Previous Page Next Page 
ఫస్ట్ క్రష్ పేజి 6

 

మా అమ్మాయి ఇప్పటివరకు మా కంపెనీ మీటింగ్స్ దేనికీ అటెండ్ కాలేదు. ఎన్నిమార్లు బ్రతిమాలినా మా ఇండస్ట్రీస్ ని కూడా విసిట్ చెయ్యలేదు. కుటుంబ స్నేహితులు కాబట్టి అప్పొల్లో హాస్పిటల్స్ లో డాక్టర్ గా చేస్తోంది కాలక్షేపం కోసం. ఈ రోజు ఎందుకో తనే ఉత్సాహంగా నాతో వస్తానంది. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అని ఆనందంగా చెప్పారు రాజు గారు. ఇక నా పనులన్నీ మా అమ్మాయి చేతిలో పెట్టేయొచ్చు అన్న నమ్మకం కలిగింది. 
ఓహ్ వెరీ గుడ్ సర్ అని మెచ్చుకున్నాడు మృణాల్. ఇంకేం సర్. బాధ్యతలు మీ అమ్మాయి చేతిలో పెట్టండి. తనే చూసుకుంటుంది అన్నాడు.
ఏమ్మా. ఏమంటావు అని అడిగారు రాజు గారు.
ష్యుర్  డాడ్ అంది విజిత కాన్ఫిడెంట్ గా.
సర్ విత్ యువర్ పెర్మిషన్ వినీల్ కి శుభాకాంక్షలు తెలిపి సత్కరించమని కోరుతున్నాను అన్నాడు మృణాల్. అతని చేతిలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు సావనీర్, ఇంకొన్ని బహుమతులు ఉన్నాయి వినీల్ కోసం. 
తప్పకుండా. మా కొత్త చైర్మన్ కాబోతున్న మా అమ్మాయి చేత చేయిస్తాను అన్నారు రాజు గారు సంతోషంగా. ఏమ్మా ఓకే నా అన్నాడు విజిత వైపు చూస్తూ. 
సరే డాడ్ అంది విజిత.
పెద్ద హాల్ కాబట్టి స్టాఫ్ అందరూ వచ్చారు వినీల్ సెలెబ్రేషన్స్ కోసం. అంతమందిని చూడటం రాజు గారికి, విజిత కి సంతోషమేసింది. 
ఒక పెద్ద కేక్, దానిపై, కంగ్రాట్స్ నీల్ అని రాసి ఉంది. 
మృణాల్  విజిత ని ఆహ్వానించాడు నీల్ ని సత్కరించడానికి. 
కెంపు రంగు చీరలో మిల మిల అందంగా మెరిసిపోతున్న విజితని చూసి అక్కడ ఆడవాళ్ళందరూ అబ్బా ఎంత అందం అనుకోకుండా ఉండలేకపోయారు.  
మృణాల్ అందించిన గులాబీ బొకే ని వినీల్ చేతికందించింది విజిత. అతని కళ్ళలోకి చూస్తూ కంగ్రాట్స్ నీల్ అంది.
థాంక్ యు అన్నాడు వినీల్.
మేడం కేక్ కట్ చేయించండి అంటూ నైఫ్ ఇచ్చాడు విజిత కి.
ఆమె చేతినుండి వినీల్ నైఫ్ తీసుకున్నాడు. ఎక్కడ తను చేయిపట్టి కట్ చేయిస్తుందోనని.
అది గమనించి విజిత నవ్వుకుంది.
విజిత ఊరుకున్నా అక్కడి లేడీ స్టాఫ్ ఊరుకోలేదు.
వినీల్ అంటే అందరికి వల్లమాలిన అభిమానం, ప్రేమ.
అందరూ వచ్చి వినీల్ చేయి పట్టి కేక్ కట్ చేయించారు. మహా మొహమాటంతో కూడిన సిగ్గుపడిపోయాడు వినీల్.
అందరూ కేక్ తీసుకుని అతని నోట్లో కుక్కారు. కొందరైతే మొహానికి రాశారు.
ప్లీజ్ ప్లీజ్ అంటున్న వినీల్ మాటలు వారు వినిపించుకోలేదు.
ఒక అమ్మాయి అయితే ముద్దు పెడతా జాగ్రత్త అని చెవిలో చెప్పి బెదిరించింది.
ఆమ్మో ప్లీజ్ మీనూ అని వారించాడు.
పక్కనే ఉన్న విజిత అన్నీ వింటూ మనసులో నవ్వుకుంటోంది. ఈ ప్రవరాఖ్యుడికి ఇంతమంది లేడీ ఫాన్స్ ఉన్నారా ఇక్కడ అని ఆశ్చర్యపోయింది. 
వెంకటరాజు గారు దూరం నుంచి వేడుకల్ని గమనిస్తున్నారు.
వినీల్ అంటే ఎందుకో అతనికి చాలా సదభిప్రాయము, మంచి నడవడిక, హుందా ప్రవర్తన, అంతకు మించి కొంత వాత్సల్యం కూడా కలిగింది.  లేచి వినీల్ దగ్గరికి వచ్చాడు.
డాడీ రావడం చూసి విజిత ఆసక్తిగా చూసింది ఎందుకా అన్నట్లు.
మృణాల్ వైపు తిరిగి మీ కంపెనీ తరపున మీ బహుమానాలు వినీల్ కి ఇచ్చారు. మీ పర్మిషన్ తో నేను ఇది ఇస్తున్నాను అని తన చేతికున్న లావుపాటి గోల్డెన్ బ్రాస్లెట్ తీసి వినీల్ చేతిని తీసుకుని అలంకరించాడు. 
అయ్యో సర్ ! ప్లీజ్ అని వినీల్ వారిస్తున్నా వినిపించుకోలేదు రాజు గారు. 
ఇది నీ ప్రతిభకి, నమ్రతకి నాకు తోచిన చిన్న బహుమానం. కాదనకు. గాడ్ బ్లెస్స్ యు అని దీవించాడు.
మొహమాటపడుతూనే థాంక్ యు సర్ అని కృతఙ్ఞతాపూర్వకంగా అభివాదం చేసాడు. 
తండ్రి చర్యకు విజిత ఉబ్బితబ్బిబ్బయ్యింది. 
తన పర్సు లోంచి లాలీపాప్ తీసి షేక్ హాండ్ ఇస్తున్నట్లు వినీల్ చేతిలో పెట్టింది.
అది చూసిన వినీల్ ఎవరైనా చూస్తారేమోనని టక్కున జేబులో పెట్టుకుని థాంక్స్ అన్నాడు విజితతో. 


****


కొంతసేపటి తరువాత వినీల్ మరియు అతని టీం, వెంకటరాజు గారు, అతని స్టాఫ్ తప్ప అందరూ మీటింగ్ హాల్ నుంచి నిష్క్రమించారు. 
వినీల్ ప్రెసెంటేషన్ మొదలు పెట్టాడు.
అతనికి సహాయంగా నలుగురు అక్కడే కూర్చుని పవర్ పాయింట్ తాలూకు స్లైడ్స్ వేస్తున్నారు.
మృణాల్ అక్కడే కూర్చుని గమనిస్తున్నాడు.
ఏదైనా టాపిక్ వినీల్ కి వదిలితే ఇక అతను ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. అంత డెడికేషన్ ఉంది ప్రొఫెషన్ మీద. అందుకే మంచి పేరు తెచ్చుకోగలిగాడు.
విజితకు వినీల్ చెప్పేదేమీ వినిపించడంలేదు. తదేకంగా అతన్నే చూస్తూ ఊహల్లో తేలుతోంది.
చాలా క్రిస్పీ గా పది నిముషాలలో విజి ఇండస్ట్రీస్ అవసరాలని బట్టి ఒక అద్భుతమైన సొల్యూషన్ ఇచ్చాడు వినీల్.
అతని వివరణ వెంకటరాజు గారికి, అతని బృందానికి తెగ నచ్చేసింది. వారు చాలా ప్రశ్నలు సంధించారు. 
ప్రతి దానికి ఓపికగా, తడుముకోకుండా, శతావధానిలా వివరణ ఇచ్చాడు వినీల్.
విజి ఇండస్ట్రీస్ కోడింగ్ టీం కూడా తమ సందేహాలు వెలిబుచ్చారు.
వారికికూడా తెలీని కొన్ని అద్భుతమైన పరిష్కారాలను చెప్పాడు వినీల్.
వారందరూ అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
అందరూ లేచి స్టాండింగ్  ఒవేషన్ ఇచ్చారు.
కరతాళధ్వనులు మిన్నుముట్టాయి.
మృణాల్, రాజు గారు, విజిత వారితో జత కలిపారు ఆనందంగా.
విజితకైతే వినీల్ ని అలా చూస్తుంటే స్కూల్ లో అతని విశ్వరూపం సాక్షాత్కరించింది. అందుకే అంత క్రేజీ వినీల్ అంటే అందరికి అనుకుంది. 
వెంకటరాజు గారు లేచి నేను మొదటి సారి ఇలాంటి సాఫ్ట్వేర్ మీటింగ్ కి రావడం. అదీ మా అమ్మాయి విజిత ప్రోద్బలంతో వచ్చాను . మామూలుగా అయితే మా స్టాఫ్ తామే ఇటువంటి మీటింగ్స్ కి అటెండ్ అయి నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడికి రావడం, వినీల్ వివరణ వినడం చాలా సంతోషంగా ఉంది. సాఫ్ట్వేర్ గురించి ఏమీ తెలీని నాకు కూడా చక్కగా అర్ధం అయ్యింది. అందుకు వినీల్ కి మనఃపూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్ట్ మీ కంపెనీ కె ఇస్తున్నాము. మా అమ్మాయి విజిత సొంతంగా ఈ ప్రాజెక్ట్ ను కోఆర్డినేట్ చేస్తుంది అంటూ కూతురి వైపు చూసాడు.
ప్రతిగా విజిత సంతోషంతో ఎస్ డాడ్ అంది ఉత్సాహంగా. 
మీటింగ్ పూర్తవడంతో అందరూ లేచి లంచ్ హాల్ కి చేరారు. చాలా పెద్ద హాల్ అది.
రౌండ్ టేబుల్స్, వాటి చుట్టూ చైర్స్ వేసి ఉన్నాయి. 
పదార్థాల ఘుమఘుమలు కమ్మని వాసన వస్తున్నాయి. 
ఒక టేబుల్ దగ్గర రాజు గారు, విజిత, మృణాల్, వినీల్ కూర్చున్నారు. 
రాజు గారికి వినీల్ బాగా నచ్చడంతో మాటలు మొదలు పెట్టాడు. 
అతని వూరు భీమవరం అని తెలిసి తెగ సంతోషపడిపోయాడు. ఎందుకంటే వారిది అదే ఊరు కాబట్టి. అక్కడ రాజు గారికి వందల ఎకరాల మాగాణి భూమి ఉంది. రాజు గారు ఒక టర్మ్ రాజ్యసభ ఎం పి  గా కూడా చేసారు. లెక్కపెడితే రాజు గారి ఆస్తి వెయ్యి కోట్లు దాటింది. అందులోనూ అంతటికీ వారసురాలు విజిత ఒక్కతే. ఇంకెవ్వరూ లేరు.
అవన్నీ వింటుంటే వినీల్ కి కంగారు మొదలైంది.
ఎవరైనా తనకు తగ్గ అమ్మాయిని చూసుకుంటే మేలేమో అన్న మీమాంసలో పడ్డాడు.
అయినా తనేమీ విజితతో ప్రేమలో పడలేదుగా. విజిత తృప్తి కోసం తండ్రికి జాతకం పంపాడు. అది కుదరాలి. కుదిరినా రాజు గారు, నాన్న గారు ఒప్పుకోవాలి. అప్పటికి గాని కథ సుఖాంతం కాదు.
అందులోనూ ఈ ప్రేమలు అవి తన మనసుకు ఏమాత్రం సరిపోవు.
అందులోనూ తనేమీ అంత అదృష్టవంతుడు కాదు విజితతో తన వివాహం జరిగేందుకు.
ఏవో అద్భుతాలు జరిగితే తప్ప అది సాధ్యం కాని పని.

 

 Previous Page Next Page