ఆ తరువాత ఉద్యోగరీత్యా వాళ్ళ నాన్నగారు బొంబాయి వెళ్ళవలసి రావటంతో పద్మిని కూడా వెళ్ళిపోయింది. ఎవరో బంధువు పెళ్ళికి వచ్చిన పద్మిని పాత స్నేహాన్ని మరిచిపోకుండా తనను చూడటానికి వచ్చింది. తనను సానుభూతితో పలకరించే స్నేహ హృదయాన్ని చూడగానే, తన కష్టాలన్నీ చెప్పుకుని కుమిలిపోయేది జ్యోత్స్న...
"నాకేమీ అక్కర్లేదు - నా కర్మాన నన్ను ఉద్యోగం చేసుకుని ప్రశాంతంగా బ్రతకనిస్తే చాలు! ఏమిటో, ఈ రాక్షసులు, నన్ను నిలువునా కబళించెయ్యాలని చూస్తున్నారు...." అంది.
పద్మిని జ్యోత్స్న పరిస్థితికి తనూ బాధపడింది.
"ఇంకా మన ప్రాంతాలే ఇంత వెనుకబడి ఉన్నాయి. బొంబాయిలో ఈ బాధలు లేవు. ఎవరైనా హాయిగా ఏ ఉద్యోగమైనా చేసుకోవచ్చును. నువ్వు వింటే ఆశ్చర్యపోతావు. నేనే సెలవు తీసుకుని వెయిట్రెస్ గా పని చేస్తాను. నేనే కాదు - కాలేజీల్లో చదువుకుంటున్న అమ్మాయిలు చాలామంది అలా పని చేస్తారు. అక్కడ అది చిన్నతనంగా అనుకోరు. నాతో బొంబాయి వచ్చెయ్యి - అక్కడ వెయిట్రెస్ గా పని చెయ్యవచ్చును" అంది.
పద్మిని మాటలు నమ్మింది జ్యోత్స్న. అతి కష్టం మీద బొంబాయి ప్రయాణానికి డబ్బు పోగు చేసుకుని పద్మిని ఇంటిలో వెలిసింది. పద్మిని తల్లి తెల్లబోయింది. ఆవిడ జ్యోత్స్న తమ ఇంట్లో ఉండటానికి ఒప్పుకోలేదు.
బొంబాయిలో ఎవరైనా ఏ ఉద్యోగమైనా చెయ్యగలిగే మాట నిజమే! కాని, తల్లిదండ్రులుండి అండదండలున్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఎవరూలేని జ్యోత్స్నలాంటి అందమైన అనాథలకి ఎక్కడైనా ఒకేలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.
పద్మిని సాయంతో హోటల్లో వెయిట్రెస్ గా చేరింది. మెయిన్ వాళ్ళ కళ్ళన్నీ తనమీదే! తన పరిస్థితి తెలుసుకున్నాక వాళ్ళ దుస్సాహసానికి మితి లేకుండా పోతోంది. మళ్లా తన ప్రాంతాలకు వచ్చెయ్యాలనిపించేది. ఎక్కడైనా ఒకటే! ఎందుకీ దూర ప్రాంతంలో.
అలాంటి పరిస్థితుల్లో తను వెయిట్రెస్ గా పనిచేస్తున్న హోటల్లోనే అర్థనగ్న ప్రదర్శనల ద్వారా డబ్బు సంపాదించవచ్చని తెలుసుకుంది. అలాంటి ప్రదర్శనలియ్యటానికి ఒప్పుకుంది.
ఆర్ధిక పరిస్థితి కూడా సరిగాలేని తనను అసలు బ్రతకనివ్వటం లేదు లోకం.... ఈ రకంగా కొంత డబ్బు సంపాదించి, ఆ తరువాత చదువుకుని, ఏదైనా ఉద్యోగంలో చేరి స్తిమితంగా జీవితం గడపగలిగితే.... ఇంత చిన్నకోరిక - అతి మామూలు కోరిక - ఒక మనిషి ప్రాథమికావసరం.... తనకు అందరానిదయిపోతోంది.
మొదట అర్థనగ్న ప్రదర్శన లియ్యాలంటే ప్రాణం పోతున్నట్లే అనిపించేది. చుట్టుపక్కల నవ్వులూ, వేళాకోళాలూ, వెక్కిరింతలూ అన్నీ పిశాచాల అట్టహాసాలలా వినిపించేవి. తన చుట్టూ ఉన్న మనుష్యులు మీదపడి తన బట్టలు పీకేసి తనను మింగెయ్యాలని చూస్తున్నారు. అంతకంటే తన బట్టలు తనే తీసేసి తనను తను కాపాడుకోవటమే మేలు కదూ? చేతిలో డబ్బు ఉంటే కొంతవరకైనా పరిస్థితులతో పోరాడవచ్చు.
రాను రాను అంతమంది మధ్య ఉన్న అందరిలోంచి పారిపోవటం అలవాటయిపోయింది. వాళ్ళ మాటలు వినిపించవు. వాళ్ళ ముఖాలు కనిపించవు. తను ఎక్కడికో, ఏ లోకాలకో ఎగిరిపోయి, ఎవరికీ కనపడని సర్వాంతర్యామిని "ఇదెక్కడి అన్యాయం? నేనేం తప్పు చేశానని నాకీ నరకయాతన? ఈ అల్పత్వాన్ని, ఈ నీచత్వాన్నీ ఎదుర్కొని నేను నేనుగా నిలబడగలిగే శక్తి ప్రసాదించవా? ఇంతమంది మనుష్యులున్న ఈ సృష్టిలో మానవత్వమే కనిపించదా?" అని ఆర్తితో, ఆవేదనతో ప్రార్థించుకుంటూ నిలిచేది.
అనుకున్నట్లుగానే కొంత డబ్బు సంపాదించిన తరువాత బొంబాయి నుంచి వచ్చేసింది. నైట్ కాలేజీలో బి.ఏ చదువుతూ, సేల్స్ గరల్ గా పనిచేస్తూ, విధితో శక్తికొద్దీ పోరాడుతోంది ఓడిపోకుండా నిలబడాలని.... కాని....
"పడుకోండి - కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది" అన్నాడు మచ్చల డాక్టర్, జ్యోత్స్నను చెయ్యి పట్టుకుని మంచంమీద కూచోబెడుతూ.
అయోమయంగా చూసింది జ్యోత్స్న. ఆ చూపులు చూస్తోంది కళ్ళలో నీళ్ళు తిరిగాయి మచ్చల డాక్టర్ కి.
"పడుకోండి" అన్నాడు నచ్చజెపుతున్నట్లు.
పసిపిల్లలా పక్కమీద వాలిపోయి కళ్ళు మూసుకుంది.... జ్యోత్స్న.
10
ఎంత ప్రయత్నించినా, భాస్కర్ కి నిద్ర రాలేదు. సర్వమూ కోలిపోయినట్లు అందరి మధ్యా బొమ్మలా నిలిచిపోయిన జ్యోత్స్న పరిదీనమూర్తిని తన మనసులోంచి తుడిచెయ్యలేకపోతున్నాడు. ఒక్కసారి జ్యోత్స్న దగ్గిరకి వెళ్ళి "బాధపడకు - నిన్నెవరూ ఏమి చెయ్యలేరు. నీకు నేనున్నాను" అని చెప్పాలని ఆరాట పడిపోతోంది అతని మనసు.
ఆ మచ్చల డాక్టర్ ఎంత అదృష్టవంతుడు! అంతమందిలో జ్యోత్స్నను చెయ్యిపట్టుకుని నడిపించుకుని తీసికెళ్ళగలిగాడు. జ్యోత్స్నకు అత్యంత క్లిష్ట సమయంలో అండగా పక్కన నిలబడగలిగాడు.... కానీ, తనేం చెయ్యగలిగాడు? పిరికిపందలా అలా చూస్తూ నిలబడ్డాడు.
అంతే! అంతకంటే తనకు శక్తిలేదు. కానీ, ఇలాంటి సమయంలో - జ్యోత్స్న అవమానాల పాలయి కుమిలిపోతున్నప్పుడు కనీసం ఒక్కసారి ఓదార్చకుండా ఎలా ఉండగలడు?