ప్రియురాలి స్తనాల వత్తిడి పాదాలకు కూడా ప్రకంపనం కలిగించినట్టు అతని పాదాల్లో సన్నటి జెర్క్ ఆమె రోదన కెరటంలా అతని మెదడుకు చేరుతూనే వుంది.
మెల్లగా కళ్ళు తెరిచాడు. ముందంతా ఎరుపు, తరువాత చీకటి నలుపు, ఆ తరువాత ప్రియురాలి ముఖం తెలుసు అతని కళ్ళముందు కొద్దిక్షణాలు ఇంద్రధనస్సులా కదలాడింది.
ప్రియురాలి స్పర్శ అతనికి నూతనోత్తేజాన్ని ఇచ్చింది. అతికష్టంమీద మెడనుంచి తాడుతీసి క్రిందకి చూసాడు. కొద్ది నిమిషాల ముందు తనని అసహ్యంచుకున్న సిరి తిరిగి తనని పునరుజ్జీవితుడ్ని చేస్తున్నట్టు..... శూన్యంలో కలిసిపోబోతున్న ప్రాణవాయువును గుప్పిట్లో బంధించి, తనలో ప్రవేశపెడుతున్న ఫీలింగ్.
అతను కళ్ళు తెరవడం చూడగానే ఆమెలో ఆనందం తరంగమై.....అతని కాళ్ళని మెల్లగా జార్చింది.
దినకరుడు సంధ్యలో మెల్లమెల్లగా ఎలా కొండల్లోకి జారిపోతాడో, అతడలా ఆమె తనూ శిఖరాన్ని అంటిపెట్టుకొని కిందకి జారసాగాడు.
అక్కడ గాలికూడా పక్కకి తొలిగి ఆ తనువుల మధ్య దగ్గరితనాన్ని సృష్టంచింది. అతని చేతులు అప్రయత్నంగా ఆమె భుజంపై నుండి జారుతూ ఆమె నడుము వంపులో ఆగిపోయాయి. అతని పాదాలు పూర్తిగా నేలను తాకాయి.
వక్షమూ.... వక్షోజమూ.......నేస్తాలయ్యాయి.
నిరీక్షణకు మించినదేదో రక్షణకవచంలా ఆమెని కప్పేసింది.
అతను అన్నీ మరచిపోయాడు. అక్కడ మనసుకూ......మనసుకూ మధ్య తెర తొలిగింది. ఆ ఆనందలో అతనికి తప్పూ, ఒప్పూ గుర్తుకురాలేదు. ఎన్నో కలల తాలూకు శారీరక స్పర్శ లభించిన క్షణం......అతను ఒక మామూలు మనిషే అయ్యాడు.
కేవలం క్షణమే!
* * *
సరిగ్గా అదే క్షణంలో సోఫాలో పడివున్న రవితేజ స్పృహలోకి వచ్చాడు. ఎదురుగా మసక చీకటిలో రెండు మేఘాలు పెనవేసుకున్న దృశ్యం కనిపించింది. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా చీకటి తొలగి ఆ దృశ్యం స్పష్టమయింది.
ఎక్కడో పిడుగు పడింది.
కళ్ళముందు వరుసగా మెరుపులు.
అంతా అపనమ్మకపు చీకటి.
ఆ తరువాత 'నమ్మాల్సిన' వెలుగు.
అతను కళ్ళు నలుముకుని మరీ చూసాడు. తన భార్య 'అతని' కౌగిలిలో వుండటమే అతన్ని షాక్ కు గురిచేసిందనుకుంటే- 'అతను' శ్రీవాణి భర్త అవడం మరింత డీప్ షాక్ లోకి వెళ్ళిపోయేలా చేసింది.
అది కొద్దిసేపే.
అతని మస్తిష్కం వేగంగా ఆలోచించసాగింది. అంటే.... అంటే మహర్షి తనవెంట నీడలా వుండి పగ తీర్చుకోవడానికి అనువైన సమయంకోసం ఎదురు చూస్తున్నాడన్న మాట.....లేక అతని భార్యని తను అనుభవించాడని..... తన భార్యని అతను.....
అతనింక ఆపైన ఆలోచించలేకపోయాడు.
తన భార్య క్లాస్ మేట్ అయిన మహర్షి తమ దగ్గిర నౌఖరుగా ఎందుకు చేరాడా- అని ఇంతకాలం వుండిన అనుమానానికి ఇపుడు స్పష్టమైన కారణం దొరికింది.
అంతేకాదు-
తనకి కళ్ళువచ్చిన మరుక్షణం తను మహర్షిని అరెస్ట్ చేయాలి. చేస్తే .......శ్రీవాణికీ తనకీ వున్న సంబంధం సిరిచందనకి తెలుస్తుంది. క్షణాల్లో ఇన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు రవి.
అక్కడ గదిలో-
ఆ ఇద్దరిలో ముందుగా తేరుకున్నది సిరిచందన.
చప్పున ఆమె మహర్షి కౌగిలినుండి దూరంగా జరిగి భర్త గుర్తుకు వచ్చినట్టు సోఫావేపు పరిగెత్తింది.
ఆమె దూరమవడంతోకల చెదిరినట్టుగా మహర్షి తమయత్వ భావనలోంచి మేల్కొన్నాడు. ఎదురుగా రామరాజు స్పృహ లేకుండా వున్నాడు. అతను వెళ్ళి కుదుపుతూ "రామారాజూ!" అంటూ పిలిచాడు. కొద్దిసేపటికి రామరాజు కళ్ళు తెరిచాడు. ఎదురుగా మహర్షి కనిపించేసరికి "దొరా మీకేమీ కాలేదు కదా" అంటూ చప్పున లేచి కూర్చున్నాడు. మహర్షి మామూలుగా వుండటం గమనించి అతని మనసు తేలికయింది.
ఈలోపు హాల్లోకి వెళ్ళిన సిరి, "ఏవండీ, మీకెలా వుంది?" కంగారుగా రవితేజ భుజం పట్టుకుని కుదుపుతూ ప్రశ్నించసాగింది.
"నాకేమీ కనిపించడంలేదు సిరీ" అన్నాడు రవితేజ.
"అయ్యో, కనిపించడం లేదా" సిరిముఖంలో ఒక్కసారిగా నిరాశా మేఘం ఆవరించింది.
రామరాజు వేపు తిరిగి చూస్తూ "ఎక్కడయినా ఏదయినా లోపం జరిగిందా?" అని అడిగాడు మహర్షి.
"లేదు దొరా. సేయల్సిందంతా సేసేశాం గదా. మందు దేనికని పనిసేసుండదో అర్థంకావడంలేదు" అన్నాడు సాలోచనగా రవి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ.
సిరిచందనకు దుఃఖం ఉప్పెనలా వచ్చింది.
భర్త అంధత్వం పోగొట్టడానికి మూలికావైద్యం వుంది అని తెలిసిన మరుక్షణం నుంచీ, ఆమె తేజాకి తిరిగి కళ్ళు వస్తాయని పూర్తి నమ్మకంతో వుంది. ఇప్పుడు ఆ నమ్మకం నిలువునా కరిగిపోవడంతో ఆమె హతాశురాలైంది. చాలాసేపు వరకు దుఃఖిస్తూనే వుంది.
రవితేజ ఆమెని అనునయిస్తున్నట్టు "ఊరుకో సిరీ! నా జన్మకింతే అని సరిపెట్టుకుంటాను" అన్నాడు.
ఆమె అతడివైపు తిరిగి "లేదు. మీకు తిరిగి కళ్ళు వస్తాయని నాకెందుకో నమ్మకంగా వుంది" అంది దృఢంగా.
"నాకు కళ్ళు లేకపోతేనేం.... ? నువ్వూ, మహర్షి నాకు రెండు కళ్ళుగా ఉన్నంతకాలం నాకేం ఫరవాలేదు."
మహర్షి క్షమాపణ చెప్పుకుంటున్నట్టు "సారీ తేజా! ఈ మందు పని చేస్తుందనుకున్నాను. కానీ ఇలా అవుతుందనుకోలేదు. అయామ్ రియల్లీ సారీ" అన్నాడు.
"నువ్వేం ఫీలవకు! నీ ప్రయత్నం నువ్వు చేశావు. ఎవరు మాత్రం అంతకన్నా ఇంకేం చేయగలరు? ఇంకీ విషయం మరచిపోదాం" అన్నాడు రవితేజ.
రామరాజు చేతులు జోడించి నమస్కరిస్తూ "నేను వెళ్ళొస్తాను బాబుగారు! మీరు నన్ను క్షమించండి. అనవసరంగా ఆశలు కల్పించాను" అని అక్కడినుంచి కదిలాడు.
మహర్షి అతడితోపాటు బయటికి వస్తూండగా సిరిచందన కూడా లేచి నిలబడి భర్తతో "ఇప్పుడే వస్తాను" అని తనుకూడా వాళ్ళతో గెస్ట్ హౌస్ నుంచి బయటికి వచ్చింది.
మహర్షితో "నువ్వు కారు తియ్యి. రామరాజుని వాళ్ళ పల్లెవరకూ దింపి వద్దువు గాని" అంది.
"అవసరం లేదమ్మా. నేను బస్ లో వెళ్ళిపోతాను" అన్నాడు రామరాజు. అతడి కిప్పటికే చాలా మొహమాటంగా వుంది. అనవసరంగా ఆ దంపతులకి లేనిపోని ఆశలు కల్పించి విఫలమయ్యానని.
సిరిచందన మహర్షి వేపు చూస్తూ 'కారు తీసుకురా' అన్నట్టు తలూపింది. మహర్షి షెడ్ వేపు వెళ్ళాడు. ఆమె రామరాజుతో "మా కోసం ఇంతచేసిన వాడివి. నిన్ను కనీసం మీ ఊరువైపు దింపటం మా బాధ్యత" అంది. రామరాజు తలవంచుకున్నాడు. సిరిచందన తలతిప్పి చూసింది. మహర్షి షెడ్ తలుపులు తీస్తున్నాడు. అతనికి మాటలు వినబడవని నిశ్చయించుకున్న తరువాత రామరాజుతో "ఏమిటి రామరాజూ నువ్వు చెప్పదలచుకున్న విషయం?" అనడిగింది. రామరాజు అర్థంకానట్టు "ఏమిటమ్మా, ఏ విషయం?" అన్నాడు.
"అదే, నా భర్తకి మీరిచ్చిన మందువల్ల ప్రాణం పోయిందేమోనని నేను భయపడుతున్న సమయంలో నువ్వేదో చెప్పబోయి ఆగిపోయావు. ఏమిటా విషయం?" అంది సూటిగా.
రామరాజుతడబడి "అబ్బే, అదేం లేదమ్మా" అన్నాడు.
"లేడు చెప్పాలి".
"వదిలేయండమ్మా, మహర్షిబాబు ప్రాణాలు తీసుకుంటున్నాడన్న తొందర్లో ఏదో మాట జారాను."
"చెప్పకపోతే నా మీద ఒట్టు. మీ దేవుడిమీద ప్రమాణం అంటే చాలా నమ్మకం. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు.
ఇక చెప్పక తప్పదన్నట్టు "మాతో పాటు మహర్షి బాబు వస్తూ వుండగా ఆయన్ని పొడలపాము కాటేసిందమ్మా. నేను ఆకు పసిరలు ఉపయోగించి అతనికి తెలివి తెప్పించాను. అయితే...." సందిగ్ధంగా ఆపుచేశాడు.
"అయితే- అయితే ఏమవుతుంది?" కంగారుగా అడిగింది.
"నెమ్మదిమీద ఒళ్ళంతా పొలుసులు, పొలుసులుగా సెర్మం వూడుతుందమ్మా' చెప్పలేక చెపుతున్నట్టు చెప్పాడు.
"అయితే.....అయితే దానికి మందే లేదా?"
"ఉందమ్మా నీ భర్త కళ్ళలో పోసిన అమృతమే మహర్షి బాబుకి ఇవ్వాలి. నేను ఇపుడు తెచ్చిన మందుని ఆ బాబునే వాడమని చెప్పాను. కానీ అది మీ ఆయన కోసం అని,నేనెంత చెప్పినా వినకుండా తీసుకొచ్చాడు"
సిరిచందన కదిలిపోయింది.
ఆమె కళ్ళు ఆర్ద్రమయ్యాయి.
మనిషి నిలువెల్లా వణికి పోయింది.
కేవలం రవితేజ తన భర్త అయిన కారణంగా తన ప్రాణాలని కూడా బలిపెట్టి అతడా మందు తీసుకువచ్చాడని తెలిసింతరువాత ఆమెకి మహర్షి పట్ల అభిమానం రెట్టింపయింది. ఆ మందు పనిచేయనీ, చేయకపోనీ- అది వేరే విషయం. కానీ అతడు మాత్రం త్యాగానికి పరాకాష్ట అయ్యాడు.
దూరంనుంచి మహర్షి కారు తీసుకువస్తున్న శబ్దం వినిపించింది. రామరాజు అన్నాడు. "......మళ్ళీ చంద్రగ్రహణం నాటికి మహర్షి బాబుకి ఏ ప్రమాదం జరగకపోతే, అప్పటికి ఎలాగైనా సరే, నేనా మూలిక తిరిగి సంపాదిస్తానమ్మా ఎక్కడన్నా మహర్షిబాబుగారికి ఆ మందిస్తాను. అది తప్పకుండా ఫలితం చూపిస్తుంది.....కానీ, మళ్ళీ చంద్రగ్రహణం వచ్చేనాటికి మహర్షిబాబు ఆ విషం బారిన పడకుండా వుండాలి. అలా పడకుండా వుండాలనే నేను కొనకి వెళ్ళగానే వేల్పుకి పూజలు చేయిస్తానమ్మా. కొనమొత్తంచేతా పూజ చేయిస్తాను" అని నమస్కరించి కారు దగ్గిరకి వెళ్ళిపోయాడు.
7
ఉదయం అయిదున్నర అవుతుండగా బెడ్ రూమ్ తలుపు కొడుతున్న శబ్దం వినిపించి మెలకువ వచ్చింది రావితేజకి. 'ఇంత ప్రొద్దుటే ఎవరు వచ్చి వుంటారు' అనుకుంటూ తన భార్యని లేపాడు.
సిరిచందన బద్ధకంగా లేచి కూర్చుంటూ "ఏమిటండీ?" అని అడిగింది.
"ఎవరో తలుపు కొడుతున్నారు వెళ్ళి చూడు" అన్నాడు.