దొంగలు పడుంటారు!" నవ్వాపుకుంటూ అంది ఆహా! ఇంత మంచి కళ్ళు పనిమనిషి కెందుకిచ్చాడు దేవుడు ?
"టెర్రస్ వాటర్ టాంక్ కింద కాపురముందే వన్ బై టూ గాడి సామానులు దొంగతనమా? అదీ సెకండ్ హాండ్ లుంగీలు --"
"దానికేముంది? దొంగల్లో కూడా కేటగిరీ లుండవచ్చుగా!" టీజింగుగా అడిగింది.
"ఉండవచ్చు - ఉండవచ్చు! ఇప్పుడర్ధమైందిలే! ఆ లుంగీ దొంగ ఎవరో - నువ్వే !"
"నిన్నటి నుంచీ ఇంటర్ వ్యూల కోసం ఒకటే తిరుగుతున్నావుగా! పాపం బట్టలుతుక్కునే టైమ్ ఉండదని జాలిపడి ఉతికి అరెశాను- అవిగో ఆరాక తీసుకో!"
'ఇదిగో ! నువ్ పనిమనిషిని నన్ను ఏకవచనంతో సంభోదించవద్దని అనేకసార్లు చెప్పాను."
"నేను పని మనిషయితే అవ్వచ్చు గానీ మేరీ పుండరీకాక్షయ్య గారి ప్లాట్ లో ఉంటున్నాను. నీకేమో అదీ ,లేదు. వాటర్ టాంక్ కింద కాపురముంటున్న వన్ బై టూ ని! నాకు మేరీ గారింట్లో కుక్ కమ్ సర్వెంటు ఉద్యోగం వుంది నీకు అది కూడా లేదు. ఇంకేం చూసి నిన్ను 'అండీ' అని పిలవమంటావ్?"
"మన గ్లామర్, మన ఖాందాన్ - మన ఇదీ ......."
"తెలుస్తూనే వుంది ఖాందాన్! మొగుడి మీద పెళ్ళానికి పెళ్ళాం మీద మొగుడికీ చిచ్చుపెట్టి జీడిపప్పు పకోడీ, బోర్నవిటాలు త్రాగటం! అవునా?" అతి కష్టం మీద నవ్వాపుకుంటూ అడిగింది.
సురేష్ ఉలిక్కిపడ్డాడు.
ఇది సామాన్య జాతి స్త్రీ కాదు.
నాజీ బ్రీడ్ అయుంటుంది. లేదా సి. ఐఏ. చీఫ్!
"ఏయ్ ఎవరు చెప్పారు నీకివన్నీ?"
"మనకి దివ్యదృష్టి ఉంది. నిజమా! కాదా! చెప్పు?"
రాధ కూర్చున్న క్లియోపాత్ర లాగా ఫోజుచ్చి ఠీవిగా కూర్చుని చెప్పింది.
"ఓర్నీ! నిజంగా రాణి ఠీవి వుంది దీనికి. ఆ ఫోజులు, ఆ మాటలు, ఆ లాంగ్వేజ్ , ఆ దర్జా నడక- వీళ్ళ ఫాదర్, మదర్ లో ఒకరు ఖచ్చితంగా రాయల్ ఫామిలీ మెంబర్ అయిండాలి.
"నిజమే ననుకో! ఏదో పుడ్ కోసం కోటి తిప్పలు! అది సరేగానీ నీ ప్లాష్ బాగ్ ఏమిటి? మీ ఫామిలీ , మీ ఊరు, నీ కధా-"
"నీకు వెనుక కధలూ, ముందు కధలూ చెప్పటం కంటే వేరే పనేం లేదేమిటి నాకు! వస్తా" అనేసి లేచి మెట్లవేపు నడిచింది.
"హలో కుమిదినీ -- వన్ మినిట్ - హలో "
వినిపించుకోకుండా వెళ్ళిపోయింది.
ఏదేమయినా గానీ, ఎంత సర్వెంట్ మెయిడయినా అవనీ ! తను పస్తున్న రోజున ఆ విషయం ఎలా గ్రహిస్తుందో ఏమో! ఇంత భోజనం తెచ్చి రహస్యంగా తనకు పెడుతుంది.
సర్వెంట్ మెయిడ్ కి ఇంత రిచ్ హృదయం దేవుడిచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకోవాలి ."
తలగడ లాక్కుని నేలేమీదే పడుకున్నాడు సురేష్.
వాటర్ టాంక్ కింద అవటం వల్ల ఏసి రూమ్ లాగా ఉంది.
పొద్దున్నుంచీ తిరిగి తిరిగి కాళ్ళు లాగేస్తున్నాయ్.
అసలు తనకు ఇక జీవితంలో ఉద్యోగం అనేది దొరుకుతుందా అన్న అనుమానం రోజు రోజుకీ ప్రబలిపోతోంది.
నిజంగానే తనకంటే ఆ కుమిదినే నయం!
ప్రొటెక్షన్ ఉంది. తిండికి డోకా లేదు.
ఎటొచ్చి ఆ మేరీ పుండరీకక్షయ్య మీద తన క్కొంచెం అనుమానం!
పుండరీ కాక్షయ్య అయిదేళ్ళ క్రితం మేరీని నడివయసులో వదిలేసి ఎగిరిపోయిన దగ్గర్నుంచీ మేరీ సోషల్ వర్కర్ గా మారిపోయింది. అందమయిన మిడిలేజ్ స్త్రీ సోషల్ వర్కర్ కి మన దేశంలో డిమాండ్ కొదవేముంది?
అయ్. ఏ.యెస్ ల దగ్గర్నుంచీ మినిస్టర్ల వరకూ ఆమె చుట్టూ సెకండ్ హాండ్ తేనెటీగల్లా తిరుగుతుంటారు.
మున్సిపల్ కార్పోరేషన్ లో స్వీపరుద్యోగం దగ్గర్నుంచీ , రైల్వే కల్చురల్ కోటాలో క్లాస్ త్రీ ఉద్యోగాలిప్పించటం వరకూ , ఇండస్ట్రీ లైసెన్స్ ల దగ్గర్నుంచీ, రెడ్ లైట్ ఏరియా లైసెన్స్ ల వరకూ అన్నీ ఆమె ఎరేంజ్ చేసేస్తుంటుంది.
కానీ ఇటీజే కొశ్చన్ ఆఫ్ మనీ.
తనలాంటి మైనస్ కాష్ గాళ్ళకు ఆమె హెల్ప్ చేయదు.
అందుకే తను కుమిదినికి 'ఆ మూల్ మస్కా' ఇస్తున్నాడు.
ఒకోసారి జనరల్ మేనేజర్లు చేయలేని పనులు ఆ ఆఫీస్ గేటు పక్కనున్న కిల్లి కొట్టువాడు అవలీలగా చేసేస్తాడు.
టి.వీ. సీరియల్స్ కోసం దేశమంతటి నుంచీ ప్రోడ్యుసర్లు మినిస్టర్ చుట్టూ, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ చుట్టూ, బ్రోకర్ల చుట్టూ తిరుగుతుంటే బాంబే దూరదర్శన్ గేటు బయటున్న కిల్లీ కొట్టువాడికి చాన్స్ ఇచ్చారు దూరదర్శన్ వాళ్ళు.
కుమిదిని గట్టిగా తల్చుకుంటే తనకు తప్పకుండా ఉద్యోగం ఇప్పుంచగలదు. మరి తలుచుకునేలా చేయడానికి చాలా పద్దతులున్నాయ్. గానీ కుమిదిని చాలా తెలివిగలది. అంత తేలిగ్గా పడే రకం కాదు.
ఇక మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ -- ఆమెకి 'లవ్ జెర్మ్స్' ని ఎక్కించటం.
ప్రేమలోకి దింపి , పెళ్ళి చేసుకోబోతాడన్న ఫీలింగ్ ఇస్తే తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తుంది.
ఆఖర్లో తనది 'సోదర ప్రేమ' అనే తెలుగూ సినిమా డైలాగూ కొట్టి తప్పించుకోవచ్చు.
"సురేష్ - సురేష్ " స్టీమ్ ఇంజన్ గొంతు అది లిప్టు దగ్గర్నుంచీ వినిపిస్తోంది.
స్టీమ్ ఇంజన్ అంటే శ్రీహరి!
ఆ అపార్ట్ మెంట్స్ రెసిడెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ .
వీలయితే మొత్తం ప్రపంచాన్ని కాజేసి తన ప్లాట్ లో దాచుకోవాలన్నంత తపన! కర్రప్షన్ చార్జెస్ మీద ఆరుసార్లు సస్పెండ్ అయాడు.
తరువాత తన మీద కర్రప్షన్ చార్జెస్ చేసేవాళ్ళను కూడా కర్రప్టు చేసేయటం వల్ల ఇప్పుడు ఇంక ఏ సమస్యలేదు.
సురేష్ ఒక్క ఉదుటున లేచి పాక్కుంటూ మరో మూల ఉన్న వాటర్ టాంక్ కింద దాక్కోడానికి ప్రయత్నించాడు గానీ అప్పటికే వచ్చేశాడు స్టీమ్ ఇంజన్.
"ఇదిగో నిన్నే -- ఏమిటలా పాక్కుంటూ వెళ్ళిపోతున్నావ్ ?" గొంతులో అనుమానం.
సురేష్ చటుక్కున లేచి నిలబడ్డాడు.
"హబ్బే! పాకటం కాదండీ! ఎక్సర్సయిజ్ అన్నమాట! కొత్త రకం ఇది. నిన్నే కనుక్కున్నారట లాస్ ఏంజిల్స్ లో - స్టార్ టి.వి లో చూపించారు ."
"అలాగా! అలా ఉండాలి కుర్ర్రాళ్ళంటే ! లేటెస్ట్ థింగ్స్ అన్నీ తెలుసుకోవాలి! నిజం చెప్తున్నాగా! ఈ రోజుల్లో ఒక్కడికి కూడా ఆ ఆసక్తి , ఆ ఇంట్రెస్ట్ లేవోయ్ -- అందుకే మా పిల్లల్ని స్ట్రిక్ట్ డిసిప్లిన్ తో పెంచాను."
"అవునండీ! జెనరేషన్ టు జెనరేషన్ మరీ డిజేనరేట్ అయిపోతోందండీ!"
'అందుకేనోయ్ నువ్వంటే నాకభిమానం. అన్నట్లు మీ పిన్ని నీకు కాఫీ ఇస్తానంటుందోయ్ పద"