"అయినా ఫోర్ సెప్స్ ఎందుకు?" అన్న ఆ అమ్మాయి మాటలకి ఈ లోకంలోకి వచ్చి, "బులెట్స్ బయటికి తీయాలి" అన్నాడు.
"బులెట్స్..........?"
"అవును భుజంలో ఒకటి- కాలిలో ఒకటి ఉన్నాయి-"
"మై..." ఆ అమ్మాయి వూపిరి పీల్చటం కూడా మానేసి స్థాణువైంది.
"ఎ... ఎవరునువ్వ్... మీ... మీరు" కళ్ళు పెద్దవిచేసి అడిగింది.
"బందిపోటు విక్రమ్ సింగ్ తెలుసా"
"ఊహూ"
"అతడి ప్రథమ అనుచరుణ్ని"
జానకీరాముడు అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు.
చల్లగాలికీ, తీసుకున్న విశ్రాంతికి, అతడొకొ కొద్దిగా సత్తువచేకూరినట్టయింది. శరీరంలోంచి వాటిని బయటకు తీయనిదే నడవడం కష్టం అని గ్రహించాడు. వత్తిగిలి కూర్చుని "నీ దగ్గిర అగ్గిపెట్టె ఉందా" అని అడిగాడు! జానకీరాముడు పెట్టెతీసి ఇచ్చాడు. అతడు జేబులోంచి పెన్ నైఫ్ తీసి, నాలుగైదు ఎండు పుల్లలు దగ్గిర చేర్చి, వాటిని మంటపెట్టి కత్తి బాగా వేడెక్కాక, కాలి దగ్గర పాంటు చింపి గాయాన్ని తుడిచాడు.
అప్పటివరకూ నిశ్శబ్దంగా చూస్తున్న ఆ అమ్మాయి ఈ లోకంలోకి వచ్చినట్లు చప్పున ముందుకువంగి, "నేను చేస్తాను" అంది. అతడికి ఆశ్చర్యం కలిగింది. ఈ కత్తి కాల్చటాలూ, రఫ్ నెస్సూ చూసి మరింత భయపడటం జరుగుతుంది అనుకున్నాడు. అతడి అంచనా తప్పయింది. ఆమె జానకిరాముడు వైపు తిరిగి "పాకలో బ్యాండేజ్, టించర్ వుంటాయి తీసుకురా" అంది. "తొందరగా రా!" అతడు తలూపి వెళ్లాడు.
"అసలే ఉప్పునీళ్ళు! తొందరగా సెప్టిక్ అవుతుంది" అంది.
అతడు మాట్లాడలేదు.
"బులెట్ చాలా లోతుగా దిగబడింది. తీసేసరికి రక్తం బాగారావొచ్చు. బ్యాండేజి దగ్గరుంటే మంచిది" అందుకే అతడిని పంపించినట్టు అంది.
"ఈ వూళ్ళో ఆస్పత్రి లేదా?" అన్నాడు.
"ఆస్పత్రా? ఇంకా నయం. స్కూలే లేదు. ఓ పది మందిని చేర్చి చెట్టు క్రింద నేనే పాఠాలు చెప్తూంటాను. అంతే. చాలా చిన్న పల్లె ఇది". మళ్ళీ ఎండు కర్రలు దగ్గిర చేర్చి కత్తిని కాలుస్తూ అన్నది "చాలా బాధకలిగిస్తుంది, ఓర్చుకోవాలి".
నాకు తెలుసు అనుకున్నాడు.
"మామూలు పరిస్థితుల్లో అయితే ఇది చాలా అపాయకరం. కానీ ఇక్కడ పది కిలోమీటర్లవరకూ డాక్టరు అన్నవాడు లేడు. అతడుకూడా యం.బి.బి.యస్. కాదు, ఆర్.యమ్.పి".
"పర్లేదు, అతడొచ్చినా చేసేపని ఇదే" ఆమె చేసే పనిని చూడకుండా మొహం పక్కకి తిప్పుకుంటూ అన్నాడు.
కత్తిని గాయం దగ్గిర చేరుస్తూ అంది "కళ్ళు మూసుకో".
మాట్లాడుతూ వుంటే బాధ తెలీదు కాబట్టి- "నీ పేరు చెప్పలేదు" అని అడిగాడు మాటలు కొనసాగిస్తూ-
"సుమతి"
చప్పున అతడు కళ్ళువిప్పి చూసేడు, సుమతి!!! సరీగ్గా అతుక్కుపోయే పేరు.
గాయం దగ్గిర ఆమె వేళ్ళు పనిచేస్తూన్న తీరుని చూసి అతడు ఆశ్చర్యపోయాడు. కర్తవ్యం వచ్చేసరికి ఆమెలో బెరుకుగానీ జంకుగానీ లేవు. చకచకా చేసుకుపోతూంది.
"ఎంతమంది వుంటారు మీ స్కూల్లో?"
"స్కూలు కాదన్నాగా. నేనే పాతిక- ఇరవైమందికి ఓ చెట్టు క్రింద పాఠాలు చెపుతూ వుంటాను".
"మరిజీతం?"
"కొంత మంది డబ్బు ఇస్తారు. కొంతమంది పప్పుధాన్యాలు..."
"సరిపోతుందా?"
"ఆ బొటాబొటీగా"
"ఏం చదువుకున్నావు సుమతీ నువ్వు?"
"యం.బి.బి.యస్. ఫైనలియర్ చదువుతూ మానేశాను".
ఎంతటి విషయాన్నైనా చాలా మామూలుగా, కోల్డ్ బ్లడెడ్ గా తీసుకునే అతడు, ఆ మాటలకి విచలితుడయ్యాడు.
"ఎమ్.... ఎమ్బీ. బి.యస్". అని తడబడ్డాడు.
"అవును. ఏం!"
"మరి ఇలా పల్లెకొచ్చి పాఠాలు చెప్పుకోవటం ఏమిటి?"
"అదంతా పెద్ద కథ"
"ఏమిటి?"
ఆమె కొంచెం సేపు వూరుకొని, అతడి గాయాన్ని మరింత పరిశీలనగా చూస్తూ చెప్పసాగింది.
"మా నాన్నగారు సీనియర్ అయ్యేయస్ ఆఫీసరు... జలంధర్ లో వుండేవాళ్ళం... కొత్తగా వచ్చిన ఐ.ఎ.యస్. వాళ్ళకి అక్కడ ట్రెయినింగ్ ఇవ్వబడుతూ వుంటుంది. తెలుసా?".
అతడు తలూపాడు.
"అందులో ఒక ట్రెయినీ ఒక లేడీ ఆఫీసర్ మీద అత్యాచారం చెయ్యబోయాడు. అది చిలికి చిలికి గాలివాన అయ్యింది. అతడిని సస్పెండ్ చేసి నాన్నని ఎంక్వయిరీ కమీషనర్ గా వేశారు. దాదాపు మూడు నెలల కేసుని కూలంకషంగా పరిశీలించి నాన్న అతడిని దోషిగా నిర్ణయించాడు. ఆ రోజు జరిగిన సంఘటన తాలూకు వివరాల్నీ, సాక్ష్యాల్నీ, అతడి గత ప్రవర్తనని, మొత్తం అన్నీ తీసుకుని సంపూర్ణమైన రిపోర్టు తయారుచేశాడు. ఒక బాధ్యతాయుతమైన పదవికి, ట్రెయినింగ్ సమయంలోనే ఇంత హీనంగా ప్రవర్తించిన వ్యక్తి పనికిరాడని ఆయన ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆ ఆఫీసరు టెర్మినేట్ చెయ్యబడ్డాడు. దాంతో అతడు కోర్టుకి వెళ్ళాడు. అతడి దగ్గిర బంధువు కేంద్రంలో ఉన్నతోద్యోగి. అతడి వెనక ఇంకా చాలామంది పెద్దవాళ్ళున్నారు. వాళ్ళ తరఫున ముందునుంచీ వత్తిడులు వస్తూనే వున్నాయి. అయితే నాన్నగారు వినలేదు. కోర్టులో కేసు నాన్నగారి మీదకే తిరిగింది. ఆయన అడిగిన లంచం ఇవ్వని కారణంగా ఈ విధంగ్ రిపోర్టు వ్రాశారని అతడు వాదించాడు. చాలా విచిత్రంగా అతడు ఏ స్త్రీ మీద అత్యాచారం జరిపాడో, ఆ లేడీ ఆఫీసర్ కూడా అతడికి అనుకూలంగానే సాక్ష్యమిచ్చింది. ఆ తరువాత ఆమె చండీగర్ అర్బన్ సొసైటీ ఛైర్మన్ అయింది. ఆ విధంగా కేసు అనుకోని మలుపు తిరిగింది. సింగిల్ మాన్ కమిషన్ లో తన విచారణ సరిగా నిర్వర్తించనందుకూ, లంచం అడిగినందుకూ ఆయన సస్పెండ్ చేయబడ్డారు. ఆయనది చాలా సున్నితమైన మనస్తత్వం! ఇంత షాక్ భరించలేకపోయారు. ముఖ్యంగా కేసు తన మీదికి తిరగటాన్ని... ఆ రోజే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు..."
అతడు ఉలిక్కిపడ్డాడు. ఆమె నిర్లిప్తంగా చెప్పుకుపోతుంది. "...ఆయన తన జీవితంలో సంపాదించినదేమీ లేదు. చాలావరకు దానధర్మాలకే ఖర్చు పెట్టాడు. అప్పుడు నేను యం.బి.బి.యస్. మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎలాగో కష్టపడి మరో సంవత్సరం కొనసాగించాను. తరువాత లాభం లేకపోయింది. అమ్మకూడా పోయింది. ఈ పల్లెలో తెలిసినామె ఒకరున్నారు. వరుసకి మేనత్త అవుతుంది. ఆమెకి ఎవరూ లేరు. ఇద్దరం కలిసి ఉంటున్నాం" అంటూ అతడి భుజాన్ని ఎత్తి పట్టుకుంది. కత్తి దగ్గిరకి చేరుస్తూ "ఎప్పుడో చదివిన చదువు, ప్రాక్టికల్స్ పూర్తిగా మర్చిపోయాను. ఏమైనా బాధపెడితే ఓర్చుకో- ఏం" అంటూ అతడి మొహంలోకి చూసి, ఫక్కున నవ్వుతూ "అరె- అదేమిటి- ఇంకా కత్తి ఆన్చకుండానే నీ కళ్లలో నీళ్ళు? ఇప్పుడే ఇంత భయమైతే ఎలా బాబూ" అంది.