నాకు తెలియకడుగుతాను- నీకెంత మంది ఆడవాళ్ళతో అనుభావమయిందేమిటి?" అన్నాడు చంచల్రావు.
"ఇలాంటి విషయాల్లో స్వానుభవం అక్కర్లేదు. లోకజ్ఞానం కావాలి. ఉదాహరణకు నిర్మలను వశపరచుకుందుకు- వనజాక్షి పరిచయం నీకేమైనా సహకరించిందా? ఏ ఆడదానితోనూ పరిచయంలేకుండానే- తలుచుకోగానే నేను నిర్మలను వశపర్చుకున్నాను....." అన్నాడు సాగర్.
"నీగురించినాకు బాగా తెలుసు. కబుర్లుపైకి బాగానే చెబుతావుకానీ మోసంచేయలేవు అందులోనూ నమ్మిన ఆడదాన్ని!"
"మైడియర్ ఫ్రెండ్! తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళు అనుకుంటూ కూర్చున్నావంటే వ్యాపారంలో పైకి రాలేవునువ్వు....." అన్నాడు సాగర్.
"నిర్మలతో నీవ్యవహారం అరవిందకు తేలిస్తే!"
"తెలియదు...."
"నేను చెబితే....?"
"ఓహొ - బ్లాక్ మెయిల్ చేస్తున్నావా?"
"బ్లాక్ మెయిల్ కాదు. అసూయ నాకుదక్కని నిర్మల నీకు దక్కుతోందంటే ఎలాగోఅలా ఆపాలనిపిస్తోంది....." అన్నాడు చంచల్రావు.
"అతపని మాత్రం చేయకు. నిర్మలతో నా అవసరం గడిచిపోయేక నేనామెముఖంకూడా చూడను. అప్పుడు నువ్వామెను మాసంబంధం గురించి బ్లాక్ మెయిల్ చేసివశపరచుకో ఆట్రిక్కు వనజాక్షిమీద పనిచేయక పోయినా నిర్మలపై పనిచేస్తుంది....."
"ఎంగిలికూడు నాకెందుకు?
"ఓహ్- వనజాక్షి ఎంగిలికూడు కాదా?"
చంచల్రావు తడబడి "సరేలే ఆలోచిస్తాను నాపదివేలూ నిలబెట్టుకునేందుకు నా ప్రయత్నాలు నేనూ చేస్తానని మరిచిపోకు" అన్నాడు.
"ఒకరిప్రయత్నాల్లో ఒకరు జోక్యంచేసుకోకూడదన్నది మనషరతు" అన్నాడు సాగర్.
"అలాంటి షరతులేమీనాకు గుర్తులేవు. కానీ నేను నీవ్యవహారంలో జోక్యం చేసుకున్న విషయం నీకు తెలియనివ్వనులే!" అన్నాడు చంచల్రావు.
16
"రండి-రండి-అల్లుడుగారూ!" అంటూ మర్యాదగా ఆహ్వానించింది మాణిక్యాంబ త్రినాధరావు నవ్వుతూలోపలకువచ్చి "మామయ్యగారు కనిపించరేం?" అన్నాడు
"ఆయన బజార్లోకి వెళ్ళారు పిల్లలేమో చదువుకుంటున్నారు....."
"నావ్యవహారమంతా సెటిలైపోయినట్లే! వచ్చేనెలలో ముహుర్తం పెట్టించేయవచ్చు-" అన్నాడు త్రినాధరావు.
"అంతా మా అదృష్టం" అంది మాణిక్యాంబ.
ఇద్దరూ కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నాక "నిర్మల యింట్లో లేదా? ఒకసారిమాట్లాడాలి....." అన్నాడు త్రినాధరావు.
"వచ్చేస్తుంది. ఒక్క పదినిముషాలాగండి...." అంది మాణిక్యాంబ. తర్వాత ఆమెలోపలకు వెళ్ళి నిర్మలకు మంచిబట్టలువేసి త్రినాధరావు దగ్గరకు పంపింది. అతడామెను చూస్తూనే "నేను గుర్తున్నానా?" అన్నాడు.
"ఊఁ" అంది నిర్మల
"మధ్యలో ఎప్పుడైనా గుర్తుకొచ్చానా?"
నిర్మల తల అడ్డంగా ఊపింది.
"నిజం చెప్పాలంటే సిగ్గేస్తుంది కదూ.... అందుకని అలాగంటున్నావు. సరేలేకానీ నేనంటే నీకిష్టమేనా?"
నిర్మల మాట్లాడలేదు.
"నేనడిగినదానికి బదులివ్వాలి...."
"నాకు తెలియదు...." అంది నిర్మల.
"మరెవరికి తెలుసు.....?"
"అమ్మకి!"
"పోనీలే- అమ్మయిష్టమే నీ యిష్టం అవునా?"
నిర్మల తల ఊపింది.
"వచ్చేనెల్లోనే మనపెళ్ళి అమ్మనీకు చెప్పిందా?"
ఎంత హుందాగా, ఎంత నిర్భయంగా, ఎంత మోటుగా అతడావిషయం చెప్పాడో నిర్మల గ్రహించింది. తల అడ్డంగా వూపింది.
"పరికిణీ కట్టుకుంటే మరీ చిన్నపిల్లలా కనపడుతున్నావు. చీర కట్టుకుంటే మనిద్దరి ఈడూజోడూ ఎంతోబాగుంటుంది. ఓసారి చీరకట్టుకురా...."
నిర్మల అదృష్టంకొద్దీ అప్పుడే రామారవోచ్చాడు.
త్రినాధరావు మాటలెలావున్నా చూపులలోఅతడామెను తెనేస్తున్నాడు. అది నిర్మలకు చాలా యిబ్బందిగావుంది.
తండ్రిరాగానే ఆమె అక్కణ్ణించి వెళ్ళిపోయింది. త్రినాధరావు ఆలోచనలామెను విడువలేదు.
"వచ్చేనెల్లోనే ముహుర్తం...." అంటున్నాడతడు.
తమకింకా పెళ్ళికాలేదు. అప్పుడే పెళ్ళయిపోయినట్లు మాటలూ, చూపులూ.....
ఒట్టువేయమని తను చేయిసాచితే "వివాహం కానిదేనేను నిన్నుతాకను" అన్నాడు సాగర్.
మంగళవారం సాయంత్రం ఏడుగంటలు.....
నిర్మల అందుకు ఎదురుచూస్తోంది. కానీ ఈలోగా సోమవారం మధ్యాహ్నం రెండుగంటలు వచ్చింది.
17
"నిర్మలా! నీవిషయంలో నేను పెద్దతప్పుచేశాను. అందుకు ప్రాయశ్చిత్తంకోరివచ్చాను...." అన్నాడు చంచల్రావు.
"ఏమిటది?" అంది నిర్మల చిరాగ్గా.
"నీ అసహాయ స్ధితిని కనిపెట్టి నిన్ను వంచించాలానే నేనిక్కడకు వచ్చాను. కానీ నీతెలివినిన్ను కాపాడింది. ఆ తర్వాత సాగర్ నిన్నువంచించాలనుకున్నాడు. అతడితెలివి నీ తెలివిని జయించింది....."
"నీ కెలా తెలుసు?"
"నిన్ను తనగదికి రప్పించుకుంటానని సాగర్ నాతో పదివేలు పందెంకట్టాడు. ఆ పందెంలో నేను నష్టపోయేది డబ్బుమాత్రమే.....కానీనువ్వు...."
"స్టాపిట్!" అంది నిర్మల.
"నేను నిజంచెబుతున్నాను కావాలంటే కనుక్కొనిచూడు. సాగర్ కి సవతితల్లి లేదు. అతదికన్నతల్లి ఇప్పటికీ నిక్షేపంలావుంది. అతడికి కష్టాలంటే ఏమిటో తెలియవు చిన్నతనంనుండీ అందమైన జీవితం. మధురమైన అనుభవాలు. అదీ వాడిజీవితం. ఇంకా చెప్పాలంటేవాడి పెళ్ళికూడా నిశ్చయమైపోయింది. ఆమెపేరు అరవింద...."