ఒక్కసారిగా, భరించలేనంత నిస్సత్తువ ఆవరించింది, ముందుకు తూలేను.
ఇన్ స్పెక్టర్ తో లక్ష్మీనారాయణ అంటున్నాడు, "క్షమించండి. భోజనానికి ఊరు రమ్మని హత్యకేసు అప్పగించాల్సి వచ్చింది."
అప్పటికి నాకు పూర్తిగా స్పృహ తప్పింది.
* * *
"అప్పుడేమయింది?"
"లోపల్నుంచి యిద్దరూ బయటి కొచ్చేసేరండి" పక్కింటితని సాక్ష్యం.
"ఇతను అప్పుడెలా వున్నాడు?"
"చాలా కోపంగా వున్నదండీ! మాటి మాటికీ వెనక్కి తిరిగి ఆ ఇంటివైపు చూసుకొంటూ వెళ్ళిపోయాడండీ."
"అబద్ధం-" అరిచేను.
"సైలెన్స్ - మిస్టర్ కృష్ణా. సంస్కారవంతుడిలా కనబడుతున్నావ్.....ఇప్పటికే చాలాసార్లయింది. ఇక యిదే లాస్ట్ వార్నింగ్. నువ్వు చెప్పుకోవలసింది ఏదైనా వుంటే చివరలో చెప్పుకోవచ్చు-"
సాక్ష్యాల మీద సాక్ష్యాలు.....గునపం పైకెత్తి పట్టుకొని వుండగా చూసినవాళ్ళు రక్తం చేతులకి అంటుకొని వుండగా చూసినవాళ్ళు! అబద్ధం చాలా అందంగా రూపుదిద్దుకుంటోంది అక్కడ.
"నీవైపు సాక్షులు ఎవరన్నా వున్నారా?"
"వున్నారు-"
"ఎవరు?"
"బాబాయి."
బాబాయి బోనెక్కాడు. డిఫెన్సు లాయరు మొదలుపెట్టేడు.
"మీ పేరు?"
బాబాయి చెప్పేడు. ఇంకో నాలుగైదు ప్రశ్నలు, జవాబులు జరిగేయి.
"ఆ రోజేమైందో చెప్పగలరా?-"
"పెద్ద మనిషిగా నన్ను తోడురమ్మని అడిగేడు. చిన్నతనం నుంచీ స్వంత బాబాయిలా పెంచేను. కాదనలేకపోయేను. అందుకని- ఇద్దరం వెళ్ళేం."
"పార్వతి తండ్రి - హతుడు ఈ పెళ్ళికి అంగీకారం తెలిపేడా?"
కోర్టులో సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం, బోను కమ్మీని పట్టుకొన్న నా చేతులు గట్టిగా బిగుసుకున్నాయి.
"కోర్టువారు నీ సమాధానం కోసం చూస్తున్నారు."
"పెంచిన మమకారం నన్ను చంపేస్తుంది. అయినా న్యాయం....న్యాయాన్ని అగౌరవపర్చలేను" బాబాయి కంఠం రుద్ధమైంది. 'అతడు ఈ పెళ్ళికి ససేమిరా ఒప్పుకోలేదు. గాలిలో పుట్టినవాడికి తన కూతుర్నివ్వలేను." అన్నాడు.
"బా...బా...య్' నా కంఠం వణికింది.
'సైలెన్స్....'
'తరువాతేమయింది?'
'నేను తొందర పడవద్దన్నాను. కాని ఉడుకు రక్తం.....ఆవేశంతో వణికిపోయేడు. రక్తం కళ్ళచూస్తానని ప్రతిజ్ఞచేసేడు. అప్పటికీ నేను నచ్చచెప్పేను- నాయనా నీకేం తక్కువ- ఈ పార్వతి కాకపోతే యింకో అమ్మాయి అనవసరంగా ఆవేశపడకూ' అని. కానే వినలేదు జడ్జిగారూ- కృష్ణ మంచితనం నాకు తెలుసు. చాలా అమాయకుడు. ఆవేశం మనిషిని రాక్షసుడ్ని చేస్తుంది. అతడ్ని కనికరించండి-' అని బోను దిగిపోయేడు.
'నీవైపు యింకెవరన్నా వున్నారా?'
'ఉన్నారు న్యాయం వుంది. పార్వతి వుంది.
"మైలార్డు, పార్వతికి ఈ కేసుతో ఏ సంబంధమూ లేదు. ఈ హత్యా జరిగినపుడు పార్వతి ఊళ్ళోనే లేదు."
'అబ్జెక్షన్ సస్టెయిన్డు.'
అంతే! అయిపోయింది.
"కూతుర్నిచ్చి పెళ్ళి చేయలేదనే చిన్న కారణంగా హత్యచేసేటంత కర్కోటకుడు ముద్దాయి. సాక్ష్యాధారాలన్నీ బలంగా వున్నాయి- నేరం బుజువయింది. కాని ముద్దాయి యువకుడు, ఆవేశంలో హత్యచేసేడూ అనే కారణాలవల్ల ఉరిశిక్ష విధించకుండా, పన్నెండు సంవత్సరాలు కఠినశిక్ష విధిస్తున్నాను."
లక్ష్మీనారాయణ పెదవులమీద చిరునవ్వు వెలిసింది.
బాబాయి కళ్ళల్లో మెరుపు మెరిసింది.
విచారించటానికి నా వాళ్ళెవరూ లేరు. పార్వతి ఏమయిందో తెలీదు. అమ్మ ఎందుకు రాలేదో తెలియదు. అక్కడి వార్తలు నాకు తెలియకుండా ఎవరో ఆనకట్ట వేసేసేరు. నాకు దుఃఖం రాలేదు. కసిగా వుంది. ఈ ప్రపంచాన్నంత మంటల్లో కాల్చేదామన్నంత కసి.
తరపున వాదించిన డిఫెన్సు లాయరు దగ్గరికి వచ్చేడు.
'క్షమించు బాబూ' అన్నాడు. "ప్రాసిక్యూషను - కేసుని బియాండ్ డౌట్ నిరూపించలేకపోయిందని నాకు తెలుసు. కానీ, మనవైపు సాక్ష్యాలు లేవు."
విషాదంగా నవ్వేను. "పర్లేదు ప్లీడరుగారూ! మీరు చెయ్యగలిగింది అంతా చేసేరు. నావైపు దురదృష్టం వుంది అంతే!"
వెనుక పోలీసులు నడుస్తూవుంటే వేన్ దగ్గరికి నెమ్మదిగా నడిచేను. అందరూ నావైపే చూస్తున్నారు. తల బాగా దించుకొని నడుస్తూ చటుక్కున ఆగేను. అవే పాదాలు లావుగా.....నల్లగా తల ఎత్తాను.
లక్ష్మీనారాయణ నవ్వుతున్నాడు. పక్కనే బాబాయి. నారాయాణ దగ్గరగా వచ్చి అన్నాడు - "మాట నిలబెట్టుకున్నాను కృష్ణా -అన్న దానికన్నా తొందరలోనే-"
నా మొహంలోకి రక్తం వడిగా ప్రవహించింది. మెడ నరాలు ఉబికినయ్ కాండ్రించి అతని ముఖం మీద వూసేను. వెనుక నుంచి నవ్వులు మరింత బిగ్గరగా వినపడ్డాయి.
"పాపం సింహంపిల్ల" అంటున్నాడు బాబాయి. చేతులమీద నెమ్మదిగా లేచేను.
"బాబాయి-" పళ్ళు కొరికేను. "అణాడబ్బులకోసం గడ్డికొరికేవ్ బాబాయి బంధుత్వానికున్న గౌరవాన్నే మంట గలిపేవు".
"డబ్బు ఒకటే కాదులే! ఇంకోటి వుంది" అన్నాడు. లక్ష్మీనారాయణ వోరగా బాబాయిని చూస్తూ. బాబాయి ముసి ముసిగా నవ్వేడు.
"బాబాయ్?" నేను గర్జించేసరికి అతడి నవ్వు ఆగిపోయింది. "పార్వతి తండ్రి దగ్గర నేను రక్తం కళ్ళజూస్తానని అన్నానని సాక్ష్యం ఇచ్చేవు కదూ! అపుడన్లేదు బాబాయి, ఇప్పుడంటున్నాను.......నేను బయట కొచ్చిన తర్వాత నీ రక్తం కళ్ళ జూస్తాను. నా చేతుల్తో స్వయంగా నిన్ను" వెనుక నించి తలమీద విసురుగా కొట్టాడు పోలీసు. తూలిపడ్డాను. ముక్కుల్లోంచి కారిన రక్తానికి దుమ్ము అంటుకొని, మొహం వికృతంగా తయారయింది. క్షణం అచేతనుడయ్యాను. భుజం పట్టుకొని పోలీసు పైకిలేపేడు చెయ్యి కలుక్కుమంది. వెనుక నుంచి ముందుకు తోసేరెవరో. రెండడుగులు వేసేను-లక్ష్మీనారాయణ నా పక్కగా వచ్చేడు "ఒక్కఆవేశమే వుంటే చాలదురా కుర్రోడా!చదరంగం ఆడాలంటే తెలివి తేటలుండాలి."
వేన్ మొదటి మెట్టు ఎక్కేను. ఆవేశంగా అంతా దిగిపోయి ప్రశాంతంగా వుంది నా మొహం. గుమ్మం దగ్గర కడ్డీ పట్టుకొని పక్కకి తిరిగి అతడివైపు చూసేను.
"అవును లక్ష్మీనారాయణ! ఈ జీవితపు చదరంగంలో ప్రత్యర్థిని ఓడించడానికి ఆవేశం కాదు, కావాల్సింది తెలివితేటలు. కాసుకో సరిగ్గా పన్నెండు సంవత్సరాల తరువాత నీతో చదరంగం ఆడటానికి వస్తాను. నిన్ను నేను చంపను లక్ష్మీనారాయణ నీ చుట్టూ ఉచ్చులు బిగిస్తాను. నీ అంతట నువ్వే ఆత్మహత్య చేసుకునేలా చేస్తాను.....సరిగ్గా పన్నెండు సంవత్సరాలు" ప్రశాంతంగా అన్నాను. అందుకని ఈసారి పోలీసు కొట్టలేదు.
లోపలి వెళ్ళి కూర్చున్నాను.
వాన్ కదిలింది.
* * *
"చాలా కష్టం" అన్నాడు ఠాకూర్.
"చంపటం చాలా సులభం, ఆత్మహత్య.....ఉహు- చాలా కష్టం."
అవును, కష్టం అని నాకు తెలుసు. కానీ ఠాకూర్ తో పరిచయం అయ్యేక అది కష్టమని అనిపించటం లేదు. ఆ మాటే అన్నాను.
"నేనేవన్నా చేయగలనని అనుకోకు" అన్నాడతను. ఏం చెయ్యాలన్నా డబ్బుకావాలు. అదీగాక వాళ్ళిప్పుడు ఏ పొజిషన్ లో వున్నారో కూడా తెలీదు."
"అదేవీఁ నాకు తెలీదు" అనాలోచితంగా అన్నాను. "నాక్కావల్సింది ప్రతిజ్ఞ నెరవేర్చుకోవటం-అంతే!"
"చిన్న పిల్లాడిలా మాట్లాడకు."
"వద్దు తాతా! ఈ విషయంలో నన్ను వెనక్కి లాగకు."
అతడు నావైపు సూటిగా చూస్తూండిపోయేడు. తరువాత నెమ్మదిగా అన్నాడు, 'సరే బిడ్డా. అలాగే- కానీ' ఆగేడు. 'కానీ నా నుంచి ఏ సహాయమూ ఆశించకు.
"దా.....దా" విస్తుపోయేను.
"అవును బిడ్డా! నీ సమస్య వ్యక్తిగతం, నాది సామాజికం. నా సమస్యతో పోల్చుకుంటే నీది చాలా చిన్నది.
"నాకర్థం కావటం లేదు తాతా!"
"ఎంతోమంది లక్ష్మీనారాయణ- అసలేమీ అన్యాయం చేసినట్టు కనపడకుండానే నీ కన్న బలహీనుల్ని నిర్దాక్షిణ్యంగా అణచి వేస్తున్నారు బిడ్డా! ఆ ఘోరాల్తో పోల్చుకుంటే నీకు జరిగిన అన్యాయం చాలా చిన్నది అంటున్నాను.'
"కాని నా పార్వతి- నా అమ్మా....."
"మనుషుల్ని సమస్యలకి కారణభూతులుగా చెయ్యకు. సమస్య సిద్దాంతమైన విభేదం. నీ దృష్టి ఇంకా విశాలం కావాలి."
లాభంలేదు. నా కర్థం కాలేదు. బయట ప్రపంచాన్ని నాలుగేళ్ళ నుంచీ చూడనివాడికి, అంతకుముందు పల్లెలో అమాయకంగా పెరిగినవాడికి ఈ సమస్య అర్థంకాదు ఠాకూర్ నాకు ఎకనామిక్స్ థియరీ' చెప్పేడు. కానీ ప్రపంచం ధియరిటికల్ గా నడవదు. అన్ని రకాల వ్యవస్థలూ 'ధియలిటికల్ గా చాలా మంచివి' మరి ఎక్కడుంది సమస్య?
మనిషిలో భావ విప్లవం రావాలి, ఏ వ్యవస్థ అయినా అప్పుడు పర్లేదు కానీ ఏ రకం వ్యవస్థలో భావవిప్లవం విస్తుంది? భావవిప్లవం రావటం కోసం విప్లవం తప్పదా?.....ఇదో సర్కిల్.
'స్పృహ' మనిషిని విచారగ్రస్తుణ్ని చేస్తుంది. ఈ వృద్ధుడు కొద్దిపాటి విజ్ఞానాన్ని నేర్పకపోయి వుంటే ఎంతో నిశ్చింతగా మృగంలాబ్రతికేవాణ్ని. ఇదంతా తెలుసుకొన్నాక మిగిలిందేమిటి? వృధా తపనా తప్ప! ఘర్షణ.....అనుక్షణం నిరంతర ఘర్షణ ఎటు మొగ్గను?
నా కథ చెప్పిన తర్వాత ఠాకూర్ నాకు నేర్పిన పాఠాల్లో కొద్ది మార్పు కనపడింది.
ఈసారి అతడు మనుషుల్లో కలిసి మెలిసి తిరగటం గురించీ, సివిలైజేషన్ గురించి నాకు తెలియచెప్పటంలో శ్రద్ధ తీసుకోసాగేడు. ఒక గుడ్డపీలిక తీసికొని 'టై' కట్టుకోవటం ఎలాగో చెప్పేడు.
'ఎందుకిదంతా?' అన్నాను.
నవ్వేడు 'నీకవసరంలేదు బిడ్డా! కానీ నీ శపధం నెరవేర్చుకోవాలంటే ఇవన్నీ అవసరం. బైటకెళ్ళిన తరువాత ఇవన్నీ నేర్చుకొని టైం వేస్టు చెయ్యటం అనవసరం తొందరగా నీ పని నెరవేర్చుకొని 'ఆ తరువాత' నువ్వు నాక్కావాలి.'
* * *
"ఎలా వుంది దాదా" అడిగాడు సెంట్రీ.
ఠాకూర్ మూలిగేడు. నేను ఒక మూలలా కూర్చున్నాను.
"ఇదేదో విషజ్వరంలా వుంది" అన్నాడు సెంట్రీ. "లేకపోతే అన్నంలో ఏదో కలిసుంటుంది. మొత్తం జైల్లో ఖైదీలందరికీ ఇలాగే వుంది. ఏది నీ చెయ్యి" అంటూ అతడి చెయ్యి వూచల మధ్య నుంచి అందుకొని, చప్పున వదిలేసి "కాలిపోతుంది, టెంపరేచర్ నూట అయిదుకి తక్కువ వుండదు" చెప్పాడు.
"అందరికీ అలాగే వుందా?"
"ఆఁ మొత్తం ఖైదీలందరూ దాదాపు స్పృహ తప్పినట్టు పడిపోయివున్నాడు. ఆవగింజవేస్తే పేలిపోయేలా వున్నాయి వళ్ళు అందరికి."
నేను కల్పించుకొని "భోజనంలోనే ఏదో కలిసి వుంటుంది. మధ్యాహ్నం నేను భోంచెయ్యలేదు. నాకేమీ కాలేదు" చెప్పాను.