Next Page 
బ్లాక్ మాంబా పేజి 1

                                 


                            బ్లాక్ మాంబా

                                                                     __ కొమ్మనాపల్లి గణపతిరావు

 




    అర్దరాత్రి దాటి రెండున్నర గంటలు కావస్తూంది.

    నిశీథి కప్పిన రాజధాని సాగర నీలిమ పులుముకున్న చీకటి కన్య రాక్షసరతిలో సొమ్మసిల్లినట్లు సద్దుమణిగింది.

    ఉండుండీ మొదలైన ఒక గాలి కెరటం మృత్యుకోరల కాటుతో అలలుగా విడిపోయింది. ప్రళయ నిస్వసంలాంటి ఒక తరంగం ప్రకృతి ఎదపయ్యెదను జార్చి తల్లి రొమ్మును చేరిన పసికందులా తూర్పుకొండల్ని తాకి అలసిపోయింది.

    అబిడ్స్ రోడ్లు నిర్జనంగా వున్నాయి. అయినా నవరాగమణుల్ని పొదుగుకున్న ఓ యువతి కంకణాల ముంజేతుల్లా కాంతుల్ని వెదజల్లుతున్నాయి.   

    ఒక పోలీస్ పెట్రోలింగ్ వేన్ వెళ్ళింది నెమ్మదిగా. ఓ ఆకారం పైకి లేచింది. పైనవున్న దుప్పటి తొలగించి దిక్కులు చూస్తున్న అతడు అంతవరకూ ఫుట్ పాత్ పై షాపుల కభిముఖంగా ముష్టి వాళ్ళతో పడుకుని వున్నా నిద్రపోవడం లేదు. ఎదురుగావున్న దివ్యతేజ ఎపార్ట్ మెంట్సునే పరిశీలనగా చూస్తున్నాడు.

    చేతికున్న వాచీ చూసుకుని సరిగ్గా మూడుగంటల దాకా అలాగే కూచున్నాడు. అప్పుడో కారువచ్చి ఆగింది సమీపంలో....రహస్యంగా మాటాడి మరుక్షణం ఎపార్ట్ మెంట్సు చీకటిలోకి నడిచాడు పరిసరాల్ని ఏకాగ్రతగా గమనిస్తూ.

    ఆరంతస్థుల దివ్యతేజ ఎపార్ట్ మెంట్సులో అంతా ఎప్పుడో నిద్రలోకి జారిపోయారు. కాని మొదటి ఫ్లోర్ లోని ఓ ఫ్లాట్ లో ఇంకా లైట్లు వెలుగుతూనే వున్నాయి....

    ఆ ఫ్లాట్ నివాసయోగ్యమైన ఇల్లు మాత్రమే కాదు. పాముల విషంపై ప్రయోగాలు జరుగుతున్న ఓ టాక్సికాలజీ లేబరేటరీ కూడా. అందులో గ్లాసు ఆక్వారియమ్స్ వంటి గాజుతొట్టెలున్నాయి. ఆ గాజు తొట్టిల్లో అతి విషపూరితమైన 'ఎన్ హైడ్రెనా' వంటి సముద్రసర్పాలు మొదలుకుని భారతదేశంలోని 236 జాతుల సర్పాలతోబాటు మనిషికి ప్రాణహాని కలిగించే నాగు (కోబ్రా), కట్లపాము (క్రైట్), రక్తపింజర (రస్సిల్ వైపర్), మిన్నాగు (సాన్క్ ల్డ్ వైపర్) లూ వున్నాయి.

    "ఇక పడుకోండి అంకుల్" టెస్ట్ ట్యూబ్ లోని వీనమ్ క్రిస్టల్స్ లో ఓ ద్రావకాన్ని కలుపుతున్న డాక్టర్ సంఘమిత్రని చూస్తూ అంది శృతి. ఆయన ప్రయోగాలకి సహకరించే డాక్టర్ శృతి....ఆరు పదులు దాటని వయసైనా ఆయన మొహంపై ముడతలు, నెరిసిన గెడ్డం నూరేళ్ళ శ్రమతో తప్ప సాధించలేని మేధస్సుని వర్షించే ఆయన కళ్ళు ఎనభయ్యేళ్ళ వృద్ధుడిగానే దర్శింప చేస్తుంటాయి. శృతి ఇప్పుడు ఆలోచిస్తున్నది ఆయన ఆరోగ్యం గురించే...ఇప్పటికి వారం రోజులుగా ఆయన రాత్రిళ్ళు నిద్రపోవడం లేదు.... "నా మాట వినండంకుల్." 

    "టేకిట్ ఈజీ మై చైల్డ్" ఒక మహర్షిలా మృదువుగా నవ్వారు. కాని ఎందరో ఆయన ఆ క్షణంలో ఎప్పటిలా లేరు... కళ్ళలో పట్టుదల ఎప్పటిదే అయినా వాటి వెనుక ఏదో ఆందోళన వుంది. "మరో అయిదు నిముషాలలో మనం ఓ అరుదైన ప్రయోగాన్ని చేయబోతున్నాం. ఫలించిందా రెండు దశాబ్దాల నా తపస్సుకీ దీక్షకీ ఓ పరమార్ధం దక్కినట్టే...లేదా..." ఆగిపోయారు సన్నని ప్రకంపనతో...

    భారతదేశంలో టాక్సికాలజీ ప్రొఫెసర్ గా డాక్టర్ సంఘమిత్ర స్థానమెంత ఉత్కష్టమైనదో ఆమెకు తెలీనిది కాదు... తను ఒకనాడు ఎవరూలేని అనాధ...ఒక పసికందుగా ఆ ఇంట ప్రవేశించింది. అయన ప్రోత్సాహంతో తనూ డాక్టరైంది. ఎప్పుడో పాము విషాలకి 'ఏంటి వీనమ్ సీరమ్' ని తయారుచేసే బాంబే 'హాఫ్ కన్ ఇన్ స్టిట్యూట్' లో పనిచేసే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి అయిదేళ్ళ క్రితమే హైద్రాబాద్ లో టాక్సికాలజీ ప్రయోగశాలని ప్రారంభించారు. ఏంటి వీనమ్ ఇంజక్షన్ రూపంలో కాక ఒక మామూలు ఆయింట్ మెంట్ లా తయారుచేసి అందరికీ అందుబాటులో వుండేట్టు చూడాలని ప్రయోగాల్ని ప్రారంభించారు.

    ఇక్కడ ఇంతటి దీక్షతో అనితరసాధ్యమైన ఈ ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఏటా సుమారు ముప్పైవేల మంది దాకా ఈ దేశంలో పాముకాటుతో మరణిస్తున్నది సకాలంలో మందులు లభ్యంకాక అన్న సత్యాన్ని తెలిపే స్టేటిస్టిక్స్ చూసి మాత్రమే కాదు. కొన్నేళ్ళక్రితం ఆయన ఒక్కగానొక్క కొడుకూ సరిగ్గా అలాంటి స్థితిలోనే ప్రాణాలు వదిలారు.

    ఇప్పటికీ అది ఆయనకి మానని గాయమే...అయినా వేదన్ని ఆశావాదం ఓడించి వేదాంతిగా మార్చింది. రుష్యత్వాన్ని సిద్ధింప చేసింది.

Next Page