ఆమె కుచోలేదు. "మీతో కొంచెం మాట్లాడాలి" అంది.
ఆమె గొంతులోని అదో రకమయిన ధ్వని విని రాజహంస మళ్ళీ బలవంతం చెయ్యలేదు. తాను మాత్రం కుర్చీలోంచి లేవలేదు."
'అయితే మాట్లాడండి" అంది.
"రాత్రి మీ యింటి కెవరో వచ్చినట్లున్నారు"
"వచ్చారు"
'ఆడవాళ్ళు కాదనుకుంటాను"
"కాదు మొగవాడే వయసులో కూడా ఉన్నాడు ఏమయిందిప్పుడు."
"నేనీ యింటి యజమానురాల్ని కదా. ఈ ఇంటిలో విషయాలు తెలుసుకోవాల్సిన అవసరముంది"
"మీరి యింటికి యజమానురాలేమో నాకు కాదు."
"కాకపోవచ్చు కాని మీరింట్లో వుంటున్నారు."
"అద్దె చెల్లించి ఈ పోర్షన్ మీరెంత వెలగట్టారో అంతా చెల్లిస్తున్నాను."
'అది నిజమేననుకొండి. కాని అద్దెకున్న వారికి కొన్ని నిబంధనలుంటాయి."
"అవేమిటో తర్వాత మాట్లాడదాం. మొదట మీరు చెప్పాలని ఉబలాటపడుతున్న పాయింటేదో క్రక్కేయండి."
రాజహంస అంత సూటిగా , నిక్కచిగా మాట్లాడుతుందని ఆమె అనుకోలేదు. అంతకు పూర్వం అద్దెకున్న వాళ్ళెవరూ ఆమెతో అలా మాట్లాడి వుండలేదు'
కొంచెం ఖంగుతింది. తమాయించుకుని "ఆ వచ్చిన తనూ, మీరు మాట్లాడుకున్న మాటలు కొన్ని నా చెవిన పడ్డాయి."
"ఇతరులు మాట్లాడుకునేవి విన్నానని చెప్పుకోటానికి మీకు అభిమాననిపించటం లేదు?"
"వినాలని వింటారేమిటి? మీరు గట్టిగా అరుచుకుంటుంటే వినిపించాయి"
"అవును, అరుచుకున్నాం. ఒక మనిషన్నాక ప్రతి వారికి ఏదో వ్యక్తిగత జీవితముంటుంది. సమస్యలుంటాయి. పరిచయలుంటాయి. చుట్టాలూ, స్నేహితులు వుంటారు. మీ ఇంటికి మీకు తెలిసినవాళ్ళు వచ్చినట్లే మా ఇళ్ళకూ మాకు తెలిసిన వాళ్ళూ వస్తూ వుంటారు."
'అంటే.....మాములు పరిచయస్తులయితే ఫరవాలేదు, ఏదో వ్యవహారమున్నట్లుంటేనూ"
"ఇక్కడ నేనేం వ్యవహారం నడిపించలేదే"
"నడిపించక'పోవచ్చు , కాని ఆ మాటలు...."
"లేకపోతే రాత్రుళ్ళేవరినీ పిలిచి పడుకోబెట్టుకోవటం లేదే"
"అది కాదండీ, నే చెప్పేది...."
"ఏమిటో మీరు చెప్పేది. మీ ఇంట్లో వున్నంత మాత్రాన ఒదిగి వుండాల్సిన అవసరం లేదు. నేను తప్పు చెయ్యనప్పుడు మీకే కాదు ఎవరికీ భయపడను. తప్పు చేస్తున్నాననిపిస్తే - ఇతరులకి కాదు, నాకు నేనే భయపతాను. నాకూ సొంత ఇల్లుంది. మీ ఇంటికన్నా పదిరెట్లు విలువగల ఇల్లు. కాని ఇలా ప్రవర్తించే మనస్తత్వం నాకు లేదు. మీకు నచ్చకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాను గానీ, విసిగించకుండా వెళ్ళిపొండి."
ఆమె వాగ్ధాటికి తట్టుకోలేక యింటావిడ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. కాని ఏ వ్యక్తీ తన పరాజయాన్ని ఒప్పుకోరు. అవమాన భారంతో ఆమె హృదయం వుడికిపోతోంది. ఈవేళ తాను గట్టిగా మాట్లాడలేకపోయింది. కాని వూరుకోకూడదు. ఏ మాత్రమవకాశం మొచ్చినా కించపరుస్తూ దెబ్బతియ్యాలి. అప్పటిదాకా తనకు మనశ్శాంతి లేదు. రకరకాల ప్లాన్ లు వేసుకుంటూ ఆమె రాత్రంతా నిద్రపోలేదు.
రాజహంస కూడా ఆలోచించుకుంటుంది. తానేమైనా అతిగా మాట్లాడానా అనుకుంది. ప్రస్తుతం ఆమె వున్న పరిస్థితి లో ఎవరు వేలెత్తి చూపించినా సహించే స్థితిలో లేను.
మనుషులు , ఇతర మనుషుల గురించి , ముఖ్యంగా ఆడవాళ్ళు ఇతర ఆడవాళ్ళ గురించి ఎందుకంత చుల్కనగా మాట్లాడతారో తెలీదు. ప్రతి స్త్రీ తను చాలా ప్రత్యేకమయిన దాన్నని ఏ కల్మషము లేనిదాన్ని అనుకుంటూ ఇతర స్త్రీల సమస్యల మీద అవగాహన లేకుండా, సానుభూతి లేకుండా మాట్లాడుతూ వుంటుంది. కొంతమంది ఆడవాళ్లుంటారు. అడుగులకు మడుగులోత్తుతూ ఎప్పటికేది కావాలో అది ఆనందంగా అమరుస్తూ హడలిచచ్చే మొగుళ్ళూ, కోరుకున్నప్పుడు పక్కమీద మొగుళ్ళతో కులుకుళ్ళూ అర్దికబలం.....ఒంటరి ఆడదాని బతుకు తీరు మీద కనీసపు అవగాహన లేక ఇష్టమొచ్చినట్లు పేలుతూ వుంటారు.
ఆమె మనసు సెగలు చిమ్ముతోంది.
* * *
చాలాకొద్ది రోజుల్లోనే రాజహంస ఈ ఇల్లు ఖాళీ చేసి సొంత ఇంటిలోకి వెళ్ళిపోయింది. ఏదో తప్పుచేసినట్లు ఈ ప్రపంచానికి భయపడుతూ ఎందుకు బతకాలి? సొంతయిల్లు పెట్టుకుని అద్దె ఇంట్లో మగ్గుతూ, ఆ అంక్షల్ని భరిస్తూ ఎందుకు లొంగి వుండాలి! తెలిసిన వాళ్ళు వస్తే వస్తారు, ఇబ్బంది పెట్టె ప్రశ్నలు వేస్తె వేస్తారు. రెండోసారి ఆ ప్రశ్న వెయ్యకుండా కటువుగా జవాబు చెబుతుంది. ఇరుగు పొరుగు వ్యంగ్యంగా అనుకుంటే అనుకుంటారు. ఎందుకు లెక్క చెయ్యాలి అసలు ఒక మనిషి ఇంకొకరి గురించి వ్యంగ్యంగా అనుకోని దెప్పుడు.
ఈ నిబ్బరం వచ్చాక అమెలోంచి కొన్ని భయాలు తొలగిపోయాయి.
భయంకరమయిన దిగులుంటుంది. హాలాహాలం వంటి దుఃఖముటుంది, భరించ శక్యం గాని బాధ వుంటుంది. కాని పిరికితనంతో కూడిన భయం మాత్రం లేదు.
23
దిలీప్ ఇరివరకటిలా ఆఫీసు పనులమీద ఆసక్తి చూపించటం లేదు.