"అదేవిటి? మీరు కథ చదవలేదుకదా?"
"చదవనఖ్కర్లేదు. నా ఎక్స్ పీరియన్స్ వల్ల మొదటి నాలుగు వాక్యాలు చదివి అందులో ఏవుందీ చెప్పే సెయ్యగలను.
" అంతేనంటారా?"
" అంతే మరి."
" సంప్రదాయంకోసం కొన్ని కథలు వేస్తామన్నారుగా."
"వేస్తాము.అలా సెలక్టయి వున్నవి మూడేళ్ళదాకా సరిపడా వున్నవి."
సూరచంద్ర నిరుత్సాహంగా లేచి నిలబడ్డాడు.
ఇంతలో ఎడిటర్ గారి టేబిల్ మిద వున్న యింటర్ కమ్ ఫోన్ మ్రోగింది.
రిసీవరెత్తి 'హలో' అనివెంటనే కంగారుపడుతూ " అలాగే, అలాగే" అని ఫోన్ పెట్టేసి " మిరు ఒక్క నిమిషం వుండండి" అని సూర్యచంద్ర తో అని హడావుడిగా ఆఫీసు లోపలవైపు కెళ్ళాడు.
సూర్యచంద్రకు అర్ధం కాలేదు .ఏం చెయ్యాలో తెలీక తిరిగి కూర్చున్నాడు.
పదినిమిషాల తర్వాత సంపాదకుడు తిరిగి వచ్చాడు. అతని మొహమెందుకో నల్లగా మాడిపోయి వుంది.
టేబిల్ మిద స్క్ర్రిప్టుతీసి డ్రాయర్ సొరుగులో వేసుకుంటూ " మిరు వెళ్ళొచ్చు" అన్నాడు.
" నా కథ."
" పరిశీలించి తర్వాత రాస్తాను."
12
శకుంతల వెలగలేరు వచ్చి రెండు నెలలు దాటి పోయింది.
రోజులు వృధాగా గడిచిపోతున్నాయి.
ఏదో చెయ్యాలి, అసలే ఆర్థిక భారంతో కృంగిపోతోన్న తండ్రిమిద అదనపు భారం కావట మిష్టంలేదు.
ఎల్. ఐ.సి. డబ్బులు పాతిక వేలూ చేతికి వచ్చాయి, ఆఫీసు డబ్బులు కూడా కొంతవరకూ వచ్చాయి.
ఆమె దగ్గరకు డబ్బు లొచ్చాయని తెలియగానే సలహా లిచ్చే పెద్ద మనుషులు ఎక్కువయిపోయారు.
శకుంతల మేనమాన రామనాధమని వున్నాడు. తన అక్కయ్యగారి కుటుంబం ఎలా వుందో మిగతా సమయాలలో తొంగయినా చూడలేదు. ఇప్పుడు శకుంతల దగ్గరకు డబ్బు వలొచ్చాయని తెలియగానే రెక్కలు కట్టుకునివచ్చి వ్రాలాడు.
" అమ్మాయ్!" అన్నాడు ఆప్యాయత వొలకబోస్తూ. మెల్లగా ఆ కబురూ, యీ కబురూ చెప్పి అన్నట్టు పాపం.ఎల్.ఐ.సి డబ్బులూ అవీ వచ్చినట్లుగా వున్నాయి."
" అవును మామయ్యా."
" మంచిదే. కాని యి డబ్బువుందే, చూస్తూ చూస్తూండగానే మంచులా కరిగిపోతుంది. మనకి తెలీకుండానే తరిగిపోతుంది.అందరి కళ్ళూ దానిమిదే వుంటాయి. అన్నట్లు ఆ డబ్బు ఏం చేద్దామనుకుంటున్నావు?"
" ఇంకా ఏమి ఆలోచించలేదు మామయ్యా .బ్యాంకిలోనే వుంచి ఆ యింటరెస్ట్ తో నే సరిపెట్టుకుందామా? లేకపోతే ఏమయినా బిజినెస్ చేద్దామా అని ఆలోచిస్తున్నాం"
" బిజినెస్సా? ఆడదానివి నీవల్ల ఏమవుతుందే పిచ్చి పిల్లా?"
"ఆడవాళ్లు చెయ్యగలిగే వ్యాపారమే చేస్తాను మామయ్యా."
" అదే... ఏమిటది?"
"ఇంకా ఆలోచించాలి."
"ఇదిగో ఓ సలహా చెబుతాను విను."
" ఏమిటి మామయ్యా?"
"వడ్డి వ్యాపారాన్ని మించింది యీ రోజుల్లో లేదు. నాకీ రంగంలో బాగా అనుభవముంది. నా చేతికో పాతిక వేల రూపాయలివ్వు రెండేళ్ళలో లక్ష రూపాయలు చేసిస్తాను"అన్నాడు చెయ్యి జాపి గాలిలో ' తే' అన్న భంగిమలో వుంచి.
" నాకు వడ్డీ వ్యాపారం యిష్టంలేదు మామయ్యా. మనుషుల రక్తమాంసాంలుపీల్చి, పీక్కుతినే ఏ అంశమూ యిష్టం లేదు నాకు."
" ఇతరులని పీల్చిపిప్పి చెయ్యకుండా వ్యాపారం ఎలా చేస్తావే పిచ్చి మొహమా?"
"వ్యాపారమంటే అంత అన్యాయం చెయ్యవలసి న అవసరం వుంటుందని అనుకోను మామయ్యా?"
" సరేలే.ముందు ముందు నీకే తెలుస్తుందిలే. " అని రామనాధం కాసేపు మొహం మాడ్చుకు కూర్చున్నాడు.
తర్వాత ఏదో ఆలోచించుకున్నట్లు "సరేలే. ఒక పని చెయ్యి" అన్నాడు.
" ఏమిటి మామయ్యా?"
" ఒక అయిదువేలు అప్పియ్యి. నాదగ్గరుంటే బ్యాంకులో వున్నట్లే."
" సారీ మామయ్యా, కుదరదు."
రామనాధంకోపంతో మండిపడి, యింత ఎత్తున ఎగిరి, చిందులు తొక్కి యింట్లోంచి వెళ్ళిపోయాడు.
రాజేంద్ర దృష్టి కూడా ఆ డబ్బుమిదే వుంది. తాను చాలా తెలివైనవాడు అఖండమైన మేధాసంపత్తివుంది. చేతిలో పైసా లేకగానీ , తన దగ్గర డబ్బుంటేనా యి ప్రపంచాన్ని గిర్రున త్రిప్పుతాడు. పాతిక వేలు తన దగ్గరుంటే అయిదా రేళ్ళలో కోటికి పడగలెత్తుతాడు.
అతను నోరు విడిచి అడగ లేదుగాని, అతని మనసులో ఉద్దేశాలు శకుంతల గ్రహించింది. ఒకరోజు తండ్రి దగ్గర కెళ్ళింది.
" నేను విజయవాడ వెడదామనుకుంటున్నాను నాన్నా"
" విజయవాడా?"
" అవున్నాన్నా."
" వెళ్ళి ఏం చేస్తావు?"
" నా బ్రతుకు తెరువు నేను చూసుకోవాలి గా నాన్నా ఇలా కూచిని తింటూంటే ఎన్నాళ్లు సాగుతుంది? మళ్ళీ నా జీవితం నేను ఎక్కడో అక్కడ మొదలుపెట్టాలి. ఏం చేస్తానో యింకా తెలీదు. ఏ నిర్ణయామూ తీసుకోలేదు. కాని చేస్తాను. మళ్ళీ పైకి ఎగ బ్రాగటానికి ప్రయత్నిస్తాను. నాతో బాటు సీతను కూడా తీసుకుపోతాను నాన్నా. నాకు సహాయంగానూ వుంటుంది, దానికీ కొంత ఉపయోగంగా వుంటుంది. ఇక్కడ వుంటే ఎలాంటి సంబంధాలొస్తూన్నాయో చూస్తున్నావుగా. కాలుచెయ్యి సరిగ్గా లేనివాళ్ళు కూడా యిరవైవేలు కట్నాలడుగుతున్నారు. లేకపోతే రెండోపెళ్ళి వాళ్ళొస్తున్నారు. నా దగ్గరుంచుకొని దాని పెళ్ళి కష్టపడి నేనే చేస్తాను. కాదనకుండా నాతో పంపించండి నాన్నా."
పరశురామయ్య చాలాసేపు మౌనంగా వూరుకుని "యిష్టమమ్మా" అన్నారు.
* * * *