Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 23


    కానీ యశోద మనసు అందుకు తూగలేదు. తన ప్రేమతో చాకచక్యంతో వివేక్ మనసును వశపరుచుకుని అతడి బలహీనత దూరం చెయ్యలేనా అనుకుంది. శక్తినంతా వినియోగించి ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది.
    "కాగుతున్న నూనె మూకుళ్ళూ వగైరా..... కనిపిస్తున్నాయా?"
    యశోద మళ్ళీ ఎప్పుడూ అడగలేదు. కానీ అతడి కళ్లలో భయమూ, ముఖానికీ పట్టిన చెమటలూ, వీటిని బట్టి ఆ దృశ్యాలే అతడిని మనసు ముందుకు వస్తున్నాయని ఊహించగలిగింది యశోద.

    "డాక్టర్ జౄయర్" కనిపెట్టిన వాక్చికిత్స గురించి యశోదకీ తెలుసు. సైకాలజీ ఆ వివరాలన్నీ ఏనాడో చదువుకుంది. ఏదో మాటలలో పెట్టి వివేక్ చిన్నతనం గురించి ఎన్నోసార్లు మాట్లాడించింది తను. కానీ క్లూ ఏదీ దొరకలేదు. చివరికి తను డాక్టర్ అనంతపద్మనాభస్వామి సూచన అనుసరించటమే మేలనుకుంది.
    ఇద్దరూ తయారయి వరండాలోకి వచ్చారు. చీకటిగా ఉన్న వరండాలోకి ఒక్కసారి గాలైట్ వెలిగింది.

    "ఎవరూ?" అని బయటికి వచ్చింది ప్రసూన.
    "మేమే!" సమాధానం ఇచ్చాడు వివేక్.
    "ఇక్కడెందుకున్నారూ? ఏం చేస్తున్నారూ?"

    "బయటికి వెళ్ళానుకుంటున్నాం!"
    "ఇప్పుడా? ఎక్కడికి?"
    "ఇప్పుడే వచ్చేస్తాం!"
    షెడ్ లోంచి కారు బయటికి తియ్యటానికి వివేక్ వెళ్ళాడు. ప్రసూన, యశోద ఇద్దరే మిగిలారు.
    "యశోదా! నాకు చెప్పకూడదా?" అడిగింది ప్రసూన.
    "నాకు తెలీదు..." గొణుగుతున్నట్లుగా అంది.
    కారు తీసుకొచ్చి హారన్ వేశాడు వివేక్.
    "జాగ్రత్తగా వెళ్ళండి" పొడిగా అని లోపలికి వెళ్ళిపోయింది ప్రసూన.
                                    * * *
    విశాలమైన హాలులో బ్లూలైట్లు మందంగా వెలుగుతున్నాయి. ఇంచుమించు అర్ధనగ్నంగా ఉన్నట్లు భ్రాంతి గొలుపుతున్న ఆడవాళ్ళు డ్రింక్స్ సర్వ్ చేస్తున్నారు.
    ఏ.సీ. వాసనలతో కలిసిపోయి నాన్ వెజ్ డిషెస్ వాసనలు అలవాటు లేని వాళ్లకి వెగటు పుట్టిస్తున్నాయి. కడుపులో తిప్పినట్లయి వాంతి చేసుకోబోయి, బలవంతాన నిగ్రహించుకుంది యశోద.  
    "ఇది నరకం" చీదరించుకున్నాడు వివేక్. సంతోషమూ, విచారమూ ఒకేసారి కలిగాయి యశోదలో! అతడిని తనే గోతిలోకి ఈడుస్తున్నానా? అనే శంక తలెత్తింది. అంతా అతని మంచి కోసమే... అని సమాధానం చెప్పుకుంది.    
    "నాకు బాగుంది!" ఉల్లాసంగా కనబడాలని ప్రయత్నిస్తూ అంది. చిత్రంగా చూశాడు. తనే ఒక టేబిల్ దగ్గరికి దారి తీసి కూచుంది.
    "వెళ్ళిపోదాం!" మరోసారి చీదరించుకుంటూ అన్నాడు వివేక్.
    "కూచోండి!"
    కూచున్నాడు వివేక్. మనస్సు కరిగింది. అతడి చేతిని ఆప్యాయంగా నొక్కింది. ఆ స్పర్శ చాలు. ఆమె కోసం ఏదైనా చెయ్యటానికి సిద్ధపడింది అతని మనసు.
    "స్కాచ్ విస్కీ విత్ సోడా!" ఆర్డరిచ్చింది యశోద.
    తెల్లబోయాడు వివేక్ "ఎవరికీ?"
    "మీకే?"
    "ఛీ! ఛీ! నాకు అలవాటు లేదు. నేను తాగను" అన్నాడు వివేక్.
    "అయితే నేను తాగుతాను."
    "నువ్వా?"
    "నేనే!"
    "తాగుతావా నువ్వు?"
    "అలవాటు లేదు. కానీ మీరు తాగకపోతే నేను తాగుతాను."
    "అదేమిటీ?"
    "అవును! మీరు తాగాలని కోరుకున్నాను. మీరు ఒప్పుకొనకపోతే. నేను తాగుతాను"
    "ఒద్దు. నువ్వు తాగకు. నేనే తాగుతాను!" అయిష్టంగా అన్నాడు.
    "అలా మూతి ముడుచుకుని తాగక్కరలేదు"
    నవ్వాడు. చాలా జాలిగా ఉంది ఆ నవ్వు. అతడి తల ఆప్యాయంగా నిమిరి చెయ్యి పట్టుకుని ఆ నరకానికి దూరంగా తీసుకుపోవాలనిపించింది.
    వయ్యారాలు చిందిస్తూ అతి విలాసంగా నడిచి వచ్చి. వివేక్ వైపు అల్లరి చూపులు విసిరి. స్కాచ్ విస్కీ బాటిల్ మూత ఓపెన్ చేసి సోడాలో కలిపి గ్లాసు వివేక్ ముందర పెట్టింది వెయిట్రిన్.
    "ఛీ! ఛీ!"
    ఆ అమ్మాయి మీద నుంచి చూపులు తిప్పుకుని చీదరించుకున్నాడు వివేక్.
    "జింజర్ చికెన్ హాఫ్ ప్లేట్!" ఆర్డర్ చేసింది యశోద.
    వెయిట్రిన్ విచిత్రంగా చూసింది యశోద వైపు. సాధారణంగా ఆ హోటల్ లో మొగవాళ్ళు ఆర్డర్ ఇస్తారు. ఆడవాళ్ళు చికాకు అణుచుకుంటూ సహిస్తారు. అలాంటిది... యశోద భార్య అయి ఉండదని ఊహించింది. అలాంటి సందర్భాల్లోనే ఆడవాళ్ళు అలా ఉంటారు.
    యశోద వైపు చూసి కన్నుగొట్టి నవ్వింది. నవ్వి ఊరుకోలేదు "మేడమ్! మీకేమైనా అవసరముంటే. నాకు ఫోన్ చేయండి. నాపేరు 'వరనియా!' ఈ హోటల్ కి ఫోన్ చేస్తే నన్ను పిలుస్తారు" అంది టేబిల్ మీద ముందుకు వంగి.  
    "షటప్! గెటవుట్" అరిచాడు వివేక్. వెయిట్రిన్ బెదిరి వెళ్ళిపోయింది.
    "ఛండాలపు ముండ" పళ్ళు నూరుతూ అన్నాడు వివేక్.
    "ఎందుకంత కోపం?"
    "దానిమాటలకి! నీకర్థంకాలేదా?"
    "ఏముంది? అర్థం కావటానికీ?"

 Previous Page Next Page