9
కళ్ళు విప్పేసరికి ఓ బెడ్ మీద పడుకుని వున్నాడు.
"రాజా! రాజా!" అని పిలుస్తోంది ఓ కంఠం.
క్రమంగా తెలివొచ్చింది. ఓ గదిలో పడుకుని వున్నట్లు గ్రహించాడు. మంచంమీద ప్రక్కనే మాధవి కూర్చునివుంది.
"రాజా! ఎలా వుంది?" అని మాధవి అడిగింది.
"అసలేం జరిగింది? నేనెక్కడ వున్నాను?"
మాధవి చెప్పింది "వీడియోగేమ్ అయిపోయిన వెంటనే మైకం వచ్చినట్లు అతను వెనక్కి విరుచుకుపడిపోయాడు. అక్కడ ఉన్నవారందరూ ఖంగారుపడి అతని ముఖంమీద నీళ్ళుజల్లి లేపటానికి ప్రయత్నించారు. తెలివి రాలేదు. మాధవి అక్కడున్న ఇద్దరి సాయంతో అతన్ని రిక్షాలో ఎక్కించుకుని ఓ ప్రయివేట్ నర్సింగ్ హోమ్ కు తీసుకువచ్చింది.
రాజాకి క్రమంగా అంతా గుర్తొచ్చింది. అంతరిక్షంలో పరిభ్రమించే గ్లోబ్, దానిమీదకు దుమికే ఫ్లయింగ్ సాసర్స్...తాను వాటిని షూట్ చేయటం...చకచక ముందుకు పరిగెడుతోన్న స్కోర్ బోర్డ్...
"నేను పందెం గెలిచానా."
"గెలిచావు"
అతని ముఖంలో గొప్ప సంతృప్తి.
మోచేతిదగ్గర చురుక్కుమంది. చేయెత్తి చూసుకున్నాడు.
"గ్లూకోజ్ ఎక్కించారు. ఏవో ఇంజక్షన్లుకూడా చేశారు" అని చెప్పింది మాధవి.
"ఇప్పుడెలా వుంది?"
"ఐ యామ్ ఆల్ రైట్! గేమ్ ఆడుతున్నప్పుడు కాన్ సన్ ట్రేషన్ చెయ్యటంవల్ల భయంకరమైన తలనొప్పివచ్చింది. ఇప్పుడేం లేదు" అంటూ లేచి కూర్చున్నాడు.
"నా స్కూటరెక్కడుంది?" అనడిగాడు.
"ఇక్కడే వుంది. అక్కడున్న అబ్బాయిలు తీసుకువచ్చారు."
రాజా రిస్ట్ వాచ్ చూసుకున్నాడు. పది దాటింది.
"మై గాడ్! ఇక్కడెంతసేపు పడివున్నాను? వెళ్ళిపోదాం."
"కాదు...నీకు ఒంట్లో బాగోలేదు."
"ఓ! బాగానే ఉంది."
ఇటీవలే ఆపరేషన్ జరగటంవల్ల అతని తలలోని నరాలు ఒత్తిడిని తట్టుకోలేకపోయాయి. కానీ ఇప్పుడెలా సర్దుకుందోగానీ చాలా ఫ్రెష్ గా వుంది.
రూంలోకి డాక్టర్ వచ్చాడు "ఎలా వుంది?" అని అడిగాడు.
"ఇందాక కొంచెం కళ్ళు తిరిగాయండీ. నౌ ఐయామ్ ఆల్ రైట్ డాక్టర్! ఐ థింక్ ఐ కెన్ గో" అన్నాడు రాజా.
ఆయన ఇంకోసారి పరీక్షచేసి ఫర్వాలేదు, వెళ్ళవచ్చునని చెప్పాడు. బిల్లు ఆఫర్ చెయ్యబోతే మెడికోస్ అని తెలిసి తీసుకోలేదు.
ఆయనకు థాంక్స్ చెప్పి ఇద్దరూ బయటకు వచ్చారు.
శుక్ల పౌర్ణమి కావటంవల్ల పండువెన్నెల కాస్తోంది.
"పద, మీ ఇంటిదగ్గర దింపి వెళతాను" అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు.
ఆమె క్షణంపాటు సంకోచిస్తూ నిలబడింది.
"ఏం? మీ ఇంట్లో ఏమయినా అనుకుంటారని భయమా?"
"దాన్ని గురించి కాదు, నన్ను దింపాక ఒక్కడివే ఇరవైమైళ్ళు ఈ రాత్రివేళ స్కూటర్ డ్రైవ్ చేసుకుంటూ వెళతావా?"
"మరేం చెయ్యను? పోనీ నువ్వు కూడా జత రా."
"అమ్మో! ఇంత హఠాత్తుగా ఏం చెప్పి రాను?"
"పోనీ ఒక పనిచెయ్యి, మీ ఇంటికి తీసుకువెళ్లు."
"తీసుకెళ్లి."
"తెల్లారేదాకా...మీ ఇంట్లో...అతిథ్యమియ్యి..."
మాధవి ఇంకోసారి "అమ్మో!" అంది.
"అందుకనే....పోదాం. స్కూటరెక్కు."
ఆమె మౌనంగా ఎక్కికూర్చుంది. స్కూటరు కదిలింది. ఆమె అతని భుజాలు పట్టుకు కూర్చుని ఎటుపోవాలో డైరెక్ట్ చేస్తోంది.
"ఇంట్లో ఏం చెబుతావు?"
"ఆ విషయం గేటుతీసి లోపలకు వెళుతూ ఆలోచిస్తాను. ఇప్పట్నుంచే బుర్ర పాడుచేసుకోవటం దేనికి?"
"ఈ జనరేషన్ ఆడపిల్లవనిపించావు."
"ముందు ముందు ఇంకా అనిపిస్తాను."
అయిదునిముషాలు గడిచాక "ఇదిగో....ఇక్కడే...ఇక్కడే" అంది.
అధునాతనంగా కనబడుతోన్న ఓ బిల్డింగ్ ముందాగారు. విశాలమైన ఆవరణలో పెద్ద మేడ. చుట్టూ అందమైన డిజైన్ తో వున్న ప్రహరీగోడ. గదుల్లోపల లైట్లు వెలుగుతున్నాయి.
ఆమె స్కూటర్ దిగాక "మూడో పరీక్ష ఎప్పుడు?" అని అడిగాడు.
"మూడో పరీక్ష.....వద్దు..."
"ఏం?"
"నువ్వు ఓడిపోతే లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి."
"అందుకని?"
"అటూ ఇటూ కాకుండా, చివరిదాకా ఇలాగే కంటిన్యూ చెయ్యొచ్చు."
"చివరిదాకా అంటే?"
"ఎప్పటికీ..."
"ఎప్పటికీ అంటే?"
ఆమె ఆలోచించింది "తెలీదు" అంది.
"కానీ...అటూఇటూ కాకుండా మనకి మనం అర్థంకాకుండా వుండటం నాకిష్టంలేదు. ఏదో ఒకటి తేలిపోవాలి. చెప్పు....మూడోపరీక్ష ఎప్పుడు?"
"సరే, నా విషయం తెలుసుగా? సడెన్ గా పెడతాను."
"సరే, నా విషయంకూడా తెలుసుగా? ఎంత సడెన్ గా చెప్పినా స్వీకరిస్తాను."
స్కూటర్ స్టార్ట్ చేశాడు "గుడ్ నైట్!"
"గుడ్ నైట్!"
స్కూటర్ కదిలింది.
"రాజా! జాగ్రత్త!"
అతనికి వినిపించిందో లేదో...ఒకటి రెండు క్షణాల్లో కనుమరుగైపోయాడు.
కొంచెంసేపు...అక్కడ్నుంచి కదల్లేనట్లు ఆ వెన్నెల వెలుగులో ఆమె అక్కడే నిలబడిపోయింది.