Read more!
Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 1

                                 

 

                                   లవ్ ఎట్ సెకండ్ సైట్    

                                                                    యర్రం శెట్టి శాయి

 

                             

 

    సూర్యుడు కొంచెం లేటుగా నిద్రలేచి రాత్రి దేవలోకంలోని బార్ లో తాగిన అమృతం తాలుకూ హాంగోవర్ నుంచి బయట పడ్డానికి ఎండను కొంచెం ఓవర్ గా , ఎర్లీగా ప్రసారం చేస్తున్నాడు.
    అదేం పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ తెల్లారుజాము నుంచే బిజీ అయిపొయింది.
    పోలీస్ డిపార్ట్ మెంట్ వాళ్ళు రాత్రంతా జరిగిన దొంగతనాలు, మర్డర్లు, రేప్ లు అన్నీ "రొటీన్ అండ్ నార్మల్ క్రైం " అన్న కంప్యుటర్ ఫైల్లో కేక్కిస్తున్నారు.
    ఆర్టీసీ వాళ్ళు రాత్రంతా ఎన్ని బస్సులు ప్రయాణీకుల్తో సహా బోల్తాలు కొట్టిందీ, ఎన్ని నదుల్లో పడిందీ, ఎన్ని లారీలకు డీ కొట్టింది, ఎంతమంది ప్రయాణీకుల్నీ పైకి పంపించగాలిగిందీ అన్నీ న్యూస్ పేపర్స్ కీ ఫాక్స్ లో పంపుతున్నారు.
    రైల్వే వాళ్ళు రాత్రంతా ఎన్ని రైళ్లల్లో ఎన్ని దోపిడీలు జరిగిందీ, ఎన్ని రైళ్ళు పట్టాలు తప్పింది, ఎన్ని రైళ్ళు పడిపోవడం వల్ల ఎంతమంది ప్రయాణీకులు కాళ్ళూ చేతులూ తలా లాంటివి పోగొట్టుకుందీ- కొన్ని కోట్లు ఖర్చు పెట్టి హిందీ భాషను విరివిరిగా ఉపయోగించటం కోసం తర్జుమా చేస్తున్నారు.
    ఇన్ కమ్ టాక్స్ వాళ్ళు చీకట్లో నల్లదనం ఎక్కడుందో వెతికి వెతికి తెల్లారేసరికి నిద్రపోయారు.
    వ్యాపారులంతా టెలీకాన్ఫరెన్స్ లో తాము ఇన్ కమ్ టాక్స్ వాళ్ళను ఎలా బోల్తా కొట్టించిందీ , అందుకు మినిస్టర్లూ ఎంతగా సాయం చేసిందీ జోక్స్ లాగా చెప్పుకుని తెగ నవ్వుకుంటున్నారు.
    అమీర్ పేట -- బస్ స్టాప్ లో నిలబడ్డ వేలమంది జనం ఉండుండి టైం చూసుకుంటూ "నీయవ్వ బస్సు ........" అని లోపల్లోపలే బూతులు తిట్టుకుంటున్నారు.
    వాళ్ళ మధ్యలో నిలబడ్డ భవానీ శంకర్ పక్కన నిలబడ్డ గడ్డమతనిని "తొమ్మిదన్నరకు రావాల్సిన బస్ ఎన్ని గంటల కొస్తుంది బ్రదర్?" అనడిగాడు. గడ్డమతను చిరాగ్గా చూశాడు.
    "ఆ మాత్రం తెలీదంటయ్యా? తొమ్మిదన్నర బస్ ఎప్పుడూ పదింబావు కొస్తుంది. అంటే తొమ్మిదీ నలబై అయిదుకి రావాల్సిన బస్ తొమ్మిదీ ఇరవై అయిదు కొస్తుంది కదా! కానీ తొమ్మిదీ ఇరవై అయిదుకి రావాల్సిన బస్ జనరల్ గా తొమ్మిదీ నలబై కొస్తుందన్నమాట. అంటే తొమ్మిదీ యాభైకి రావాల్సిన బస్ ......"
    "ఒవరయింది రా నాయినా! ఇంక ఆపేయ్" అంటూ అడ్డుపడ్డాక గానీ అతను మాట్లాడటం ఆపలేదు. బస్ స్టాప్ కి దగ్గర్లోనే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ సడెన్ గా గ్రీన్ లోకి మారటంతో అంతవరకూ కాచుక్కూర్చున్న ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ముందుకి దూకింది. ఆ ట్రాఫిక్ ని చీల్చుకుంటూ శరవేగంతో ముందుకి దూసుకొస్తున్న ఓ అందమయిన స్కూటర్ రాణీని చూసేసరికి భవానీ శంకర్ లో ఒక్కసారిగా హుషారు పుట్టుకొచ్చింది.
    హుషారు పుట్టుకొచ్చినప్పుడల్లా "వెన్నెల్లో హయ్ హాయ్ ' అంటూ పాడేయ్యటం మామూలే కనక ఆ ట్యూన్ వెంటనే అందుకున్నాడు. కాపోతే వాల్యూం కంట్రోల్ తప్పి బాగా హైపిచ్ లో పాట పాడేసరికి భవానీశంకర్ పక్కనే నిలబడ్డ శామ్యూల్ అనే పెద్దమనిషి అదిరిపడి -- ఎవరిదో ఏదో కొంప మునిగిందనుకుని ఒక్క గెంతు గెంతి దూరంగా పరుగెత్తాడు.
    శాస్త్రి అనే శాస్త్రి గారు హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ లు చాలా మామూలు విషయం గనుక ఇప్పుడూ అలాంటిదేదో జరుగబోతోందనుకుని ధభేల్ మని నేలమీద పడుకుండిపోయాడు. అప్పల్రాజు అనే మీసాలతను వెంటనే ఒక రూపాయి కాయిన్ తీసి భవానీ శంకర్ మీదకు విసిరాడు. ఆ అరుపుకి 'జాకీ' అనే వీధి కుక్కొకటి బెదిరిపోయి రోడ్ కి అడ్డంగా ట్రాఫిక్ ని చేధించుకొంటూ పరుగెత్తింది. అయితే రోడ్ కి అవతలి వేపున్న 'మోతీ ' అనే స్ట్రీట్ డాగ్ -- జాకీ తననే ఎటాక్ చేయబోతుందని అపార్ద్గం చేసుకుని -- అది ఎటాక్ చేసేలోగానే తను జాకీ మీదపడి భీకరమయిన ఫైటింగ్ మొదలు పెట్టింది.
    దాంతో ఆ స్లమ్ డాగ్స్ రియాల్టీ షో లో ఆ స్కూటర్ రాణీ తాలుకూ స్కూటర్ స్కిడ్ అయిపోవడం , స్కూటర్ రాణి కింద కూలబడిపోవటం క్షణాల్లో జరిగిపోయాయ్.
    కూలింగ్ గ్లాసెస్ తో ఉన్న ఆ అందాల స్కూటర్ గాళ్ స్కిడ్ అయిపడితే క్షణాల్లో సహాయానికి ఎగబడే హీరోలకు మనదేశం పెట్టింది పేరు గనక ఓ పాతికమంది హీరోలు రంగంలోకి దూకారు.
    అయితే ఇదంతా కొంచెం ముందుగానే పసిగట్టిన భవానీ శంకర్ మాత్రం -- వారందరినీ విజయవంతంగా చెల్లాచెదురు చేసేసి తనే ఆ స్కూటర్ రాణీకి సాయం చేసి  లేచి నుంచో గానే, స్కూటర్ ని కూడా లేపి రోడ్ పక్కకు లాగి స్టాండ్ వేశాడు.
    "ఈ స్లం డాగ్స్ తో పెద్ద న్యూసెన్స్ యి పోయింది. మున్సిపల్ కార్పోరేషన్ ఏం చేస్తోందో తెలీదు --- ఇడియేట్స్!" అంది స్కూటర్ రాణీ కోపంగా డ్రస్ దులుపుకొంటూ.
    అలాంటి లింక్ డైలాగ్ కోసమే చాలా ఆత్రుతగా ఎదుర్చుస్తున్న భవానీ శంకర్ చప్పున అందుకున్నాడు.
    "అదే మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత! క్షణాల్లో వీధి కుక్కల్ని శూన్యంలో నుంచి వందల సంఖ్యలో ప్రోడ్యుస్ చేయటం మన కార్పోరేషన్ కి కొట్టిన పిండి! వాళ్ళు నగరమంతా అన్ని రకాల బోర్డులూ రాసి తగిలిస్తారు గానీ "అందమయిన నగరం మనది - కుక్కలు లేని నగరం మనది " అనే స్లోగన్ మాత్రం గాలి కోడిలేశారు దొంగనాయాళ్ళు-"
    భవానీశంకర్ అభిప్రాయంతో తనూ ఏకీభవించింది స్కూటర్ రాణీ.
    "ఇదంతా అక్కినేని అమల ఇంకా అలాంటి గాంగ్ చేస్తున్న న్యూసెన్స్ " అంది స్కూటర్ రాణి ఇంకా కోపంగా.
    "మీరు కాబట్టి కొంచెం లాంగ్వేజ్ వాడారు. ఒకవేళ నాకే ఇలా జరిగితే కార్పోరేషన్ మీదా, ఆ కుక్కల సంరక్షణ సమితి మీదా మర్డర్ కేస్ ఫైల్ చేసేవాడిని-"
    స్కూటర్ రాణీ షాకయింది.
    "కేసా?"
    "అవును - డియర్! మీలాంటి మోస్ట్ బ్యుటిపుల్ యంగ్ గాళ్స్ నిలా కుక్కలతో ఎటాక్ చేయించే హక్కు ఎవడికి లేదు -- అది ఇంచుమించుగా ఏటంప్ట్ టు మర్డర్ ఎ సిటిజన్ " కింద కేస్ బుక్కవుతుంది -"
    "యా - యా - యూ మే బి రైట్-" అందామె కొంచెం డౌటుగా.
    "ఎనీవే! థాంక్స్ ఎలాట్- ఫర్ యువర్ హెల్ప్-"
    "నో నో - ఇలాంటివి చేయటం నా డ్యూటీ - కింది పీలవుతా - అన్నట్లు - " అంటూ పేరూ వగైరాలూ అడగబోతుండగానే ఆమె సడెన్ గా స్కూటర్ స్టార్ట్ చేసుకుని మళ్ళీ రాకెట్ లాగా దూసుకుపోయింది.
    "హలో మిస్ - హలో హలో -" అని భవానీశంకర్ పిలుస్తుంటే పక్కనున్నతను అతని భుజం తట్టాడు.
    "హలో - ఇదేం సినిమా కాదు- పేరూ ఫోన్ నెంబరూ అడిగి తీసుకుని లవ్ స్టోరీ రన్ చేయడానికి --" అన్నాడు సీరియస్ గా.
    'అరేయ్- చెక్కమొఖం! నేనెప్పుడూ అమ్మాయిలకు నా పేరు, సెల్ నెంబరూ ఇస్తాను గానీ వాళ్ళది తీసుకొను -- అది నా లెవల్.- ఇంక ఆ సైడ్ కి తిరిగి ఇంకోడి భుజం చూసుకో -" అంటూ అప్పుడే ఆగిన బస్ మీదకు దూకాడు.
    కానీ అప్పటికే వందల జనం ఒకేసారి జోరపడ్డానికి ప్రయత్నించడంతో భవానీశంకర్ గావుకేక పెట్టాడు.

Next Page