"లేడీస్ అండ్ జంటిల్ మన్ !" రవితేజ మైకును అందుకున్నాడు.
"ప్రధానికి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసరుగా బాధ్యతగల ఉద్యోగం చేస్తున్న నేను మాట్టాడే కంటే, ఇక్కడ ఎందరో పెద్దలు - తమ తమ రంగాలలో నిష్ణాతులయినవారు చాలా మంది వున్నారు. అటువంటి వ్యక్తుల సలహా- సంప్రదింపులు నాలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. కాలం చాలా విలువయినది. కనుక, ఐ.ఎ.ఎస్. లో టాపర్ అయిన మిస్ రీతు తమకు తోచిన విషయాలను- సెక్యూరిటీకి సంబంధించినంతవరకు-నాలుగు మాటలు చెబితే, మా బోంట్లకు ప్రయోజనదాయకంగా వుంటుంది. వారిని ఆహ్వానిస్తూ నేను శెలవు తీసుకుంటున్నాను" అంటూనే వేదిక దిగి వెళ్ళి తన స్థానంలో కూర్చున్నాడు రవితేజ.
త్రుళ్ళిపడింది కుమారి రీతు. క్షణం ఆలోచించింది. అప్పటికి ఇప్పుడు తనకు మంచి అవకాశం లభించింది! తనకు అవకాశాన్ని స్వయంగా అతనే కల్పించాడు ! అతని నిప్పుడు తలెత్తుకోకుండా చేయాలి...చకచకా మైక్ ముందుకు వచ్చింది రీతు.
రీతూ తన మాట మన్నించి వచ్చి మాట్టాడబోతున్నందుకు ఆనందించాడు రవితేజ. ఆమె చెప్పే ముఖ్యాంశాలను నోట్ చేసుకోవడం కోసం ఉత్సాహంగా కలం, కాగితం సిద్ధం చేసుకున్నాడు.
వాతావరణం నిశ్శబ్దమయింది.
"గౌరవనీయులైన అధ్యక్షుల వారికి, ఆసీనులయిన తోటి ఆఫీసర్లకు అభినందనలు" ఉత్సాహంగా ఉపన్యసించడం ప్రారంభించింది కుమారి రీతు.
"వి.ఐ.పి. లకు భద్రతల విషయంలో తీసికోవలసిన జాగ్రత్తల గురించి, అధికారులుగా విధి నిర్వహణలో ఎదురయే సాధక బాధకాల గురించి సదస్సులో ఇప్పటివరకు చాలా విషయాలను చాలా మంది పెద్దల ముఖతః తెలుసుకున్నాం. కాని, ఇటువంటి కీలకమయిన సదస్సులకు స్క్రీనింగ్ లేకుండా అందరినీ ఆహ్వానించడం వలన అసలీ అంశం వి.ఐ.పి. కి సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ దెబ్బతింటుందని నా అభిప్రాయం.
"మనలో కొందరు అధికారులు వృత్తిని అంకిత భావంతోకాక, హాబీగా తీసుకోవచ్చు. ముఖ్యంగా వెనుకా ముందూ ఏడేడు తరాలకు కోట్లకు పడగలెత్తిన వారి వారసులు ఎవరయినా మనలో వుంటే, వారికి ఈ ఉద్యోగం ఒక లెక్కలోనికి కాదు. అటువంటి వారు కేవలం సమాజంలో ఒక స్టేటస్ సింబల్ కోసమే కాని, ఉద్యోగాన్ని ఒక జీవనాధారంగా తీసుకోరు. అటువంటి వ్యక్తులు వృత్తిపట్ల అంకిత భావంతో వుంటారనుకోవడం కూడా పొరపాటే. అటువంటి వ్యక్తులకు ఇటువంటి సదస్సులలో ఆయా రంగాలలో నిష్టాతులయినవారు ఇచ్చే సూచనలు ఎలా తలకెక్కుతాయి?
"పార్టీలలో, నైట్ క్లబ్బులలో విచ్చలవిడిగా తాగి తందనాలాడుతూ తమ వ్యవస్థనే కించపరచే విధంగా మాట్టాడతారు కొందరు. అటువంటి వారు సెక్యూరిటీకి సంబంధించిన సీక్రెట్స్ ఏమైనా వుంటే వాటిని కాస్తా వారు తాగిన మైకంలో బయటకు కక్కేస్తారు కూడాను! కుక్కకు పిల్లలు పుడితే మనుషులకు విందులు చేసే పైలాపచ్చీస్ గాళ్ళ నోట్లో సీక్రెట్స్ ఎలా దాగుంటుంది?" ఆవేశంగా చెప్పుకుపోతున్నది రీతు.
కుమారి రీతు సదస్సు లక్ష్యాన్ని పూర్తిగా డైవర్ట్ చేసేసిందని అధ్యక్షులు గమనించారు.
కేవలం ఎవరో ఒక వ్యక్తిని నిందించడంకోసం కుమారి రీతు వేదికను వుపయోగించుకుంటున్నదని సదస్యులు అందరూ గ్రహించేశారు.
రవితేజ చివ్వున తలెత్తాడు. సూటిగా చూశాడు. అతనికి అసలు విషయం విశదమైపోయింది. అప్పటికే అతని కనులు అగ్నిగోళాలయ్యాయి.
ఎప్పుడో ట్రైనింగులో తను జోక్స్ తో అందరినీ నవ్వించి వుండవచ్చు. కొందరు ఫీల్ అయితే అయి వుండవచ్చు. అలా ఫీలయినవారిలో రీతూ కూడా వున్నదని ఇప్పుడే తెలుసుకున్నాడు రవితేజ. అప్పటి సంఘటనకు ఇప్పుడు ఇంత తీవ్రంగా స్పందిస్తుందేమిటి రీతూ?
రీతూ తన మీద ఇంత కక్ష ఎందుకు పెంచుకున్నట్టు? అసలు రీతూ తనను అర్ధం చేసుకోలేదు! కేవలం రీతూ కోసమే తను పట్టుపట్టి సెక్యూరిటీ విభాగానికి వచ్చింది!
రీతూను ప్రధానికి పి.ఎస్.గా తీసుకున్నారని తెలిసి, తను ఆమెకు దగ్గరగా వుండవచ్చునని, ఎల్లవేళలా ఆమెను ఆరాధిస్తూనే వుండవచ్చునని, అందరినీ వదులుకొని, ఇంత దూరం వచ్చాడు!
తను రీతూను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నది నిజం. కాని...కాని...తనంటే రీతూకు ఇంత ఏహ్యభావం గూడు కట్టుకుని వున్నదని తొలిసారిగా ఇప్పుడే తెలుసుకున్నాడు.
రవితేజ మనసు మూగబోయింది. అతని హృదయం బ్రద్దలయింది.
అది సదస్సు, తను బాధ్యతగల అధికారి.