కల్యాణిని గదిలో ఒంటరిగా విడిచిపెట్టి మాధవి ఆలోచిస్తూ టెర్రస్ మీదకు వెళ్ళింది.
పెరటి వాల్ దగ్గర ఓ అమ్మాయి నిలబడివుండటం కనిపించింది. ఆ అమ్మాయిని మాధవి వచ్చినప్పట్నుంచీ చూస్తూనేవుంది. ఆమె సీనియర్. అయితే ర్యాగింగ్ లో ఎక్కడా పాల్గొనలేదు. అంతేకాదు, మనిషి చాలా మెతకలా సిగ్గరి అయినట్లు కన్పిస్తోంది.
"హలో!" అంది ఆమె దగ్గరకు వెడుతూ.
ఆమె ప్రక్కకు తిరిగి చూసి, నవ్వి "హలో" అంది.
"ఒక్కరే నిలబడ్డారేం?"
"నేనెప్పుడూ ఒంటరిగా వుండటాన్నే లైక్ చేస్తాను. బైదిబై మీరు కొత్తగా జాయినయ్యారు కదూ?"
మాధవి తల ఊపింది.
"మీ పేరు?"
చెప్పింది.
"నా పేరు ప్రమీల."
"మీరు రచయిత్రా?"
"ఎందుకలా అడిగారు?"
"మిమ్మల్ని చూడగానే అలా అనిపించింది. చెప్పండి, అవునుకదూ?"
ఆమెకొంచెం నవ్వి "అవునో, కాదో నాకుతెలీదు కానీ నేను కొద్దిగా రాస్తూ ఉంటాను" అన్నది.
"ఏం రాస్తూ ఉంటారు? కథలా? నవలలా? పోయెట్రినా?"
"అన్నీ కొంచెం కొంచెం. ఎందులోనూ పూర్తిప్రవేశం లేదులెండి."
"కాని మనుషుల్ని అబ్జర్వు చేస్తూ ఉంటారు."
ఆమె ఏమీ జవాబు చెప్పలేదు.
"నిన్నట్నుంచీ రకరకాలుగా మమ్మల్ని సీనియర్సంతా ర్యాగ్ చేస్తున్నారు. మీరు పార్టిసిపేట్ చెయ్యలేదేం?"
"అందులో నాకేమీ ఆనందం లేదుకనుక."
"అంతే మిగతావాళ్ళకంతా ఆనందం వుందన్న మాటేగా.
ఒక మనిషి హింసననుభవిస్తుంటే అది చాలామందికి ఎంజాయ్ బుల్ గా వుంటుందన్నమాట."
"కొందరికి" అని సరిదిద్దింది ప్రమీల.
"అసలు ర్యాగింగ్ మీద మీ ఉద్దేశమేమిటి?"
"జూనియర్స్ కాలేజీలో కొత్తగా చేరతారు కాబట్టి, సీనియర్స్ తో పరస్పర అవగాహనం కావడానికి, వాళ్ళకి స్టడీస్ లోగాని, మిగతా ప్రక్రియల్లోగాని సీనియర్స్ కోపరేషన్ కావాలి కాబట్టి ర్యాగింగ్ అవసరమని వాదిస్తారు కొందరు. కాని నా దృష్టిలో ఇది పైశాచికమైన వినోదం. పరస్పరావగాహనకోసం ఇంత వికృతమైన చర్యలు చేయ్యనఖ్కర్లేదు. అది చాలా సునాయాసంగా సాధించవొచ్చు" అన్నది ప్రమీల.
"ఈ రాజా అన్న అబ్బాయి మీకు తెలుసా?"
"తెలుసు. అన్నట్లు నేనేంచదువుతున్నానో మీకు తెలీదుకదూ. ఫైనలియర్."
"రాజాగురించి మీ ఉద్దేశమేమిటి?"
"అతనికి స్టూడెంట్స్ సర్కిల్ లో చాలా పలుకుబడివుంది. ఫాలోయింగ్ వుంది. పట్టుదల మనిషి, చాలా దుడుకువాడుకూడా. అనుకున్నది సాధిస్తేనేగాని వదిలిపెట్టనిరకం. అమ్మాయిలని బాగా ఏడిపిస్తాడు. కొంతమంది అమ్మాయిలు అతనంటే పడిచచ్చే మాటకూడా నిజం. దెబ్బలాటలకు రెడీ. రెండుమూడుసార్లు ఇతర కాలేజీలకూ, మన కాలేజీ విద్యార్థులకూ అయిన తగాదాల్లో దూసుకువెళ్ళి వ్యవహారాన్ని క్లయ్ మాక్స్ వరకూ తీసుకెళ్ళాడు. నిజం చెప్పాలంటే అతను నాకూ సరిగ్గా అర్థంకాలేదు. ఒక్కోసారి చూస్తే అతి క్రూరుడేమోననిపిస్తుంది. అప్పుడప్పుడూ ఇదంతా నటనేమో, ఒట్టిరాలుగాయేతప్ప కల్లాకపటం ఏమీ లేదేమోననిపిస్తుంది. ఏం, వివరాలడుగుతున్నారు? మిమ్మల్నేమయినా అన్నాడా?"
"నా జోలికి వచ్చినాబాగుండేది. అతనిదృష్టి ఓ అమాయకురాలిమీద పడింది" అన్నది మాధవి సాలోచనగా.
ఇంతలో చాలామంది ఆడపిల్లలు టెర్రస్ మీదకువచ్చారు. వాళ్ళ సంభాషణకు అంతరాయం కలిగింది.
* * *
మరునాటి ఉదయం ఎనాటమీ థియేటర్ కు వెళుతుంటే మెట్లమీద రాజా ఎదురయాడు. కల్యాణి గుండె గబగబా కొట్టుకుంది. ప్రక్కనేవున్న మాధవి చెయ్యి గట్టిగా పట్టుకుంది. రాజా కల్యాణి ముఖంలోకి సూటిగా చూశాడు. అతని కళ్ళలోని ఎరుపు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అతని వాలకం చూస్తే ఏమయినా దౌర్జన్యం చేస్తాడనిపించింది. కాని అలాటిదేమీ సంభవించలేదు. ఏమనుకున్నాడో, ఏమో ప్రక్కకు తొలగి దారి ఇచ్చాడు. ఆడపిల్లలిద్దరూ పైకి వెళ్ళిపోయారు.
లంచ్ అవర్ లో క్రిందకు దిగి వస్తోంటే "ఇదిగో కల్యాణీ!" అని పేరు పెట్టి ఎవరో పిలిచారు. ఉలికిపడి వెనుదిరిగి చూసింది. ఎవరో కొత్తముఖం. నల్లగా, పొడుగ్గా, బలిష్టంగా వున్నాడు. గొంతుకూడా మొరటుగా వుంది. కల్యాణికి భయంవేసింది.
"నా పేరు దివాకర్. ఫోర్తియర్ చదువుతున్నాను" అంటూ ముందుకు వచ్చాడు.
ఇతను కూడా ర్యాగింగ్ చెయ్యటానికి వస్తున్నాడా ఏమిటి అనుకుంది మాధవి.
"ఏమిటి ఆ రాజాగాడేదో గొడవ చేస్తున్నాడట?" అనడిగాడు దివాకర్.
మాధవికి, కల్యాణికి ఏం జవాబు చెప్పాలో తెలీక చూస్తూ ఉండిపోయారు.
"ఫర్వాలేదు చెప్పండి. నేను మీ పక్షమే. మీకు సహాయంచెయ్యటానికే వచ్చాను."
అతని ముఖం చూస్తోంటే మాధవికి సదభిప్రాయం కలగలేదు. తమకతను ఏవిధంగా స్నేహితుడో, తమపక్షం ఎందుకు వహిస్తున్నాడో అర్థంకాలేదు. ఈ లేనిపోని సాయాలన్నీ ఎందుకు స్వీకరించాలి? నిర్దాక్షిణ్యంగా కట్ చేసి పారేద్దామా అనుకుంది. కాని ఇంతలో రాజా ముఖం, అతని కళ్ళలోని ఎరుపు గుర్తుకొచ్చింది. తాను ఒక్కతే అయినా ఫర్వాలేదు. ఒంటరిగా ఎలాంటి సంఘటనయినా ఎదుర్కోగలదు. కాని కల్యాణిగురించి కొంత ఆసరా అవసరమనిపించింది.
ముక్తసరిగా జరిగింది చెప్పింది.