Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 26


    అతని కళ్ళలోకి ఓ కొత్త మెరుపువచ్చింది "ఓస్! ఇంతేనా?" అంటూ లేచి నిలబడ్డాడు. ఒకసారి ఆమెకేసి చూసి ఆ అంచుకు వెళ్లాడు. మరుక్షణంలో మాధవి చేయమన్నపని ఎంత అసాధ్యమో అతనికి బోధపడింది. లోయలాంటి ప్రదేశానికి అవతల అంచునుంచి వంగిన కొన్ననందుకోవాలి. ఆ కొమ్మని ఇటువైపు వంచాలి, ఆ పువ్వును కోయాలి.

 

    అతను చేతిని ముందుకు జాచాడు.

 

    ఆమె కుతూహలంగా చూస్తోంది.

 

    అతను కొండ అంచున నిలబడ్డాడు.

 

    ఆమె ఆసక్తిగా తిలకిస్తోంది.

 

    అతను ముందూవెనకా ఆలోచించలేదు. ముందుకు వంగాడు.

 

    ఆమె ఆసక్తి ఆశ్చర్యంగా మారింది.

 

    ఇంకా ముందుకు వంగాడు. ఆమె ఆశ్చర్యం భయంగా మారింది.

 

    ఇంకా ముందుకు.....

 

    గుండె దడదడమని కొట్టుకుంటోంది. పెదవులు తడి ఆరిపోతున్నాయి.

 

    "రాజా!" అని పిలుద్దామనుకుంటోంది. కానీ ఆమె పిలుపు గొంతుదాటి ఇంకా ఇవతలకు రాలేదు. అప్పటికే జరుగవలసిన ఉపద్రవం జరిగిపోయింది.

 

    అతను నిలువునా గాలిలోకి ఒంగాడు. అతని చేతులు కొమ్మని తాకాయి. కానీ పాదాలు గాలిలోకి లేచిపోయాయి.

 

    "రాజా!" అంటూ వెర్రికేక వేసింది మాధవి.

 

    పాదాలు నేలమీదలేవని గ్రహించిన మరుక్షణంలో అతను కొమ్మను పట్టుకున్నాడు. కానీ అతనిబరువుకు కొమ్మ ఆగలేదు. ఫెళఫెళమంటూ విరిగి క్రిందకుజారింది. ఆ కొమ్మతోబాటు రాజాకూడా క్రిందకు జారిపోయాడు.

 

    అతనిప్పుడు కొమ్మని పట్టుకుని అగాధమైన లోయలో వ్రేళ్లాడుతున్నాడు.

 

    కొండలో పాతుకుని వున్న కొమ్మలో బలం గబగబా తగ్గిపోతోంది. అతని బరువుకు ఏ క్షణాన్నైనా పూర్తిగా ఊడిపోయి అతన్తోపాటు అగాధంలోకి కూలిపోయేలా వుంది.

 

    "రాజా!"

 

    "మాధవీ!" జీవితం చివరి ఒడ్డున వ్రేలాడుతోన్న అతను జవాబిచ్చాడు.

 

    కొమ్మ మరికొంచెం వంగింది.

 

    ఆమెకేమి చెయ్యడానికీ పాలుపోలేదు. ఒక్కక్షణం మెరుపులా ఓ ఆలోచన తాకింది. అంతే! ఇహ ఉపేక్షించలేదు. త్వరత్వరగా కట్టుకున్న చీరె విప్పేసింది. లోయకు ఇటువైపున బలమైన చెట్టు వుంది. చీరె ఒక అంచు ఆ చెట్టు మొదట్లో గట్టిగా ముదేసింది. రెండో అంచు క్రిందకు విసిరేసింది.

 

    "రాజా! ఇది పట్టుకో..."

 

    అతను చెయ్యి జాపాడు. చీరె కొన అందింది. దగ్గరకు లాక్కుని గట్టిగా పట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి అతను వ్రేలాడుతున్న కొమ్మ పూర్తిగా విడిపోయింది. కొండనుంచి అతను చప్పున కొమ్మని వదిలేసి రెండోచేత్తో కూడా చీరెను పట్టుకున్నాడు.

 

    మాధవి ఊపిరి బిగబట్టి చూస్తోంది.

 

    అతను చీరె సాయంతో కొంచెం కొంచెం పైకి వస్తున్నాడు.

 

    చీరె అతని బరువును ఆపుతుందా? మధ్యలో చిరిగిపోతే?

 

    నిశ్చేష్టితంగా అలానే చూస్తూ నిలబడింది.

 

    క్రమక్రమంగా పైకి వస్తున్నాడు. ఇంచుమించు చివరికి వచ్చి పట్టు దొరక్క మళ్ళీ వెనక్కి జారిపోతుంటే - తెలివి తెచ్చుకుని చెయ్యి అందించి, బలమంతా ఉపయోగించి అతన్ని బయటకు లాగేసింది.

 

    రాజా పూర్తిగా పైకి వచ్చేశాడు. ఆమెకు అభిముఖంగా నిలబడ్డాడు.

 

    అతని ఒళ్ళంతా కొట్టుకుపోయి, అక్కడక్కడా రక్తం చిమ్ముతోంది. ముఖం వడలిపోయి, కళ్ళు కాంతిని కోల్పోయి, యుద్ధంలో పరాజితుడైన సైనికుడిలా గోచరిస్తున్నాడు.

 

    ఎదురుగా నిలబడి, తనకు తాను అర్థంగాకుండా చలిస్తూ, చల్లగా జవాబిస్తూ అతన్నే చూస్తోంది మాధవి.

 

    "మాధవీ!" చేతులు ముందుకుజాచాడు.

 

    అనుకోకుండా ముందుకు జరిగింది. మరుక్షణం ఆ చేతుల్లో వుంది.

 

    "మాధవీ! మాధవీ!" అతని చెంప ఆమె చెంపను రాసుకుంటోంది. అతని ముఖం ఆమె ముఖంలో దాక్కుంటుంది.

 

    కానీ....

 

    ఆ కాసిని క్షణాల్లో ఆమె అర్థంకానితనం నుంచి అర్థం చేసుకునే స్థితికి వచ్చింది. చల్లని జ్వాల యధాస్థానాన్ని పొందింది.

 

    అతన్ని మృదువుగా విడిపించుకుంది. చెట్టుకు కట్టివున్న చీరెని విడదీసి మౌనంగా కట్టుకుంది.

 

    ఆమె మౌనం అతనిలో ఏదో భయాన్ని మేల్కొలిపింది.

 

    "మాధవీ!"

 

    "రాజా! నువ్వు పరీక్షలో ఓడిపోయావు...అంటే...అంటే...అంటే....నేను...నేను... ఐ యం సారీ రాజా! గుడ్ బై!"

 

    అతని జవాబుకోసం ఎదురుచూడకుండా ఆ మసకచీకట్లో కొండమీద నుంచి క్రిందకు దిగిపోసాగింది.


                                                                11


    ఇలా ఎందుకు చేసింది?

 

    అసలు తన మనసేమిటి?

 

    అంతరాంతరాలలో ఏముందో తనకు తెలుసు. కానీ తను భద్రంగా దాచుకున్న నిర్ణయానికి భిన్నంగా, తన మనస్సుకే విరుద్ధంగా ఇలా ఎందుకు మాట్లాడుతోంది?

 

    అది తన స్వభావమా?

 

    ఒకప్పుడు అతనంటే ఏర్పడిన కసా?

 

    తొందరగా బయటపడతామన్న స్త్రీ హృదయపు బింకమా?

 

    ఈ సమస్యకు ఓ స్పష్టమైన స్వరూపం ఇవ్వకపోతే బాగుండునన్న సందిగ్ధావస్థా?

 

    "హలో!"

 

    రోడ్డుమీద జన సందోహంలో సంఘర్షణతో నలిగిపోతూ నడుస్తోన్న మాధవి ఉలికిపడి ఆగింది.

 

    ప్రక్కనే స్కూటరాగినట్లయింది. కానీ ఈ గొంతు రాజాది కాదు.

 

    తల త్రిప్పి చూసింది.

 

    "ఎక్కడినుంచి?" అనడుగుతున్నాడు దివాకర్ నవ్వుతూ.

 

    అతనెప్పుడొచ్చాడు ఈ ఊరు?

 Previous Page Next Page