Previous Page Next Page 
దుప్పట్లో మిన్నాగు పేజి 8


                                     వెంకు చెప్పిన కథ: మానవాతీత వ్యక్తి
    ఆ టేబిల్ చుట్టూ అయిదుగురం వున్నాం. నేనూ, రామ్మూర్తీ, రామ్మూర్తి భార్య, అతడి పదహరేళ్ళ కూతురు అరుణ- వీరందరూ కాక అయిదో వ్యక్తి వెంకటేష్.
    ఈ రోజు డిన్నర్ లో ప్రముఖ వ్యక్తి వెంకటేష్ అనటంలో సందేహంలేదు. అతడేం చదువుకున్నాడో మాకు తెలీదు కానీ, మనిషి మాత్రం ఎప్పుడూ మాట్లాడుతూ వుంటాడు. అతడు వృత్తిరీత్యా మెజీషియను. ఈ కారణంగా అతడికి ఈ ఊర్లో చాలామంది తెలుసు. అతడి మొదటి భార్య చనిపోయిందని ఒక రూమారు కూడా  వుంది. కానీ అతను మాత్రం తనకి వివాహం కాలేదని  చెప్పుకుంటూ  వుంటాడు.
    వెంకటేష్ ని నేను అంతకుముందు రెండు మూడుసార్లు కలిశాను. అయితే ఇలా తక్కువ గ్రూప్ లో కల్సుకోవటం ఇదే మొదటిసారి. ఈసారి కలుసుకోవడానికి కారణం రామూర్తిఇస్తున్న డిన్నర్.
    రామ్మూర్తి  హేతువాది. ఈ డిన్నర్ కి వెంకటేష్ ని పిలవడానికి కారణం కేవలం అతడితో ఈ మానవతీత శక్తులు గురించి చర్చించడానికే అన్నది నిర్వివాదాంశం. నేను ఒక నాన్ కాంట్రవర్షియల్ మనిషిగానూ, సమాజంలో కొద్దిగా పలుకుబడి, చాలామందితో మంచి సంబంధ బాంధవ్యాలు వున్న వ్యక్తిగా ఈ డిన్నర్ కి  పిలవబడ్డాను అన్న వ్విషయం నాకు అర్థమైంది. అందువల్ల ఒక  శ్రోతగా వీరి వాదనలు వినటం నా బాధ్యతగా గుర్తించి, ఆ సంభాషణలో ఎక్కువగా పాల్గొనలేదు.
    వెంకటేష్ ఆ ఇంటికి రాగానే, తను వ్రాసిన 'మనుషులూ- మానవాతీత శక్తులూ' అన్న పుస్తకం తాలూకు రెండు ప్రతుల్ని చెరోకరికీ ఇచ్చాడు. అంతకుముందే ఆ పుస్తకం తాలూకు ఇంగ్లీషు వెర్షన్ని నేను చదివి వున్నాను. మనుష్యులు తమకున్న అతీంద్రియ శక్తులను ఉపయోగించి గాలిలోకి ఎలా ఎగరొచ్చో, ఇతరుల మెదడులో కదిలే ఆలోచన్లనీ ఎలా పసిగట్టవచ్చో వగైరా వివరాలు సోదాహరణంగా వివరించబడ్డాయి. గతంలో ఇలాంటి సంఘటనలు ఏయే దేశాల్లో ఎప్పుడెప్పుడు జరిగాయో ఛార్టుల్తో సహా ఇవ్వబడ్డాయి.
    రామ్మూర్తి హేతువాది కాబట్టి ఒక రకమైన కసితో ఆ పుస్తకాన్ని డిన్నర్ టేబుల్ ముందే తిరగవేస్తున్నాడు. నేను వెంకటేష్ని పరిశీలించటంలో నిమగ్నమయ్యాను. నిజం చెప్పాలంటే - నాకు మొదటి చూపులోనే వెంకటేష్ నచ్చలేదు. అతడికి సుమారు నలభై అయిదేళ్ళు వుంటాయి. అతను తన జట్టుకు రంగు వేశాడని చూడగానే  తెలుస్తూంది. అతడి మొహంలో ప్రవేశించటమే చాలా  అట్టహసంగా ప్రవేశించాడు. గుమ్మంలో నిలబడి చేతిలో వున్న చిన్న దువ్వెనని గాలిలోకి విదిలించాడు. అది ఓ రెండు అడుగుల కర్రగా మారి, దాని చివర ఒక గులాబీ పువ్వు ఆడుతూంది.
    రామ్మూర్తి భార్య సంభ్రమంగా చూసింది. కూతురు అరుణ అయితే ఆనందాతిరేకంతో చప్పట్లు కొట్టింది. అది నిజం కర్రకాదనీ-కాగితం మడతబెట్టి డానికి రంగు వేశాడనీ, లోపల స్ప్రింగు పెట్టాడనీ తరువాత నాకు రామ్మూర్తి చెప్పాడు గానీ, ఆ క్షణం మాత్రం వెంకటేష్ హీరోయే అయ్యాడు. కర్ర చివర్నవున్న గులాబీని తీసి, రామూర్తి కూతురికి అందించాడు.
    కొంచెం సేపటికి డిన్నర్ మొదలయింది.
    టేబుల్ దగ్గర వున్న కుర్చీల దగ్గరికి వెళ్ళి కూర్చోబోతున్న సమయానికి రామ్మూర్తికి అటువైపుగా వెళ్ళి కుర్చీ లాక్కున్నాడు వెంకటేష్. చాలా మామూలుగా  జరిగినా- ఈ విషయం నా దృష్టి దాటిపోలేదు. అతడు అలా లాక్కొని కూర్చోవటంతో రామ్మూర్తి కూతురు అతడి పక్కన కూర్చోవలసి వచ్చింది.
    లైటు వెల్తురులో వెంకటేష్ మొహంలో ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్. అతడు వంగి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు  విషయం స్పష్టంగా గమనించాను. ఆ అమ్మాయి తన కుర్చీలో అటుగా వంగిపోయి మునగదీసుకుని కూర్చుంది. ఆమె మొహంలో ఇబ్బంది స్పష్టంగా కనబడుతూంది. ఈ నలభై ఏళ్ళ వృద్ధుడు ఏవో చీఫ్  జోకులు వేసి ఆ అమ్మాయిని నవ్వించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సహజంగా తెలివైందీ. లోకజ్ఞానం వున్నదీ అయిన అరుణ అతడి మాజిక్ నీ మెచ్చుకున్నా, ఈ చనువుని మాత్రం మెచ్చుకోలేక పోతూంది. మాట్లాడుతూ అతడు ఆ అమ్మాయివైపు వంగటంలో వున్న మెలకువ చూస్తుంటే - అతడు ఆ అమ్మాయిల్ని మాజిక్ పేర మాజిక్ చేసేవాడిలా కనబడ్డాడు. అరుణ మాత్రం వీలయినంత మర్యాదగా అతడినించి దూరంగా జరుగుతూంది.
    మాట్లాడుతూ మాట్లాడుతూ వెంకటేష్ "ఇప్పుడు మీకో అద్భుతం  చూపిస్తాను" అంటూ జేబులోంచి అర్థరూపాయి కాసుతీశాడు. అందరం అతడివైపు చూశాం. అతడు ఆ నాణాన్ని అందరికీ చూపించి అరచేతిలో పెట్టుకొని, దాన్ని ఎడమ చేతితో రాశాడు. అంతే. అరచేతిలో నాణం ఉన్నట్టుండి మాయమైపోయింది. మా కళ్ళల్లో విస్మయాన్ని గమనించి అతడు నవ్వుతూ అరుణ చెవిని సుతారంగా పట్టుకొని, ఆ రింగులోంచి అర్థరూపాయిని తెప్పించాడు.
    అతడు ఎంత లాఘవంగా వేళ్ళమధ్య దాన్ని దాచాడూ అన్నది కాదు నేను గమనించింది. చూసేవాళ్ళకి అతడో అద్భుతమైన మానవాతీత వ్యక్తిగా  కనబడవచ్చుగాక. కానీ , అరుణమొహం మాత్రం అతడి చనువైన స్పర్శతో ఎర్రగా మారింది. అయినా మర్యాద కోసం నవ్వింది.
    ఆ తరువాత మేము వూహించని విధంగా సంభాషణ మరోవైపు దొర్లింది. దాని పరిణామం ముందు ముందు అంత దారుణంగా వుంటుందని ముందే తెలిస్తే అక్కడున్న ప్రతీవారూ ఆ సంభాషణ అక్కడే ఆపుచెయ్యడానికి ప్రయత్నించి దానికన్నా ఎక్కువ వంగొని మాట్లాడుతున్నాడు.
    "పూర్వం  బుషులు నీటిమీద నడిచేవారట. శామన్యముని ప్రతిరోజు కావేరి నదిని నడుస్తూ దాటి అవతలితీరంలో పూజాపుష్పలని కోసుకుని తెచ్చే వాడట." బుగ్వేదంలో ఎక్కడా శామన్యముని ప్రసక్తే లేదే?" మధ్యలో కల్పించుకుని అన్నాడు రామ్మూర్తి.
    "మీరు సరిగ్గా చదివి వుండరు."
    "పదండి. అలా అయితే అద్వైతానందస్వామి దగ్గరికి వెళదాం. ఆయన బుగ్వేదాన్ని ఆమూలాగ్రం పఠించారు" అంటూ రామ్మూర్తి లేవబోయాడు. వాళ్ళ  వాదన వింటుంటే డిన్నరు వదిలేసి ఆ అద్వైతానందస్వామి దగ్గరికి ఇప్పుడే పరిగెత్తే ప్రమాదం వుందనిపించింది. నేను కల్పించుకుని వారించాల్సి వచ్చింది. అయినా నా ప్రయత్నం ఫలించలేదు. అరుణ ముందు ఆమె తండ్రి అలా అనేసరికి, వెంకటేష్ కుర్చీలోంచి లేచి గొంతు పెద్దది చేసి, "మానవాతీత శక్తుల మీద నేనెన్నో పరిశోధనలు చేశాను. నా పరిశోధనలకి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా గుర్తింపు వచ్చింది. కేవలం మీలాంటి వితండవాదులు లేవన్న మాత్రాన  పేరా సైకాలజీకి గుర్తింపు లేకుండా పోదు. బహుశా ఈ ఫీల్డులో నేను సాధించిన విజయాల గురించి మీరు చదవలేదేమో" అన్నాడు.
    "'బిహైండ్ ది ఐరన్ కర్టెన్' అని ఒక పుస్తకం వుంది. ఒకప్పుడు అది చాలా గొప్ప పుస్తకంగా పేరుపొందింది. కానీ తరవాత తరవాత హేతువాదులు అందులోని ప్రతి అంశాన్ని ఛేదించి దానిలో వున్న అశాస్త్రీయాన్ని నిరూపించటంతో ఇప్పుడు అది అనిమిదో తరగతి కుర్రవాళ్ళు కాకమ్మకథలుగా చెప్పుకోవటానికి  మాత్రమే  పనిచేస్తూంది. మీ పరిశోధనలకి ఆ పుస్తకాన్ని బాగా వాడుకున్నారు. కంగ్రాట్స్"
    వెంకటేష్ మొహంలోకి రక్తం జివ్వున చిమ్మింది. అతడు కోపంగా బల్లని తొయ్యటంతో అక్కడి పదార్థాలు కొద్దిగా తొణికినాయి. నేను కల్పించుకోబోతుంటే అతడు స్వరం హెచ్చించి, "మీరు లేవన్నంత, మాత్రాన మానవాతీత శక్తులు లేకుండా పోవు. ఇప్పుడు మీ ముందే ఒక విద్యని ప్రదర్శించి చూపుతాను, చూడండి" అంటూ కుర్చీలోనుంచి వంగి నావైపు తిరిగి, "మీ  దగ్గిరో  చేతి  రుమాలుంటే ఇవ్వండి" అని తీసుకున్నాడు. అలాగే అరుణవైపు తిరిగి, ఆమెనూ అడిగి ఆ రెండూ కళ్ళ మీద  పెట్టుకోబోతూ, "మీరే సెంటు వాడతారు" అని అడిగాడు.
    "ఏం ?" అంది.
    "చాలా మంచి వాసన వస్తూంది."
    ఆమె మాట్లాడలేదు. అతడు నాతో "ఒక గుడ్డతో నా రెండు కళ్ళూ గట్టిగా కట్టేయండి" అన్నాడు. నేను మారు ప్రశ్నించకుండా, అతడి కళ్ళమీదున్న జేబురుమాళ్ళ మీద గట్టిగా గంతలు బిగించాను. రామ్మూర్తి మౌనంగా దీన్నంతా ప్రేక్షకుడిలా చూస్తున్నాడు. వెంకటేష్  తన మొహంమీద ఒక తువ్వాల్ని ముసుగులా కప్పుకున్నాడు. ఆ తరువాత అమ్మాయివైపు తిరిగి, "మీరో కాగితం తీసుకుని దానిమీద మీ కిష్టమైన వ్యక్తిపేరు వ్రాయండి" అన్నాడు.
    "ఎందుకు" అందా అమ్మాయి.
    "వ్రాయండి ప్లీజ్"
    ఆ అమ్మాయి కాగితంమీద పెన్నుతో పేరు వ్రాసి అతడి ముందుకు తోసింది. అతడు దాన్ని బోర్లించి తనముందు పెట్టుకున్నాడు. "ఇప్పుడు మీరు ఏ  వ్యక్తిపేరు వ్రాశారో- ఆ వ్యక్తి గురించి బాగా మనసులో తల్చుకోండి" అంటూ ఆ అమ్మాయి చేతిమీద చెయ్యి వేశాడు. ఆ అమ్మాయి కంగారుపడి, చెయ్యి లాక్కోబోయి ఆగింది. ఆ గది అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఆ అమ్మాయి తల వంచుకుని కూర్చుంది. సరిగ్గా నిమిషం  తరువాత నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, "మీకు ఇష్టమైనా వ్యక్తి మీ తండ్రిగారు. అవునా" అన్నాడు. నేను చప్పున వంగి, అతడి ముందున్న కాగితాన్ని తిప్పిచూశాను. ఆ అమ్మాయి వ్రాసింది తన తండ్రిపేరే. ఆ గదిలో ఉన్న  ప్రేక్షకులం అందరం క్షణంపాటు స్థబ్దులమైపోయాం. అతడు తన కళ్ళకు కట్టిన గంతలు విప్పుకుంటూ చిరునవ్వుతో మా వైపు చూశాడు. రామ్మూర్తి భార్య అయితే  అతడిని ఓ యుగపురుషుడిని చూసినట్లు చూస్తూంది. అతడు అన్నాడు..... "మనిషి  మనసులో ఆలోచన్లని ఏకాగ్రతద్వారా కనుక్కోవడాన్ని టెలీపతి అంటారు. నేను మీ  అమ్మాయి, తన మనసులో ఏ వ్యక్తి గురించి ఆలోచిస్తుందో అలాగే కనుక్కున్నాను. అయితే దీనికి చాలా ధ్యానం- కాన్సన్ ట్రేషన్ అవసరం. దీన్నే పురాణాల్లో తపస్సు అనేవాళ్ళు. మన పూర్వులు కనుక్కున్నదాన్నే విదేశీయులు మళ్ళీ కొత్త ఇంగ్లీషు పేరుపెట్టి పరిశోధనలు చేస్తున్నారు. ఇది తెలుసుకోలేని అల్పులు హేతువాదం పేరిట మన పురాణాల్ని అవహేళన చేస్తున్నారు. గుండె వేగాన్ని తగ్గించేవారూ, జలస్థంభన విద్య ప్రదర్శించేవారూ, భూమిలో నాలుగు అడుగుల లోతు సమాధిలో కొన్ని రోజులపాటు ఉండగలిగేవాళ్ళూ. ఇలా ఎన్నో మానవాతీత శక్తుల్ని ప్రదర్శించగలిగేవాళ్ళూ ఉన్నారు. వీరిని మీరు కాదనగలరా?"
    నిశ్చయంగా ఇది రామ్మూర్తికి ఓటమే. తన కళ్ళముందు జరిగిన విశేషాల్ని అతడు ఎలా కాదనగలడు? తలవంచుకుకూర్చున్నాడు. అతడిని చూస్తే జాలేసింది. అంతలో అతడు తలెత్తి, "నేను శక్తులు లేవని అనటం లేదు. ఈ రోజుకాకపోతే రేపైనా సైన్సు డానికి హేతువు కనుక్కుంటుంది అంటున్నాను. నేను చెప్పేదల్లా అలాటి శక్తులు ప్రదర్శించేవాళ్ళు లేరని."
    "కానీ ఇప్పుడు మీ ముందు నేను ప్రదర్శించాను కదా?"
    "నాకు తెలియనంత మాత్రాన  అది ట్రిక్ కాదని ఎలా అనగలం?"
    వెంకటేష్ మొహం ఎర్రగా కందిపోయింది. కోపంతో ముక్కుపుటాలు అదిరాయి. "ఇంత జరిగినా మీరు నమ్మలేదంటే మీరు నిశ్చయంగా మూర్ఖులు" అన్నాడు. పరిస్థితి శ్రుతిమించుతూందని నేను "ప్లీజ్- కంట్రోల్ యువర్ సెల్ఫ్" అన్నాను.

 Previous Page Next Page