Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 26


    తెచ్చుకున్న ఆవేశంతో చెప్పుకుపోతున్నారు మంత్రిగారు. ముందు సీట్లలో కూర్చున్నవారు మహదానందంతో  తలలు ఆడిస్తూ, టపాకాయల శబ్దాలను మించిన  శబ్దాలతో చప్పట్లు కొట్టసాగారు.


    అయితే.... తాగే పానకంలో పుడక పడ్డట్లు, తింటున్న ఇడ్లీలో బొద్దింక వచ్చినట్లు - అకస్మాత్తుగా శ్రీవారి ఉపన్యాసానికి అడ్డుకట్ట పడింది.


    జనం మధ్యనుంచి "భాగ్యారావు డౌన్ - డౌన్" అంటూ కేకలు వినిపించాయి.

 
    ఈ హఠాత్పరిణామానికి  అమాత్యులవారు అవాక్కయిపోయారు వేదిక మీదున్న ప్రముఖులు  వెలవెలబోయారు. ముందుసీట్ల వారి మెడలు అప్రయత్నంగా  వెనక్కి తిరిగాయి.


     సభా నిర్వాహకుడు మైకు దగ్గరకు వచ్చి, "మహాశయులారా! దయచేసి నిశ్సబ్దంగా వుండాలని ప్రార్దన! మన దేశంలో, అందులోనూ మన రాష్ట్రంలో జరుగుతున్న  అభివృద్దిని సహించలేని, మన ప్రభుత్వం సాధించిన ప్రగతిని చూసి అసూయపడేటటువంటి దుష్టశక్తులు కొన్ని, కొందరు సి. ఐ. ఏ. ఏజంట్ లు, ఒకవిదేశీ హస్తం కల్లోలాలను సృష్టిస్తున్న విషయం మీ అందరికీ తెలిసినదే! అలాంటివారికి గట్టి గుణపాఠం నేర్పాలి. ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకుంటే అధ్యక్షులవారి అనుమతి తీసుకుని మైక్ దగ్గరకు వచ్చి మాట్లాడవచ్చు. లేదా అడగదలచుకుంటే కాగితం మీద రాసి పంపవచ్చు. అంతేకానీ, అల్లరి చేయవద్దనీ, మన ఊరి గౌరవాన్ని నిలపమనీ మనవి!" అంటూ చిన్నసైజు ఉపన్యాసం ఇచ్చాడు.


    నినాదాలు ఇస్తున్నవారు ఏమనుకున్నారో, ఏమోకానీ.... అల్లరి చల్లారిపోయింది.


    అదంతా తన వాక్ప్రవాహపు ప్రభావమేనని మురిసిపోయి కళ్లు మూసుకుని తన్మయత్వంతో తలాడించేశాడు సభా నిర్వాహకుడు.

 
    మరో రెండు నిమిషాలలో రిలే రేస్ లో లాగా అంచెలంచెలుగా ఒక కాగితం జనం చేతుల మీదుగా అధ్యక్షుల వారి హస్త కమలాలకు అందింది.


    అందులోని విషయం చదివి ఆముదం తాగినట్లు ముఖం పెట్టారు వామన మూర్తిగారు. మనం వచ్చేటట్లున్న వారి ముఖారవిందం చూసి ఆందోళనను కప్పిపుచ్చే దృక్కులతో పరస్పర ముఖాలు చూసుకున్నారు భాగ్యారావుగారు, రంగప్రసాద్ గారు.


    "అందులో ఏముందో చదవండి!" అంటూ జనంలోంచి కేకలు వినిపించాయి.


    తప్పదన్నట్లు ఆ కాగితం మీద రాస్తున్న విషయాన్ని చదివారు వామన మూర్తిగారు.

 
    "ఇటీవల మన మంత్రివర్యులు మహర్షి పట్టణానికి వెళ్లి స్వామివారి  ఆలయాన్ని  సందర్శించారు.  ఆ సమయంలో వారి వెంట స్థానిక యం. యల్. ఏ. కూడా వెళ్లారు. అయితే  ఆయన హరిజనుడైన కారణంగా ఆయనను ఆలయంలోకి ప్రవేశించనీయకుండా అవమానం జరుగుతున్నా కిమ్మనకుండా ఉండిపోయారు మీరు. ఈ వార్త పత్రికలలో  ప్రముఖంగా వచ్చింది కూడా.  మీరు ఈ చర్యను ఖండించడం కానీ,  కనీసం  వివరణ ఇవ్వడం  కానీ జరగలేదు. మరి- మీరే ఈ వేదిక మీద హరిజనులను అవమానించే వారిని, వారు ఎంతటి పెద్దవారైనా, ఆఖరికి మంత్రులైనా  ఉపేక్షించకూడదనీ,  శిక్షించాలనీ ఉపన్యాసం దంచుతున్నారు.  సాంఘిక  సంక్షేమ మంత్రిగా వుండిన మీరు, మీ సమక్షంలోనే  గౌరవనీయుడైన హరిజన నాయకుడికి అవమానం జరిగితే కిమ్మనకుండా ఊరుకున్నారు.  యం. యల్. ఏ. గతే ఇలా వుంటే సామాన్య హరిజనుల సంగతేమిటి? మీరు ఏ చర్యా తీసుకొనకపోవడం, ఆ చర్యను సమర్దించడం కాదా? మీరు వల్లించే ఆదర్శాలు, సూత్రాలు నేతి బీరకాయలో నేతి వంటివేనా?మీ ఉపన్యాసాలూ, ఉద్బోధలూ వేదికలకే పరిమితమా?" అని నిలదీసి వుంది అందులో.


     ఆ వాక్యాలు వింటూ వుంటే మంత్రిగారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. కాళ్ళు వణికాయి. ..., కళ్ళు బైర్లు కమ్మాయి. పెదవులు తడి ఆరిపోయాయి. నాలుక పిడచగట్టుకుపోయింది.  అతి ప్రయత్నం మీద మాటలు పెగల్చుకొని, నూతిలోంచి మాట్లాడుతున్నట్లు హీనస్వరంతో -


    "మహా జనులారా! ఇప్పుడే అధ్యక్షులవారు దుష్టశక్తులు, సి. ఐ. ఏ. ఏజంట్లు చేస్తున్న దురాగతాల  గురించి ప్రస్తావించారు. ఈ శక్తులే అక్కడ జరిగిన సంఘటనను కావాలని  వక్రంగా చిత్రించాయి.  ఇందులో విదేశీ ప్రచ్చన్న హస్తం పాత్ర వుందని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఈ విషయమై నేను రేపొక సుదీర్ఘకమైన ప్రకటన చేయబోతున్నాను. ప్రస్తుతం మాత్రం ఈ సంఘటనతో నాకు ఎటువంటి సంబంధం లేదనీ, అసలు ఆ విషయం నాకు తెలియనే తెలియదనీ పత్రికలలో చూసిన వెంటనే వివరణలు కోరారనీ,  ఇది విచారణలో  ఉన్న అంశం కనుక ప్రస్తుతం ఇంతకంటే  ఎక్కువ చెప్పలేననీ మాత్రం మనవి చేసుకుంటున్నాను" అని చెప్పి కుర్చీలో చతికిలపడ్డారు.


     ఆ నాలుగు మాటలు చెప్పేసరికి భాగ్యారావుగారికి ముచ్చెమటలు  పోశాయి.


    మంత్రిగారి  సమాధానం ఎవరికీ రుచించలేదు. మళ్లీ గొడవ మొదలైంది. సభ అర్దాంతరంగా ముగిసింది.

 
    ఈ అధ్యాయం ముగిసిపోలేదు. మహర్షి పట్టణం సంఘటన గురించి శాసనసభలో నానా రభసా జరిగింది. ప్రజలలో తీవ్రమైన కోపావేశాలు పెల్లుబికాయి. ఊరూరా, వాడ వాడలా ఈ సంఘటనను ఖండిస్తూ సభలూ,  సమావేశాలూ జరగసాగాయి.  గోడల మీద  'భాగ్యారావుని మంత్రివర్గం నుంచి తొలగించాలి. ఆయన శాసన సభ్యత్వానికి రాజీనామా  చేయాలి' అన్న రాతలు దర్శనం ఇవ్వసాగాయి.  కరపత్రాల పంపకం జోరుగా సాగింది.

 Previous Page Next Page