"దురదృష్టం నాదికాదు నీది, పదివేలూ సిద్దంచేసుకో...."
చంచల్రావుక్కణ్ణించి విసురుగా వెళ్ళిపోయాడు. అప్పుడు అరవింద తనపక్కనేవున్న ఫోన్ తీసి ఓనంబర్ డయల్ చేసింది.
"సాగర్ స్పీకింగ్" అంది అవతలి కంఠం.
"నేను- అరవిందను....ఇప్పుడే చంచల్రావొచ్చి- మీరిద్దరూ పదివేలు పందెంకాసుకుని ఓ అమ్మాయిని మోసం చేయాలనుకున్నారనీ- అందుల నువ్విప్పుడు నెగ్గుతున్నావనీ నిర్మాలనే అమ్మాయి రేపురాత్రి నీ ఆఫీసుగదికి వస్తుందనీ చెప్పాడు. జరగబోతున్న ఘోరాన్నాపమని నన్ను వేడుకున్నాడు....."
క్షణకాలం అవతలినుంచి మాటలేదు.
"హలో...." అంది అరవింద.
"ఊఁ"
"దానికి నేనేమన్నానో తెలుసా?"
"చెప్పు...."
"అంతా నువ్వేముందు నాకు చెప్పావన్నాను. ఇందంతా తమాషా అన్నాను. పందెలో నెగ్గడానికి నువ్వు నిర్మలతోకలిసి నాటకమాడుతున్నావన్నాను...."
"ఇదంతా నీకు ముందే ఎలాతెలిసింది?"
"మైడియర్ సాగర్ - నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీగురించి నాకు పూర్తిగా తెలుసు. నువ్వు నన్ను మోసంచేయవు. చేయలేవు...."
"ఎందుకని?"
ఒట్టేశావుగా....." నవ్వింది అరవింద.
"థాంక్యూ అరవిందా! ఆపదివేలలో ఓ రెండువేలునీవి. రెండువేలునిర్మలవి....."
"పూర్ చంచల్రావు!" అని ఫోన్ పెట్టేసింది అరవింద. కానీ ఎందువల్లనో ఆమె మనసు తేలిక పడలేదు. ఆమె ఆలోచిస్తూండగానే మళ్ళీ ఫోన్ మ్రోగింది.
"హలో!" అంది అరవింద.
"నేను - సాగర్ని !"
"ఏమిటి విశేషం.....ఏదైనా మర్చిపోయావా?"
"రేపు తమాషా చూడ్డానికి నువ్వూ వస్తున్నావా?"
"వస్తే చంచల్రావు ముందు నిన్నవమాసించినట్లేకదా!"
"థాంక్సే లాట్ అరవిందా! నీ నమ్మకం నాకు నీమీద గౌరవాన్ని పెంచుతోంది..."
అప్పుడు అరవింద ఫోన్ ద్వారా సాగర్ కు ముద్దుపంపించింది.
19
అది సాగర్ ఆఫీసుగది. గదినానుకుని అటాచ్డ్ బాత్ ఉన్న బెడ్రూం ఒకటుంది. అందులో డబుల్ బెడ్ మీద కొత్త దుప్పటి పరిచాడతడు. దిండ్లకు కొత్తగలేబులు తొడిగాడు. కొద్దిగా పన్నీరు మంచంమీద చిలకరించాడు. మల్లెపువ్వులు కొన్ని గది బీరువాలో ఉంచాకు.
సాగర్ ఇప్పుడు ఆఫీసుగదిలో నిర్మలకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. టైము ఏడు దాటింది. నిర్మల వస్తుందా, రాదా అన్నదే అతడి ఆలోచన. ఆమె వస్తుందన్న ఆశ, రాదేమోనన్న భయం. అతడి మనసులో భీకరపోరాటాన్ని సలుపుతున్నాయి. ఆ సమయంలో కాలింగ్ బెల్ మ్రోగింది. సాగర్ తనేవెళ్ళి తలుపు తీశాడు. గుమ్మం ముందు నిర్మల!
"లోపలకురండి!" అన్నాడతడు. నిర్మల లోపలకు వచ్చింది తలుపు దానంతటదే మూసుకుంది.
"రావేమోనని భయపడ్డాను...."
"రాకపోతే భయమెందుకు?" అంది నిర్మల.
"కూర్చోండి-" అన్నాడు సాగర్ ఆమె ప్రశ్నకు బదులివ్వకుండా.
"ఇంకా మీ స్నేహితులెవరూ వచ్చినట్లులేదే!"
"వాళ్ళెవరూరారు...." అన్నాడు సాగర్.
"ఎందుకని?"
"ఇక్కడ మనిద్దరం ఏకాంతంగా కలుసుకొనే అవకాశంవచ్చినప్పుడు మనమధ్య వేరేమనిషి ఉండకూడదానిపించింది!" అన్నాడు సాగర్. నిర్మల మాట్లాడలేదు.
"నిర్మలా ! నేను మీరువస్తారనీ భయపడ్డాను. రారనీ భయపడ్డాను"
"ఎందుకు?"
"రోజూ మిమ్మల్ని కలుసుకున్నప్పుడెంతో నిర్మలంగా ఉండగాలిగాను కానీ ఈరోజీలా ఇక్కడ ఏకాంతంగా కలుసుకుంటామనగానే నామనసు పెడరులు తొక్కింది. నా మీద నాకేనమ్మకం పోయింది. ఏవేవో పిచ్చిపనులు చేశాను. గదిలో పక్కలు మార్చాను పన్నీరుచల్లాను మల్లెపూలు కొనిపెట్టాను. కానీ ఇది తప్పని నాకుతెలుసు. అందుకే మీరు రాకుంటే బాగుండునని అనుకున్నాను...."
"కానీ నేను వచ్చాను...." అంది నిర్మల.
"నా మనసు వశంతప్పుతోంది. నాకు భయంగావుంది...."అన్నాడు సాగర్.
"నాకు భయంగాంగాలేదు...."అంది నిర్మల.
"సాగర్ ఆశ్చర్యంగా ఆమెవంక చూశాడు నిజంగానే ఆమెలో ఆదుర్దా కానీ, వణుకుగానీ కనిపించడంలేదు. ఎప్పటిలాగే నిర్మలంగా వుంది.
"నామీద మీకున్న నమ్మకానికి థాంక్స్..... కానీ నిలబెట్టుకోలేనేమో!"
"ఒట్టువేయమని చేయిసాచితే- వివాహంకానిదే నాచేయికూడా తాకనన్నారు మీరు. మీమీద నా నమ్మకం ఎలా పోతుంది?"
సాగర్ వెంటనే- "అందరికీలేని కొన్ని సెంటిమెంట్లు నాకున్నాయి. అలాగే అందరికీ వుండే సెంటిమెంట్లు కొన్ని నాకులేవు. పెళ్ళంటే హొమం ముందు కూర్చుని- మంత్రోచ్చారణమధ్య ఒక పురుషుడు స్త్రీకి తాళికట్టడం కాదని నా అభిప్రాయం ఒకరినొకరు అర్ధం చేసుకున్న యువతీయువకులు తొలిసారిగా స్వార్ధాన్ని, అహాన్ని , సర్వాన్ని మరిచిపోయి ఒకరిలో ఒకరు ఐక్యం కావడమన్నదే పెళ్ళిఅని నా అభిప్రాయం. ఈ పెళ్ళికి వేదమంత్రాలవసరంలేదు. తాళివుడందు కానీ అదే అసలైన పెళ్ళి.... ఈరోజు నా కెందుకో మనపెళ్ళి జరుగుతుందనే అనిపించింది"
"తప్పకుండా జరుగుతుంది....." అంది నిర్మల.
సాగర్ కళ్ళలో వెలుగు కనిపించింది-" థాంక్స్!" అన్నాడతడు.
"మన మధ్య ఇటువంటి మర్యాదలు వద్దు. పెళ్ళికి ముందు మనం ఒకరినొకరు మరి కాస్త అర్ధం చేసుకోవాలి. అందుకు మన్నన వదలడం మొదటిమెట్టు. నేను నిన్ను సాగర్ అంటాను. నువ్వునన్ను నిర్మలాఅను....." అంది నిర్మల.