Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 38


    "నాకేం తెలుసు?"

    "రెండొందల పాతిక."

    "అంత ఖరీదా ?!"

    "అవును! ఎందుక్కొన్నానో తెలుసా?"

    చలపతి కామె వ్యవహారం ఏమీ నచ్చలేదు. తాసిల్దారుగారు ఈ మాటలు వింటే ఏమనుకొంటారు? చదువు చెప్పమంటే అమ్మాయి కట్టుకున్న చీర గురించి చెపుతున్నాడు 'వీడు' అనుకొంటారు.

    "బహుశా కట్టుకోవడానికే కొన్నారనుకొంటాను." చిలిపిగా అన్నాడు చలపతి.

    కిలకిల నవ్వేసింది రెహానా.

    "లేకపోతే ఇంకెందుకు? నేనడిగేది అదికాదు - ఈవేళ నా పుట్టిన్రోజని నాన్నగారు కొనిపెట్టారు."

    "అదా సంగతి! ఇంతకూ ఈ వేళ మీ పుట్టిన్రోజన్నమాట! మరి ఆ పండుగ జరుపుకోలేదా?"

    "అట్టహాసంగా చేయడం నాన్నగారికిష్టం ఉండదు. అంతా సింపుల్. కొత్త బట్టలేసుకోవడం, మమ్మీ తయారు చేసే మాంచి స్వీట్లూ, హాట్లూ తినెయ్యడం - ఇంతే ప్రోగ్రామ్."

    "బాగుంది. ఎనీహౌ మీరు ఇలాంటి అందమయిన పుట్టినరోజులు ఓ వంద జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక పాఠం మొదలెడదామా?"

    "మీరా పాఠం గొడవ వదిలేట్లు లేరే! ఈ వేళ అన్నీ బంద్!"

    "ఎందుకని?"  

    "నేను ఇప్పుడు ఫస్ట్ షో సినిమాకి వెళుతున్నాను.

    "ఓహో! అలాగయితే వెళ్ళండి మరి.

    "అప్పుడేనా? నాన్నగారు జీపు పంపిస్తానన్నారు. ఒక్కర్తెనూ ఎలా వెళ్ళడమా అని మా క్లాస్ మేట్ సుభద్రని రమ్మన్నాను. అది ఇంతవరకూ రానేలేదు." నవ్వుతూ అంది రెహానా.

    చలపతికి ఆమె ఇదంతా తనకెందుకు చెపుతూందో లీలగా అర్థమయింది.

    "మరి నే వెళతాను" అన్నాడు లేచి నించుని.

    "అయ్యయ్యో! అంత తొందరేం? నేను వెళ్ళేది బృందావన్ టాకీస్ కే లెండి? దగ్గరే! ఇంకా చాలా టైముంది. ఈలోగా మీరు స్వీట్ తీసుకోరూ?" అంటూ లోపలకు నడిచింది.

    గత్యంతరం లేక కూర్చుండిపోయాడు చలపతి.

    రెండు ప్లేట్లనిండా స్వీటూ, హాటూ తీసుకొచ్చి అతనిముందుంచిందామె.

    "ఇన్నా?" అడిగాడు చలపతి.

    "ఇంకా చాలా ఇద్దును- మీరు గాబరా పడకపోతే" గట్టిగా నవ్వేస్తూ అంది. చలపతికి మాట్లాడడానికి భయంగా ఉంది. త్వరత్వరగా తినడం ముగించి, టీ తాగి బయటపడ్డాడు.

    "పాఠం చెప్పలేదని దిగులు పెట్టుకోకండి! రేపు రెండు చెబుదురు గాని." గేటు వరకూ వచ్చి నవ్వుతూ అంది మెల్లిగా.

    రాను రాను అతనితో చనువును పెంచుకొంటూ వచ్చింది రెహానా. పాఠాలకంటే ఏవేవో మాటలు ఎక్కువసేపు చెప్పడం అలవాటయి పోయింది. ఒకో రోజు అసలు పాఠం చెప్పనిచ్చేది కాదు.

    "నిన్న రిలీజయిన హిందీ సినిమా చూశారా?" అనడిగేది.

    'లేదు అనంటే - ఎందుకని? హిందీ రాదనా? నన్ను తీసుకెళ్ళండి- ట్రాన్స్ లేట్ చేసి చెబుతుంటాను" అనేది నవ్వుతూ. 

    చలపతి ఏం మాట్లాడాలో తెలియక వూరుకుండిపోయేవాడు.

    నెలరోజులు అలా గడిచిపోయినాయి. తనకు తెలీకుండానే ఆమెను ఒక్కరోజయినా చూడకుండా ఉండలేని స్థితికి వచ్చేశాడు చలపతి.

    సాయంత్ర మెప్పుడవుతుందా, ఎప్పుడు ఆమె కనబడుతుందా అని మనసులో ఆరాటంగా ఉండేది.

    ఓ రోజు మధ్యాహ్నం పోస్ట్ లో బొంబాయిలోని ఓ కంపెనీ నుంచి అపాయింట్ మెంట్ ఆర్డర్ వచ్చింది. ఆ ఉద్యోగానికి అప్లైచేసి చాలా కాలమయిపోయింది. ఇంటర్ వ్యూ కూడా అయింది.

    సంతోషంతో ఉక్కిరిబిక్కిరయాడు చలపతి. ఆ రాత్రికే బయలుదేరడానికి నిశ్చయించుకొన్నాడు. వెంటనే తాలూకా ఆఫీస్ కి వెళ్ళి తాసిల్దారుగారి కీ సంగతి తెలియజేశాడు"

    "కంగ్రాచ్చులేషన్స్! చాలా మంచి కంపెనీ అది. వెంటనే చేరిపోవడం మంచిది" అన్నారాయన.

    "సారీ, సార్. రెహానా ఎగ్జామిన్స్ వరకూ ఉండనందుకు" అన్నాడు చలపతి.

    "దట్సాల్ రైట్- ఈ నెల రోజుల్లోనే చాలా ఇంప్రూవ్ అయింది రెహానా! సాయంత్రం ఓసారి ఇంటికొస్తావూ?"

    "అలాగేనండీ."

    ఫ్రెండ్సందరితో తన ఉద్యోగం గురించి చాటింపు వేసి సాయంత్రం చీకటి పడుతూండగా తాసిల్దారుగారి ఇల్లు చేరుకున్నాడు చలపతి.

    సోఫాలో కూర్చుని, "రెహానా" అంటూ పిలిచాడు.

    "వస్తున్నానండీ! ఒక్క నిమిషం" లోపలనుంచే అంది రెహానా.

    పది నిమిషాల తరువాత కర్టెన్ తొలగించుకొని వచ్చిందామె.

    ఆమెను చూస్తూనే ఉలిక్కిపడ్డాడు చలపతి. వాడిపోయిన ముఖం, దిగులు కమ్ముకొన్న కళ్లు- జబ్బుపడి లేచిన మనిషిలా కనబడుతూంది. అతని కెదురుగా కూర్చుని తలవంచుకొని కిందకు చూడసాగింది.

    "ఈవేళ నుంచీ పాఠాలు లేవు" అన్నాడు చలపతి నవ్వు తెచ్చి పెట్టుకొంటూ.

    తలెత్తి అతని కళ్ళలోకి చూసింది రెహానా.

    "నాన్నగారు చెప్పారు" అంది బాధగా.

    చలపతికి ఆమె కనిపించటం లేదు. కళ్ళ నిండుగా నీళ్ళు కమ్మేసినాయి. కర్ఛీప్ తీసి ముఖం తుడిచేసుకున్నాడు.

    కొద్ది క్షణాలు మౌనంగా గడిచిపోయాయ్. ఇక నుంచీ రెహానా తనకు కనిపించదన్న నిజం గుండెల్ని కలిచివేస్తోంది.

    "ఆఖరి రోజు! కాసేపు సరదాగా మాట్లాడకూడదూ?" అన్నాడు గొంతు పెగల్చుకొని.

    ఛివాలున తల ఎత్తి అతనివంక చూసింది రెహానా! ఆమె కళ్ళ నిండా నీళ్ళు నిలిచి ఉన్నాయి.

    "నేను వెళ్తానిక!" అన్నాడు మరోవేపు చూపు మరలుస్తూ.

    "ఒక్క నిమిషం.. ఛాయ్ తీసుకొస్తాను" నెమ్మదిగా నడిచి లోపలకు వెళ్ళింది. అయిదు నిమిషాల తరువాత ఓ కప్పునిండా టీ తీసుకొచ్చి అతనిముందు ఉంచింది.

    తాగి కప్పు టీపాయ్ మీద ఉంచాడు చలపతి.

    "మీ చెయ్యి ఇలా ఇవ్వండి" అంది నెమ్మదిగా.

    "జ్యోతిష్యం చెప్తావా?" అన్నాడు నవ్వి చేయి జాపుతూ.

    గుప్పిట్లంచి మల్లెమొగ్గలతో చుట్టి తయారుచేసిన ఓ ఉంగరం తీసి అతని వేలికి తొడిగిందామె.

    "రెహానా! ఇలా చేయచ్చా? దీని అర్థం ఏమిటో నీకు తెలుసా?" అన్నాడు చలపతి భయంగా.

    రెహానా జవాబు చెప్పలేదు. 'నమస్తే' అని చేతులు జోడించి లోపలకు వెళ్ళిపోయింది. కొద్ది సేపటి తరువాత తహసిల్దారుగారు వచ్చి ఓ కవరు చలపతి కందించారు.

    "ఈ నెలరోజులకీ ఫీజిది" అన్నారు నవ్వుతూ.

    ఆ రాత్రే చలపతి ఈ ఊరు వదిలేశాడు. సంవత్సరం తరువాత తిరిగి ఆ ఊరు వచ్చినప్పుడు ఆ తహసిల్దారు గారి గురించి వాకబు చేశాడతను.  

    ఆయన భార్యకు అనారోగ్యం మూలాన ఆరు నెలలు సెలవుపెట్టి ఊటీ వెళ్ళారట. ఆ తరువాత ఎక్కడికి ట్రాన్స్ ఫరయిందో తెలియదు.

    బాంక్ చేరుకొన్నాడు చలపతి. అయిదవడానికి మరో అయిదు నిమిషాలు మాత్రముంది. గేటు దగ్గరే నించుంటే ఏ క్షణాన్నయినా రెహానా బయటకు రావచ్చు. నిలబడి సిగరెట్ వెలిగించాడు. రెహానా ఇంకా కన్యేనా- లేక పెళ్ళయిందా? ఆ ప్రేమ ఇప్పటికి ఇంకా అలాగే ఉంటుందా?

    ఒక్కొక్కరే బ్యాంక్ ఉద్యోగులు బయటికొస్తున్నారు. మరికొంచెం సేపట్లో దూరంగా చెట్లమద్య నుంచి రెహానా మరో అమ్మాయితో కలిసివస్తూ కనిపించింది. గుండెలు విపరీతమయిన వేగంతో కొట్టుకోసాగింది చలపతికి. మనసంతా ఓ విధమైన ఆనందంతో నిండిపోయింది. తదేకంగా, తన్మయత్వంతో ఆమెవంకే చూస్తూండిపోయాడు. పరిసరాలుకూడా గుర్తులేకుండా పోయినాయి. తనూ, రెహానా! అంతే! ఇంక ఏమీ కనిపించటం లేదు. దగ్గరగా వచ్చేసింది రెహానా! ఇంకొద్ది క్షణాల్లో తనను చూస్తుంది. హఠాత్తుగా అతనిలో ఆలోచనలు విద్యుత్తులా ప్రవహించాయ్.

    'ప్రతి మనిషికీ కొన్ని తీయని అనుభూతులూ, అనుభవాలూ ఉంటాయి. రెహానాకూ, తనకూ తాము గడిపిన నెలరోజులూ తీయని అనుభూతి. జీవితమంతా ఆ అనుభూతి ఇద్దరిలోనూ కదులుతూనే ఉంటుంది. తనిప్పుడు రెహానాను కలుసుకుంటే ఇద్దరూ సంతోషిస్తారు. మాట్లాడుకొంటారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకొంటారు. మర్నాడు తనెలాగూ బొంబాయి వెళ్ళిపోతాడు. అంతే! అక్కడితో ఇద్దరిలోనూ ఆ తీయని అనుభూతి నశించిపోతుంది. ఇద్దరకూ బాంక్ దగ్గర కలుసుకొని మాట్లాడిన దృశ్యమే గుర్తుకొస్తుంది. కాని, తన వెలికి ఆమె కన్నీళ్ళతో మల్లెమొగ్గల ఉంగరం తొడిగిన దృశ్యం గుర్తుకి రాదు. అందుచేత ఆ అనుభూతికి తను దూరమయి, రెహానాని దూరం చేయకూడదు...'

    ఛటుక్కున వెనక్కి తిరిగి వేగంగా అడుగులు వేస్తూ జన సమూహంలో కలిసిపోయాడు చలపతి.   

                                     * * * * *       

 Previous Page Next Page