Previous Page Next Page 
కాంతి కిరణాలు పేజి 5


    అలా ఎంతసేపు గడిచిపోయిందో ఇరువురికీ తెలీలేదు. ముందుగా సృజన్ బాబే ఆలోచనల్లోంచి తేరుకొని టైమ్ చూసుకొన్నాడు. పదకొండున్నరవుతోంది. "ఇంక పోదామా?" అడిగాడతను.
    సురేంద్ర మౌనంగా లేచినుంచుని భారంగా విడిదింటి వేపు అడుగులు వేయసాగాడు. రాన్రాను అతనికి స్వరూప మీద కోపం, అసహ్యం పెరిగిపోతున్నయ్! కావాలని తన నామె మోసగించినట్లనిపించసాగింది. ఆమెమీద అంత వరకూ పేరుకుపోయిన ప్రేమానురాగాలు నెమ్మదిగా కరిగిపోసాగినయ్! అమాయకురాలిలా ఎంత నటన? ఆమె హృదయాన్ని ప్రప్రధమంగా తనే ఆక్రమించుకున్నాడనీ, ఆమె సరసన జీవితం ఎంతో మధురంగా, ఆనందంగా సాగిపోతుందనీ ఊహించుకొన్నాడు. వాడెవడినో ప్రేమించి, వాడితో ప్రణయకలపాలు జరిపి-చివరకు తనను వివాహం చేసుకోడాని కెందుకొప్పుకుంది? ఒకవేళ వాడు అన్ని ముచ్చట్లూ తీరాక-వివాహం చేసుకోను, పోమన్నాడేమో. ఇలాంటి కథలు చాలా తెలుసు తనకు. తమ బంధువుల్లోనే ఒకమ్మాయి ఇలాగే ఒకడిని ప్రేమించి, తీరా గర్భం వచ్చాక, వాడు పెళ్ళిచేసుకోవంటే ఆత్మహత్య చేసుకు చనిపోయింది. కాలేజీలో డాక్టర్ గారమ్మాయి విజయ ఓ ఫైనలియర్ కుర్రాడితో ఇంచుమించుగా సంవత్సరంపాటు సంసారంచేసి చదువవగానే-అతన్నొదిలేసి ఓ ఆఫీసరుని పెళ్ళి చేసేసుకుంది. ఇంతకూ ఇప్పుడేమిటి చెయ్యటం? స్వరూపమీద ద్వేషం పేరుకుపోసాగిందతనిలో. ఇప్పుడీ పెళ్ళి ఆగిపోతే వాళ్ళతో బాటు తమకీ అవమానమే. పైగా అందుమూలాన స్వరూపకి జరిగే నష్టమేమీ ఉండదు. పెళ్ళి తప్పిపోవడం ఇది రెండోసారవుతుంది. అంతే, మర్నాటినుంచే మరోడిని వలలో వేసుకొని, వాడిని పెళ్ళాడటానికి తయారవుతుంది మళ్ళీ. ఇలాక్కాకూడదు. తనలాంటి అమాయకులతో చెలగాట మాడకుండా ఆమెకు బుద్ధి చెప్పాలి. మళ్ళీ జీవితంలో మరో మగాడు ఆమెవంక చూడకుండా ఉండేట్లుగా తగిన శాస్తే చేయాలి. గుణపాఠం నేర్పాలి.
    ఇల్లు చేరుకొన్నారిద్దరూ. ఇల్లంతా ఇంచుమించుగా నిశ్శబ్దంగా ఉంది.
    స్నేహితులందరికోసం గదిలోపక్కలుపరిచి ఉన్నాయ్. బట్టలు మార్చుకొని వాటిమీదకు వరిగారిద్దరూ.
    ఇద్దరికీ కంటిమీద నిద్ర రావటంలేదు.
    తీరా స్వరూప సంగతి చెప్పేశాక అతనికి తను చేసింది మంచిపని కాదేమో అన్న ఆలోచన మొదలైంది. మరి కొద్దిసేపటికీ పశ్చాత్తాపంతో దహించుకుపోసాగాడతను. తనమూలాన స్వరూప జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతోందో అన్న ఆలోచన అతడిని భయకంపితుడిని చేసింది.
    శ్రీధరం, వీర్రాజు, సీతంరాజు సినిమా నుంచి తిరిగి వచ్చారు. కొద్దిసేపు ఆ పాత సినిమాలోని సన్నివేశాలు గుర్తుకి తెచ్చుకుంటూ మాట్లాడి క్రమంగా నిద్రలోకి జారిపోయారు.
    దగ్గర్లోనే గడియారం మూడు గంటలు కొట్టింది అశాంతిగా అటూ ఇటూ పొర్లసాగాడు సృజన్.
    అప్పుడే లేచి కూర్చుని సిగరెట్ అంటించుకున్న సురేంద్ర వంక బాధగా చూసాడతను.
    ఇదంతా తన మూలానే జరుగుతోంది. మానసికంగా అతనెంత గాయపడతాడో తలచుకొంటే గుండెలవిసి పోతున్నయ్. క్రమంగా తనమీద తనకే అసహ్యం కలుగసాగింది సృజన్ బాబుకి. తనంత దుర్మార్గుడు మరొకడుండడీ ప్రపంచంలో ఎంత దుర్మార్గుడు కాకపోతే పచ్చని పెళ్ళిపందిట్లో అలాంటి వార్తని పెళ్ళికొడుక్కి చెప్తాడు? ఒకవేళ ఇప్పుడే పెళ్ళి ఆగిపోతే స్వరూప ఉసురు తప్పక తనకే తగుల్తుంది.
    "సురేంద్రా." నెమ్మదిగా లేచి కూర్చుని పిలిచాడు సృజన్ బాబు.
    "ఊఁ" గంభీరంగా అనిపించిందతనికి గొంతు.
    "ఇంకా అదే ఆలోచిస్తున్నావా?"
    "అవును."
    "ఇప్పుడేం చెయ్యాలని?"
    "స్వరూపకి బుద్ది చెప్పాలి. అది ఎలా చేయాలా అన్నదే బోధపడటం లేదు."
    "అంటే పెళ్ళి జరగడం లేదన్న మాటేగా?"
    "అదొక్కటే చాలదు సృజన్. ఆ రాక్షసి మరోసారి ఎవ్వరి జీవితంతోనూ చెలగాటా లాడటానికి వీల్లేకుండా ఏదయినా పాఠం నేర్పాలి. అప్పుడుగాని నాకు మనశ్శాంతి ఉండదు."
    "పోనీ ఆమెనలా వదిలేసి మనదారిన మనం పోతే ఏం?"
    "వాళ్ళకి కారణ మేం చెప్తావ్?"
    హఠాత్తుగా మనవాళ్ళెవరికో ప్రమాదంగా ఉన్నట్లు కబురందిందని చెప్తే సరి..."
    చిన్నగా నవ్వేడు సురేంద్ర.
    "వాళ్ళని అంత గౌరవమర్యాదలతో వదిలేద్దామనా? ఉహుఁ. అలా వీల్లేదు సృజన్. నా సంగతి నీకు తెలిసిందేగా నే నొకరి జోలికిపోను. ఒకరు నన్నవమానిస్తే ప్రతీకారం తీర్చుకునేవరకూ వదలను..."
    సృజన్ కి ఏం మాట్లాడటానికి తోచలేదు.
    ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ అతనికి ఆందోళన అధికమవసాగింది.
    చీకట్లు విచ్చుకొంటూండగానే మంగళ వాయిద్యాలు వినిపించసాగినయ్. ఇంట్లో అప్పుడే హడావుడి మొదలయింది.
    స్నేహబృందమంతా నిద్రలేచారు.
    సురేంద్రని లోపలికి పిలుచుకెళ్ళారు కొందరు ఆడవాళ్ళు.
    అన్యమనస్కంగానే తనూ మిగతావారితోపాటు తయారయి పెళ్ళిపందిట్లోకి చేరుకొన్నాడు సృజన్ బాబు.
    ఎప్పుడు ఏం గొడవ జరుగుతుందోనని అతను కలవరపడుతూనే ఉన్నాడు. సురేంద్ర ఏం చేయదలుచుకొన్నాడో అతనికేమాత్రం బోధపడటం లేదు. వివాహం యధాతథం గానే జరిగే సూచనలు  కనబడుతున్నాయ్.
    ఒకవేళ వివాహం వేదికమీద రసాభాసచేస్తాడేమో! "ప్రతీకారం" తీర్చుకొంటానన్న అతని మాటలు గుర్తుకొచ్చినయ్ సృజన్ బాబుకి. జరగబోయే సంఘటన తల్చుకుంటే అతనికి వళ్ళు ఝల్లుమనసాగింది.
    వివాహ వేదికమీద కూర్చున్నాడు సురేంద్ర. పురోహితుల మంత్రాలు మైకులో మార్మోగుతున్నాయ్! సురేంద్ర మొఖంవంకే చూస్తున్నాడు సృజన్. చిరునవ్వుతో స్నేహితులవంక చూసాడు సురేంద్ర. అతని మొఖంలో ఎలాంటి భావమూ కనిపించటం లేదు.
    పెళ్ళికూతురిని కూడా తీసుకొచ్చారు వేదిక మీదకి.
    ముహూర్తం వేళ దగ్గరయింది.
    జరగాల్సిన తంతంతా యధాప్రకారం జరిగిపోతోంది. సృజనుబాబు గుండెలు వేగంగా కొట్టుకో సాగినయ్ ఏ క్షణాన ఏంజరుగుతుందోనని ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు.

 Previous Page Next Page