ఈ లాజిక్ ఏమిటో తనకర్థం కాదన్నట్టు వర్మ లేచాడు. "కానీ నువ్వు మాత్రం గదిలోంచి బయటకు వెళ్ళకు. నేనామె గురించి కనుక్కుంటాను. నువ్వు భోజనం తెచ్చే వెయిటర్ కి కూడా మొహం సరిగ్గా చూపించకు. రెండు మూడు రోజుల్లో బహుశా ఆ అమ్మాయి ఆచూకీ తేలియొచ్చు. గుడ్ నైట్!" అని అక్కడినించి వెళ్ళిపోయాడు రవివర్మ.
మహర్షి ఒక్కడే గదిలో మిగలిపోయాడు. మిత్రుడు పడేసివెళ్ళిన న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు.
ఫోటోలో సెంట్రీ మొహం చూస్తూంటే కడుపులో దేవేస్తోంది. ఇంత దారుణంగా అతన్ని చంపి ఆ నేరం తనమీద పడవేయడం కోసం తాళం చేతులు తనకిచ్చారు అని ఊహించుకుంటుంటేనే అతడికి బాధగా వుంది. ఈ నీలాపనిందల తనని జీవితాంతం వదలవనుకుంటాను.
పేపర్ పక్కన పడేస్తుండగా బల్లమీద భార్య డైరీ కనబడింది.
తనని అంత అందంగా, తీయగా మోసం చేసిన తన భార్య ఏమి వ్రాసుకుని ఉండి ఉంటుంది? అనుకుంటూ ఆ పుస్తకాన్ని తెరిచాడు.
అది ఒక సంవత్సరపు డైరీ కాదు. అక్కడక్కడా వ్రాసుకున్న భావాలన్నీ పొందుపరచబడ్డాయి మధ్యలో చాలా కాగితాలు ఖాళీగా వున్నాయి.
తననెలా మోసం చేసిందీ వ్రాసుకుని వుండి వుంటుందా?
ప్రియుడితో రహస్యంగా ఎంత సంతోషం అనుభవించిందీ వ్రాసి వుంటుందా? అనుకుంటూ అతడు చదవటం ప్రారంభించాడు.
6
నేను చిన్నప్పుడు క్రమశిక్షణ పేరుతో అటు ఇంట్లోనూ, ఇటు స్కూల్లోనూ కూడా సమస్య లెదుర్కొన్నాను, ఇంట్లో అయితే చిన్న విషయాలకి కూడా పెద్ద ప్రణాళిక లే ఉండేవి. నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు చిన్న శబ్దంకూడా చేయకూడదు. బాత్ రూమ్ లో స్నానం చేసేటప్పుడు కూనిరాగం తీయకూడదు. 'లగ్జరి' అనే మాట మా ఇంట్లో వినిపించడానికి వీల్లేదు.
ఎడ్యుకేషన్ కే మా ఇంట్లో పెద్ద పీటవేశారు. అన్నిటికీ ఆంక్షలే. అన్నిటికీ టైమ్ లే. ఏ విషయాలు అవసరమైనవో, ఏమి మూలాదారమైనవో అవన్నీ అనవసరమైనవిగానూ, మాకు సంబంధం లేనివిగానూ మా ఇంట్లో ట్రైనింగ్ పొందాము.
మా ఇంట్లో మనసుమీద ఇరుకుగా పనిచేసే మాటలు, నియమనిష్టలూ..... క్రమశిక్షణ...... పిల్లలు టీ, కాఫీ త్రాగకూడదు ...... గట్టిగా నవ్వకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము బెలూన్లలో బంధింపబడిన గాలిలా పెరిగాము.
* * *
ఆ రోజు ఇంట్లో ఎవరూ లేకుండా చూసి దొంగతనంగా తెచ్చుకున్న సెక్స్ బుక్ లో ఫోటోలు చూడసాగాం. మా ఇంట్లో ఎంత స్ట్రిక్టు అంటే కనీసం పక్కింటి నుండి అడిగి తెచ్చుకున్న వీక్లీ ఎవరైనా చదువుతుంటాం. అయితే ఇలాంటి పుస్తకం ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. అందులో ఒక అమ్మాయికున్న పెద్ద స్తనద్వాయాల గురించి మా చర్చ జరిగింది. మా పల్లెలో బట్టలు ఉతికితెచ్చే అమ్మాయికి అంతకన్నా పెద్దవి వుండటం చూశానని మా అక్క చెప్పింది.
ఆ సాయంత్రం స్నానం చేస్తూ చాలాసేపు నన్ను పరీక్షగా చూసుకున్నాను. ఎందుకో నాకు చాలా ఇన్ఫీరియర్ గా అనిపించింది.
* * *
మా స్కూల్లో అందరమ్మాయిలకి 'ఆపోజిట్ సెక్స్' అంటే ఇంట్రెస్ట్ వుండేదిగానీ, ఒక్క రోజీ మాత్రం ఎక్కువగా బయటపడేది. తను ఎవరెవరితో సెక్స్ లో ఎంత బాగా ఎంజాయ్ చేయగలిగిందో వివరంగా చెబుతుంటే నా ఒంటిలోంచి వెచ్చటి ఆవిర్లు వచ్చేవి. ఇంతవరకూ నాకు 'అధారామృతం' అంటే ఎలా వుంటుందో కూడా తెలియకపోవటం చిన్నతనంగా అనిపించేది. 'రోజే' కోసం చాలామంది వచ్చేవాళ్ళు. బండి వెనకాలో, కారులోనో కూర్చుని, వాళ్ళ భుజాలమీద వాలి కబుర్లు చెబుతూ వెళ్ళేది. నాకు ఆమెనుగానీ, అలాంటి జంటలను గానే చూసినప్పుడల్లా చాలా ఈర్ష్యగా అనిపించేది. నాకూ ఓ బాయ్ ఫ్రెండ్ వుంటే.....'
మా నాన్న గుర్తొచ్చి ఆ ఆలోచన క్కూడా భయమేసింది.
* * *
ఒకసారి బస స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తూండగా ఒక యువకుడు బైక్ నా ముందు ఆపి "లిప్ట్ కావాలా మేడమ్?" అంటూ నమ్రతగా అడిగాడు. పచ్చటి శరీరఛాయతో....... రాత్రిళ్ళూ నాకు గుర్తుకువచ్చే సినిమా హీరోకన్నా ఇంకా అందంగా వున్నాడతను. నేను కాదలనలేకపోయాను. అదే మొట్టమొదటిసారి నేను మా నాన్న ఆంక్షను దాటింది. కుదుపులకి నా వక్షం అతనికి తగులు తుందని తెలిసీ ఎందుకో దూరం జరగలేకపోయాను. అసలు ఆ కుదుపులు అతనే క్రియేట్ చేస్తున్నాడేమో? అనిపించింది. ఆ ఊహే చాలా బావుంది.
అతనితో నా పరిచయానికి అది నాంది.
అతనికి ముద్దుగా 'ఇలూ' అని పేరు పెట్టాను. 'ఇలూ' అంటే I.L.U.....! ఐ లవ్యూ.
* * *
పరిచయమైన సంవత్సరం వరకూ రోజీ తన గురించి అసలు నాకేమీ చెప్పుకోలేదు. తర్వాత్తర్వాత మనసు విప్పి మాట్లాడటం మొదలు పెట్టింది.
ఒకసారి ఆమె నాతో "నీకింకా చాలా యవ్వనం మిగిలి వుంది. నీకు పూర్తిగా అర్థం చేసుకునే వయసు కూడా లేదు. నా జీవితంలోని విషాదమంతా నీకు చెప్పి నిన్ను భయానికి గురిచెయ్యటం నాకిష్టంలేదు. ఆ విధంగా నువ్వు నానుంచి దూరం అయిపోతావేమోనన్న భయం కూడా నాకు కలిగింది. నీ ఊహల్లోనూ, నీ అమాయకత్వంలోనూ, నీకెంత కాలం సాధ్యమైతే అంతకాలం నువ్వు కనసాగడం మంచిదని భావించాను" అంటూ ఏవేవో చెప్పింది.
'ఇలూ' పరిచయమైన చాలా కాలం తరువాతగానీ ఆమె మాటల్లో నిగూఢత నా కర్థం కాలేదు.
* * *
ఇంట్లో చిన్న క్రమశిక్షణా రహిత్యపు చర్య జరిగినా మా నాన్న ముఖం రౌద్రంగా కనిపించేది. గట్టిగా మాట్లాడుతున్నా సహించేవాడు కాదు. 'ఇలూ' అలాకాదు. నన్నొక బెబీలా చూసుకున్నాడు. నేను అలిగితే ప్రాణం పోయినట్లు విలవిల్లాడేవాడు. నేను అల్లరిచేస్తే అపురూపంగా చూసేవాడు. ఇంట్లో దొరకని స్వేచ్ఛ మొత్తం అతని సాంగత్యంలో పోందేదాన్ని.
'ఇలూ' దగ్గిరావటం ద్వారా నేను ఆ నాన్నమీద కసితీర్చుకుంటున్నాననిపించేది. అదీగాక నా శరీర సౌష్టవం పట్ల ఉన్న ఇన్ఫీరియారిటీని అతను పోగొట్టేవాడు. మొదట్లో పెదవులూ, ఆ తరువాత శరీరమూ, అతనికి అందించాల్సి వచ్చింది. కానీ రానురాను అది మా ఇద్దరిమధ్యా 'కామన్' విషయమై పోయింది. అయినా నేను బాధపడలేదు. రోజీలా పదిమందితో తిరగటం లేదు. అదీగాక అతన్ని పెళ్ళి చేసుకోవాలను కుంటున్నాను కూడా!
సాయంత్రం మా అమ్మ దగ్గర గారాలుపోతూ "ఢీల్లీ వెళ్ళే అవకాశం వచ్చిందమ్మా. జెస్ట్ రెండ్రోజులే" అన్నాను.
"రెండ్రోజుల్లో ఢీల్లీ వెళ్ళి రావటమనేది సాధ్యపడదు. కేవలం ప్రయాణానికే అంత టైమ్ పడుతుంది" అమ్మ అంది.
"ప్లయిట్ లో వెళ్తున్నాం."
"ఎవరు తీసికెళ్తున్నారు...... ఆ అమ్మాయేనా?"
'ఆ అమ్మాయి' అంటే అమ్మ దృష్టిలో 'రోజీ'. 'ఇలూ' తో నా తిరుగుళ్ళకి రోజీ' ని అడ్డం పెట్టుకోవడం అలవాటయిపోయింది. రోజీ కూడా అవసరమయితే అబద్ధం ఆడమన్నా నాకోసం ఆడుతుంది. ఇప్పుడు కూడా నా 'ఇలూ' తోనేగా వెళ్ళేది!
"అవును" అన్నాను అమ్మతో.
"సరే, నాన్నగారి మూడ్ చూసి అప్పుడు డిసైడ్ చేద్దాం" అంది అమ్మ. ఆయన కెలాగైనా నచ్చచెబుతుందని నాకు తెలుసు.
* * *
రోజీ బాగా డబ్బు సంపాదించింది.
ఆమె ఫ్లాట్ కి వెళ్ళానో రోజు. అన్నీ విలువైన వస్తువులే. గోల్డ్ అయితే చెప్పనక్కరలేదు. నాలుగు బీరువాల నిండా బట్టలు. ఆమె లగ్జరీ చూసి నిజం చెప్పొద్దూ.... పైకి నవ్వుతూ మాట్లాడినా లోపల బాగా ఈర్ష్య కలిగినందుకు బాధపడ్డాను.
ఈ దేశంలోనున్న మధ్యతరగతి వాళ్ళలో ఇంచుమించు తొంభైశాతం మంది తమ మూడొంతుల కాలాన్ని సంపద, కీర్తి,...... ఈ రెండింటిమీద మోజుతో దిశగా పయనిద్దామనే తాపత్రయపడుతూ గడుపుతుంటారు."
అయితే రోజీ మాత్రం తన ప్రయత్నంలో విజయం సాధించిందని అర్థమైంది....... ఆమె బ్యాంకు బాలెన్స్ చూసాక!
* * *
ఈ రోజు 'శోభాడే' పుస్తకం చదివాను. అందులో 'అంజలి' పాత్ర అచ్చు నాలాగే వుంది. తను ఈ పుస్తకం నాకు ఎందుకు ఇచ్చాడో అర్థంకాలేదు.
రోజీ ఓ రోజు నన్ను హెచ్చరించింది. "మా అందరి కన్నా భిన్నమైన అమ్మాయి వనుకున్నాను. నువ్వు కూడా మాలో కలిసిపోవటం నాకు బాధగా వుంది" అంది.
"ఏమిటీ నువ్వనేది?" నిజంగానే నాకర్థం కాలేదు.
"అతనితో నీ పరిచయం గురించి నేను చెప్పేది" అంది.
"అతన్ని నేను ప్రేమిస్తున్నాను."
"అంత ప్రత్యేకత ఏం కనిపించింది నీ కతన్లో?" రోజీ కూడా 'పరిచయాల గురించి' భిన్నంగా మాట్లాడటం నాకాశ్చర్యంగా అనిపించింది. 'ఇలూ' గురించి పూర్తిగా ఆమెకు విడమర్చి చెప్పాలనిపించింది.
"నేను ప్రత్యేకంగా ఫీలయ్యేటట్లు అతను చేశాడు. నీకు తెలుసా..... నా బ్రెస్ట్స్ అంటే అతనికి చాలా ఇష్టం" అన్నాను.
"ఇంకా......"
"నా లక్షణాలని అతను అభినందిస్తాడు. నా అభిరుచులకు విలువనిస్తాడు నేనేమి మాట్లాడినా వింటాడు."
"అంతేనా? ఇంకా ఏమయినా జరిగిందా? ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే, నీ మార్పుకు మొదట్లో నేను కొంత దోహదం చేసానేమో అనే ఫీలింగుతో" రోజీ నిజాయితీగా అంది.
నేను కూడా అంతే నిజాయితీగా చెప్పాలనుకున్నాను. "ఇందులో నువ్వు చేసిందంటూ ఏమీలేదు. పోతే...... అతనితో కలిసి పడుకోవటం కూడా జరిగింది. చాలా అద్భుతంగా వుంది ఆ అనుభవం! భూకంపం వచ్చినట్లుగా అనిపించింది. మొట్ట మొదటి సారిగా నేనేదో పొందాననిపించింది. "పెద్ద ఆరిందానిలా ఆవేశంగా అన్నాను.
ఆమె దిగ్ర్భాంతి చెందింది.
"శ్రీవాణి! నువ్వు స్పృహలో వుండే మాట్లాడుతున్నావా?" ఆమె ముఖంలో ఆశ్చర్యం కనిపించింది.