Next Page 
గర్ల్ ఫ్రండ్ పేజి 1

                                 


                                    గర్ల్ ఫ్రండ్
                                     __ డాక్టర్ సి. ఆనందారామం.

                                                             


    అత్యంత వేగంగా ముందుకు దూసుకుపోతోంది ఇంపోర్టెడ్ చెవర్లెట్ కారు. కారు మలుపుత్రిప్పటంలో ఎంతటి రష్ లోనైనా బ్రేక్ వెయ్యకుండా ముందుకు తీసుకుపోవటంలో డ్రైవర్ చాకచక్యమూ, ధైర్యమూ, కొద్దిగా పొగరుకూడా తెలుస్తున్నాయి. చిన్నాపెద్దాకాని ఒక మోస్తరు బంగళా కాంపౌండ్ లోకి వేగంగా కారుతలుపు తెరుచుకుని ఠీవిగా అందులోంచి డిగిన యువకుడు నూనూగుమీసాల నూతన యవ్వనంలో వున్నవాడు. కళ్ళు చిలిపిగ పెంకిగా పొగరుగా కళకళలాడుతున్నాయి. అతి నిర్లక్ష్యంగా నవ్వుతున్నట్లున్నాయి పెదవులు. పట్టుదలను సూచిస్తూ కొనదేరినట్లుగా వుంది ముక్కు. గాలిలో ఎగురుతున్నట్లుగా బాల్కనీకున్న పదిమెట్లుఎక్కి బాల్కనీలో కేన్ చైర్ లో కూచుని చదువుకుంటూన్న ఒక కన్నెపిల్ల కభిముఖంగా నిలబడ్డాడు. ఆ అమ్మాయి లేతగా వుంది. కళ్ళు నిర్మలంగా ఉన్నాయి. పెదవులు అమాయకంగా నవ్వుతున్నాయి. నున్నటిచెక్కిళ్ళలో చిన్నచిన్న సొట్టలుపడుతూ అందాలు విరజిమ్ముతున్నాయి. కారు ఆగటం కాని, ఆ యువకుడు రావటంకాని, తనముందు నిలవటంకాని, తెలియనంత శ్రద్ధగా చదువుకుంటూంది ఆ అమ్మాయి.
    "నీకసలు సిగ్గుందా?" గట్టిగా అరిచాడా అబ్బాయి. ఆ అరుపుకు చదువులో లీనమైవున్న ఆ అమ్మాయి అదిరిపడింది. చేతిలోంచి పుస్తకం జారిపడింది. అమాయకంగా బెదురుగా చూసింది. ఆ చూపులకి ఒక్క నిముషం కరిగిపోయినా, మరుక్షణంలో మరింత కోపం వచ్చింది ఆ యువకుడికి.
    "ఇలాంటి నంగనాచి చూపులతోనే లోకాన్ని నాశనం చేస్తున్నావు!" అన్నాడు. ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా రోషంగా తర్జని చూపిస్తూ "యూ గెటవుట్!" అంది.
    "వాట్! నన్నే గెటవుట్ అంటున్నావా?" ఒక అడుగు ముందుకు వేశాడు ఆ యువకుడు. చాచి లెంపకాయ కొట్టబోయింది. ఆ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. "వదులు!" అని విదిలించుకోబోయింది.
    "వదలను. నీకు ఉచ్చం నీచం లేదు. మంచి చెడ్డలు లేవు. మానాభిమానాలు లేవు."
    ఆ యువతి పెద్దపెద్ద కళ్ళతో దెబ్బతిన్న లేడిలా చూసింది. అలా చూస్తుండగానే ఆ కళ్ళనిండా నీళ్ళు నిండుకుని బొట్లుబొట్లుగా జారసాగాయి.
    అతడు కంగారుపడి చెయ్యి వదిలేశాడు. నిస్సహాయంగా చూస్తూ "ఎందుకేడుస్తున్నావు?" అన్నాడు.  ఆ యువతి చేతులలో ముఖంకప్పుకుని అటు తిరిగింది. ఆమె భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి ఏడుస్తున్నట్లు గుర్తుగా. ఆ భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకుని "ఏడవకు" అన్నాడు. నీళ్ళునిండి ఎర్రబారిన కళ్ళతో రోషంగా చూసింది ఆ అమ్మాయి.
    "నువ్వు పశువ్వి, కిరాతకుడివి, మీ మొగజాతి అంతా నరరూప రాక్షసులు."
    "ఏయ్! నన్నే అంతంతమాటలంటున్నావా? ఎంత ధైర్యం?"
    "నేను నీకెందుకు భయపడాలి? ఏం తప్పు చేశానని భయపడాలి? సిగ్గులేంది నాకు కాదు - నీకు - ఈ నాగరిక యుగంలో కూడా ఒంటరిగా ఉన్న ఆడపిల్ల జోలికొచ్చి నానా మాటలు అంటున్నావు - ఛీ! ఛీ! ఈ మొగాళ్ళంతా ఇంతే! ఆడపిల్ల కనిపిస్తే చాలు, తోడేళ్ళవుతారు - పచ్చినెత్తురు తాగే రాక్షసులవుతారు - ఈ యమదూతల బారినుండి ఆడపిల్లలను కాపాడే దేవుడెక్కడున్నాడో? ఏమో!"
    "నేను తోడేలునా? రాక్షసుణ్నా, యమదూతనా?"
    "అంతకంటే పెద్ద మాట లేవైనా దొరికితే వాటితోనే తిట్టేదాన్ని__"
    "నోర్ముయ్ నేను తలచుకుంటే, ఏం చెయ్యగలనో తెలుసా?"
    "అందుకేగా రాక్షసుడన్నది?"
    తెల్లబోయాడు ఆ యువకుడు - కిసుక్కున నవ్వింది ఆ యువతి - ఆ నవ్వులో అందాలను దిగ్ర్భాంతుడై చూస్తూ నిలబడ్డాడు ఆ యువకుడు- ఆ చూపులకు కనుబొమలు చిట్లించి కళ్ళెర్ర చేసి "రాజా!" అని పిలిచింది గట్టిగా - లోపలినుంచి సింహంలాంటి కుక్క వచ్చి అతని మీదకు దూకింది- అతడు తప్పించుకోవాలని ప్రయత్నించాడు - అది వదలలేదు - అతడు పరుగు పెడుతుంటే కుక్క వెంటాడుతుంటే ఆ అమ్మాయి హాయిగా నవ్వింది-కుక్క అతని ఖరీదైన పేంట్ ని చింపి పీలికలు చేసింది. తొడ దగ్గర కూడా కాస్త పంటిగాటు పడింది-అప్పుడు "రాజా" అని పిలిచి, ఆ కుక్కను కట్టేసింది- చిరిగిపోయిన పేంట్ తో, కొద్దిపాటి రక్తపు మరకలతో, పరుగులు పెట్టటంవల్ల ఆయాసంతో ఒగురుస్తూ చాలా హాస్యాస్పదంగా కనపడ్డాడు అతడు - ఆ అమ్మాయి నవ్వుతూ "ఆడపిల్లని ఏడిపించినంత తేలిక కాదు కుక్క నుంచి తప్పించుకోవటం - ఉండండి-ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. తరువాత హాస్పిటల్ కు వెళ్ళి ఇజంక్షన్ తీసుకోండి- ఎలాంటి కుక్క అయినా, కుక్క కాటు నిర్లక్ష్యం చెయ్యకూడదు" అని లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్సు తీసుకువచ్చింది - అతడు బాధతో అక్కడే ఉన్న మరో కేన్ కుర్చీలో కూచున్నాడు. ఫస్ట్ ఎయిడ్ బాక్సుతో వచ్చిన ఆ యువతి ఏదీ మీ గాయం? అంది - అతడు తొడ మీది తన గాయాన్ని చూపటానికి సిగ్గుపడ్డాడు - "సిగ్గుఎగ్గు లేనిదానినని వస్తూనే తిట్టారుగా! నిజమే! సిగ్గులు ఒలకబోస్ వృత్తికాదు నాది.గాయం చూపండి-" అంది. తొడమీద తన గాయం చూపిస్తూ ఆశ్చర్యంతో "మీరు డాక్టరా?" అన్నాడు. "కాదు, మెడిసిన్ చదువుతున్నాను. ఫస్ట్ ఎయిడ్, ఐనా ఈమాత్రం ఫస్ట్ ఎయిడ్ ఎవరికైనా వస్తుందిలెండి!"
    డెటాల్ తో అతని గాయం కడిగి, ఆయింట్మెంట్ రాసి పైన దూదిపెట్టి బాండేజ్ కట్టింది - సుకుమారమైన ఆ చేతివ్రేళ్ళను చూస్తూ ఆ స్పర్శను అనుభవిస్తూ తన బాధ మరచిపోయాడు అతను. కళ్ళెత్తి అతని వంక చూసి నవ్వింది. "ఇంక మీరు వెళ్ళచ్చు" అంది. తన కాలివంక చూసుకుంటూ "ఈ కాలితో నేను డాన్స్ చెయ్యగలనా, ఇవాళ?" అన్నాడు.

Next Page