు?"
"బాగుంది! అట్నించి అటే ఎటైనా పారిపోతే, అపఖ్యాతి భరించలేమనుకుని ఇలా చెప్తున్నారేమో!"
"ఛ! మంజు చాలా కుదురైన పిల్ల!"