Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 20


    ఇరవై ఏళ్ల వయసులో ఆ అపర రోమియో జూలియట్ లు పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత  అర్థమైంది ఇద్దరికీ- తమ  మధ్య వున్నది ప్రేమ కాదనీ కేవలం వయస్సు ఆకర్షణ అనీ. ఆ తరువాత ఇద్దరు పిల్లలు కలిగారు. ఆ తరువాత ఆ అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది.

    ఇద్దరు పిల్లల్నీ చేరోవైపునా పెట్టుకుని విష్ణుశర్మ  రోదించాడు. అతడి వాళ్లిద్దరూ తన పిల్లలే అని గొప్ప నమ్మకం. వాళ్ల అభ్యున్నతి కోసం ఏదైనా చేద్దామనుకున్నాడు.

    సరీగ్గా సలీం శంకర్ లాంటి వడ్డూ, పొడవూ వున్న అతడిని వసంత్ దాదా అనుచరులు పట్టుకున్నారు.

    వప్పండం కుదిరింది.

    ఇద్దరు పిల్లల పేరుమీద అయిదు లక్షలు వేసి అతడు ఢిల్లీ రవాణా  చేయబడ్డాడు. జపాన్ వెళ్లేవరకూ అతడికి ఆలోచించుకోవటానికి టైమ్ ఇవ్వకుండా ఎంగేజ్ చేశారు దాదా అనుచరులు. సలీంశంకర్ మీద ఈ దేశంలో కేసు అయిపోగానే, విమానాశ్రయంలో అనుకున్న మార్పిడి జరగటానికి కావల్సిన ఏర్పాట్లు జరిగినయ్! ఆ రోజు దగ్గరపడింది!

    అప్పుడు..... మత్తులోంచి క్రమంగా బయటకొచ్చినట్టు - తను మరణించాలి. అన్న వాస్తవం  బయట  కొచ్చి విష్ణుశర్మని భయపెట్టసాగింది.

    ప్రేమ తుప్పు పెళ్లవగానే ఎలా రాలిపోయిందో, అలాగే, పిల్లల పట్ల  సెంటిమెంటు, చావు దగ్గరకొచ్చేసరికి రాలిపోయింది.

    అప్పటివరకూ తను చచ్చిపోయాక తన డబ్బుతో పిల్లల్ని కార్లలోనూ భావంతుల్లోనూ వూహించుకున్న వాడు, తనూ పిల్లలూ అష్టకష్టాలు పడి డబ్బు సంపాదించి, లేచిపోయిన భార్యమీద పగతీర్చుకున్నట్టు వూహించుకోసాగాడు.

    అవి  జరగాలంటే ఇక్కణ్ణుంచి బయటపడాలి. క్షణ క్షణానికీ ఈ కోర్కె ఎక్కువ అవసాగింది. వారం రోజుల తరువాత అలాంటి అవకాశం దొరికింది. ఆ ఇంట్లోంచి బయటపడ్డాడు.

    సలీంశంకర్ ఊరినుంచి తప్పించటం కోసం వసంత్ దాదా వేసిన అద్భుతమైన ప్లాన్  తెలిసిన ఏకైక పరాయివ్యక్తి అతడొక్కడే.

    విష్ణుశర్మ బయటపడ్డాడన్న వార్త సరీగ్గా  అరగంట తరువాత దాదాకి తెలిసింది.

    వసంత్ దాదా జీవితంలో మొట్టమొదటిసారి కాలరుద్రుడయ్యాడు. అతడిలోని రాక్షసుడు బయటపడ్డాడు. మొహం వికృతంగా మారింది. దాదాపు యాభై మంది అనుచరులు ఢిల్లీ పురవీధుల్లో గాలిపటాల్లో ఎగిరారు. మోటారు సైకిళ్ళ ధ్వని ప్రతిధ్వనించింది.

    కదలబోయే రైళ్ళు - 'బాంబు పెట్టబడింది' అన్న ఫోన్ కాల్ రావటంతో ఆగిపోయాయి బస్ స్టాండ్ లు గాలించబడ్డాయి. విమానాశ్రయాలు కూడా వదిలి పెట్టలేదు.

    ఎక్కడ  కనపడితే అక్కడే  కాల్చెయ్యమని ఆర్డర్స్ ఇచ్చాడు దాదా. ఈ వార్త బయటకు పొక్కితే సలీంశంకర్ ని ఎవరూ రక్షించలేరు అన్నది నిర్వివాదాంశం!

    అప్పుడే జపాన్  నుంచి కమిషనర్ ఆఫ్  పోలీస్ యామీన్ సన్  ఇండియా వచ్చి వున్నాడు. విష్ణుశర్మతో పాటు తన ప్లాను కూడా బయటకు రాకుండా సమాధి కావాలి!

    వసంత్ దాదా  తన గదిలో అసహనంగా పచార్లు చేస్తున్నాడు.

    అదే సమయానికి- సెకండ్ క్లాస్ కంపార్ట్ మెంట్ టాయిలెట్ లో విష్ణు శర్మ ప్రాణాలు బిగపట్టుకుని నిలబడి వున్నాడు.

    ట్రైన్ లో బాంబు లేడని అధికారులు నిశ్చయించి,  అది కదిలేందుకు అనుమతి ఇవ్వటానికి గంట పట్టింది. ఈ గంటలో అధికారులతోపాటు  దాదా అనుచరులు కూడా ట్రైన్ ని ఆమూలాగ్రం వెతికారు. అయితే వారు వెతికేది బాంబు కోసం కాదు, విష్ణుశర్మ కోసం.......

    వారు ఆఖరిపెట్టె వెతకబోతూ వుండగా మద్రాసు ఎక్స్ ప్రెస్ బయల్దేరుతున్నట్టు ప్రకటన వినిపించింది. నలుగురు మనుష్యులు అటు పరుగెత్తారు. మిగిలిన ఇద్దరూ రైలు కదలబోతూవుంటే దూకేసారు.

    చెమటతో తడిసిన బట్టల్తో ఆ టాయ్ లెట్ లోనే కొన్ని గంటలు గడిపాడు విష్ణుశర్మ. భయంతో వణికిపోతున్నాడు. ఇప్పుడతడికి అయిదు లక్షలు కనపడటం లేదు. పిల్లలు కనపడుతున్నారు. తన దహన సంస్కారాలు కనపడుతున్నాయి.

    వసంత్ దాదాకి ప్రతి అయిదు నిమిషాలకీ శర్మ దొరకలేదన్న వార్తా పంపబడుతూవుంది. అతడు చాలా  రెస్ట్ లెస్ గా  వున్నాడు.

    విష్ణుశర్మ పోలీస్ అధికారులకి ఈ విషయం వెల్లడిచెయ్యకముందే అతడి  నోరు శాశ్వతంగా మూసెయ్యాలి. ఇది మొదటిపని. సలీంశంకర్ ని  జపాను పోలీసులు తీసుకువెళ్ళబోయేలోపులో మరొకడిని ఆ స్థానంలో పెట్టేటందుకు వెతకాలి. రెండూ కష్టమైన పనులే. కానీ సాధించాలి.

    అతడు విసుగ్గా  పచార్లు చేయసాగాడు. టైమ్ ఎక్కువలేదు. ఏ క్షణమైనా విష్ణుశర్మ తన పధకం బయట  ప్రపంచానికి వెల్లడి చెయ్యవచ్చు. దానివల్ల తనకేమీ  నష్టంలేదు. శర్మ సాక్ష్యం ఆధారంగా పోలీసులు తనని అరెస్ట్ చేయలేరు. కాని సలీం  శంకర్ ప్రాణాల్ని మాత్రం  ఆ తరువాత ఎవరూ రక్షించలేరు. జపానులో అతడి శరీరం సమాధి అయిపోతుంది.

    వసంత్  దాదా రిసీవర్ ఎత్తి లా మినిష్టర్ సెక్రటేరియేట్ కి ఫోన్ చేసాడు సెక్రటరీ తన ప్రైవేట్ ఫోన్ లోకి రాగానే విషయం చెప్పాడు.

    సెక్రటరీ  ఇబ్బందిగా  "దాదా, ఇంతకుముందులా లేవు పరిస్థితులు! పత్రికలు ముఖ్యంగా ఇంగ్లీషు జర్నల్స్ మనని ఏకిపారేస్తున్నాయి. ఏం చేసినా  జాగ్రత్తగా చెయ్యాలి" అన్నాడు.

    "ఇదేమీ పెద్ద సాయంకాదుసాబ్. ఏదో ఒక కారణంమీద  సలీంశంకర్ ని మరో మూడు నాలుగు నెలలు ఇండియాలోనే వుంచేట్టు చూడండీ".

    "చూస్తాను".

    ఇది జరిగిక రెండ్రోజులకి సలీంశంకర్ మీద  చిన్న కేసు బుక్ అయింది. అది కూడా పూర్తయ్యాకే అతడిని జపాన్ పంపించవలసిందని మినిస్ట్రీ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. (అదిప్పట్లో పూర్తవదని అందరికీ తెలుసు)

    అయితే ఇక్కడ  జపాను నుంచి వచ్చిన పోలీస్ అధికారి మరింత పట్టుదలతో వ్యవహరించాడు. నేరుగా న్యాయశాఖ మంత్రితోనే మాట్లాడాడు. అదృష్టవశాత్తు ఆ మంత్రి యువకుడు. వయసు తెచ్చే లంచగొండితనం ఇంకా అలవాటు కాలేదు. ఈ వ్యవహారాన్ని నెల రోజులులోగా పూర్తిచేసి పంపించవలసిందని తాఖీదు ఇచ్చాడు.

    ఏది ఏమైనా వసంత్ దాదాకి నెలరోజుల టైమ్ దొరికింది.

    ఈ నెల రోజుల్లోగా అతడు పనులు చెయ్యవలసివుంది. మొదటిది విష్ణు శర్మ నోరు శాశ్వతంగా మూసెయ్యడం ద్వారా తన ప్లాను బయట ప్రపంచంలో మూడో కంటికి తెలియనివ్వకుండా చెయ్యటం!! రెండు - సలీం శంకర్ బదులుగా జపాను వెళ్లటానికి మరో మనిషిని వెతకటం!!!

    రెండోది అంత కష్టం కాదు.

    విష్ణుశర్మ విషయమే దాదాని మరీ టెన్షన్ పడేస్తూంది. అతడి తెలివితేటలస్థాయి గురించి తనకేమీ తెలీదు. అతడు ఏ పోలీస్  స్టేషన్ లో నైనా, లేక ఏ  పత్రికా విలేకరి దగ్గరనైనా కాస్త నోరు కారాడంటే చాలు. శంకర్ ని మృత్యువు కబళించినట్టే. ఎలాగైనా అతడిని దానికన్నా ముందే పట్టుకోవాలి.

    అతడీ విధంగా యోచిస్తూ వుండగా ఫోన్ వచ్చింది. 'సరుకు' సికింద్రాబాద్ లో  దిగిందని, అక్కడ లీడర్లు గుర్తుపట్టరని. కొద్ది నిమిషాల్లో కట్టెలా మారబోయే శరీరాన్ని వాళ్ళ పరిభాషలో 'సరుకు' అంటారు.


                                                            12


    "కంగ్రాచ్యులేషన్స్ అమ్మాయ్" అన్నాడు రామసుబ్బారావ్ కుర్చీలో కూర్చుంటూ.

    "దేనికండి" నవ్వుతూ అడిగింది అనూష. ఆమె జనరల్ మేనేజర్  అయ్యాక, ఒక పార్టీలో రామసుబ్బారావ్ ని పరిచయం చేస్తూ ఇంటర్వ్యూ సమయంలో ఆమె  చేసిన ట్రిక్ చెప్పేసాడు పండా. సుబ్బారావు బిగ్గరగా నవ్వేసి "గుడ్. ఆ ఉద్యోగంలో వుండాలంటే ఆమాత్రం తెలివితేటలుండాలి అమ్మాయ్" అన్నాడు. పండా ఆయనకి ఎందుకు చెప్పాడా అనుకుంది కానీ తరువాత ఎప్పుడొచ్చినా అతడు గుంటూరు నుంది జున్ను తీసుకొచ్చి ఇచ్చేవాడు. పండాకి జున్ను అంటే చాలా  ఇష్టం. ఆమెతో కూడా కలుపుగోలుగా మాట్లాడేవాడు.

    "ఏదో స్కీం మీద నువ్వు వ్రాసిన వ్యాసం  చాలా బావుందిటగా. మా వాళ్ళు చెప్పుకుంటున్నారు".

    ఆమె జవాబు చెప్పలేదు. మనసులో మాత్రం తన వ్యాసం ఇంత సంచలనం కలిగించిందా అని ఆశ్చర్యపోయింది. అంతలో పండా నుంచి పిలుపొచ్చింది.

    "ఊక్క నిమిషం ఇప్పుడే వస్తాను. అంటూ ఆమె  ఛైర్మన్ గదిలోకి వెళ్ళి "ఎందుకు పిల్చారు?" అని అడిగింది.

    పండా తలెత్తి "నేనా? లేదే!!" అన్నాడు. "సరే ఎలాగో వచ్చావ్ గా. ఈ రోజు పేపర్లో 'రతి అండ్ కంపెనీ' గురించి ఏదో  పడిందట చూడు" అన్నాడు.

    రతి అండ్ కంపెనీకిప్ గార్మెంట్స్ (బట్టలు)లో ప్రత్యేకమైన స్థానం వుంది వివిద దేశాలకి ఎగుమతి చేస్తారు.

    "ఏ పేపరు?" అడిగింది.

    "హిందూనో- ఇండియన్ ఎక్స్  ప్రెస్సో"

    "అలాంటిదేమీ చూసినట్టు లేదే" అంది. ప్రతిరోజు అన్ని పేపర్లూ మొదటి అక్షరం నుంచి చివరివరకూ చదవడంతో వాడి దినచర్య ప్రారంభమవుతుంది.

    "మళ్లీ ఓసారి చూడు".

     ఆమె తిరిగి తన గదికి వచ్చేసరికి కుర్రాడు ఎకనామిక్ టైమ్స్ తెచ్చాడు, ఆ ఒక్క పేపర్ మాత్రం మధ్యాహ్నం వస్తుంది. ఆమె తిరగేసి చూసింది. మూడో  పేజీలో  వుంది ఆ  వార్త.

    "ఎందుకు నవ్వుతున్నావమ్మాయ్"

    "ఏం లేదండి".

    రామసుబ్బారావు పేపరు తీసుకుని చూసాడు.

    "రతి అండ్ కంపెనీ వారిచే కొత్తరకం  బ్రాసియారు"

    అహ్మదాబాద్, నవంబర్ 13: రతి అండ్ కంపెనీ కొత్త రకం బ్రాసియర్లని పేటెంట్ చేసింది. వెనుక తగిలించుకునే హుక్స్ కానీ, స్ట్రిప్స్ కానీ లేకుండా కేవలం ముందు మాత్రమే వుండే ఈ బ్రాసియర్స్  భారతదేశపు మొట్టమొదటి వస్త్రపు పేటెంట్ (పేటెంట్ నెం. బి. 19637) అవుతుందని ఆ కంపెనీ డైరెక్టర్  మల్హోత్రా చెప్పారు. అమెరికాలో ప్రస్తుతం వున్న స్ట్రిప్ లెస్ బ్రాసియర్ల కంటె ఇవి మేలైనవనీ, స్టీల అందాన్ని మరింత హుందాగా నిలుపుతాయనీ శ్రీ మల్హోత్రా అన్నారు. ప్రస్తుతం ఆమెరికా యువతరాణి కంటె ఎక్కువగా, 35 ఏళ్ళ పైబడిన తరాన్ని, ఈ ఫ్యాషను ఉర్రూతలూగిస్తున్న విషయం పాఠకులకి తెలుసు. ఈ ఎస్. ఎల్. బీ.లు శారీరక పోషణ విషయంలో కూడా......."

    పూర్తిగా చదవకుండా సుబ్బారావు పేపరు బల్లమీద పడేస్తూ "అమ్మాయ్, ఈ కంపెనీ షేర్లు వెంటనే కొనాలి" అన్నాడు.

 Previous Page Next Page