Previous Page Next Page 
అతడు ఆమె ప్రియుడు పేజి 8


                    రెండో అధ్యాయం

    "వూడా' మార్కెటింగ్ యార్డ్ లోకి యాభై కిలోమీటర్ల వేగంతో  దూసుకొచ్చింది 'సన్నీ'. గట్టిగా విన్పించిన బ్రేకుల శబ్దాలకి తమ పనుల్లో హడావిడిగావున్న జనమంతా ఓ క్షణం తలతిప్పి చూసారు.

    బైక్ మీద  వచ్చి ఆగిన అమ్మాయి  వారిని పట్టించుకోలేదు. స్టయిల్ గా జుట్టుని వెనక్కి నెట్టుకుంటూ స్టాండ్ వేసింది.

    వూడా మార్కెటింగ్ యార్డ్ లో సైకిళ్ళకూ, స్కూటర్లకూ, కార్లకూ విడి విడిగా పార్కింగ్ స్థలాలున్నాయి. అయితే సన్నీమీదదిగిన అమ్మాయి 'కార్ పార్కింగ్ ఓన్లీ' అని వ్రాసి వున్న బోర్డు చూసికూడా అదో మామూలు విషయంలా బైక్ ని ఓ కారు పక్క పార్కింగ్ చేసింది. ఆమె స్టాండ్ వేస్తున్న తీరు ఎవరినయినా ఒక క్షణం నిలిపివేయక తప్పదు.

    ఆమె స్టాండ్ వేసి వెనుదిరుగుతుండగా ఒకతను ఆమె  దగ్గరకు వచ్చాడు. ఆరడుగుల ఎత్తు, విశాలమైన ఛాతీ.

    అతను వచ్చి దగ్గర నిలబడటం చూసి ఆమె "ఏమిటి విషయం?" అన్నట్టు కళ్ళెగరేసింది.

    "ఎక్స్ క్యూజ్ మీ! ఇక్కడ కారు మాత్రమే పార్క్ చేయాలి" అన్నాడు. అతడి కంఠం గంభీరంగా  పలికింది.

    "పార్క్ చేయడానికి మాకు కారు లేదండీ" చిలిపితనం ఉట్టిపడే చిరునవ్వుతో అంది. ఆమె అలా నవ్వుతుంటే విల్లుని మధ్యకి వంచినట్టు వంగింది ఆమె పై పెదవి.

    ఆమె మాటల్లోని రిటార్డుని గమనించి "అదికాదండీ, ఇక్కడ బైక్  పార్క్  చేయకూడదు" అని సరిదిద్దుకున్నాడు. ఆమె అందం అతన్ని తడబడేట్టు చేస్తోంది.

    ఆమె అతన్ని ఒకసారి క్రిందినుండి పైవరకూ పరిశీలించి చూసి, చిరుగాలికి నుదురుపైబడే ముంగురుల్ని మళ్ళీ వెనక్కి తోసుకుంటూ "ఇంతకీ ఆ విషయం చెప్పడానికి మీరెవరండీ" అని అల్లరిగా ప్రశ్నించింది.

    "నేనీ ఏరియా ఏ.సి.పి.ని" సివిల్ డ్రస్ లో వున్న అతడు జవాబిచ్చాడు.

    అయెం గతుక్కుమని , వెంటనే సర్దుకుని, "మీ ఐడెంటిటీ  కార్డు ఓ సారి చూపిస్తారా?" అని అడిగింది.

    అతడి భృకుటి ముడిపడింది. ఏదో అనబోయి, మళ్ళీ ఆ ఆలోచన విరమించుకుని, జేబులోంచి ఐడెంటిటీ కార్డు తీసి చూపించాడు.

    ఆమె భయపడి, అతడ్ని మంచి చేసుకోవటానికా అన్నట్లు "మీరింత పెద్ద ఆఫీసరై వుండీ, ఇలాంటి చిన్న కేసుల్ని పట్టుకోవడం ఏమిటండీ" అంది సానుభూతిగా.

    "పోలీసాఫీసర్ గా కాకున్నా, ఒక సామాన్య పౌరుడిగా కూడా నేనీ విషయం చెప్పొచ్చు. రూల్స్ కి వ్యతిరేకంగా మీరిక్కడ బైక్ పార్క్ చేశారు. అది ప్రశ్నించిన ఓ పోలీస్ అధికారిని తన ఐడెంటిటీని చూపించమని నిలదీశారు."

    "అలా అడిగే అధికారం నాకుంది కదండీ."

    "మీరు అధికారాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను రూల్స్ గురించి మాట్లాడుతున్నాను. మీ బైక్ ని కోర్టులో జుల్మానా చెల్లించి విడిపించు కోవచ్చు."

    ఆమెకి ఏమనాలో తోచలేదు. బ్రతిమాలటానికి అహం అడ్డొచ్చింది.

    అంతలో ఒక కారు అక్కడికి వచ్చి ఆగింది. దానిపై 'పోలిస్' అని వ్రాసి  వుంది. అందులోంచి కమీషనర్ ఆఫ్  పోలీస్ దిగాడు. తేజా అతడికి సెల్యూట్ చేశాడు.

    "హల్లో మిస్టర్ తేజా.....! ఏమిటి విశేషం అన్నట్టు అతడి వైపు చూశాడు ప్రశ్నార్థకంగా.

    తేజా ఏదో చెప్పబోయేటంతలో ఆమె కల్పించుకుని "సర్...... ఇతడు నా అడ్రస్ చెప్పమని లేకపోతే రాంగ్ పార్కింగ్ క్రింద బైక్ ని కోర్టుకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు కంగారు నటిస్తూ అంది.

    రవితేజా షాక్ తగిలినట్టు అవాక్కయ్యాడు. ఒక క్షణం  ఈ హఠాత్ సంఘటనకి బిత్తరపోయి, వెంటనే తేరుకుని "నో....నో సర్. అన్నీ అబద్ధాలు చెపుతోంది ఈ అమ్మాయి. అసలేం జరిగిందంటే" అంటూ చెప్పబోయాడు.

    ఆమె అతడిని మాట్లాడనివ్వలేదు. "నిజం సార్..... ఐడెంటిటీ కార్డు చూపించి నేను ఐ.పి.ఎస్/ ఆఫీసర్నీ. నీ అడ్రస్ చెప్పు అంటూ వేధిస్తున్నాడు సార్" అంటూ గొంతు హెచ్చింది.

    అప్పటికే జనం మూగుతున్నారు.

    "నన్నో అబ్బాయి ఏడిపిస్తున్నాడు" అని ఒకమ్మాయి అబద్ధం చెప్పి నమ్మించడం చాలా సులభం. అదే "ఓ అమ్మాయి నన్ను ఏడిపిస్తోంది" అని అబ్బాయి చెప్పినా ఎవరూ నమ్మరు.

    దీనికి కమీషనర్ ఆఫ్ పోలీస్ కూడా అతీతుడేమీ కాదు. పైగా చుట్టూ జనం!

    "మిస్టర్ తేజా...... ఒక బాధ్యత గల ఆఫీసర్ వై యుండి ఏమిటి నీ ప్రవర్తన" అన్నాడు అధికార స్వరంతో.

    తేజా మాట్లాడలేదు.

    ఆ అమ్మాయి నాటకం విజయవంతమైందని అతడికి అర్థమైంది. ఇక వాదించి లాభంలేదని కూడా తెలిసిపోయింది.

    ఆయన తత్వం బాగా తెలుసు.

    అందుకే 'సారీ' అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

    వెళ్తూ ఆమె మొహంలోకి ఒకసారి చూశాడు. ఆమె మొహంలో అల్లరి అతడిని చిలిపిగా వెక్కిరించింది. సన్నగా ఎవరికీ తెలియకుండా కన్ను కొట్టినట్టు కూడా అనిపించింది.

    అతడు తన వాహనంవైపు వెళ్తూంటే వెనుకనుంచి ఆయన ఆ అమ్మాయిని ప్రశ్నించడం వినిపించింది.

    "నీ పేరేమిటమ్మా?"

    ఆమె మొహం మరింత అమాయకంగా పెట్టి "నా పేరు సిరిచందన అండీ" అంది.

    అలాంటి పరిస్థితులలో కూడా అతను అనుకున్నాడు.

    "ఇట్స్ నైస్ నేమ్"

   
                             2 

    రవితేజ మనసంతా టెన్షన్ గా వుంది. ఐ.పి.యస్. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా అతనంత టెన్షన్ గా  ఫీల్ కాలేదు. కారు నెమ్మదిగావెళుతోంది. దానికన్నా ముందే అతని హృదయం చేరవలసిన చోటుకి చేరిపోయింది.

    మొదటిసారి పెళ్ళి చూపులంటే ఎవరికైనా అంత ఉత్సుకత ఉండటం సహజమే.

    రెండంతస్తుల అందమైన మేడ అది! ముందు రెండు కార్లు పెట్టుకునేటంత పోర్టికో, ఇరువైపులా రకరకాల పూలమొక్కలు- వాటి మధ్యగా గేటునుంచి పోర్టికో వరకు ఎర్రమట్టి రోడ్డు. గేటు పక్కనే చిన్న బోర్డు, ఆ బోర్డు మీద విష్ణువర్ధనరావు అన్నపేరుంది.

    విష్ణువర్ధనరావుపేరుకి తగ్గట్టు ఆ ఇంట్లో లక్ష్మికళ ఉట్టిపడుతోంది. గోడలమీద రకరకాల తైలవర్ణ చిత్రాలు, గది మొత్తం పరిచిన రెడ్ కలర్ కార్పెట్- సెంట్రిల్లీ ఎయిర్ కండిషన్డ్ భవంతి అది.

    కారు హారన్  వినగానే గూర్ఖా హడావుడిగా వెళ్ళి గేటు తెరిచాడు. లోపలికి వస్తున్న కార్లోని వ్యక్తుల్ని ఎప్పుడూ చూడకపోయినా, వాళ్ళెవరో తెలిసినట్టు శాల్యూట్ చేశాడు. కారు వచ్చి పోర్టికోలో ఆగింది. హాల్లోంచి విష్ణువర్ధనరావు హడావుడిగా బయటికొచ్చి కారు దగ్గరకి నడుస్తూ "రండి,రండి. మీ కోసమే ఎదురుచూస్తున్నాం" అన్నాడు. లోపల్నుంచి ముందు సత్యనారాయణ రావు  దిగాడు. ఆయన  రవితేజ తండ్రి, ఎత్తుగా, లావుగా, బలంగా వుంటాడు. బట్టతల, కొద్దిగా తెల్లవెంట్రుకలు లేకపోతే ఆయన కూడా యువకుడేమోనని పొరపాటు పడతారు.

    తండ్రితోపాటే రవితేజ కూడా కారు దిగాడు. మామూలు సమయాల్లో ఒక ఐ.పి.యస్. ఆఫీసర్ కుండే అధికారం, దర్పం ఇప్పుడతనిలోలేవు. తండ్రితోపాటు పెళ్ళి చూపుల కొచ్చిన యువకుడిలాగే కొద్దిగా బిడియంగా, మౌనంగా, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యతతో వున్నాడు.

    ముగ్గురూ హాల్లోకి ప్రవేశించారు. హాలు మధ్యలో మూడు సోఫాలు వలయాకారంలో వేయబడి వున్నాయి. మధ్యలో టీపాయ్, దానిమీద అందమైన ప్లవర్ వాజ్, దానిపక్కన  రెండు మూడు ఇంగ్లీషు పత్రికలు, ఆ రోజు దినపత్రికలూ వున్నాయి. "కూర్చోండి" అన్నాడు విష్ణువర్ధనరావు.

    గేటు దగ్గర గూర్ఖానుంచి, ఇంటి యాజమానివరకూ ఎంతో ఎగ్జయిట్ మెంట్ తో వున్నట్టు కనబడుతోంది. ఆ ఇంట్లోకూడా అవేమొదటి పెళ్ళిచూపులు. పెళ్ళి కూతురి తండ్రిగా ఆయన కంగారు తెలుస్తోంది.

    విష్ణువర్ధనరావు, సత్యనారాయణ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ దార్లు వేరయ్యాయి.

    వివాహం జరిగిన తర్వాత విష్ణువర్ధనవావుకి కలప వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. రెండెకరాల పొలం కాస్తా ఇరవై ఎకరాలయ్యింది. కూతురికి పది సంవత్సరాలొచ్చేసరికి అతని ఆస్తి మరో పదింతలు పెరిగింది.

    విశాఖ పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో అరకు వేలీలో గవర్నమెంటు భూమిని కొని యూకలిప్టన్ చెట్లు పెంచాడు. అవి విపరీతంగా లాభాలని ఆర్జించి పెట్టాయి. అప్పుడప్పుడూ వెళ్ళి వుండటానికి ఒక గెస్ట్ హౌస్ లాగా  ఆ తోటలోనే ఒక బిల్డింగ్ కట్టించాడు. వేసవిలో చాలామంది అరకులోయ వెళుతూ వుంటారు. అక్కడి కొచ్చిన వారందరూ తప్పకుండా ఆ గార్డెన్ కూడా చూస్తారు.

    ఆ గార్డెన్ పేరు సిరి గార్డెన్స్. తన కూతురు పేరే దానికి పెట్టాడాయన.

    విష్ణువర్ధనరావు సహజంగా కళాహృదయుడు. ప్రకృతి ఆరాధకుడు. సంవత్సరానికి రెణ్ణెల్లు కుంటుంబంతో సహా సిరి గార్డెన్స్ లో గడుపుతాడు!

    గెస్ట్ హౌస్ ముందు రకరకాల పూలమొక్కలు తెప్పించి పెంచడం ఆయన అలవాటు. ఒకసారి ఆఫ్రికా నుంచి ఒక ప్రత్యేకమైన మొక్క తెప్పించాడు. వృక్షరాజ్యంలోనే అతి పెద్ద పుష్పాన్ని పూసే ఆ మొక్క పేరు  రఫ్లీసియా. ఆ పుష్పాన్ని చూడటానికి కూడా సీజన్ లో టూరిస్టులు సిరి గార్డెన్స్ కి వస్తుంటారు.

    ......రవి తేజ సోఫాలో ఇబ్బందిగా కూర్చుని చుట్టూ చూస్తున్నాను. ఆ గదికి ఒక మూల అందమైన స్టెయిర్ కేసుంది. అక్కడి నుంచి పై గదులకి మెట్లున్నాయి. ఆ మెట్లమీద నుంచి దిగబోయే అమ్మాయికోసం అతడు మాటిమాటికీ దృష్టి సారిస్తున్నాడు. కానీ అంతలోనే పెద్దలు తన 'ఉత్సాహం' గమనిస్తారేమోనన్న బిడియంతో చూపులు తిప్పుకుంటున్నాడు.

    ఆ మెట్లమీంచి దిగబోయే అమ్మాయి. తనని ఆ ముందురోజు ఏడిపించిన సిరిచందనే అని తెలిస్తే అతనికి ఎలా ఉండేదో మరి!

    పెద్ద వాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు. యూకలిప్టన్ చెట్ల పెంపకం గురించి విష్ణువర్ధనరావు చెపుతూంటే, సైన్యంలో తన అనుభవాల గురించి సత్యనారాయణ మాట్లాడుతున్నాడు. రవితేజకి మాత్రం  ఈ మాటలేం వినపడటంలేదు. పుస్తకం చేతిలో ఉందన్నమాటే కాని అతని మనసు మాత్రం ఇంకెక్కడో వుంది. ఈ లోపులో ఆ గదిలో సన్నటి పరిమళం ముందు వ్యాపించింది. కబుర్లు ఆగిపోయాయి. గదిలో అంత హఠాత్తుగా నిశ్శబ్దం వ్యాపించేసరికి రవితేజ తలెత్తి చూశాడు.

    ముందు అతని కళ్ళముందు బంగారు తీగ మెరిసినట్లయింది. దూరంనుంచి అది నడిచి వస్తున్నట్లు అనిపించింది.

 Previous Page Next Page