Previous Page Next Page 
చీకట్లో సూర్యుడు పేజి 28


    చాలా రోజులు యశ్వంత్ స్పృహలో లేడు. మొత్తం బాధ్యత అంతా వాయుపుత్ర మీద పడింది. యశ్వంత్, నిఖిల్ సపర్యలు అనూహ్య చూసుకునేది. నిఖిల్ ని చూస్తుంటే ఆమెకు తన అన్నయ్య గుర్తొచ్చేవాడు. కొంతమందిని చూస్తే ఇలాటి అన్నయ్య వుంటే బావుణ్ణు అనిపిస్తుంది. నిఖిల్ అలాంటివాడే.

    మొదటి రెండురోజులు యశ్వంత్ పరిస్థితి ఆందోళనకరంగా వున్నా- క్రమంగా సర్దుకున్నాడు. పదిరోజులపాటు ఆమె  కంటిమీద కునుకు లేకుండా సేవ చేసింది. ఆమె జీవితంలో ఆ పదిరోజులే అత్యంత సంతృప్తికరమైన దినాలు.

    అప్పుడప్పుడు వాయుపుత్ర వచ్చి చూసేవాడు. అతను వచ్చినప్పుడు యశ్వంత్ కి అత్యంత సామీప్యంలో వున్న ఆమె లేచేదికాదు. దాన్ని అతడు గుర్తించాడో లేదో కూడా పట్టించుకునే స్థితిలో లేదామె.


                              *    *    *

    వాళ్ళిద్దరూ పూర్తిగా కోలుకునే సమయానికి, వారి నౌక బృహస్పతి గ్రహం పక్కగా వెళ్తోంది. అది గ్రహంకాదు, రోదసీలో తేలుతున్న "వాయుసముద్రం". దట్టంగా, గాఢంగా, తెల్లటి మబ్బులు పేరుకున్నట్టుగా, చిక్కగా వుంది. నేల నీరు అన్న సరిహద్దులు లేవు. పర్వతాలు, లోయలు లేవు. కేవలం దట్టమైన వాయు సమూహం. అంతే....ఆ "వాయుగ్రహం" అతి వేగంగా, బొంగరం కంటే వేగంగా, తన చుట్టూ తను తిరుగుతూంటే (భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు తీసుకుంటే, దాన్ని317.9 రెట్లు పెద్దదైన అంగారక గ్రహం కేవలం పదిగంటల్లో ఒక చుట్టు తిరుగుతుంది. దాన్ని బట్టి వేగాన్ని వూహించుకోవచ్చు.)  ఆ దృశ్యాన్ని చూస్తూంటే కళ్ళు చెదురుతున్నాయి. ఆ మేఘగర్భంలో వేడికీ, వెలుతురుకీ రకరకాల రంగులు మారుతున్నాయి. దానిచుట్టూ నక్షత్రాలు, దగ్గిరగా  చందమామలూ, వాంగోగ్ చిత్రం "స్టార్ నైట్" ని  గుర్తు తెస్తున్నాయి. ఒకగ్రహాన్ని అంత దగ్గర్నుంచి చూడగలగటం అద్భుతం. జన్మసార్థకం.

    "ఆ తెలుపు, అదంతా అమోనియా గ్యాస్ మయం. ఎరుపు రంగు కాలిపోయే వేడి ప్రదేశం! వాతావరణం ఆ ప్రాంతాల్లో కృంగిపోతున్నదన్నమాట. నీలంరంగు చారలన్నీ శూన్యప్రదేశాలు. కనిసిస్తున్న ఎరుపురంగు పాస్ఫరాస్, సల్ఫర్ వాయువులు, వాటి మీద సూర్యకిరణాలు పడి ఆల్ట్రావయోలెట్ గా పరావర్తనం చెందుతూ రంగురంగుల రూపాలని కలగచేస్తోంది. దాదాపు నాలుగు మిలియన్ల సంవత్సరాల క్రితం మన భూమి యిలాగే వుండేది" అన్నాడు వాయుపుత్ర.

    "అదేమిటి?" అడిగింది అనూహ్య. జూసిటర్ కి దూరంగా ఎర్రటి మచ్చమెరుస్తోంది.

    "అది జూపిటర్ కు  ఒక ఉపగ్రహం. యూరోసా, గావిమాడ్, కాలిస్టో- ఆ మూడు జూపిటర్ కి చందమామలు- ఒక భర్తకి ముగ్గురు భార్యల్లా-" నవ్వేడు వాయుపుత్ర. ఆమె నవ్వలేదు.


                              *    *    *

    కెవ్వుకెవ్వుమన్న పసిపాప ఏడుపుతో అలుముకున్న మత్తు కొద్దికొద్దిగా విడిపోయింది శ్రీజకి. కళ్ళు విప్పి చూసింది.

    అప్పుడే పుట్టిన పాప! ఆమె మనసంతా మాతృత్వ భావపు ఉద్వేగంతో నిండిపోయింది. పాపవైపు అపురూపంగా చూసుకుంది. ఆమెకు తన భర్త తరంగాల ద్వారా పంపిన ఉత్తరం గుర్తొచ్చింది. (మరచింది ఎప్పుడని?)

    "శ్రీజా,
   
    ఈ సందేశం నీకు అందేసరికి నేను తండ్రినై వుంటాను. బాబు పుట్టినా పాప పుట్టినా- 'అనంత' అన్న పేరు ముందు వచ్చేలా పెట్టు. ఈ నిరంతర శూన్యవిశ్వంలో గుమ్యం లేకుండా మేము వెళ్తూంటే, తరచూ నాకెందుకో ఆ పేరు గుర్తొస్తుంది. ఆనంతరాగ, ప్రేమానంత- లాటి పేరేదైనా సరే, నీ ఇష్టానికే వదిలేస్తున్నాను.

                    -నిఖిల్."
    ఆమె నిఖిల్ కోసం ఒక ఉత్తరాన్ని వ్రాసింది. మరుసటిరోజు దాన్ని సైన్స్ సిటికీ పంపిద్దామనుకొంటూ వుండగా, ఆ సాయంత్రం టీ.వి.లో వార్త వచ్చింది.

    అంతరిక్షనౌక సుహృద్భావ్ ఆస్టరాయిడ్స్ మధ్యలోంచి వెళుతోంది. ఒక  విస్ఫోటన ప్రమాదాన్ని కొద్దిలో తప్పించుకుంది. దాని వేగం పెరగటం వల్ల ఇక భూమినుంచి ఆ వాహనానికి ఏ వార్తలూ చేరలేవు......" ఈ చివరి వాక్యం శ్రీజకి కంగారు పెట్టింది. సైన్సు విద్యార్థినీ అవటంవల్ల ఆమె కారణాన్ని ఊహించగలిగింది. కానీ వాస్తవం ఆమెని దుఃఖంలో ముంచెత్తింది. ఇక తన భర్తతో తను మాట్లాడలేదు. దిగంతరాళాల్లో ఎక్కడో, ఏ మూలనుంచో అతడు పంపే చిన్న చిన్న సందేశాల్ని అందుకోగలదంతే.

    "అంతరిక్ష నౌక సుఖ ప్రయాణంకోసం ప్రపంచపు నలుమూలలా ప్రార్థనలు జరుపుతున్నారు. మానవజాతి భవిష్యత్తుని నిర్ణయించే ఈ ఖగోళయాత్ర జయప్రద మవ్వాలని పోప్ పాల్......" ఆమె టీ.వీ. కట్టేసింది.

                                                                           4


    "డాక్టర్ ఫిలిప్స్" పిలిచింది అనూహ్య.

    "యస్"
   
    "మీతో కొంచెం మాట్లాడాలి."

    "ఏం, ఆరోగ్యం బావుండటం లేదా?" మృదువుగా అడిగాడతడు. "అబ్బే, అదేం లేదు. మనసే బావుండటంలేదు. మీ సలహా కావాలి నాకు."

    "కొంతవరకు నీ సమస్య అర్థం చేసుకున్నాను."

    "అంతగా బయటపడ్డానా డాక్టర్?"

    "నీకంటే వాయుపుత్ర యశ్వంత్ లే ఎక్కువగా బయటపడ్డారు" నవ్వేడు. "యశ్వంత్? నేను నమ్మను."

    "వాయుపుత్ర నీవైపు చూసే ఒక్కచూపులో అతడి మనసు పట్టెయ్యవచ్చు. ఇక యశ్వంత్ అంటావా-మామూలు సమయంలో నిగ్రహించుకునేవాడేమోగాని డెలీరియంలో తనకు తెలియకుండానే మాట్లాడాడు - స్పృహలేకుండా నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నదీ......"

    అనూహ్య ముఖం మ్లానమయింది.

    "సమస్య మీకు తెలిసింది మాత్రమే కాదు డాక్టర్? యశ్వంత్ నా మాజీ భర్త-"

    బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డాడు ఫిలిప్స్! ఆమె ఏదీ దాచుకోలేదు. అంతా వివరించింది.

    "డాక్టర్, యశ్వంత్ దగ్గరుంటే అతడికి చాలా ఆత్మీయురాలినని చాలా గర్వంగా ఫీలవుతుంటాను. అలాంటి వ్యక్తిని భర్తగా పొంది దూరం చేసుకున్నాననుకున్నప్పుడల్లా గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. కాని వాయుపుత్రకి నామీదున్న ప్రేమ నేను భరించలేనంత గాఢమైంది. ఒక మనిషి ఒకసారే యిద్దర్ని ప్రేమించడం ఎలా సంభవమో నా కర్థం కావడంలేదు. ఒకే వరలో రెండు కత్తుల్ని ఇమడ్చడానికి చేసే ప్రయత్నంలో నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. ఇలాంటి సమస్య ఇంతకుముందు ఎవరికైనా వచ్చిందేమో నాకు తెలీదు.

    మరో సమస్య ఏమిటంటే వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి గాఢమైన స్నేహం. ప్రేమ, భక్తి. అదే నా నిర్ణయాన్ని ఒకరివైపు మళ్ళించకుండా అడ్డు పడుతుందనుకుంటాను."

    "మీ పరిచయం అయి ఇన్నాళ్ళయినా ఇంతకాలంగా ఒకరి గురించి మరొకరికి తెలియనివ్వకపోవడం పొరపాటు."

    "ప్రయత్నం చేశాను డాక్టర్. వీలుకాలేదు. అది నావల్ల కావడం లేదసలు."

    "నీ మాటలనుబట్టి యశ్వంత్ పట్ల నీ ప్రేమ ఎవ్వంత ఎక్కువగా వున్నట్లనిపిస్తోంది. అతడికి భార్యగా వుంటే మిగతా విషయాలన్నీ మర్చి పోగలవు."

    "లేదు డాక్టర్. ఆ రకంగానూ ఆలోచించాను. ఎవరికి దగ్గరైనా రెండోవాళ్ళకి అన్యాయం చేసిన ఫీలింగు వస్తుందనుకుంటాను. ఒక్కప్పుడు ఈ ఇద్దర్నీ గురించి కాదు, నా కర్తవ్యం పట్లే మనసుని కేంద్రీకరించాలనే నిర్ణయానికొచ్చాను. కాని ఈ చిన్న వాహనంలో ఇద్దరిమధ్యా జీవిస్తూ మనసుని అదుపులో పెట్టుకోవటం కష్టంగా వుంది."

    "నీ మనోభావాలు వాళ్ళకు తెలియకపోవటం నీలో మరింత ఘర్షణ రేగిస్తోంది అనూహ్యా. కనీసం ఒకరికైనా తెలియపరిస్తే నీ సమస్యకి పరిష్కారం సులభమౌతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు" అన్నాడు ఒక నిర్ణయానికి వచ్చినట్టు. ఆమె సాలోచనగా తలూపింది. తన నిర్ణయం ముందు ఎవరికి చెప్పాలి? యశ్వంత్ తట్టుకోగలడేమోగానీ, వాయుపుత్ర తట్టుకోగలడా?

   
                              *    *    *

    "బ్రహ్మవిద్యా మన స్పీడ్ కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తోంది."

    "సోలార్ టాంక్ ల నించి శక్తి సరిగ్గా సరఫరా అవడంలేదు."

    "తప్పు ఎక్కడుందో సరిగ్గా చూసి చెప్పు."

    "ఏమో నాకు సరిగ్గా తెలియడంలేదు."

    "ప్రయత్నం చెయ్యి. పవర్ టాంకులు ఎనభై అడుగుల ఎత్తువరకు వున్నాయి. అందులో ఎక్కడో సరిగ్గా చెప్పాలి."

    "నాలుగో టాంకు పక్కన జాయింటు పానెల్ మార్చాలనుకుంటాను."

    "మన దగ్గర స్టాకుంది కదూ?" అడిగాడు. కంప్యూటర్ వెంటనే జవాబు ఇవ్వలేదు.

    "ఉంది" అంది కొంచెం సేపయ్యాక.

    "ఎందుకంత భయపడుతున్నావ్? అయిదు నిముషాల పని అది."

    "అయితే చేసిరా" సైన్సు చరిత్రలో కంప్యూటర్ వెంటనే సమాధానం ఇవ్వలేకపోవటం బహుశ మొదటిసారి.


                                                          *    *    *

    వాయుపుత్ర స్పేస్ సూట్ వేసుకొని తయారయ్యాడు. కంట్రోలు దగ్గర కూర్చుంది అనూహ్యా. వాహనాన్ని న్యూట్రల్లోకి తీసుకొచ్చాడు యశ్వంత్. శూన్యంలో తన చుట్టూ తాను తిరుగుతూ పైకి కదులుతోంది సుహృద్భావ్. (న్యూట్రల్ అంటే ఒకే వేగంతో ప్రయాణించటం. మనిషి బయటవుండగా వాహన వేగంలో మార్పు రాకూడదు.)

    తెరమీద వాయుపుత్ర బయటికి వెళ్ళడం కనిపిస్తోంది. అనూహ్యకి భయంగా వుంది. స్పేస్ లో నడిచేవారిని భూమి పైనుండి టీ.వీ. స్క్రీన్ మీద చూడటం తప్ప ప్రత్యక్షంగా  చూడడం, అందులో కంట్రోలు దగ్గర  తను మాత్రమే వుండడం భయంగా వుందామెకు.

    వాయుపుత్ర శూన్యంలోకి అడుగుపెట్టాడు. వెంటనే వెనుక తలుపు మూసుకుంది. అతడు మెల్లగా క్రిందకు జారుతున్నాడు. ఏ ఆధారమూ లేకుండా అతడలా జారుతుంటే ఏ క్షణంలో క్రిందకు పడిపోతాడో నన్నట్లు ఊపిరి బిగపట్టి చూస్తోంది అనూహ్యా.

 Previous Page Next Page