Previous Page Next Page 
పెంకుటిల్లు పేజి 42


    "నువ్వే చెప్పు. పెళ్ళి ఇప్పుడు చేయాలని తలపెట్టటం సమంజసం అయిన విషయమే నంటావా?"

    రంగయ్య ఈసారి ఉత్సాహంగా "ఎందుకు కాదండీ" అన్నాడు.

    "అయితే శకుంతలమ్మగార్ని కూడా ఆవిడ అభిప్రాయం అడుగుదామనుకుంటున్నాను. అంతా ఆమె యిష్టం మీదనే అనుకో."

    రంగయ్య ముసిముసిగా నవ్వి "ఏమని అడుగుతారు?" అన్నాడు.

    ఈ ప్రశ్నకు జవాబు ప్రకాశరావు సులభంగా చెప్పవచ్చునని భావించాడు గాని, తీరా ప్రయత్నం ప్రారంభించాక అనుకున్నంత తేలిక కాదని తేలిపోయింది. కొంతసేపు సందిగ్ధంలోపడి 'మీరు ఎటువంటి వాళ్ళను పెళ్ళిచేసుకోదలిచారు?' అని అడుగుతాను అన్నాడు.

    రంగయ్య గంభీరంగా నవ్వి "అడగకూడని ప్రశ్న యిది. ఇలా అడిగితే అమ్మగారు ఏమని సమాధానం చెబుతారు?" అన్నాడు.

    వాడు ఇలా అంటూంటే ప్రకాశరావుకు ఒకందుకు నవ్వు వచ్చింది. మద్రాసులో ధనవంతుల ఇంట్లో పుట్టి  పెరిగిన శకుంతలకు నిన్న మొన్నటి దాకా ముక్కూ మొఖం తెలియని పరాయి వూరి అబ్బాయి ఒకడూ, ఇంట్లో పనిచేసేవాడు ఒకడూ పెళ్ళిపెద్దలు కావలసి వచ్చింది. ఆ నవ్వుతోపాటు విచారం కూడా కలిగింది.

    "అయితే ఏమని అడగమంటావో నువ్వే  చెప్పు" అన్నాడు ప్రకాశరావు అమాయకంగా.

    "ఏమి అడిగితే మాత్రం యేం సమాధానం చెబుతారు బాబుగారూ? అసలు అమ్మగారు యింకొకర్ని పెళ్ళి చేసుకోరు."

    "అసలు పెళ్ళే చేసుకోరా?"

    "అసలు చేసుకోరని నే ననన్నానా? ఇంకొకర్ని......... అంటే ఇంకొకర్ని" అంటూ వాడు నవ్వసాగాడు.

    ప్రకాశరావు చిరాకుగా "ఎందుకు నవ్వు? కాస్త నవ్వు ఆపి అసలు విషయం చెబుదూ" అన్నాడు.

    రంగయ్య ఈసారి నవ్వు ఆపి  గంభీరంగా "అమ్మగారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు బాబూ! నేను చెప్పేది  నిజం" అన్నాడు.

    ప్రకాశరావు స్థబ్దుడై కుర్చీకి అంటుకుపోయాడు. ఆ స్థితిలో చాలాసేపు వున్నాక తేరుకుంటూ "అబదం" అని అరిచాడు.

    రంగయ్య లేచి నిలబడి "అబద్ధమా!" అన్నాడు "మీకు తెలియదు. మీరు చాలా అమాయకలు. శకుంతలమ్మగారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు. నేనేం పోసుకోలు కబుర్లు చెప్పేవాడిని కాదు. మిమ్మల్ని తప్ప ఇంకోర్ని పెళ్ళికూడా చేసుకోరు. అమ్మగారి  స్వభావాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. ఇప్పటికైనా నిజం గ్రహించండి" అని ప్రకాశరావు "రంగయ్యా, రంగయ్యా" అని పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా తలుపులు తెరుచుకుని బయటకు వెళ్ళిపోయాడు.

    "ప్రపంచంలో ఎటువంటి వింతలు జరుగుతుంటాయి?" అనిపించింది ప్రకాశరావుకి. ఇదేమిటి విపరీతం? ఎంతటి అద్భుతమైన విషయాన్ని రంగయ్య నోటిగుండా తను యివాళ్ళ విన్నాడు! తను శకుంతలని యిప్పటికికూడా సరిగ్గా అర్థం చేసుకోని మాట నిజం. కాని అర్థం చేసుకోకపోవటంలో యింత ఘోరంగా పొరాబడ్డానా?

    సంతోషానికి బదులు అతని మనసంతా ఆందోళనతో నిండిపోయింది. ఏదో ఒక గొప్ప విషయం జరిగినట్లు భావించుకోక జరగకూడని విషయం యేదో జరిగిపోయినట్లు బాధపడసాగాడు.

    రంగయ్య చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజముందో తనకి తెలియదు. అనుక్షణమూ అనుమానిస్తూనే వున్నాడుకూడా. నిజంగానే తీసుకుని, దాన్ని గురించి లోతుగా ఆలోచించేటప్పుడు అతని అంతరంగం ఎగిరెగిరి పడసాగింది. ఒకదారిన యెంతపొడుగు ఆలోచించుకున్నా ఫరవాలేదు. కాని ఒకదారీ తెన్నూ లేకుండా వివిధ దిశలకు పోయి మనస్సును అరికట్టుకోవాలని ప్రయత్నించేందుకుకూడా ఆశక్తుడై అన్ని ఊహా బంధనాలను భరించకలే, ఒక అద్భుతమైన అవస్థలో అతను రెండు చేతుల్తో తలపట్టుకుని కూలబడి వున్నాడు.

    శకుంతల వచ్చి భోజనానికి పిలిచేవరకూ అతను అదేరీతిగా వున్నాడు. అప్పుడు ఉలుక్కుపడి లేచి ఆమె వెనక నిశ్శబ్దంగా నడిచాడు.

    భోజనాలయినంతసేపూ అతని పని చాలా అవస్థగా వుంది. తలయెత్తి ఆమె ముఖంలోకి చూడలేకపోయాడు. ఎప్పుడయినా చూసినా వింతగా, బెదిరిపోతున్నట్లుగా అదిరే కళ్ళతో చూసేవాడు. ఇతని ప్రవర్తన శకుంతలకూ ఆశ్చర్యమూ, సిగ్గూ రెండూ కలుగజేశాయి. ఎప్పుడూ చూడని విధంగా అతను తనవంక చూస్తూంటే ఆమెకు సిగ్గు వేయకుండా యెలా వుంటుంది?" అలా చూస్తారేం?" అని తెగించి అడుగుదామనుకుంది ఆమె. కాని ఆశక్తురాలై "ఇవాళ అలా వున్నారేం?" అని మాత్రం అడుగగలిగింది.

    "ఇవాళ మనస్సుని అరికట్ట లేకుండా వున్నాను" అని ఆమె వంక చూడటానికి భయపడుతూ. భోజనం చేయటంలో నిమగ్నమైనట్టు నటించసాగాడు.

    "అంత ఇది ఏం కలిగిందో?"

    "ఇది అంటే....." అని ప్రకాశరావు అడుగుదామనుకుని విఫలుడై వూరుకున్నాడు.

    "చూడండి, మీరైతే నాతో రారన్నమాట."

    "ఎక్కడికి?"

    "దేశయాత్రకు."

    "ఉహు ఎలా వచ్చేది? నేను త్వరగా మా యింటికి వెళ్ళిపోవాలి. అక్కడ  అంతా నా కోసం యెదురు చూస్తూంటారు."

    శకుంతల గట్టిగా నవ్వుతూ "ఏమంత తొందర? మీ అన్నగారిలాగే మీకూ పెళ్ళి స్థిరపడిందేమిటి?" అంది.

    ప్రకాశరావు అదిరిపడి ఆమె నాయనాల్లోకి చూశాడు. ఏమీ సఫలీకృతుడు కాలేక, సర్దుకుని భావయుక్తంగా చూస్తూ "మీ పెళ్ళికాకుండా నా పెళ్ళి యెన్నటికీ కాదు" అన్నాడు.

    అంత గట్టిగా నవ్వినా శకుంతల అమితమైన లజ్జతో తలవంచుకుని ఓరగా అతనివంక చూసింది: "భలేవారే" అంది తర్వాత చిన్నగా.

    ప్రకాశరావు ఆమెకి యివాళ చాలా నవీనంగా కనబడుతోంది. ఎన్నడూలేని శోభను ఇవాళ ఆమె వదనంలో చూడగలుగుతున్నాడు. అందులోనూ యిప్పుడు అతని కంటికి ఆమె మరీ నూతనంగా, తమాషాగా, సౌందర్యపు ముద్దగా కనబసాగింది.

    అతనికి సంభాషణ అంతటితో ఆపుచెయ్యటం యిష్టంలేదు. అదే విధంగా కొంతసేపు సాగాలని ఉత్సాహంగా వుంది.

    "అవును నేనసలు పెళ్ళి చేసుకుంటానో లేదో చెప్పలేను బీదవాడ్ని, నన్నెవరు చేసుకుంటారు?" అన్నాడు కొంచెం ఆగి.

    శకుంతల చాలా మామూలుగా "మీ అన్నగారు ధనవంతులా ఏమిటి?" అంది.

    "కాదు."

    "మరి ఆయనకెట్లా అయింది."

    "ఆయన అన్ని విధాల యోగ్యుడు. నేనో ...... మరి......" అంటూ భయంతో ఆగిపోయాడు. ఆక్షణంలో అతనికి తనమీద తనకే అసహ్యం వేసింది. సంభాషణ సరదాగా నడిపించబోయి ఈ చెడుదారి యెందుకు తొక్కానా అనుకున్నాడు. తన అసమర్థతకి తననే నిందించుకున్నాడు.

    శకుంతల కోపం తెచ్చుకున్నట్లు లేదు. "అయితే మీకు కులం పోయిందనేగా మీ భయం. ఏ కులం లేని పిల్లనో పెళ్ళిచేసుకోండి" అని చేయి కడుక్కునేందుకు అక్కడినుంచి లేచి వెళ్ళిపోయింది.

    ప్రకాశరావు క్షణంసేపు నిర్ఘాంతపోయాడు. ఆమెతో మాట్లాడటానికి అతనికి మనసు పోలేదు. కంచంలోనే చేయి కడిగేసి డాబామీదకు వెళ్ళిపోయాడు.

    చిక్కపోతున్న చంద్రుడు కళాహీనంగా క్రిందికి చూస్తున్నాడు. పిట్టగోడ దగ్గర నిల్చుని ప్రకాశరావు పైకి చూసి నిట్టూర్చాడు.

    "ఈ ఊరుకు ఎందుకు వచ్చానా అనిపించింది "ఈ  ఊరుకు యెందుకు వచ్చాను? ఈ యింట్లో యెందుకు అద్దెకు తీసుకున్నాను. శకుంతలతో యెందుకు పరిచయం అభివృద్ధి చేసుకొన్నాను?" అని పరితపించసాగాడు.

    ఆమె తనని ప్రేమిస్తుందని రంగయ్య చెప్పాడు. కానీ ఇన్నాళ్ళ నుంచీ ఆమె పట్లవున్న తన అభిప్రాయం ఏమిటి? ఏమిటి?

    ఉన్నట్లుండి అతను వొణికాడు మేను గగుర్పొడిచింది. తను ఆమెను ప్రేమిస్తున్నాడా? ఆమె అంటే వున్న ప్రేమ రోజురోజుకూ అభివృద్ది అవుతోందా?

    అతనికి మరో సందేహంకూడా తోచి భయకంపితుణ్ని చేసింది. "నేను ఆమె దగ్గర్నుంచి డబ్బు ఆశించానా?"

    ఈ మధ్య తనకు భాగ్యంమీద పుట్టిన వ్యామోహం. ధనవంతుల పట్ల కలిగిన అసూయ, బీదతనంపట్ల అవతరించిన యేహ్యతా, యిదంతా నిర్వివాదాంశం. శకుంతలమీద తనకున్న అభిప్రాయంలో తన స్వార్థం కూడా కొంత వుందా?

    రెండు చేతుల్తో గట్టిగా తలపట్టుకుని "లేదు, లేదు" అనుకున్నాడు "నాలో ఏ మాత్రం స్వార్థం లేదు" అనుకున్నాడు.

    కాని ఎంతసేపు గిజగిజలాడిపోయినా యీ ప్రేమకు పర్యవసానం యేమిటో బోధపడలేదు. తమ ఇంటి వాతావరణం, ఆ ఆచారాలు, కట్టుదిట్టాలు ఒక్కసారిగా అతని కళ్ళముందు తిరిగాయి. వీటన్నిటినీ ఛేదించుకుని అక్కడ తను ఎలా వొకస్థానం సంపాదిస్తాడు? స్థానం సంపాదించటం అంటే? తను అప్పుడే అంత లోతుగా?

    కానీ ఇంతసేపూ యిలా తనలో తాను మదనపడితే లాభంలేదని, కొంత చొరవ చూపించాల్సిన అవసరం వుందనీ ప్రకాశరావుకు అప్పుడు స్ఫురించింది.

    తన చుట్టూ వేసుకున్న కంచెను ఛేదించుకొంటూ అతను ముందుకు సాగిపోతున్నప్పుడు, ఒక్కసారి సింహావలోకనం చేసుకొనేసరికి అతను సిగ్గుపడి ఆగిపోయాడు.

    "ఇది జరగదు జరగదు" అనుకొన్నాడు.

    ఎలా జరుగుతుంది? ఇదే సంభవం అయితే మళ్ళీ తను ఆ యింట్లో అడుగు పెట్టటానికి అర్హుడుకాడు. అన్నగారి మనస్తత్వం తనకు తెలుసు. తనని సుతరామూ క్షమించడు. తన దగ్గర ఏమాత్రం సాయం ఆశించడు. ఆ యింట్లో కాలుపెట్లే యోగ్యత తనకు వుండదు. జీవితాంతం పరాయి ప్రదేశంలోనే దేశాలు తిరుగుతూనో గడపాల్సి వుంటుంది.

    అతని కళ్ళు చెమర్చాయి. ఈ వూహ కూడా అతనికి యేమాత్రం సమ్మతంగా లేదు. అలా గనుక జరిగితే తన మనసులో ఏ ఉద్దేశంవున్నా  బయటవాళ్ళకు ఒక్కటే ననిపిస్తుంది, "డబ్బుకోసం అమ్ముడుపోయాడని!" వాళ్ళకు శకుంతల కనబడదు. శకుంతల మనస్సులో వుండే లోతులు కనబడవు. త్రిశంకు నరకాన్ని కొత్తగా సృష్టించుకొంటె అందులో వున్నట్లుగా వుంది ప్రకాశరావుకు.

    ఏనాడో ఒకనాడు యీ భయంకరమైన ఉచ్చులో చిక్కుకుంటాడని అతనివన్నీ ఊహామాత్రమైనా అనుకోలేదు. ఉద్రేకం కోసం అటూ యిటూ తిరగసాగాడు. అతని మనసులో చెలరేగుతున్న వాదనలూ, ప్రతివాదనలూ క్రమక్రమంగా అంతరించిపోతూ చిన్నగా ఒకవైపుకి మ్రొగ్గసాగాయి. అన్నగారూ, తల్లీ, తండ్రి, కష్టాలు ఒక్కుమ్మడిగా విరుచుకుపడి జయించనారంభించాయి. లోకం ఎక్కడి స్వార్థం అనుకుంటుందోనని అంతరంగం భయపడసాగింది.

    ఇంతలో పెనుచీకటిలా అతనిలో వొకప్రశ్న ఎదురయింది.

    "అసలు యిదంతా ఎందుకనుకోవాలి తను?"

    శకుంతల తనని ప్రేమిస్తోందని ఈనాటివరకూ తనకు తెలియదు.

    రేపో ఎల్లుండో యిక్కడ్నుంచి వెళ్ళిపోయేవాడు తను. తనంతట తాను యెప్పుడూ బయటపడలేదు. ఆమె అభిలాష యేమిటో తనకు తెలియదు. ఇన్నాళ్ళ బట్టి ఎలాగూ జరిగిపోలేదా? యిప్పుడూ అలాగే జరిగిపోతుంది. పరిస్థితులు మరీ అంత తీవ్రంగా ఎదురైననాడు అంతస్సంఘర్షణ చెలరేగి తన అంతరాత్మే యే విషయమూ నిర్ణయిస్తుంది. అంతే కాదు, అభిప్రాయలు తనవింకా బలపడలేదు. ఈలోగానే యేదోవొకటి ఆమెకు న్యాయంచేసి యిక్కడ్నుంచి వెళ్ళిపోతే తుఫానులోంచి బయటపడినట్లు అవుతాడు.

 Previous Page Next Page