Previous Page Next Page 
ఫస్ట్ క్రష్ పేజి 3

 

ఇదేం సోదిరా బాబు. ఎరక్కపోయి పలకరించి ఇరుక్కున్నాను అనుకున్నాడు చికాకుపడుతూ.
అందులోనూ చుట్టుపక్కల అందరూ తనవైపే చూస్తున్నారు.
ఈ సమయంలో జాగ్రత్తగా మసలుకోకపోతే మొదటికే మోసం వస్తుంది.
ఏదో వంకతో ఈమె నుంచి మెల్లగా జారుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. 
మీ ప్రేమ, మీ పెళ్లి, మీ ఇష్టం. మధ్యలో నాకెందుకండీ అంటూ కుర్చీలోంచి లేవబోయాడు.
ఎందుకో విజితను చూస్తుంటే మొదటిసారి అతని మనసు లయ తప్పింది. ఆమె అందాన్ని ఆరాధిస్తూ అలా ఉండిపోవాలనిపిస్తోంది. మరుక్షణమే ఇదేంటి తను ఇంత బలహీనుడా, నో నో అని మొహం తిప్పుకుంటున్నాడు.
దాన్ని తప్పించుకునేందుకే బలవంతంగా లేవబోయాడు.
అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా ! నాకు హెల్ప్ చెయ్యరా అంది దీనంగా చూస్తూ.
ఆ చూపులు వినీల్ మనసును గట్టిగా తాకాయి. ఏంచెయ్యాలో తెలీక మళ్ళీ కూర్చున్నాడు ఏంటి చెప్పండి అన్నట్లు.
ఐస్ క్రీం తిందామా. తింటూ మాట్లాడుకోవచ్చు అంది కళ్ళతోనే ప్లీజ్ అంటూ విజిత.
వినీల్ వద్దు అని చెప్పే లోపే బేరర్ ని పిలిచి రెండు లార్జ్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చింది.
ఐస్ క్రీం వచ్చే లోపు ఇదిగో ఇది చప్పరించండి అంటూ లాలి పాప్ చేతిలో పెట్టింది నవ్వుతూ.
ఇదేంటి చిన్నపిల్లలు తినే లాలి పాప్ నాకిచ్చారు. ఆబ్బె నేను తీసుకోను అంటూ తిరిగి ఇవ్వబోయాడు.
చిన్నపిల్లాడినే అనుకుని తీసుకోండి. కాలక్షేపానికి చప్పరించొచ్చు అంటూ తనూ ఓ లాలీ పాప్ బుగ్గన పెట్టుకుంది వినీల్ నే చూస్తూ.
ఇదేంటి ఈవిడ ఇంత చిత్రంగా ఉంది అంటూ ఆ లాలీ పాప్ జేబులో వేసుకున్నాడు ఇంకేం మాట్లాడకుండా. 
అప్పటికే మెల్లగా రాత్రి అవుతోంది. చీకటి ముసురుతోంది.
ఆ ప్రాంతమంతా దీపాల వెలుగులో మెరిసిపోతోంది.
హోటల్ కూడా జన సమ్మర్ధంతో కళకళలాడుతోంది.
పిల్లలు అటూ ఇటూ పరుగెత్తుతూ అరుస్తున్నారు.


****


విజిత ని వదిలించుకుని ఎలా వెళ్లాలో తెలీటల్లేదు వినీల్ కి. ఆ విషయమై తెగ ఆలోచించేస్తున్నాడు.
అప్పటికే చుట్టూ కూర్చున్న వారికి వీళ్లిద్దరి సంభాషణ వినిపించీ  వినిపించనట్లుగా వినోదం కలిగిస్తోంది.
అందరూ ఉత్సాహంగా వీరివైపే చూస్తున్నారు.
ఎక్కడినుంచైనా ఫోన్ వస్తే మాట్లాడుతూ అలా వెళ్లిపోవచ్చు అని మొబైల్ వైపు చూస్తూ మదనపడుతున్నాడు వినీల్.
అతని కదలికలు గమనిస్తూ అతన్నే చూస్తోంది విజిత.
మగవారిలో ఇంత హ్యాండ్సమ్ గా కూడా ఉంటారా అని అలా అతన్నే చూస్తోంది. 
విజిత్ చూపులు కొంచెం ఇబ్బంది కలిగిస్తుండటంతో నేను వెళ్తానండి అంటూ లేవబోయాడు వినీల్.
ప్లీజ్ కూర్చోండి. ఐస్ క్రీం తినేసి వెళదాం అంది విజిత బ్రతిమిలాడుతున్నట్లు అతని మొహంలోకి చూస్తూ .
ఈ లోపు ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాడు. అందులోనూ లార్జ్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చింది విజిత. 
ఇంకేముంది వినీల్ బుక్కయ్యాడు.
ఎలాగైనా అతన్ని మాటల్లో పెట్టాలని  మీ సంగతులు చెప్పలేదు అంది విజిత ఐస్ క్రీం తింటూ.
మామూలే అన్నాడు ముక్తసరిగా.
వినీల్ కి మనసులో భయంగా ఉంది. అతనికి ఆడవాళ్ళతో అలా సరదాగా కబుర్లు చెప్పడం అంత ఇష్టం లేదు. తండ్రి తెచ్చిన సంబంధం చూసి పెళ్ళయ్యేంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నది అతని అభిప్రాయం.
పెళ్ళికి ముందు ప్రేమ ఎంతమాత్రమూ కుదరదు అన్నది అతని స్థిర నిశ్చయం. ప్రేమకు పెళ్ళికి పొత్తు కుదరదు అన్నది అతని అభిప్రాయం. అందులోనూ రోజూ వార్తల్లో సోషల్ మీడియా లో కధనాలు చూస్తూ అమ్మో అలాంటివి అసలొద్దు. ఎదో బుద్ధిగా జాతకం కుదిరిన అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితం గడిపేస్తే హ్యాపీ అనుకుంటాడు.
సరే రేపు మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ కి నచ్చచెప్పండి. నా పెళ్లి చూపులు ఆపేలా ప్రయత్నం చెయ్యండి ప్లీజ్ అంది వేడుకొంటున్నట్లు.
ఆ మాటలకు అదిరిపడ్డాడు వినీల్.
అరే ! నేనెలా వస్తాను. మీరెవరో నేనెవరో. ఇక్కడేదో రెండు నిముషాలు మాట్లాడితే సరిపోతుందా. మన మధ్య ఏముందని నేను మీకు హెల్ప్ చెయ్యాలి.  నేను రాను అని కచ్చితంగా చెప్పాడు విజిత వైపు చూడకుండా. 
ఒక్కసారి నా మొహంలోకి చూసి చెప్పండి అంది విజిత.
ఊహూ నేను చూడను. నేను వెళుతున్నాను అంటూ లేచాడు. 
అంతేలెండి మీరేదో మంచివారనుకున్నాను. మీకై మీరే నా దగ్గరికొచ్చి నన్ను ఓదారుస్తుంటే ఎంతో సంతోషంగా మీరు నాకు హెల్ప్ చేస్తారని కొండంత ఆశపడ్డాను అంటూ మీ చేత్తో ఆ టిష్యూ ఇవ్వండి అంది గోముగా. 
అబ్బా మళ్ళీ మొదలెట్టింది పాత పాట అంటూ మనసులో అనుకుని గుప్పెడు టిష్యూ లు విజిత చేతిలో కుక్కాడు కోపంగా ఇక ఏడుపు మొదలెట్టండి అన్నట్లు.
థాంక్స్. ఇన్ని వద్దు లెండి. ఒక్కటి చాలు అంటూ మూతి తుడుచుకుంది. మీరు నాకు ఏ హెల్ప్ చెయ్యరు అని తెలిసిపోయింది. నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యండి ప్లీజ్ అంది.
సరే పదండి. ఎక్కడ మీ ఇల్లు. అలా ఐన వదిలించుకుందాం అని ఆనందపడ్డాడు.
బంజారా హిల్స్ లో. మీరు ఎక్కడ ఉంటున్నారు అంది.
నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో అన్నాడు.
ఓహ్ నైస్. మాది అదే రోడ్ అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ.
ఆమె వైపు చూస్తే భయంగా ఉంది వినీల్ కి. ఎక్కడ ఆకర్షితుడవుతాడో అన్నట్లు.
అంతా గమనిస్తూనే మనసులో నవ్వుకుంటోంది విజిత. అతని కంగారు ఆమెకు వింతగా హాయిగా ఉంది. 


****


ఇద్దరూ లేచి హోటల్ వెలుపలికి వచ్చి పార్కింగ్ వైపు దారి తీశారు.
కొంచెం వెనుకగా నడుస్తూ విజిత డ్రైవర్ కి ఫోన్ చేసి చెప్పింది నువ్వు వెళ్ళు నేను వస్తాను అని. 
బయట కొంచెం చిరుజల్లు పడుతోంది.
వినీల్ కారు కొంచెం దూరంగానే పార్క్ చేసి ఉంది.
మీరు ఇక్కడే ఉండండి నేను కారు తీసుకొస్తాను అన్నాడు వినీల్.
ఫర్లేదు అంత తడిసేట్లు లేదు. చిన్న జల్లే కదా అంటూ అతని ప్రక్కనే నడుస్తోంది. 
యాదృచ్చికంగా ప్రక్కకు తిరిగి విజిత వైపు చూసాడు.
ఆ క్షణంలో బ్రహ్మని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
ఈ అందాల రాశిని వరించే ఆ అదృష్టవంతుడు ఎక్కడున్నాడో అనుకున్నాడు.
విజిత మొహమాటం లేకుండా అతన్నే చూస్తోంది.
అది గమనించిన వినీల్ కొంచెం వడివడిగా అడుగులేస్తున్నాడు.
అబ్బా కొంచెం ఆగండి. మీ పరుగు నేను అందుకోలేక పోతున్నాను. అలా అయితే మీరే నన్ను ఎత్తుకు తీసుకెళ్ళాలి చెప్తున్నా అంది.
ఆమ్మో ఇదొక ఫిట్టింగా అనుకుంటూ తన స్పీడ్ తగ్గించాడు.
మెల్లగా నడుచుకుంటూ వెళ్లి ఇద్దరూ కారులో కూర్చున్నారు.
మీ ఇల్లు ఎక్కడ. మిమ్మల్ని దింపేసి వెళతాను అన్నాడు.
మీ ఇంటి ప్రక్కనే అంది వినీల్ నే చూస్తూ 
అంటే నువ్వు వెంకటరాజు గారి అమ్మాయివా అన్నాడు ఆశ్చర్యంగా.
అవును అంది నవ్వుతూ.
అరే నేనెప్పుడూ గమనించలేదు అన్నాడు.
మిమ్మల్ని నేను రోజూ చూస్తుంటాను అంది ఆరాధనపూర్వకంగా చూస్తూ. మీరు సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు. మీ ఇల్లు మా పెదనాన్న గారిదే. 
అవునా ! వీర్రాజు గారు మీ పెదనాన్న గారా అన్నాడు. 

 

 Previous Page Next Page