Read more!
Next Page 
జోగబాల పేజి 1

                                 


                జోగబాల                                                                                          - కొమ్మూరి వేణుగోపాలరావు

 

                                        


    అతి ప్రాచీనమైన నాగరికతకూ, ప్రపంచానికి సగర్వంగా చెప్పుకునే సంస్కృతికీ, ధీమాగా, ఆత్మవిశ్వాసంతో తమ పవిత్రతను ఎలుగెత్తి చాటుకునే ఆధ్యాత్మికతకూ, వాటితో కలబోసి, ఐక్యమైన, అంతర్లీనమై ఉన్న ఆటవిక, పైశాచిక మూఢాచారాలకూ ఆలవాలమై ఉన్న మన దేశంలో ఒక ఊరు.


    ఆ ఊరు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన చెందనిదై ఉండవచ్చు. కాని అలాంటి ఊళ్ళు ఒరిస్సాలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో ఇంకా కొన్ని రాష్ట్రాలలో అజ్ఞాతంగా ఉన్నాయి. కొన్నింటికి గుర్తింపు ఉన్నాయి. కొన్నింటికి లేవు.


    ఆ ఊరిపేరు జోగాపురం. అవటానికి పల్లెటూరే అయినా ఆ చుట్టుప్రక్కల ఉన్న ఇరవై ముప్పయి గ్రామాలలో అదే పెద్దది. దాదాపు వెయ్యి గడపదాకా ఉంటుంది. ఆ ఊళ్ళో ధనికులూ ఉన్నారు, మధ్యతరగతి ప్రజలూ ఉన్నారు. పేదరికంతో అట్టడుగు స్థితిలో ఉన్నవారూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే చిన్నచిన్న వ్యాపారాలు కూడా మొదలై క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి.


    ఊరికి తూర్పుదిశన అయిదారుమైళ్ళ దూరంలో పర్వతశ్రేణి వ్యాపించి వుంది. ఆ కొండలమీద ఆకుపచ్చని చెట్లు దిటవుగా పెరిగి ఉండి, దూరం నుంచి చూస్తే చిట్టడవి ఆక్రమించి ఉన్నట్లు గోచరిస్తుంది. ఉదయాన ఆ కొండల వెనుక నుండి సూర్యుడు పైకి లేస్తున్న దృశ్యం చాలా శోభాయమానంగా ఉంటుంది.


    ఊరికి ఉత్తరం వైపుగా చిన్న ఏరు ప్రవహిస్తూ ఉంది. ఎప్పుడో తప్ప అందులో పాదాలు మునిగేటంతటికన్న నీళ్ళు ఉండవు. దానికి దగ్గరలో చలమలు తవ్వి అందులోంచి మంచి నీటిని తోడుకొని పోతూ వుంటారు ఆ ఈరి ప్రజలు.


    ఊళ్ళో పది పదిహేను దాకా పెద్ద పెద్ద మేడలున్నాయి. తర్వాత చాలావరకు చిన్న చిన్న డాబాలు, పెంకుటిళ్ళు, మిగతావి పూరిపాకలు. ఏరు దాటి వెళ్ళాక హరిజన వాడ ఉంది.


                               *    *    *    *


    రాత్రి ఎనిమిదయేసరికి ఊరంతా చీకటి అలుముకుంది. ఊళ్ళో విద్యుద్దీపాలు ఉండడంచేత కలవారి ఇళ్ళల్లో లైట్లు వెలుగుతున్నాయి. భరించగలిగినవారు తమ తమ గృహాల్లో ఎలక్ట్రిసిటి పెట్టించుకున్నారు. లేనివారి ఇంట్లో కిరసనాయిలు దీపాలతోనే గడుపుకొస్తున్నారు.


    హరిజనవాడలో మాత్రం చీకటే వ్యాపించి ఉంది. అక్కడక్కడా మిణుకు మిణుకుమనే చమురుదీపాలు తప్ప. పేరుకు స్ట్రీట్ లైట్స్ ఉన్నా వాటి కాంతి ఆ ఇళ్ళమీద ప్రసరించడం లేదు.


    హరిజనవాడలో ఓ మట్టిగోడలమీద కట్టబడిన పూరింట్లో ముందు భాగంలో చమురుదీపం మిణుకు మిణుకుమని వెలుగుతోంది. నడి వయసు దాటిన ఓ వ్యక్తి ఈతాకుల చాప మీద కూర్చుని నాటుసారా సేవిస్తున్నాడు. పక్కనే పెట్టుకున్న రేకుపళ్ళెంలో బాగా మసాలా వేసి వేయించిన చిన్న చిన్న మాంసం ముక్కలున్నాయి. అతనికో అడుగు దూరంలో కటిక నేలమీద... ఓ స్త్రీ పడుకొని వుంది - అతని భార్య. కళ్ళు మూసుకుని పడుకుని వుంది. వొంట్లో బాగోలేనట్లు మధ్య మధ్య మూలుగుతున్నది.


    ఆ చీకట్లో నడుచుకుంటూ బయటనుంచి ఓ యువకుడు లోపలకొచ్చాడు. ఇరవై - ఇరవై రెండేళ్ళు మించి ఉండవు. నడివయసు వ్యక్తి ఆ యువకుడివంక యధాలాపంగా తలెత్తి చూసి మళ్ళీ తాగడంలో పడ్డాడు.


    "పుష్ప ఖాళీగా ఉందా?" అనడిగాడా యువకుడు.


    నడివయసు మనిషి చాలా మామూలుగా తలవూపి మళ్ళీ తన పనిలో నిమగ్నమైనాడు.


    అడ్డుగా ఉన్న గోనెసంచిలాంటి తెరని తొలగించుకొని ఆ యువకుడు లోపలకెళ్ళాడు.


    నేలమీదున్న ఈతాకుల చాపమీద యిరవై ఏళ్ళ యువతీ పడుకుని ఉంది. పక్కనే మరో గుడ్డిదీపం వెలుగుతోంది.

Next Page