ఆ విధంగా ఆలోచించిన మహర్షి ఇప్పుడు వేదననుంచి బయటపడ్డాడు. భయంకూడా అతని మనసులోంచి తొలగిపోయింది. ఇప్పుడు అతని మనసులో నిలిచి వున్నది కర్తవ్యం మాత్రమే. తన చేతులతో అంధుడైన రవితేజని తిరిగి మామూలు వ్యక్తిని చేసి, సిరిచందనకి అప్పగించి, ఈ లోకంనుంచి మహాభినిష్కృమణం సాగిస్తే సరిపోతుంది అన్న భావం ఒక్కటే- ఇప్పుడతనిలో బలీయంగా మిగిలిపోయింది.
8
"నిజమా?" అంది సిరిచందన అతడివైపు సంభ్రమంగా చూస్తూ. "అవును చలమయ్య చెప్పాడు."
అంతలోనే ఆమె మొహంలో నిస్పృహ కనపడింది. "నేను నమ్మను, నమ్మలేను, పెద్ద పెద్ద డాక్టర్లు చేయలేనిది ఈ కోయవాళ్ళు, మంత్రగాళ్ళు ఏం చేయగలరు" అంది తల విదిలిస్తూ.
"ప్రయత్నించటంలో తప్పులేదుగా. ఒక్కొక్కసారి ఇంగ్లీష్ మందులతో నయంకాని రోగాల్ని కూడా మూలికల వైద్యంతో నయం చేసిన ఉదాహరణలున్నాయి."
"అవును. నువ్వు చెప్పిందీ కరెక్టే. ప్రయత్నిద్దాం" అంది సిరిచందన.
ఈ విషయం తెలిసి అందరికన్నా ఎక్కువ సంతోషించింది రవితేజ. అతడు చాలా ఎగ్జయిటింగ్ గా "రేపే వెళ్దాం" అన్నాడు. సిరిచందనకి అతడి ఉత్సాహం అర్థమైంది. మామూలు పరిస్థితిలో కన్నా , ఆ దురదృష్టకరమైన స్థితిలో వున్నవాళ్ళకే ఆ బాధ అర్థమవుతుంది. ఏ చిన్ని ఆసరా దొరికినా దాన్నే పట్టుకోవాలని చూస్తుంటారు. ఏ పుట్టలో ఏ పాముందో అని కనిపించిన దేవుళ్లకీ, బాబాలకీ మొక్కుతూ ఉంటారు. రవితేజ ఒక పెద్ద ఐ.పి.యస్ ఆఫీసరైనా కూడా ఇటువంటి మానసికస్థితికి అతీతుడేమీ కాదు. అందుకే ఆ కోయదొర దగ్గరకి మరుసటిరోజే వెళదామని తొందర పెట్టాడు.
* * *
"మహీ! కారు రెడీయా?" భర్త చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ వస్తూ అడిగింది సిరి.
"రెడీ మేడమ్" అన్నాడు కారు దగ్గరున్న మహర్షి.
ఆ రోజు సిరిచందన చాలా హుషారుగా వుంది. "ఏమిటీ..... ఇంతకుముందు వరకూ సిరీ అని పిలిచి ఇప్పుడు మేడమ్ అంటున్నావ్?" అని చిరుకోపంతో ప్రశ్నించింది.
"సారీ మే......" అనబోయి ఆగి "సారీ, ఏదో ఆలోచనలో ఉండి అలా అని వుంటాను. అయినా నేను మీ కేర్ టేకర్ని కదా! అలా అనడంలో తప్పేముంది?" అన్నాడు నవ్వుతూ.
భర్తని కారులో కూర్చోపెట్టాక, తనూ కూర్చుంటూ "అదిగో - అలాంటి మాటలు మారోసారి నా దగ్గరన్నావంటే ఊరుకోను" తర్జని చూపిస్తూ బెదిరిస్తున్నట్టు అంది.
మహర్షి చిన్నగా నవ్వి "అలాగే" అంటూ కారు స్టార్ట్ చేశాడు. రవితేజ అప్పటివరకూ మౌనంగానే వున్నాడు. మహర్షిని కలిసినప్పటినుంచి అతన్ని ఒకే ప్రశ్న తొలిచివేస్తూంది. అంత చదువుకున్న మహర్షి ఇంత చిన్న జీతానికి తమ దగ్గిర ఎందుకు చేరాడు?
సిరిచందన, మహర్షి క్లాస్ మేట్స్ కావటం కేవలం యాదృచ్చికమా? తన భార్యని అతడు సిరీ' అని పిలిచేంత చనువుందా?
అతడి 'పోలీస్' ఆలోచనకి లక్ష సందేహాలు కలుగుతున్నాయి. మొహం మాత్రం మామూలుగానే వుంది.
ఈ లోపులో సిరిచందన భర్తతో "ఏమండీ, ఈ కోయదొర వాళ్ళ మీకు కళ్లు వస్తే మహర్షికి మనం ఒక మంచి బహుమతి ఇవ్వాలి" అంది.
తన పాత ఆలోచనల్లో ఉన్న రవితేజ చప్పున "నేనెందుకు? నువ్వు..... నువ్వు ఇవ్వు" అన్నాడు.
సిరిచందన తెల్లబోయింది. కారు డ్రైవ్ చేస్తున్నా మహర్షి కూడా వెనక్కీ తిరిగి చూశాడు. అప్పటికి రవితేజకి తను మాట్లాడింది అర్థమై, దాన్ని కవర్ చేసుకుంటూ "అవును మరి! నాకు కళ్ళొస్తే నాకన్నా ఎక్కువ సంతోషించేదానివి నువ్వే అని నేననుకుంటున్నాను. అందులో ఏమన్నా తప్పుందా" అని అడిగాడు నవ్వుతూ.
సిరిచందన మాత్రం నవ్వేసింది.
మహర్షి మాత్రం ముఖంలో తన ఆలోచనలు ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ డ్రైవ్ చేయసాగాడు.
సిరిచందనలో ఆతృత క్షణక్షణానికీ పెరిగిపోతోంది. మహర్షి ఆ విషయం చెప్పినప్పటి నుండీ ఆమెకి చాలా టెన్షన్ గా వుంది. ఎప్పుడు కోయపల్లె వస్తుందా అని ఆత్రంగా చూస్తోంది.
కారు ఘాట్ రోడ్ మీద మెలికలు తిరుగుతూ సాగిపోతోంది. అరకునుండి పాడేరు వెళ్ళే ఆ రోడ్డంతా ఆడవాళ్లు తలకు పెట్టుకునే పిన్ను (హెయిర్ పిన్ బెండ్) లా అక్కడక్కడా మాలుపులతో కూడి వుంది.
మహర్షి దృష్టి మొత్తం రోడ్డుమీదే కేంద్రీకరించి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా కారు లోయలోకి జారిపోవడం ఖాయం.
ఎంతో నేర్పు వుంటేనేగాని ఆ ఘాట్ రోడ్ లోని టర్నింగ్స్ ని హాండిల్ చేయడం సాధ్యం కాదు.
మలుపు వచ్చినప్పుడల్లా ఆమె తన చేతిని గట్టిగా పట్టుకోవటం చూసి రవితేజ, చిన్నగా నవ్వి ఆమె భుజం చుట్టూ చేయివేసి దగ్గరగా జరిగి కూర్చున్నాడు.
ఇంకోరెండు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే అడవి ప్రారంభమవుతుంది అక్కడనుంచీ మట్టి రోడ్డు. అడవిలో కొండల మధ్య ప్రయాణం. రోడ్డు మరీ బాగా లేకపోతే కాలినడక కూడా వెళ్ళాల్సి వుంటుంది.
ఆలోచనలతోనే డ్రయివ్ చేస్తున్నాడు మహర్షి. ఇంతలో..... ఓ వ్యకి రోడ్డుమీద నించుని కారు ఆపమన్నట్టు చేయి వూపటం గమనించి కారు స్లో చేసి ఓ పక్కగా ఆపాడు.
ఆ వ్యక్తి ముఖం చాలా ఆదుర్దాగా వుంది. మనిషి వగరుస్తున్నట్టు కనిపించాడు. కారు ఆగగానే అతను పరిగెత్తుకుని దగ్గరికి వచ్చి "సార్! మావాడికి పాము కరిచి చావు బ్రతుకుల్లో వున్నాడు. దయచేసి కోయపల్లె వరకూ తీసుకెళ్ళండి" అంటూ విండోలోంచి చేతులు పట్టుకుని ప్రాధేయ పూర్వకంగా అడిగాడు.
"ఎక్కడ?" డోర్ ఓపెన్ చేస్తూ అడిగాడు మహర్షి.
"రండి సార్ చూపిస్తాను. ఆ తుప్పల్లో పడి వున్నాడు" అన్నాడతను.
మహర్షి వెనక్కీ తిరిగి కారులోనికి వంగి చూస్తూ "నేనిప్పుడే వస్తాను" అన్నాడు.
ఆ సమయంలో రవితేజ సిరి భుజంమీద తలాన్చి పడుకుని వున్నాడు. ఆ దృశ్యం చూడగానే మహర్షి వెంటనే తల తిప్పుకుని వెనుదిరిగాడు.
ఆ వ్యక్తి దారి చూపిస్తున్నట్టు వెళుతుంటే వెనకే అతను ఏటవాలుగా వున్న ఆ దారంట జాగ్రత్తగా అడుగులువేస్తూ అనుసరించసాగాడు.
కొద్ది దూరం వెళ్ళాక ఆ వ్యక్తి తుప్పల చాటున పడివున్న మనిషిని చూపిస్తూ ఇతనే, దయచేసి కాస్త సాయం పట్టండి" అన్నాడు.
మహర్షి క్రిందపడివున్న మనిషి ముఖంలోకి పరీశీలనగా చూస్తూ శ్వాస చూడటం కోసం ముక్కు దగ్గర వేలుంచబోయాడు.
సరిగ్గా అప్పుడే.... అతను ఊహించని సంఘటన జరిగింది.
అతని తల వెనుక భాగం మీద బలమైన దెబ్బ పడింది!
ఏం జరిగిందో గమనించే లోపలే నేలమీద కొరిగిపోయడతను. వెంటనే స్పృహ తప్పింది.
నేలమీద పదివున్నట్టు నటించిన వ్యక్తి అప్పుడు లేస్తూ "మొదటి ఆపరేషన్ విజయవంతమైంది" అన్నాడు.
ఆ తరువాత వారిద్దరూ కలిసి కారు దగ్గరికి వెళ్ళారు. అందులో ఒకడు గట్టిగా విజిల్ ఊదాడు.
ఆ కారుకి ఇరవై గజాల దూరంలో ఆగివున్న మరో జీప్ ఆ విజిల్ శబ్దం వినగానే స్టార్టయి కారు వెనగ్గా వచ్చి ఆగింది.
ఆ జీప్ లోంచి ఓ దృఢకాయుడు దిగాడు.
ఆరడుగుల ఎత్తుతో....... ఎర్రటి శరీర ఛాయతో.....బలంగా వున్న ఆ వ్యక్తి జీప్ దిగి సరాసరి కారు దగ్గరికి వచ్చాడు.
విండో దగ్గరికి వచ్చి లోపలికితొంగి చూశాడు.
సిరికి ఏం జరుగుతోందో అర్థంకావటంలేదు. ఏదో జరగబోతూందన్న ఆమె సిక్త్స్ సెన్స్ హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తోంది.
జీప్ దిగినవ్యక్తి కారులోకి తొంగి చూసేసరికి ఆమె అప్రయత్నంగా భర్త భుజాన్ని గుచ్చి పట్టుకుంది.
"మిస్టర్ రవితేజా....హౌ ఆర్ యూ?" ఆ వ్యక్తి కంఠం ఆ నిశ్శబ్దంలో ఖంగుమంటూ మోగింది.
అంతసేపు జరుగుతున్నదేమీ తెలీక భార్య భుజంమీద తలాన్చి వున్న రవితేజ ఒక అపరిచిత వ్యక్తి గొంతు హఠాత్తుగా వినిపించేసరికి ఉలిక్కిపడి తలెత్తి "ఎవరు.....ఎవరదీ?" అన్నాడు.
"వ్వా....ఏం నాటకమాడుతున్నావ్?"
"ఎవరు మీరు..... నేను గుర్తుపట్టలేదు"
"అరే బంద్ కరో బక్వాస్. నేను..... సర్దార్ అబ్బాస్ ఆలీఖాన్ ని. కాస్త కళ్ళు తెరిచి చూడు రవితేజా! నువ్వు ఇంతకాలం గుడ్డివాడిగా నాటక మాడుతున్నావని మాకు తెలుసులే....."
రవితేజ వినటం లేదు.
ఆ వ్యక్తి తన పేరు చెప్పగానే అదిరిపడ్డాడు.
'అబ్బాస్! ద గ్రేట్ గోల్డ్ బిస్కెట్ స్మగ్లర్!' మనసులో అనుకున్నాడు.
ఇంతవరకూ అతన్ని చూడటం జరగలేదు, ఫైల్లో ఫోటో చూడటం తప్ప.
మనిషిని ఎరగడు. ఇక్కడ ... ఇంతదూరంలో ...... షూట్ రోడ్ మీద..... అంటే..... అంటే ఇంతకాలం తనని ఫాలో అవుతూ వస్తున్నారన్న మాట వీళ్ళు 'మైగాడ్' అనుకున్నాడు. కలవరాన్ని అదిమి పెడుతూ "ఇక్కడ నీకేం పని?" అని ప్రశ్నించాడు గంభీరంగా.
జరుగుతున్న దాన్నంతా సిరి బిత్తరపోయి చూస్తోంది. ఆమె చేయి భర్త భుజాన్ని వదలలేదు. అబ్బాస్ కరుగ్గా అన్నాడు.
"అదంతా తరువాత చెబుతానుగానీ, ముందు నువ్వు కారు దిగు" అంటూ డోర్ తెరిచి రవిని బలవంతంగా బైటకు లాగాడు.
రవి క్రింద పడబోయి నిలదొక్కుకుంటూ "ఆలీఖాన్! ఏమిటిదంతా! అని గట్టిగా అడిగాడు.
"మిస్టర్ రవితేజ.....! ముందు నీ నటన ఆపు"
"నటనేమిటీ?" కనుబొమలు ముడిపడ్డాయి రవికి.
"రవితేజా......నువ్వు ఐ.పి.యస్ ఆఫీసర్ వి. సినిమా స్టార్ లా యాక్షన్ చేయకు. గుడ్డివాడిలా నటించి నా ముందే వేషాలు వేయకు"
"అంటే, నీ ఉద్దేశం...... నా కళ్ళు పోలేదనా?"
"నీ కళ్ళు పోయినట్టు నీ భార్యనీ, సమాజాన్నీ నమ్మించగలవేమో కానీ, ఈ ఆలీఖాన్ ని మాత్రం నమ్మించలేవు. నీ కళ్ళు పోలేదనీ, పోయినట్టు నాటకమాడి నువ్వూ, ఆ కమిషనర్ 'కుట్టే' కలిసి , ప్రభుత్వానికి అందజేయకుండా నా గోల్డ్ బిస్కెట్స్ కాజేయాలని ప్లాన్ చేస్తున్నారనీ నాకు తెలుసు. మర్యాదగా అవి ఎక్కడ దాచావో చెప్పు".
"నో......నాకేం తెలియదు. నా కళ్ళు నిజంగానే పోయాయి" గట్టిగా అరిచాడు రవి.