Previous Page Next Page 
13... 14.... 15 పేజి 3


    ఆ రోజు మరీ నొప్పి ఎక్కువగా వుండటంతో ప్రొద్దున్నే పక్కమీద నుంచి లేవలేకపోయింది.

    అతను ప్రొద్దున్నే ఎనిమిదింటికి మామూలుగా లేచి బ్రష్ చేసుకుని వచ్చేసరికి డైనింగ్ టేబుల్  మీదా కాఫీలేదు. అతడు కంగారుగా  లోపలికి  వచ్చాడు.

    "ఏమిటి? హెల్త్  బావోలేదా?" అడిగాడు.

    "అవునండి"

    "వొట్టి కడుపునొప్పేనా?"

    "ఊ?"

    "నువ్వు రెస్ట్ తీసుకో. నేను హొటల్  నుంచి టిఫిన్ తెప్పించుకుంటాలే. భోజనం కూడా బయటే చేస్తాను. నీకు బోయ్ తో క్యారియర్ పంపిస్తాను" అంటూ అతడు లోపలికి వెళ్ళాడు. ఆ తరువాత ఫ్యామిలీ డాక్టర్  ఫోన్ చేయటం వినిపించింది. "....నేనే..... విష్ణుని.... తనకి కడుపునొప్పి ఆట..... ఆ...... అదే.......మామూలే.... ఏమిటి? బరాల్ గనా? ... ఓకే.....అబ్బెబ్బె .... ఏంలేదు...." ఫోన్ పెట్టేసిన చప్పుడు.

    అతడు స్నానం చేసి తయారయి డ్రెస్సింగ్ టేబిల్ దగ్గిర తల దువ్వుకున్నాడు. సన్నగా విజిల్ చేస్తూ పెర్ ప్యూమ్ స్ప్రే  చేసుకుని  బయల్దేరుతూ, "వెళ్ళొస్తాను. నొప్పి మరీ ఎక్కువగా వుంటే డాక్టర్ గ్గానీ, నాగ్గానీ ఫోన్  చెయ్యి" అన్నాడు. ఆమె కళ్ళుమూసుకుని వుంది.

    ఆ తరువాత గేటు తీసి వేసిన చప్పుడు.

    క్షణం తరువాత వాహనం  వెళ్ళిపోయినా చప్పుడు.

    వేదనగా మిగిలిన గుండె చప్పుడు.

    అతడు సన్నగా విజిల్ వేసిన ధ్వని ఇంకా  ఆ గదిలో వినిపిస్తూనే వుంది. సెంట్ పరిమళం గాలిలో కదలాడుతూంది. చాలా మామూలుగా... భార్య ఆరోగ్యంగా వున్నా, పడుకున్నా పెద్ద తేడా  లేనట్టుగా వి...జి...ల్....! అదీ ఆమెని బాధ పెట్టింది. చాలా చిన్న చిన్న విషయాలే రంపపు ముళ్ళయి మనసుని పరపరా కోస్తాయి. అతడు తన  పక్కన కూర్చుని హడావుడి చెయ్యనవసరం లేదు. డాక్టర్ ని పిలిచి కంగారు పెట్టనవసరం లేదు. తనకి కాఫీ భోజనం ఏర్పాటుచేయడమే కర్తవ్యంగా భావించి అతని మానాన అతను పనులు చేసుకుపోవటం.... అదీ బాధ.... దానికితోడు.... ఆ వి...జి...ల్....
   
    ఒక కల పూర్తి కాకుండానే సూర్యుడు వుదయిస్తూంటే, నెమ్మదిగా ఆవిరైపోయే హిమబిందువులాంటిది నాజీవితం. పిల్లల్ని కనటం, పెద్ద చేయటం, పెళ్ళిళ్ళుచేసి పంపటం......పైకి వెళ్ళిపోవటం. ఇంతే..

    స్మరిస్తేనే పద్యం.

    శృతి చేస్తేనే వాద్యం.

    నైవేద్యమిస్తేనే హృదయం!!!

    నేనోస్తూంటే నీ నరాల్లో అలజడి వుండదు. నేను నడిచివస్తూన్న రహదారుల పక్కన అందమైన గడ్డిపూలు వూగవు. విషాదమేమిటంటే గుబులు కూడా వుండదు. 'ఇది నా విషాదమ'ని చెప్పుకోవటానికి కారణం కూడా వుండదు. అదీ విషాదం.

    'నువ్వు ఏ విషయంలో తీరికలేకుండా వున్నావో చేపుతే, నీవు ఎలాంటి వాడివో చెపుతా'నన్నాట్ట ఒక వేదాంతి. నీకు తీరికలేకుండా పోవటానికి నేను కారణం అయ్యుంటే ఎంత బావుండేది!

    నిజమైన ప్రేమంటే..... శృతిమించినప్పుడూ, శుష్కించినప్పుడూ ఒకేలా వుండేది.


                                                                              4

    ప్రహసిత్ మెట్లు దిగి క్రిందకి వచ్చాడు. అతడి కోసం క్రింద బెంజ్ వెయిట్ చేస్తోంది. రణధీర్ పంపిన కారు అది. రణధీర్ జమీందారీ వంశానికి చెందినవాడు. పెద్ద పెద్ద  నగరాల్లో అతడికి ఇండస్ట్రీస్ వున్నాయి. రాజకీయాల్లో కూడా పేరుంది.

    రణధీర్ కూతురు మలయ పవని. ఆ అమ్మాయి  సిమ్లాలో చదువుతూంది. ప్రహసిత్ అంటే ప్రాణం. టెన్నీస్  అంటే ప్రాణం. అయితే మిగతా అభిమానుల్లాగా అతనితో డైరెక్టుగా పరిచయం పెంచుకోకుండా, అతనంటే  తనకున్న  ఇష్టాన్ని తండ్రికి చెప్పింది. రాజు తల్చుకుంటే ఇక కొదవేముంది. ప్రహసిత్ గురించి ఎంక్వయిరీ చేయించాడు.

    ప్రహసిత్ కి తల్లిదండ్రులు లేరు. డాక్టరు. బాగా డబ్బుంది. ఏ దుర్గుణాలూ లేవు. అంతకన్నా కావాల్సింది ఏముంది? ఇవన్నీ చూసి తనతో ఆర్ధికస్థాయిలో సరితూగలేకపోయినా, అతడిని అల్లుడిగా చేసుకుందామని తానే స్వయంగా వచ్చి కలుసుకున్నాడు.

    ప్రహసిత్ కి కూడా  'నో' అనటానికి కారణం ఏదీ కనిపించలేదు. మలయపవని చక్కటి అమ్మాయి. ఒక టెన్నిస్ పోటీలో తనని మామూలుగా కలిసింది. రణధీర్ మాటలద్వారా ఆ అమ్మాయి బాగా వీణ వాయిస్తుందనీ, ఇంగ్లీషు లిటరేచర్ అంటే చాలా ఇష్టమని తెలిసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ అమ్మాయిని చేసుకోవటం ప్రహసిత్ దే అదృష్టం.

    ఈ సాయంత్రం పెళ్ళిచూపులు.

    అంటే అది డిక్షనరీ అర్థం వచ్చేమాట కాదు. ఆ రోజు కేవలం ఆ డేవిస్ కప్ మ్యాచ్ చూడటానికే మలయపవని ఆ వూరొచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఆమెతో కూడా వచ్చారు. మలయపవని తల్లి ఆ విధంగా ప్రహసిత్ ఒకసారి చూడాలనుకుంది.

    రణధీర్ కి ఆ  వూళ్ళో గెస్ట్ హవుస్ వుంది. ప్రహసిత్ కోసం కారు పంపాడు ప్రహసిత్ ఇప్పుడు వెళ్తున్నది అక్కడికే.

    ఈ రోజు డేవిస్ కప్ మ్యాచ్ ప్రహసిత్ గెలవటం రణధీర్ కి సంతోషంగా వుంది. ఓడిపోయినా మూడ్ లో ఈ పెళ్ళిచూపులు జరిగివుంటే అంత  బావుండేది కాదు.

    ప్రహసిత్ ని భార్యకి పరిచయం చేసాడు రణధీర్. మలయపవని కూడా వచ్చి కూర్చుంది. టీ తాగి కొంచెంసేపు మాట్లాడుకున్నాక "వాళ్ళు మాట్లాడుకుంటార్లే, మనం అలా ఈవెనింగ్ వాక్ కి  వెళ్ళొద్దాం పద" అని భార్యని బయల్దేరతీసాడు.

    ప్రహసిత్, పవని మిగిలారు. కొంచెంసేపు మౌనంగా వున్నాక మలయ పవని నవ్వుతూ అన్నది..... "మిమ్మల్ని చూస్తే ఎవరూ మీరొక డాక్టరనీ, ప్రముఖ టెన్నీస్ ప్లేయర్ అనీ అనుకోరు."

    "ఎందుకని?"

    "ఇంత నిశ్శబ్దంగా వుంటే....."

    ఆ మాటలకి ప్రహసిత్ మాట్లాడలేదు. తరువాత అన్నాడు...."నేను కాస్త ఎక్కువగానే మాట్లాడుతాను. హుషారుగానే వుంటాను. అయితే ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో పడ్డాను."

    ఆమె ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. అతడు ఆమెవైపు చూసి నవ్వేడు. ఆ  నవ్వులో ఒక స్నేహభావం మాత్రమే వుంది. అతనన్నాడు. "మీరు చాలా అందంగా  వుంటారు. సంస్కారం వున్నట్టు కనబడుతుంది. కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకోగలరు అని అనుకుంటున్నాను."

    "మీరే విషయం చెపుతున్నారు ప్రహసిత్"?

    అతడామె ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పకుండా తను అనుకున్నది చెప్పసాగాడు.

    "ఇదే విషయాన్ని నిన్నటిరోజు నాకెవరయినా చెప్తే కొట్టిపడేసి వుండేవాడిని. ఎగతాళి చేసేవాడిని. కానీ ఇప్పుడు నేను అదే పరిస్థితిలో పడ్డాను. ఇదంతా మీకు చెప్తే తేలికభావం కలగొచ్చు. కానీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి" అని ఆగి  "ఈరోజు ప్రొద్దున్న మ్యాచ్ జరుగుతుండగా ఒకమ్మాయిని చూసాను. ఆ అమ్మాయిని దూరంనుంచి చూసే నేను ప్రేమించాను" అన్నాడు.

    యధాలాపంగా వింటూన్న మలయపవని ఒక్కక్షణం ఉలిక్కిపడింది. పదహారేళ్ళ కుర్రాడు అన్నట్టుగా వున్నదామాట. ఇండియాకి ప్రాతినిధ్యం వహించే యువకుడు అన్నట్టుగా లేదు. ఒక డాక్టర్ అన్నట్టుగా లేదు. మ్యాచ్ జరుగుతూండగా అమ్మాయిని దూరంనుంచి చూడటం ఏమిటి? ప్రేమించటం ఏమిటి?

    "మీకు నవ్వు రావొచ్చు. ఈ అనుభవం జరగకపోయివుంటే అసలిలాటి భావం ఒకటి కలుగుతుందని నేనే నమ్మకపోయి వుండేవాడిని. ఆ అమ్మాయిని చూడగానే తను నా కోసమే పుట్టింది అన్పించింది. ఐ.....ఐ కుడ్ నాట్ జస్ట్ ఎస్కేప్ ఇట్.."

    "ఆ అమ్మాయి పేరు?"

    "తెలీదు"

    ఆమె ఆశ్చర్యంగా 'తెలీదు' అంది.

    "లేదు. కానీ ఎక్కడున్నా పట్టుకుని తీరతాను"

    ఆమె నవ్వి "విష్ యు ఆల్ ది బెస్ట్" అంది.

    "సారీ పవనిగారూ..... పెళ్ళి చూపులవరకూ తీసుకొచ్చి ఈ విషయం చెపుతున్నందుకు సారీ. నా చర్య, నా ఆలోచన..... అంతా స్టుపిడిటిగా మీకు అనిపించవచ్చు. ముక్కూ, మొహం తెలియని అమ్మాయి.....ఆ అమ్మాయి ఎవరో....మేనరికం వుందో..... ఎవర్నైనా ప్రేమించిందో....ఏమీ తెలియకుండా.....వన్ వే ట్రాఫిక్ లా ప్రేమించి..... అదే సాయంత్రం మీ దగ్గిర పెళ్ళిచూపులకొచ్చి ఆ విషయం చెప్పటం....."

    "అదే ప్రేమంటే" అంది మలయపవని అతడి మాటలు మధ్యలో కట్ చేస్తూ....

    అతడాశ్చర్యంగా తలెత్తాడు.

    "అది ప్రేమ అనుకోవటం స్టుపిడిటీ కాదు. అనుకోకపోవటం స్టుపిడిటీ.... ఒకర్ని చూస్తే అకారణంగా వాళ్ళతో స్నేహం చేయాలనిపిస్తుంది. అభిమానం కలుగుతుంది. వ్యక్తిత్వాలు, అర్థం చేసుకోవటాలూ అవన్నీ తరువాత వచ్చేవి.గాంధీగారి భావాలు మనకు నచ్చవచ్చు. వ్యక్తిత్వం గొప్పగా కనపడవచ్చు. అందుకని  ఆయన్ని  వివాహమాడాలనుకోం! రోమాటింక్ ఫీలింగ్..... అదీ ముఖ్యం!" అంది.

    "థాంక్స్, మీరు నన్ను అర్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంతవరకూ తెచ్చినందుకు మరోసారి క్షమాపణ చెప్పుకుంటున్నాను".

    "అబ్బే. అదేం లేదు. నా అభిమాన ప్లేయర్ తో కలిసి 'టీ' తాగే అవకాశం లభించింది. అది చాలు. ఆ అదృష్టవంతులెవరో..... తొందర్లో శుభలేఖ పంపండి" అంది నవ్వుతూ.

    ప్రహసిత్ కూడా తేలికపడ్డ మనసుతో నవ్వేడు. "డానికి చాలా IFS BUTS వున్నాయి. అన్నిటికన్నా ముందు ఆ అమ్మాయి ఎవరో తెలియాలి కదా."


                                      5

    టి.వి.లో లైవ్ ఇంటర్వ్యూ వస్తోంది.

    ఆ రోజు డేవిస్ కప్ మ్యాచ్ గెలిచిన సందర్భంగా తెలుగువాడైనా ప్రహసిత్ ని హైదరాబాద్ దూరదర్శన్ ఇంటర్వ్యూ చేస్తూంది.

    "ఓడిపోబోతున్న చివరిక్షణంలో గెలవడం మీకెలా అనిపించింది?"

    "నాకెందుకో ఈ రోజు గెలుస్తామన్న నమ్మకం కలిగింది."

    "ఎలా?" ఇంటర్వ్యూ చేసే అమ్మాయి ఆశ్చర్యంగా అడిగింది.

    "నిన్న సాయంత్రం నా దగ్గరికి ఒక సాధువు వచ్చాడు. నాకు శుభం కలుగుతుందని, దాని కోసం పూజ ఒకటి చేయాలనీ చెప్పి, అయిదొందలు ఇమ్మన్నాడు. ఇటువంటి విషయాల మీద నమ్మకంలేని నేను అతడిని నిరాకరించాను. దాంతో  అతడికి కోపం వచ్చి 'ఈరోజు ఆటలో మానసికంగా వోడిపోయే స్థితికి చేరుకుంటాననీ, అప్పుడు  తనని తల్చుకొమ్మనీ, అన్నాడు. తన మహత్తుమీద నమ్మకం కలిగితే, ముందు వరుసలో ఒక దేవి అంశవున్న స్త్రీ  కూర్చుని వుంటుందని, బంతిని ఆమె తన వడిలోకి ఆకర్షించి, తన శక్తిని దానికి ఆపాదిస్తుందని, అప్పటితో దశ తిరుగుతుందని అన్నాడు. అతని మాటల మీద  నమ్మకం లేక నేను దాన్ని పట్టించుకోలేదు. కానీ అతడు చెప్పినట్టే జరగటం మొదలైంది. అంతలో ఒక ఆకుపచ్చ చీరె కట్టుకున్న ఆమె ముందు వరసలో కనపడింది. అప్పటివరకూ నేను ఆటలో గెల్చినా, మానసికంగా ఓడిపోతూ వచ్చాను. అప్పుడు బంతి వెళ్ళి ఆమె వొళ్ళోపడింది."

 Previous Page Next Page