Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 5

 

    ఆమె వైపు లలితా ఎగాదిగా చూసింది.
    "మీ అయన ఇంట్లో వున్నారా?"
    ఊహించని ప్రశ్నకు లలిత బొమ్మలా బిగుసుకు పోయింది.
    "లేదు....." ముక్తసరిగా సమాధానం చెప్పింది.
    "ఎక్కడకు వెళ్ళారు...."
    ఈసారి తడుముకోకుండా టక్కున జవాబు ఇచ్చింది.
    "కాంప్ కు వెళ్ళారు...."
    ఇన్ స్పెక్టర్ ధీరజ భ్రుకుటి ముడిపడింది.
    "అవును మేడమ్ ....ఈ మధ్య కాలంలో ప్రతిదానికీ చీటికీ మాటికీ విసుక్కోవడం ఆయనకు ఎక్కువ అయిపొయింది. ఇంటిలో సరిగా వుండడం లేదు. స్నేహితులతో కలిసి తాగడానికి అలవాటు పడిపోయి కట్టుకున్నా పెళ్ళాం పై చేయి చేసుకుంటున్నాడు కూడా.....అలానే వారం రోజుల క్రితం తాగి వచ్చి నానా గొడవ చేయబోతే నేనూ మాటకు మాట చెప్పాను. ఆ కోపంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు అలా వెళ్ళి రెండు మూడు రోజుల వరకూ రాకపోవడం మామూలే. కాబట్టి నేను అంతగా పట్టించుకోలేదు. కానీ ఈ మధ్యనే ఇంకొక విషయం తెలిసింది...." ఒక క్షణం పాటు ఆగి లలిత భారంగా శ్వాస పీల్చింది.
    "చెప్పండి....." ఆమె ముఖంలోకి చూస్తూ అన్నది ధీరజ.
    "ఆడవాళ్ళతో బయట చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారు. అంతటితో ఊరుకోకుండా ఇంకొకదాన్ని ఉంచుకున్నారు కూడా....."
    "ఎవరు ఆమె....."
    "ఇక్కడ కాదు మేడమ్ ....ఆ రంకులాడి రాజమండ్రిలో వుంటుంది."
    మరొక కొత్త పాయింట్ దొరకడంతో ధీరజ ఆమె చిరునామా అడిగింది.
    "మీ వారు ఏ రోజున వెళ్ళారు...."
    "జూన్ ఒకటవ తేదీన...."
    మీ వారి ఫోటో ఇవ్వండి.
    "ఐసీ ....మీ అయన ఎప్పుడు వస్తే అప్పుడు వైజాగ్ రైల్వే పోలీస్ స్టేషన్ కు ఒకసారి వచ్చి కనపడమని చెప్పండి....."
    లలిత భర్త సీతాపతి ఫోటో ఒకటి తీసి ఇన్ స్పెక్టర్ కు ఇచ్చింది.
    అసలు ఆ ఇన్ స్పెక్టర్ ఎందుకు వచ్చిందో తన భర్త ఫోటో ఎందుకు తీసుకు వెళుతుందో అర్ధం కాక బొమ్మలా నిలుచుండి పోయింది.


                                                       *    *    *

    హెడ్ కానిస్టేబుల్ వీరాచారి వచ్చి చెప్పిన విషయాలను బట్టి చనిపోయిన వ్యక్తీ పేరు సీతాపతి అనీ వైజాగ్ లోని ఒక ప్రయివేట్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్ గా పని చేస్తున్నాడని తెలిసింది.
    జనరల్ ఎంక్వయిరీలో అతనికి బాగా తాగే అలవాటు వుందనీ, భార్య భర్తల మధ్యన తరచుగా పోట్లాటలు, కీచులాటలు జరుగుతుంటాయని తెలియడంతో అతనిని హత్య చేసే అవకాశం ఎవరికీ వున్నదో తెలుసుకోవాలంటే తను వెళ్ళి ఇన్ వెస్టిగేషన్ చేయక తప్పదు అనే నిర్ణయానికి వచ్చి వైజాగ్ సిటికీ వచ్చింది ఇన్ స్పెక్టర్ ధీరజ.
    సిటిలో దిగిన వెంటనే సీతాపతి పనిచేసే కంపెనీకి వెళ్ళి విచారించింది. భార్యను కూడా ప్రశ్నించాకా అతని మరణం వెనుక ఏదో మిస్టరీ వున్నట్టు వూహించింది.
    అటో జగదాంబ సెంటర్ లో ఆగడంతో ఆమె ఆలోచనలు అంతటితో ఆగిపోయాయి.
    బిల్ పే చేసి దసవల్లా హోటల్ వైపు నడిచింది.....
    హోటల్ దాటి కొంచెం ముందుకు వెళ్ళి రోడ్ కు దూరంగా లోపల వున్న శివాలయం ముందు ఆగింది ధీరజ.
    ఆ పరిసరాలను చూడగానే ఆమె మనస్సు ఎక్కడకో పరుగు దీసింది.
    కొన్ని సంవత్సరాల క్రితం తను ప్రతిరోజూ ఈ గుడికి వచ్చేది....ఎన్నో సార్లు ఈ జగదాంబ సెంటర్ లోనే సిటీ బస్ కోసం రోజూ వెయిట్ చేసేది. అలా వెయిట్ చేయడంలో తను అనిర్వచనీయమయిన ఆనందాన్ని పొందేది....
    కారణం .....తన క్లాస్ మేట్ .....తన కలల హీరో కూడా అక్కడే బస్ యెక్కడానికి రావడం
    ఒక్కొక్కప్పుడు అతను రావడం ఆలస్యం అయ్యేది......ఒకటి రెండు బస్సులను కూడా అతని కోసం మిస్ చేసుకునేది.....ఆలస్యం అయిన కొద్ది కోపంతో రుసరుసలాడే దల్లా అతను కంటికి కనిపించే సరికి ఆ కోపం కాస్తా కరిగిపోయేది.
    తాము ఇద్దరమూ కలిసి ఎన్ని సినిమాలు చూశారో ....యెన్ని సాయంత్రాలు సముద్రపు ఒడ్డున గడిపారో.....యెన్ని గంటలు కలిసి సిటీ తిరిగేవాళ్ళో ఒక్కసారిగా ఆమె కళ్ళముందు గిర్రున తిరగడంతో ఏదో తెలియని అపశ్రుతి ధీరజ మనస్సులో మెదిలి అప్రయత్నంగానే కనుకొలకుల వెంట ఆశ్ర్హువులు జలాజలా రాలాయి.
    హ్యాండ్ కర్చీఫ్ తో కళ్ళు వత్తుకుంటూ ధీరజ ముందుకు నడిచింది.
    కొంచెం ముందుకు వెళ్ళి యెడమ వైపు రోడ్డులోకి తిరిగి తనకు కావలసిన బిల్డింగ్ మెయిన్ గెటుని తెరిచింది.
    ఏదో తెలియని అనుభూతి ఆమె మనస్సు నిండా నిండిపోయి వుంది.
    చాలా కాలం తరువాత తిరిగి తను ఆ బిల్డింగ్ లో అడుగు పెడుతున్నది.....
    ఇంత హటాత్తుగా తను రావడం చూసి తన చిరకాల నేస్తం యెలా ప్రతి స్పందిస్తాడో తనను ఇంకా ఆరాధిస్తున్నాడా లేక.....ఆ సాంతం మరచిపోయాడా లేక.....జీవితంపై విసిగి నిరాశా నిస్పృహలతోనే వున్నాడో లేక మనసుకి నచ్చిన మరొక స్త్రీ ని పెళ్ళి చేసుకుని సుఖంగా ఆపై ఆలోచించ లేకపోయింది ధీరజ.
    మెట్లు పైకి వెళ్ళింది.
    మధ్య వయస్కుడు ఒకాయన మొదటి గదిలో నుంచి బయటకు లేస్తూ ఆమెకు ఎదురయ్యాడు. పోలీస్ యూనిఫారం లో వున్న యువతి కనిపించడంతో ఖంగారు పడి పోయాడతను.
    "మీ....మీ.....రు...." తడబడిపోతూ అడిగాడు నారాయణ మాస్టారు.
    "నేనే మాష్టారు ధీరజను...."
    అతని ముఖంలో కొట్టవచ్చినట్టు ఆశ్చర్యం....
    "ఎవరూ.....ధీరజమ్మా....."
    ధీరజ అవునన్నట్టు తల వూపింది.
    పోలీస్ డ్రస్ లో వున్న ఆమెను నఖ శిఖపర్యంతం పరీక్షగా చూశాడు అయన.
    "రా తల్లీ....చాలా కాలానికీ చూస్తున్నాను....అసలు నిన్ను గుర్తుపట్ట లేకపోయాను....." అంటూ ఇంటిలోకి దారితీశాడు నారాయణ మాష్టారు.
    లోపలకు వచ్చి కూర్చున్నదాన్నమాటే కానీ ఆమె చూపులు బయటకే తొంగి చూస్తున్నాయి.
    "మంచినీళ్ళు తీసుకోమ్మా...."
    ఆప్యాయంగా తెచ్చి ఇచ్చిన నీళ్ళ గ్లాసు కింద పెట్టింది.
    "ఎలా వున్నారు మాష్టారూ?"
    "నాకేం తల్లీ బాగానే వున్నాను.....నువ్వు పోలీస్ ఉద్యోగానికి ఎప్పుడు వెళ్ళావమ్మా....." ఇప్పుడు ఏ వూరిలో పని చేస్తున్నావమ్మా.... ప్రశ్న మీద ప్రశ్న లేశాడు.
    "హైదరాబాద్ సిటిలో సెలక్ట్ అయ్యాను. తరువాత ప్రమోషన్ మీద విజయవాడ రైల్వేకు డెప్యుటేషన్ మీద వచ్చి ఆరునెలలు అయింది. వచ్చినప్పటి నుండి విశాఖపట్నం రావాలనుకుంటూనే వున్నాను తప్ప ఇంతవరకూ కుదరలేదు. ఇప్పుడు అయినా ఒక కేసు పని మీద వచ్చాను....అందుకే మనసు ఉండబట్టలేక....."
    "ఈ తాతను చూడడానికి వచ్చానంటావు .....కానీ నిన్నిలా చూస్తూ ఆనందించాలో లేక తరువాత మాటలు పూర్తీ చేయలేక ఆగిపోయాడు నారాయణ ,మాష్టారు.
    "జరిగిపోయిన దానికి విచారించి ప్రయోజనం ఏముంది మాష్టారు. అది సరే, సునీల్ ఎక్కడ వుంటున్నాడు....ఎలా వున్నాడు.....ఏం చేస్తున్నాడు....ఏదయినా ఉద్యోగం వచ్చిందా లేదా?"
    "ఏం చెప్పమంటావమ్మా.....ఇక్కడ నుంచి చాలా సంవత్సరాల క్రితమే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఎక్కడ వుంటున్నాడో తెలియదు. వుండేది మాత్రం ఈ వైజాగ్ లోనే.....కానీ ఎప్పుడు కనిపించినా ఇంటి అడ్రస్ చెప్పడు.....ఎప్పుడూ ఖరీదయిన కార్లలో తిరుగుతూ కనిపిస్తుంటాడు...."
    అంటే అతను ఏదో గొప్ప ఉద్యోగమే సంపాదించి మంచి స్థితిలోనే ఉన్నట్టుగా....." చిరునవ్వుతో అన్నది.
    "లేదమ్మా.....ఏ ఉద్యోగమూ చేయడం లేదు.... బహుశా ఏదయినా వ్యాపారం చేస్తున్నాడేమో" అన్నాడు నారాయణ.
    "సునీల్ పెళ్ళి చేసుకున్నాడా మాష్టారూ?"
    ఉండబట్టలేక ఎప్పటినుండో అడగాలను కుంటున్న ప్రశ్న అడగనే అడిగింది.
    ఆమె ప్రశ్నకు జీవం లేని నవ్వు నవ్వాడు.
    "అది కాదు మాష్టారూ....మామధ్య పెరిగిపోయిన అడ్డుగోడ అలానే నిలిచిపోయింది. పేదింటి పిల్లనయిన నన్ను కాదని వేరే డబ్బున్న వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడేమోనని" అనుమానంగా అడిగి జవాబు కోసం క్షణం ఆగింది.
    "పెళ్ళా....ఈ జీవితంలో నిన్ను తప్ప మరొకరిని పెళ్ళి చేసుకోడు .....చేసుకోలేడు కూడా....."
    "నిజమేనా మాస్టారూ? .... మీరు చెప్పేది నిజమేనా?"
    "అవునమ్మా .....ఎప్పుడయినా పెళ్ళి విషయం ఎత్తితే సమాధానం చెప్పకుండా మాట మార్చేవాడు నీమీద ప్రేమతోనే ఇంకా పెళ్ళి చేసుకోకుండా ఉన్నాడనే నా అనుమానం. అది తెలుసు కుందామనే ఎందుకయ్యా ఇంకా ఒంటరి జీవితం గడుపుతావు .....పెళ్ళి చేసుకుని స్థిరపడవచ్చు కదా అంటే వేదాంతిలా నవ్వేవాడు. మొత్తానికి బయటకు చెప్పుకోలేని ఏదో వ్యధ తో కుమిలి పోతున్నాడనిపించింది. అందుకే రెట్టించి అడిగి అతని మనస్సును కష్ట పెట్టడం ఎందుకని మౌనం వహించాను....

 Previous Page Next Page