Next Page 
సూర్యనేత్రం పేజి 1

                                 


                                   సూర్య నేత్రం

                                                                           సి. ఆనందారామం  

                                 


    బ్రహ్మ ముహూర్తంలో లోకాలను లేత వెలుగులతో మేలుకొలిపి, సంకల్ప స్వరూపామైన హింకారానికి వ్యక్తీకరణ అయిన ప్రస్తావంలా వుంది ఉదయ సూర్యుని మనోహర శిల్పం.
    గుహ ముఖ ద్వారానికి తోరణాల్లా చెక్కిన శిల్పాలకు పై భాగాన ఉంది సూర్య శిల్పం.
    అందరూ మంత్రించిన బొమ్మల్లా నిలబడిపోయారు. మానవుడి అంతరాంతరాల్లోని భయాలన్నీ చిక్కగా పేరుకొన్నట్లు గుహలో చీకట్లు! గుహ ద్వారం నుంచి ఊళలు వేసుకుంటూ సుడులు తిరుగుతూ, రివ్వున ముఖాల మీద కొట్టింది అతి చల్లని గాలి! బయట కుమ్ములో పెట్టినట్లు శరీరాలను కుతకుత ఉడికించే వేడి. లోపలినుంచి మంచులాంటి చల్లని గాలి! పైగా ఆ ఊళలు!
    ముందుకు కదిలింది అనిలకుమారి. చటుక్కున ఆమె పక్కకు వచ్చి నిలబడ్డాడు రవి.
    ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఆ ప్రయత్నంగా అంతలోనే బెదిరినట్టు గభాలున వెనక్కి తిరిగి మిగిలినవాళ్ళని రామ్మన్నట్టు చూశారు.
    మరొక చలిగాలి ఉసురు ఉండుండి ఎవరో ఏడుస్తున్నట్టు. అంతలో విరగబడి నవ్వుతున్నట్లు ఊళలు.
    కూలీలు నిలువునా వణికిపోతున్నాయి. చలితో కాదు. భయంతో. ఆ భయం వాళ్ళ ముఖాలమీద స్పష్టంగా రాసి ఉంది. కళ్ళముందు ఏదో భయంకరాకాలు చూస్తున్నట్లు బెదిరిపోతున్నారు.
    "మేం లోపలికి రాం దొరా! తమరెళ్లి రండి. సేమంగా బయటపడి నారంటే ఆ తరువాత బయటిపని సేస్తాం నోపటికి రాం" కోలీలకి నాయకుడిలా కనిపించే అనుమయ్య అన్నాడు.
    వెంటనే ముందుకొచ్చాడు నరసింవ్వ.
    "ఆ గుహ లోపలికి పోగూడదని శాపమయ్య! కొన్ని వందల ఏళ్ల మట్టి ఎవరూ ఆడకి పోయినోళ్ళు లేరు. పోయి పేనాలతో తిరిగొచ్చినోళ్ళు లేరు. మేం రాము. రామంటే రాము."
    "అనుమయ్య, నరసింవ్వ చెప్పింది ఒకటే అయినా అదేదో అనుమయ్య మాటలని ఖండిస్తున్న ధోరణిలో అన్నాడు నరసింవ్వ.
    దానికి కారణముంది అనుమయ్య లచ్సిబోడుకి దొర. నరసింవ్వ సిరిమిట్టకి దొర. తమ తమ యజమానులైన దేవనారాయణ్, యజ్ఞ నారాయణ్ ల మధ్య ఉన్న వైరం వాళ్ళ మధ్యకూ పాకింది. ఏ విషయంలోనూ ఏకాభిప్రాయానికి రారు. కానీ కొన్ని కొన్ని విషయాలలో ఒకటయిపోతారు. అలా అయిపోతున్నామని తమకే తెలియకుండా.
    వాళ్ళతో వాదించి ప్రయోజనం లేదనీ, వాళ్ళలో "రీజన్" ప్రవేశపెట్టటం ఎవరి తరమూ కాదని అనుభవం మీద తెలుసుకున్నాడు. జెన్నిఫర్, విష్ణువర్ధన్ ల వంక చూశాడు. "నేనొస్తాను" వాళ్ళతో కలిసింది జెన్నిఫర్.
    "నేనూ వస్తాను" విష్ణువర్ధన్ కూడా వచ్చి చేరాడు.
    నలుగురూ గుహలో ప్రవేశించారు. రివ్వున కొట్టింది మళ్ళీ చలిగాలి ఊళలతో.
    అనిల చీర పైకి లేచింది గొడుగులా. వెంటనే కంగారుగా గోడకి ఆనుకుని చీరని రెండు కాళ్ళ మధ్యకి బిగించింది గోచీలా. అంతకంటే మార్గం లేదు. చీకటి. ఒకటికొకరు కనబడటం లేదు. ఒకరి మాట మరొకరికి వినపడటం లేదు. గాలి హోరులో చలి గడగడ వణికిస్తోంది.
    అంతలో ఒక చెయ్యి చల్లగా తగిలింది అనిలకి. కెవ్వున అరిచింది తన నిగ్రహం కోల్పోయి. భయం ఎంత తేలిగ్గా వశపరచుకుంటుంది, ఎంతటి దృఢ మనస్కులనయినా.
    "నేను...నేను" చెవి దగ్గర గుసగుసగా అన్నాడు రవి. దూరంగా నిలబడి మాట్లాడటానికి లేదు. వినపడదు. అతడు తనకు అతి దగ్గరగా ఉన్నాడని అర్థమవుతోంది. అతడి చెయ్యి గట్టిగా పట్టుకుంది. అతడూ అంతే గట్టిగా పట్టుకున్నాడు. ఒంటరితనాన్ని మించిన శత్రువు లేదు. మనిషికి తమకు ఒక తోడు ఉందనుకోవటం ఇద్దరి మనసులలోనూ భయాన్ని చాలా వరకు తగ్గించింది.
    "లైట్ లేదా?" అడిగింది అనిల. గోడకి ఆనుకుని నిలబడితే గాలి వేగం అంతగా లేదు అది అర్థం చేసుకుంది అనిల. గోడ అంచునే నడుస్తోంది రవి చెయ్యి వదలకుండానే.
    అప్పుడు గుర్తొచ్చింది రవికి. తన హేండ్ బాగ్ లో మిగిలిన అవసరమైన సామానులతోబాటు టార్చిలైట్ కూడా ఉందని.
    రవి టార్చి వెయ్యటమూ, మరోవైపు నుంచి మరో టార్చి వెలగటమూ, రెండు గావుకేకలు వినపడటమూ, రెండు శరీరాలు దబ్బున నేలమీద పడటమూ ఒకేసారి జరిగింది.
    రెండో టార్చి వేసింది జెన్నిఫర్. నేలమీద పడ్డ శరీరాలు జెన్నిఫర్, విష్ణువర్ధన్ లవి. వాళ్ళు అలా నేలమీద పడటానికి కారణమూ అర్థమయింది. అతి త్వరలో టార్చి వెలుగులో ఎదుటి గోడమీద జెన్నిఫర్, విష్ణువర్ధన్ లున్న ప్రదేశానికి దగ్గిరగా రెండు భయంకరమైన శిల్పాలు గోడలమీద...
    ఒకటి సింహం తలతో ఉన్న శిల్పం. తలలో జూలుకు బదులుగా పాములు. కళ్ళు పచ్చగా, ఎర్రగా అతి భయంకరంగా ఉన్నాయి. పాములు కూడా ఎర్రగానే ఉన్నాయి రక్తం కక్కుతున్నట్లు భయంకరంగా కోరలతో నోరు తెరిచింది. శరీరం మాత్రం మనిషి శరీరం. అది కూడా ఎర్రగానే వుంది రక్తవర్ణంలో. ఒక తోక చేతుల చివర పంజాలు, వాడి పులిగోళ్ళతో దానికింద ఏవో అక్షరాలున్నాయి. అవి తెలుగు, సంస్కృతాలు కావు.
    ఆ పక్కనే మరొక భయంకర శిల్పం. శరీరం సాధారణ మానవ శరీరం లాగానే వుంది. పట్టుపంచె కట్టుకున్నట్లుగా ఉంది. చేతిలో నాలుకలు చాచి భయంకరంగా చూస్తున్న పాము. చిత్రంగా ఆ పాము రెండుగా చీలి పోయినట్లుగా ఉంది. ఒక భాగం లావుగా ఉంది. రెండో భాగం సన్నగా ఉంది.
    రెండు భాగాలు విడిగా లేవు. చివర ఒక దానితో ఒకటి అతుక్కుని ఉన్నాయి. అలాగే తల కూడా రెండు భాగాలకూ ఒకటే. ఆ సర్పం తల కూడా ఎర్రగా ఉంది రక్తం చిమ్ముతున్నట్లు. అగ్నిజ్వాల కళ్ళతో.
    ఆ శిల్పానికి మరో చెయ్యి లేదు. విరిగిపోయిన మొండెం వుంది సగానికి. ఎవరైనా విరక్కొట్టారో, లేక ఆ శిల్పమే అలా ఉందో! శిరస్సు లేదు. ఆ స్థానంలో కాలకూట విష జ్వాలలుఉంనాయి, ఎర్రగా భైరవస్వామి దేవాలయ గర్భాలయ ద్వారం పైన సముద్ర మధన శిల్పంలో కనిపించిన లాంటి కాలకూట విష జ్వాలలు అక్కడికంటే మరింత భయంకరంగా రక్త వర్ణంలో ఉన్నాయి. దానికింద కూడా ఏవో అక్షరాలు తెలుగూ, సంస్కృతమూ కాని అక్షరాలూ.
    అనిల, రవి మరింత దగ్గిరకి జరిగారు. ఒకరి చేయి మరొకరి చేతిలో మరింత బిగుసుకుంది. కొన్ని నిముషాలు వాళ్ళిద్దరూ ఆ శిల్పాల మీద నుంచి దృష్టి మరల్చుకోలేకపోయారు. రవి చేతిలో టార్చిలైట్ వెలుగుతూనే ఉంది.
    ఇద్దరిలో మొదట కర్తవ్యం గుర్తుచేసుకున్నది అనిల.
    "టార్చి వాళ్ళమీదకి వెయ్యండి. ఎలా వున్నారో చూడాలి."
    "రవి లైట్ అటువైపు ఫోకస్ చేశాడు.
    జెన్నిఫర్, విష్ణువర్ధన్ లిద్దరూ స్పృహతప్పి వున్నారు.
    "ఏం చేద్దాం" అడిగాడు రవి. ఎంత దగ్గిరగా వున్నా ఒకటిమాట ఒకరికి వినపడటం కష్టంగా వుంది మంచులాంటి గాలి ఊలలతో.
    "వాళ్ళని కాపాడాలి"
    అటు ఒక్క అడుగు వెయ్యబోయింది. గట్టిగా పట్టుకున్నాడు.
    "వద్దు"
    "వాళ్ళని అలా వదిలేస్తే బతకరు"
    "అవును కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తే మనమూ బతకం'
    "ఏం?"
    "ఇంకా అర్థం కాలేదా? మనం గోడనానుకుని వున్నాం. అంచేత గాలి మనని విసిరెయ్యటం లేదు. గుహ మధ్యలో నిలదొక్కుకోలేం. గాలి తాకిడి, ఆ శిల్పాలు చూడటం వల్ల కలిగిన భయం ఈ రెండింటికీ తట్టుకోలేక వాళ్ళు స్పృహ తప్పారు."
    'ఎలా మరి వాళ్ళని బయటికి తీసుకెళ్ళటం?"
    "ఒక ఉపాయం ఉంది. ముందు మనం బయటికి వెళ్దాం. అప్పుడు చెప్తాను. ఇక్కడ మాట్లాడటం చాలా కష్టంగా ఉంది."
    ఇద్దరూ ఒకటి చేతులొకరు పట్టుకుని గోడనానుకుని నడుస్తూనే బయటికి వచ్చారు. ఒక లోకం లోంచి మరో లోకంలోకి వచ్చినట్టుగా ఉంది.

Next Page