ఆలోచనలతో తెల్లవారింది.
ఏడుగంటలకల్లా స్నానంచేసి బట్టలు వేసుకొని, రెండుసార్లు కాఫీ తాగేసి కూర్చున్నాడు. ఇక్కడకు వచ్చినప్పటినుంచీ భోజనం సహించటంలేదు. అసలు ఆకలి అనేది యెవరికైనా వుంటుందా అనిపిస్తోంది.
ఇప్పుడప్పుడే ఆమెరాదని తెలుసు. అయినా యెదురుచూస్తూ కూర్చున్నాడు.
ఎనిమిది.... తొమ్మిది.... పది.... పదకొండు....
గదిబయట అడుగుల చప్పుడవుతోంది. అతను చేతిలో పట్టుకొన్న పుస్తకం లోంచి తలయెత్తి చూశాడు. కిటికీలోంచి కనిపించింది ఆమెముఖం. తలుపులు దగ్గరగానే వేసివున్నాయి. తీసుకుని లోపలకు వచ్చింది "ఆలస్యం చేశానా" అంది నవ్వుతూ.
అతను లేచి నిలబడి "కూర్చోండి" అని కుర్చీ చూపించి తాను మంచంమీద దిండు లాక్కుని కూర్చున్నాడు. "ఆలస్యం చేయటానికి ఫలానా టైమని చెప్పలేదుగా" అన్నాడు.
పద్మజ అతని ముఖంకేసి చూస్తూ ముసిముసిగా నవ్వింది. ఆమె లా నవ్వటం అతనికి చాలా ఇష్టమనిపించింది. ముత్యాలవంటి పలువరసా, లేతచిగుళ్ళూ..... అతనికి ఎంతో బావుంది.
నిన్నటికీ ఇవాల్టికీ యెంతో తేడా కనిపించింది ఆమెలో. నిన్న ఏదో బాధ దాచుకున్నదానిలా వుంది. ఇవాళ చిలిపిగా, అల్లరిపిల్లలా వుంది. నిన్నటికన్నా నిండుగా, గోముగా వుంది.
హఠాత్తుగా ఆమెని చూస్తే అతనికి జాలివేసింది. తనకోసం ఇలా గదికి వచ్చినందుకు.
"కళ్ళు ఎర్రగా వున్నాయేం?" అని ప్రశ్నించింది.
"ఊరికినే సరదాకి."
"ఏమిటలా ఊరికినే చూస్తారు? ఏమైనా చెప్పండి. ఎంత శ్రమపడి వచ్చానో తెలుసా?"
"చాలా శ్రమ కలిగిందా నీకు నావల్ల?"
"ఊ. మరి మీరు నన్ను శాంతిగా వుండనిస్తారని గనుకనా" అంటూ ఆమె డ్రెస్సింగ్ టేబిల్ మీద చెల్లాచెదురుగా పడివున్న వస్తువుల్ని "సర్దనా వీటిని" అంది.
"సర్దండి చూద్దాం."
"ఊఁ సర్దను. నా ఇష్టం!" అంటూ ఆమె అక్కడ వస్తువులన్నీ దువ్వెనా, తలనూనె సీసా అటూ ఇటూ కదిపి చప్పుడు చెయ్యసాగింది. "చప్పుడు చేస్తే కోప్పడతారా?"
"ఉహుఁ" అంటూ చెంపమీద చిన్నదెబ్బ వేస్తానని సౌంజ్ఞచేసి చూపించాడు.
నిన్నటి బిడియం పోయింది. అతడామెకు యెంతో చేరువగా వచ్చేస్తున్నాడు. ఆమె అద్దంలోంచి అతనివంక తన్మయంగా చూసింది.
"మీకు ఎక్కువ కోపం వచ్చేస్తూంటుందా?"
"కొంచెం ఎక్కువగానే వచ్చేస్తూ వుంటుంది." అన్నాడు మధుబాబు.
"కేర్ చెయ్యను" అంది పద్మజ.
"మరి అహం ఎక్కడకు పోతుంది?"
పద్మజ సంతోషపడుతూ "అచ్చం ఉత్తరాల్లో మధుబాబులాగా మాట్లాడుతున్నారిప్పుడు. నిన్న అంత సీరియస్ గా వున్నరేమిటి?" అంది.
"ఒక పులిబోనులో ప్రవేశించినట్లు ప్రవేశించాను నిన్న మీయింటికి. యింటినిండా యెవరో అమ్మాయిలు! నువ్వేమో ఓ లార్డ్ లా గదిలో కూర్చుని అక్కడికి రమ్మన్నావు. ఇంక సీరియస్ గాక మరేమిటి?"
పద్మజ దిగులుగా నవ్వింది. "అంతకంటే ఏమీ చేయలేకపోయాను. మీ దగ్గరకు ఇలా రావాలంటే ఎంతో భయంవేసింది. అసలు రాగలుగుతాననుకోలేదు."
"ఎందుకు పద్మా నేనంటే భయం, నేనేం చేస్తానని" అన్నాడు మధుబాబు జాలిగా.
"మిమ్మల్ని చూసికాదు, పరిస్థితుల్ని చూసి."
అతనేమంటాడు, ఒకటి రెండు క్షణాలాగి "భోజనం చేసి బయల్దేరావా పద్మా?" అనడిగాడు.
"ఆఁ ఏం?"
"ఏంలేదు. కాఫీ తెప్పిద్దామని."
"భోంచేస్తే కాఫీ తెప్పించరా?"
"ఆరోగ్యానికి మంచిది కాదు."
"మీరు అన్నం తిన్నారా?"
అతను యిబ్బందిలో పడి "లే....దు" అన్నాడు.
"ఎందుకనీ?"
"ఊరికినే, ఆకలిగా లేదు."
"అయితే ఇక్కడకు తెప్పించుకోండి. మీరు తింటూంటే చూడాలనివుంది." అంది ఉత్సాహంగా పద్మజ.
"అహఁ నాకు సిగ్గేస్తుంది. నువ్వు తింటానంటే యిద్దరకూ తెప్పిస్తాను."
"అమ్మ బాబోయ్! ఓ అరగంటకూడా కాలేదు. మీరు తినాలిసిందే" అంటూ ఆమె బలవంతంచేసింది. కాని అతను యెంతకూ తినకపోయేసరికి విసుక్కుని, "అనుభవించండి. యెవరి ఖర్మకెవరేం చేస్తారు" అంది.
"అవును ఖర్మే."
ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అతనికి కనబడకుండా వుండాలని, మాట మారుస్తూ "నాకు కాఫీ తాగాలని వుంది" అంది గారాబంగా.
అతను లేచివెళ్లి బాయ్ ని పిలిచి కాఫీ తీసుకురమ్మని చెప్పాడు.
"నాకు దాహం వేస్తోంది. మంచినీళ్లు కావాలి. అంది పద్మజ మళ్ళీ.
అతను కిటికీలో వున్న గ్లాస్ తీసి, ప్రక్కనున్న బాత్ రూమ్ లో ట్యాప్ దగ్గర కడిగి, మంచినీళ్ళకూజా దగ్గరకొస్తూన్నాడు.
"నేను పోసుకుంటాను లెండి."
"గొప్పపనిచేశారులెండి" అంటూ జాగ్రత్తగా నీళ్లునింపి ఆమెచేతికి అందించాడు.
ఆమె కొంచెం తాగి "దాహం వెయ్యటంలేదు" అన్నది నవ్వి.
అతనుకూడా నవ్వి "నాకు తెలుసు" అన్నాడు.
"ఆ ఫ్యాన్ ఒట్టి అలంకారం కోసమా.... వెయ్యరా?"
కూర్చోబోతున్నవాడల్లా లేచి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి వచ్చాడు. చలి వేయసాగింది.
"అబ్బ! చలేస్తోంది. ఆపెయ్యండయ్యా బాబూ."
అతను లేచి ఫ్యాన్ ఆపేశాడు.
"అటూ యిటూ త్రిప్పిస్తున్నానని కోపం వస్తుందా?"
"కొంచెం...."
"కోపంవస్తే చెంపలు వాయించేస్తారా?"
"ఉహుఁ చెవి మెలిపెట్టేస్తాను."
ఇంతలో కాఫీ వచ్చింది. బాయ్ వచ్చి ట్రిని బల్లమీద పెట్టి వెళ్ళిపోయాడు. మధుబాబు లేచివెళ్లి "కొంచెం లేచి ఆ మంచంమీద కూర్చుంటారా రాణీగారు. కాపీకలపాలి" అన్నాడు.
"నాపేరు పద్మ. రాణిగారు కాదు."
"నాకు మాత్రం రాణీగారే."
"అయితే మీరెవరు?"
"మీ సేవకుడ్ని."
"ఐతే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. కాఫీ తయారుచేసి ఇయ్యి."
"తమరు కాస్త కుర్చీలోంచి లేవండి."
ఆమె నవ్వుకుంటూ లేచి మంచంమీదకు వెళ్లి కూర్చుని అతను పాలూ, డికాషన్, పంచదారా జాగ్రత్తగా కలుపుతోంటే ఆసక్తిగా తిలకిస్తున్నది.
"తీసుకోండి" అతను కాఫీకప్ ఆమెకు అందిచ్చాడు.
ఇద్దరూ కాఫీ తాగుతూ ఒకటిరెండు నిముషాలు మౌనంగా వూరుకున్నారు. ఇలా సైలెంట్ గా వుంటే నాకు బావుండదబ్బా" అంది పద్మజ వున్నట్లుండి.
"అయితే యిద్దరం కలిసి కేకలేద్దాం. అప్పుడు బాగుంటుంది."
"ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ "అవునుగాని మీరు నాకు ఉత్తరాలు రాయటం ఎందుకు మానేశారు" అంది హఠాత్తుగా.
అతను విచలితుడయాడు. సంభాషణ యిలా తిరుగుతుందనుకోలేదు.
"చెప్పండి, అలా ఆపేయటం వల్ల నేనెంత బాధపడ్డానో, నా కళ్లు ఎలా వర్షించాయో మీకేమైనా తెలుసా?"
మధుబాబు యిహ విధిలేక "రాశానా విషయం. మీకు పెళ్ళయిందన్న సంగతి తెలిసి...."
"నాకు పెళ్ళయితే రాయటం మానెయ్యాలా?"
అతను జవాబు చెప్పలేదు.
"మీ మొగవాళ్ళంతా యింతే. విశాలహృదయం వుండదు మీకు. నాకు పెళ్ళయి వున్నంతమాత్రాన నన్ను మరిచిపోవాలా మధుబాబూ! అప్పుడు నేను సన్నిహితంగా వుండకూడదా? నన్నుగురించి అన్యవిధంగా అందరిలా భావించవద్దని యెన్నిసార్లు సూచించాను? అంత స్వార్థంగా ఎందుకు ఆలోచించాలి మీరు?" ఆమెకంఠం ఒణికింది.
మధుబాబుకు ఆమెభుజాలు పట్టుకు కుదిపి గట్టిగా అడిగేయాలనిపించింది. "ఓ యువతి, తనకు పెళ్లి అయిన విషయం చెప్పకుండా దాచి, ఓ యువకుడ్ని స్వప్నసీమల్లో విహరింపజేసి, అతని హృదయవీణాతంత్రుల్ని మధురంగా మోగించి, అతనే తన సర్వస్వం అన్నభ్రమ కలిగించినస్థితిలో..... ఆ యువతిని పత్నిగా చేసుకునేందుకు అతను ఉబలాటపడితే అది స్వార్థమా పద్మా?" అన్నాడు.
ఆమె చకితురాలైంది. అతనివంక విహ్వలదృష్టితో చూసింది.
"ఆమె వివాహిత అని తెలిసినప్పుడు అతను నరకం అనుభవించి, ఆ మహాయాతనలో అందని ఆ దేవతకోసం, తనకోసం ఏంచెయ్యలేని ఆమెను మరిచిపోదామని, ఫలితం లేని ఆవేదనలు పెంపొందించుకోవటానికి భయపడి, ఆమె జీవితాన్ని అశాంతిపాలు చేస్తున్నాననే భీతితో మౌనం వహిస్తే అది స్వార్థమా పద్మా?"