Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 21


    "అయ్యో! నీకర్థంకాదేం? వాడికి నష్టం లేకపోవచ్చు కానీ నాకుంది."

 

    "మీకా? అదేమిటి?"

 

    "అదంతేలెండి, మీకర్థంకాదు."

 

    "అర్థం కాకుండానే వుండనివ్వు" అనుకుంది మనసులో.

 

    "ఆ! అవసరమొస్తే కబురు చెయ్యండి. రెక్కలు కట్టుకుని వచ్చి వాల్తాను"

 

    "సరే."


                                                             * * *


    కొన్నాళ్ళ తరువాత.....

 

    ఓ ఆదివారం మాధవి విజయవాడ వచ్చింది. సాయంత్రం ఓ ఫ్రెండింటికి వెళ్ళి కాసేపు మాట్లాడి తిరిగి ఇంటికి వెళుతుంది. మనిషిని తప్పించుకుపోవటం అసాధ్యమన్నంత రద్దీగా వున్నాయి విజయవాడ రోడ్లు. ఫస్ట్ షోలకు వెళ్ళేవాళ్ళు, మ్యాట్నీలు చూసి ఏదో ఘనకార్యం చేసినట్లు అలసటగా వచ్చేవాళ్ళు, ఏదో పని వున్నట్లు హడావుడిగా నడిచిపోయేవాళ్ళు, మనుషుల్ని తప్పించుకుంటూ అవస్థపడుతూ వెళ్ళే చిన్నకార్లు, ప్రాణాలుపోతే ఎంత ఆఫ్ట్రాల్ అన్నంత నిర్లక్ష్యంగా మీద మీదకు వచ్చే రిక్షావాళ్ళు, రోడ్డంతా సొంత సొమ్మయినట్లు ట్రాఫికంతా జామ్ అయినా చీమ పాకినట్లు కూడా లేకుండా చలించకుండా రోడ్డుమధ్య ఆపుకు కూర్చునే సిటీబస్సులవాళ్ళు.....

 

    ప్రక్కనే ఏదో ఆగినట్లయింది. తల త్రిప్పి చూసేసరికి స్కూటర్ మీద కూర్చుని, ఒక కాలు నేలకు ఆనించి... రాజా.

 

    "హలో! ఎంత విచిత్రంగా కలిశారు?"

 

    "నాకూ విచిత్రంగానే వుంది."

 

    "సంతోషంగా లేదా?"

 

    "నిజం చెప్పమన్నారా? అబద్ధం చెప్పమన్నారా?"

 

    వెనుకనుంచి విజిల్ వినిపించింది.

 

    "అదిగో ట్రాఫిక్ పోలీసు కోప్పడుతున్నాడు మనం రూల్సు అతిక్రమిస్తున్నామని. ముందు స్కూటరెక్కండి. ఈ రష్ లోంచి బయటపడదాం."

 

    "సరే" అంటూ ఆమె వెనుక ఎక్కికూర్చుని, జాగ్రత్తకోసం అతని భుజం పట్టుకుంది.

 

    "ఎటుపోదాం?"

 

    "ముందీ జనంలోంచి బయట పడండి."

 

    "ఈ ఊళ్ళో రద్దీలేని చోటు ఎక్కడన్నా వుందా అని?" అంటూ స్కూటర్ ముందుకు పోనిచ్చాడు.

 

    "ఎప్పుడొచ్చారు?" అనడిగింది మాధవి.

 

    "ఇప్పుడే...గుంటూరునుండి తిన్నగా వస్తున్నాను"

 

    "దేనికొచ్చారు?"

 

    "నిజం చెప్పమన్నారా? అబద్ధం చెప్పమన్నారా?"

 

    "అబద్ధమెప్పుడో ఎమర్జెన్సీలో వాడుకుందాం లెండి. నిజమే చెప్పండి."

 

    "మిమ్మల్ని చూడటంకోసం రావాలనిపించింది. వెంటనే స్కూటరెక్కి వచ్చేశాను."

 

    "మా ఇల్లు తెలీదుగా."

 

    "మీరెలాగైనా హఠాత్తుగా కనిపిస్తారని నా సిక్త్ సెన్స్ చెప్పింది.

 

    "అంతరాత్మ ప్రభోదించిదన్నమాట. ఎలా వున్నారు?"

 

    "చక్కగా వున్నాను. క్రాఫింగ్ మళ్లీ వచ్చేసిందిగా. నాతల గట్టిదిలెండి. ఇలాంటి చిన్నచిన్న ప్రమాదాలేమీ చెయ్యవు."

 

    "ఆపండాపండి."

 

    "స్వోత్కర్షా?"

 

    "కాదు, స్కూటర్."

 

    స్కూటర్ బ్రేక్ వేశాడు.

 

    రోడ్డుప్రక్క 'స్టాలియన్' అనే అందమైన అక్షరాలతో పెయింట్ చేయబడి వుంది ఓ స్టాల్. ఖరీదైన అద్దాల తలుపులు. ఆ అద్దాల వెనుకనుంచి రంగురంగుల క్రోటన్స్. వాటిమధ్య ఆర్టిస్టిక్ గ్గా మలచబడ్డ శిలాకృతి కలిగిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహం- నీటిలో తడిసిన స్త్రీ మూర్తి.

 

    "ఇక్కడికెందుకు?" అనడిగాడు రాజా.

 

    "వీడియో సెంటర్! ఇక్కడ వీడియోగేమ్స్ వుంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం."

 

    ఆమె క్రిందకుదిగింది. అతనుకూడా దిగి స్కూటర్ ఒకప్రక్కన పార్క్ చేశాడు.

 

    అద్దాల తలుపులు త్రోసుకుని లోపలకు వెళ్ళారు. అవి సౌండ్ ప్రూఫ్స్ డోర్స్ ఏమో బయటినుంచి చూస్తే లోపల నిశ్శబ్దంగా వున్నట్లుంది. లోపలకు అడుగుపెట్టేసరికి ఓ ప్రక్కనుండి ధన్ ధన్ మన్న చప్పుళ్ళు, ఇంకోవైపు నుంచి డజన్లకొద్దీ కార్లు పరుగెడుతున్నట్లు, అవి దబ్ దబ్ మని డ్యాష్ చేసుకుంటున్నట్లు శబ్దాలు- వాటి చుట్టూ గుమికూడి డజన్లకొద్దీ మనుషులు- ఎక్కువగా స్కూల్ బాయ్స్, కాలేజీ స్టూడెంట్స్.

 

    ఒక వీడియో సెట్ లో రయ్ రయ్ మని కార్లు పరుగెడుతున్నాయి. రోడ్డుకు రెండు దిశలనుంచీ, ఎటుపడితే అటు ఓ డైరెక్షన్ అంటూ లేకుండా పరిగెడుతున్నాయి. వాటిమధ్యనుంచి ఓ రేసుకారు దూసుకుపోతుంది. ఆకృతిలో గుర్తు పట్టడానికి వీలుగా మిగతా కార్లకన్నా కొద్దిగా భిన్నంగా వుంది. వీడియో సెట్ కు ఓ స్టీరింగ్ అమర్చి వుంది. క్రింద యాక్సిలేటర్ వుంది. ఓ కుర్రాడు సెట్ ముందు నిలబడి ఆపరేట్ చేస్తున్నాడు. చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్నాడు. కుడికాలితో యాక్సిలేతర్ నొక్కుతున్నాడు. రేసుకారు అతని కంట్రోల్ లో వుంటుంది. వెనుకనుంచి, ఎదురుగా వస్తున్న మిగతా కార్లు దానిమీదకు దూసుకువస్తున్నాయి. అతను స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ ఆ కార్లను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. డ్యాష్ ఇచ్చినప్పుడల్లా పెద్ద చప్పుడవుతోంది. ఎదురుగా బోర్డుమీద నెంబర్లు గిరగిర మారుతున్నాయి. ఈ స్పీడ్ రేస్ తడవకి ఒకటిన్నర నిముషం వుంటుంది. రెండు అర్థరూపాయల కాయిన్స్ కంప్యూటర్ సిస్టంలో పడవేస్తే సెట్ ఆన్ అవుతుంది. తొంభై నిముషాల్లో నాలుగొందలపాయింట్లు సాధిస్తే మళ్లీ కాయిన్స్ వెయ్యనవసరం లేకుండా గేమ్ కంటిన్యూ అవుతూ వుంటుంది. నాలుగొందల పాయింట్లు సాధించలేకపోతే ఆటోమేటిక్ గా సెట్ ఆఫ్ అయిపోతుంది. కుర్రాళ్ళు ఉత్సాహంగా ఒకరితర్వాత ఒకరు పోటీపడి గేమ్ ఆడుతున్నారు.

 

    రెండో వీడియోసెట్ స్పేస్ యిన్ వేషర్స్. ఆకాశమండలంలో ఓ గ్లోబ్ పరిభ్రమిస్తూ వుంటుంది. దానిమీదకు రివ్వురివ్వుమని ఎగురుతూ ఫ్లయింగ్ సాసర్స్ దూసుకువస్తున్నాయి. ఒకటి కాదు, రెండుకాదు...ఎన్నో...అమాంతం అంతరిక్షంలో ఉద్భవిస్తూ గోళంమీదకు రాకెట్ వేగంతో విరుచుకుపడుతున్నాయి. ఆపరేటర్ కు ఒక చేతిలో గ్లోబ్ ని అటూఇటూ కదిలించే చిన్న మీటర్లాంటిది, ఒకచేత్తో ఫ్లయింగ్ గన్ వున్నాయి. సాసర్స్ మీదకు వచ్చినప్పుడల్లా గ్లోబ్ ని మీటర్ ఆపరేట్ చేస్తూ తప్పిస్తూ వుండటం, మరోచేత్తో గన్ తో గురిచూసి ఫ్లయింగ్ సాసర్స్ ని షూట్ చేస్తూ వుండటం...షూట్ చేయబడినప్పుడల్లా ఫ్లయింగ్ సాసర్స్ పేలిపోతున్నాయి. ఎంత జాగ్రత్తగా షూట్ చేసినా ఎటువైపునుంచో వచ్చి గ్లోబ్ ని గుద్దుకుంటూనే వున్నాయి. అవి గుద్దుకున్నప్పుడల్లా పాయింట్లు మైనస్ అవుతున్నాయి. సెట్ కు ఒకవైపుకు సెకన్లు, ఒకవైపు పాయింట్లు జరజర పరిగెత్తుతున్నాయి.

 Previous Page Next Page