"ఎవరు తీసుకొస్తారు?"
"నా దగ్గర పనిచేసే డ్రైవర్ మహర్షి...."
"మహర్షి?"ఇబ్రహీంఖాన్ కంఠంలో ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. "... ఏమిటీ నువ్వు రావా?"
"నీ ఇష్టం మిస్టర్ ఖాన్, నన్ను రమ్మంటే నేనే వస్తాను"
ఖాన్ ఒక్కక్షణం మౌనంగా ఉండి "వద్దులే. ఈ వ్యవహారంలో ఈలాంటి పోలీస్ ఆఫీసర్లుపాల్గొంటే మాకు ప్రమాదం. నీ డ్రైవర్నే పంపించు. అయితే ఒక్క విషయం. ఎటువంటి మోసం జరిగినా మరో హెచ్చరిక లేకుండా నీ భార్య ప్రాణాలు తీయటం ఖాయం" అన్నాడు.
"ఆ విషయం నాకు తెలుసు మిస్టర్ ఖాన్. కానీ ఒక్క విషయం! మధ్యలో మా డ్రైవర్ ఏదయినా మోసం చేస్తే దానికి మాత్రం నేను జవాబుదారీ కాదు. ఆ వచ్చిన బంగారం ఆశాలైందో కాదో తేల్చుకుని, ఆ తరువాతే నువ్వు నా భార్యని వదిలివచ్చు"
"అంటే...." అనుమానంగా అడిగాడు ఖాన్.
"ఒకవేళ డ్రైవర్ మోసంచేస్తే...."
అటువైపు నుండి ఖాన్ నవ్వాడు. "అలా మోసంచేస్తే ఆ డ్రైవర్ బ్రతకడు. అక్కడికక్కడే అతడి ప్రాణాలు తీసి ఆ తరువాత జరగవలసిన విషయాలు ఆలోచిస్తాను"
"అయితే ఒక్క విషయం గుర్తుంచుకో మిస్టర్ ఖాన్! బంగారం పంపించటం వరకే మా బాధ్యత. అది మంచి బంగారం కాకపోతే నువ్వు చర్య తీసుకోవలసింది మా డ్రైవర్ మీద తప్ప, నా భార్య మీద కాదు" అని ఫోన్ పెట్టేశాడు రవితేజ.
మరో అరగంట తర్వాత కమిషనర్ అశ్వత్ధామ బంగారపు బ్రీఫ్ కేసులతో అక్కడికొచ్చాడు. వాటిని రవితేజ కందజేస్తూ "ఫోనొచ్చిందా?" అని ఆత్రుతతో అడిగాడు.
"వచ్చింది సార్" అన్నాడు రవితేజ. "ఆ బ్రీఫ్ కేసులు ఎప్పుడు, ఎక్కడ ఎలా అందజేయాలనేది సాయంత్రం చెప్తానన్నాడు ఖాన్! అంతేకాదు, ఈ వ్యవహారంలో పోలీసులెవరూ భాగం పంచుకోకూడదట. ఎవరితో పంపాలన్నది సాయంత్రం చెప్తాడట"
"అయితే సాయంత్రం వరకూ ఆగాలన్నమాట. సిరిచందన ప్రాణాలకి....."
"ఏ ప్రమాదమూ లేదని చెప్పాడు. మనం కూడా చేయగలిగిందేమీ లేదు" అన్నాడు రవితేజ. ఎలా ప్రోసిడ్ అవ్వాలన్న విషయం మరికొంచెం సేపు మాట్లాడి లేస్తూ "సాయంత్రం వస్తాను" అని చెప్పి కమిషనర్ వెళ్ళిపోయాడు.
మరో పదినిమిషాల్లో రవితేజ ఆ బ్రీఫ్ కేసులని కార్లో పెట్టుకొని వేగంగా బయలుదేరాడు. ఊళ్ళో ఒక చిన్న సందులోకి ప్రవేశించాడు. అక్కడ వరసగా కంసాలి దుకాణాలున్నాయి. అతడొక కంసాలిని కలిసి క్లుప్తంగా చేయవలసింది చెప్పాడు. ఆ పని వినగానే ముందు అతను చెయ్యనన్నాడు. రవితేజ తానెవరో చెప్పి, కొంత డబ్బు జేబులోంచి తీసేసరికి కంసాలి ఒప్పుకున్నాడు. సాయంత్రం నాలుగ్గంటలకల్లా కావాల్సింది చేసి పెడతానని వాగ్దానం చేశాడు.
రవితేజ ఇంటికొచ్చి నాలుగ్గంటల వరకూ ఒక్కడే కూర్చున్నాడు. సరిగ్గా నాలుగవుతుండగా మళ్ళీ కంసాలి దగ్గరికెళ్ళి ఆ బ్రీఫ్ కేసులున్నాయి. రెండు కమీషనర్ ఇచ్చినవి, మరో రెండింట్లో డూప్లికేట్ బిస్కెట్స్ ఉన్నాయి. రాత్రవుతూండగా కమీషనర్ వచ్చాడు.అప్పుడు పిలిపించాడు రవితేజ మహర్షిని!
మహర్షి అప్పటివరకూ టెన్షన్ లో ఉన్నాడు. ఏం జరుగుతుందో అతడికి తెలియదు. రామరాజుని కొనదగ్గర దింపి అతడు వెనక్కి వచ్చేసరికి, ఇంట్లో సిరిచందన లేదని మాత్రం అతడికి రవితేజ దగ్గరున్న చనువు సరిపోలేదు. తను తెచ్చిన మూలికల ప్రభావం వలన రవితేజకి కళ్ళు వచ్చాయన్న ఆనందం- సిరిచందన కిడ్నాప్ వల్ల వెనుకపడి పోయింది.
కమీషనర్ వచ్చిన తర్వాత అతన్ని పిలిపించినప్పుడు క్లుప్తంగా ఏం జరిగిందో రవితేజ చెప్పాడు.
మహర్షి చాలా వ్యాకులపడ్డాడు. "ఇప్పుడు.....ఇప్పుడేం చేయాలి సర్
అని అడిగాడు.
"నువ్వు వెళ్ళి. ఈ బ్రీఫ్ కేసులు వాళ్ళు అందించమన్నచోట అందించి,సిరిచందనని వెనక్కి తీసుకురావాలి."
"తెస్తాను సార్" అన్నాడు మహర్షి కమీషనర్ తో.
"వాళ్ళు నరరూప రాక్షసులు. చాలా జాగ్రత్తగా హాండిల్ చెయ్యాలి" హెచ్చరించాడు కమీషనర్.
"నా ప్రాణంపోయినా ఫర్వాలేదు సార్! సిరిచందనని జాగ్రత్తగా తీసుకొస్తాను" అన్నాడు మహర్షి.
"మా కారులో వెళ్ళు" అన్నాడు రవితేజ సార్! సిరిచందనని జాగ్రత్తగా తీసుకొస్తాను" అన్నాడు మహర్షి.
"మా కారులో వెళ్ళు" అన్నాడు రవితేజ. మహర్షి అతని దగ్గర తాళాలు తీసుకొని, బ్రీఫ్ కేసులు రెండు కార్లో పెట్టుకొని స్టార్ట్ చేశాడు. కమిషనర్ , రవితేజ మెట్లమీద నిలబడి ఉన్నారు. కారు నెమ్మదిగా వీధి మలుపులో అదృశ్యమయ్యింది.
రవితేజ గాఢంగా శ్వాస పీల్చుకున్నాడు.
తన భార్యని రిలీజ్ చెయ్యబోయేముందే, అవి ఒరిజనల్ బిస్కెట్లో కాదో ఇబ్రహీంఖాన్ పరీక్షచేసి చూస్తాడని అతడికి తెలుసు. అవి డూప్లికేట్ వి అని జరిగిందో తెలీని మహర్షి సరియైన సమాధానం చెప్పలేకపోతాడు. ఖాన్ అతని ప్రాణాలు తీస్తాడు. అందులో సందేహమేమీ లేదు.
రవితేజకి కావాల్సింది అదే. తన చేతులకి ఏ మట్టీ అంటకుండా మహర్షి ప్రాణాలు కోల్పోవటం! అదిగాని అలా జరక్కపోతే జైలునుంచి తప్పించుకున్న నేరంమీద మహర్షి కేసు కోర్టుకి వెళ్ళగానే, తనకి అతడి భార్య అయిన శ్రీవాణికి మధ్య ఉన్న ఆఫైర్ బయటికొస్తుందని, అది తన భార్యకి తెలుస్తుందని రావితేజకి నిశ్చయంగా తెలుసు. అందువల్ల మహర్షి పోలీసులకి పట్టుబడటం కన్నా ఖాన్ చేతిలో అతని ప్రాణాలు పోవడం మంచిది. అందుకే అతనా ప్లాన్ వేశాడు.
తమకి అందినవి ఒరిజనల్ బంగారపు బిస్కెట్లు కావని తెలిసిన ఇబ్రహీంఖాన్ సిరిచందనని వదిలిపెట్టడని కూడా రవి తేజకి తెలుసు. అయితే దానివల్ల ఆమెకి ఏ హానీ చేయడు. బిస్కెట్ల మార్పు కేవలం మహర్షే చేశాడని భావిస్తాడు - మహర్షిని చంపేసిన తర్వాత తిరిగి తమతో బేరం పెడతాడు కావాలంటే అప్పుడు ఒరిజినల్ బిస్కెట్లు ఇచ్చి సిరిచందనని వెనక్కి తెచ్చుకోవచ్చు. ఒకసారి మహర్షి చనిపోయిన తర్వాత సిరిచందనకీ, తనకీ మధ్య ఇంకెవరూ అడ్డుండరు.
ఒకవేళ మహర్షి అసలు ఆ కిడ్నాపర్ స్థావరానికి వెళ్ళకుండా బిస్కెట్ల బ్రీఫ్ కేస్ లతో పారిపోతే, అప్పుడు మొత్తం జరిగిన విషయమంతా ప్రభుత్వానికి తెలియపరచవచ్చు. అప్పుడు సిరిచందనని విడియమంతా ప్రభుత్వానికి తెలియపరచవచ్చు. అప్పుడు సిరిచందనని విడిపించవలసిన బాధ్యత పోలీస్ ఫోర్సు మీద పడుతుంది.
ప.....ది లక్షల విలువచేసే ఒరిజనల్ బంగారు బిస్కెట్లు తన దగ్గిర ఉండిపోతాయి.
కిడ్నాపర్స్ తన భార్యని చంపరు అన్న నమ్మకం రవితేజకి బాగా ఉంది. ఒక పోలీసాఫీరుగా ఈ విషయం అతనికి తెలుసు. కిడ్నాపర్స్ సాధారణంగాఅంత రిస్క్ తీసుకోరు. వీలైనంతవరకూ డబ్బు పిండుకోవటానికే చూస్తారు.
అతడు మొత్తం పరిస్థితినంతా సమీక్షించుకున్నాడు. రెండే మార్గాలున్నాయి. ఇబ్రహీంఖాన్ డూప్లికేట్ బిస్కెట్లు అందించినందుకు మహర్షిని చంపటం ఒక మార్గం. లేదా మహర్షి పడి లక్షల విలువ చేసే బిస్కెట్లు (అనుకొని పొరపాటుపడి) పారిపోవటం ఒక మార్గం. ఏదైనా తనకు లాభమే.....
తను వేసిన మాస్టర్ ప్లాన్ కి తనే సంతృప్తి చెంది, ఆనందాన్ని లోపల దాచుకుంటూ కమీషనర్ అశ్వత్ధామతో కలిసి లోపలికి నడిచాడు రవితేజ.
సరిగ్గా పడి నిమిషాలు తరువాత వారిద్దరూ మరో కార్లో మహిర్షి కారు వెనకే బయల్దేరారు.
డెబ్బయ్యవ కిలోమీటరు రాయి దగ్గిర ఆపుచేసాడు అశ్వత్ధామ! మహర్షి బ్రీఫ్ కేసులు అందించవలసిన ప్రదేశం అక్కడికి అయిదు కిలోమీటర్ల దూరంలో వుంది.
మరో అరగంటలో ఖాన్- మహర్షి కలిసి, ఇటు బ్రీఫ్ కేసులు ఇవ్వటం, అటు సిరిచందనని అప్పగించటం జరుగుతుంది.
ఇద్దరూ ఎదురు చూస్తున్నారు!
సిరిచందానని తీసుకురావటానికి వెళ్ళిన మహర్షి కోసం అశ్వత్ధామ!!
మహర్షి మరణ వార్త కోసం రవితేజ!!!
అతడి కళ్ళ ముందు - సిరిచందన పెట్టెలో చీరెల అడుగున దొరికిన వుత్తరం కదుల్తోంది. నాగకోనకి వెళ్ళబోయే ముందు - మహర్షి ఆమెకి రాసిన ఉత్తరం అది.
9
ఒక మనిషిని కిడ్నాప్ చేయటంకన్నా, కిడ్నాప్ చేసిన మనిషిని బంధించి ఉంచటం కష్టమైన పని. పుస్తకాల్లోనూ, సినిమాల్లోనూ చూసినంత సులభంగా డబ్బులు వసూలు చెయ్యటం సాధ్యమయ్యుంటే, ఈ ప్రపంచంలో అందరూ అదే వృత్తి అవలంబించి ఉండేవారు.
ఎవరికీ తెలియనిచోట మనిషిని బంధించి ఉంచటం, ఆ వ్యక్తికి ఆహారం, నీరు అందించటం, అతడి అరుపులు ఎవరికీ వినబడకుండా ఉండేలా చెయ్యడం, కంటిమీద కునుకు లేకుండా అతన్ని కనిపెట్టుకొని ఉండటం, ఇవన్నీ పైకి కనబడేంత సులభమైన విషయాలు కావు.
నిరంతరం చేతులు కట్టేసి ఉంచటం కూడా సాధ్యమయ్యే పనికాదు. నోటికి ప్లాస్టర్ వేసినా కూడా, అది ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదకరంగా పరిణమించవచ్చును.
కిడ్నాపర్సు సాధారణంగా తాము బంధించిన వ్యక్తిని చంపేయాలని అనుకోరు. తమ కందవలసిన డబ్బు అందిన తర్వాత ఆ వ్యక్తిని వదిలి పెట్టటానికే ఇష్టపడతారు. ఎందుకంటే కిడ్నాప్ నేరానికన్నా హత్యా నేరానికి శిక్ష ఎక్కువ.
ఆలీఖాన్ మరణించిన తర్వాత ఇబ్రహీం, శాస్త్రి కలిసి ఆ పథకాన్ని పూర్తి చేయాలనుకున్నారు. సాధారణంగా ఒక బాస్ కింద సమానస్థాయిలో పనిచేసే ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఎక్కువగా ఉండదు. ఇద్దరూ తమ అంతస్తు నిలబెట్టుకోవటం కోసం అంతర్గతంగా ఒకళ్ళ నొకళ్ళు ద్వేషించుకోవటం సహజం ఆలీఖాన్ బ్రతికున్నంత కాలం ఇబ్రహీం, శాస్త్రిళ మధ్య ప్రధమ అనుచరుడి స్థానం కోసం పోటీ ఉండింది. ఆలీఖాన్ మరణించిన తర్వాత ఇద్దరూ విడిపోదాం అనుకున్నారు.
సిరిచందనని కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది ఇబ్రహీంఖాన్. బయట జీపులో వెయిట్ చేసింది శాస్త్ర్రి. కేవలం తామిద్దరం ఈ మొత్తం ఆపరేషన్ లో ఉండాలని వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు. మూడో అనుచరుణ్ణి ఇందులో చేర్చుకోవటం వారి కిష్టం లేదు. వారి ఆపరేషన్ లో మొదటిభాగం విజయవంతంగా పూర్తి కావటంతో తాము ఆశించిన పడి లక్షల బంగారం దొరికినట్టే భావించారు.
అరకువేలీ నుంచి ప్రయాణం చేసే రోడ్డు అడవి గుండా వెళుతుంది. ఆ అడవిలోనే ఒక చిన్న కొండమీద పాడుబడిన గుడిలో సరిచందనని వుంచారు. అక్కడికి డెభ్బై అయిదో కిలోమీటరు రాయి సమీపంలోవుంది. అందుకే దానిని ఎంచుకున్నారు.
ఇబ్రహీంఖాన్ ఊళ్ళోకి వెళ్ళి రవితేజకి ఫోన్ చేసి మళ్ళీ వచ్చేసరికి శాస్త్రి గుడిబయట రాతి మీద కూర్చొని డ్రింక్ చేస్తున్నాడు. సిరిచందన కొంచెం దూరంలో బంధింపబడి వుంది. ఆమె కాళ్ళు రెండూ బలంగా కట్టివేశాడు శాస్త్రి, చేతులు మాత్రం బంధించలేదు.