Previous Page Next Page 
యువత నవత పేజి 2

   
    "చీరకట్టులో వున్నంత సెక్సీదనం ఇంకే డ్రెస్సులోనూ వుండదని నేనంటాను!ఒకటి ఒంపులు ఒలకబోసుకోవాలంటే చీర కట్టుకోవాలి! జానెడు బెత్తెడు జాకెట్టులో ఒళ్లంతా బయట పరచుకోవచ్చు! పమిట కప్పుకొన్నట్టుగా కప్పుకొంటూనే గుండెల ఎత్తులు బయట పెట్టుకోవచ్చు!"

    "అందరూ ఔననేదాన్ని కాదనడం నీ తత్వంకదా?"

    "ఎవడయినా దుశ్సాసనుడు కొంగు కొసపట్టుకు లాగితేచాలు గిర్రున తిరిగి లంగా, జాకెట్ తో నిలబడిపోవాలి!"
    అంతలో సుగుణమ్మ వచ్చింది. "వాళ్లు ఎప్పుడు వస్తారోగాని, మీకు అన్నాలు పెడతాను రండర్రా" అని పిలిచింది.

     ముగ్గురూ డైనింగ్ హాలులోకి వెళ్లారు.

     శాలిని తన ప్లేట్ లో అన్నంచూసి, గాబరాగా అంది "బాబోయ్! ఇంత అన్నం  తిన్నానంటే రెండు రోజులకే డ్రమ్ములా అయిపోతానండీ! సగం తీసేయండి!"

    "ఎంత అన్నం పెట్టానమ్మాయ్? రెండు పిడికిళ్లు అన్నానికి కుంభాన్ని చూసినట్లుగా గాభరాపడుతున్నావు! మా వనజాక్షికూడా అంతే! ముక్కుకు మూడు మెతుకులు రాచుకొని, మళ్లీ గంటకే ఆకలి ఆకలని అరుస్తుంది. లేనివాళ్లు లేక యేడుస్తుంటే వున్నవాళ్లు లావైపోతామన్న భయంతో కడుపుకాల్చుకొంటున్నారు. డైటింగ్ చేసి నాజూగ్గా తయారయ్యాం అని మీరు మురుస్తున్నారేమోగాని నాకు మాత్రం మీరు ఒంటి ఊపిరి మనుషులుగా కనిపిస్తున్నారు. తిండిలేక కృశించిపోయినట్టుగా కనిపిస్తున్నారు. మా వనజాక్షి రెండేళ్ల క్రితం కొంచెం బొద్దుగా  వుండేది లావున్నావని ఎవరయినా అన్నారో, తనకే అనిపించిందో డైటింగ్ అంటూ  ముక్కుకు మూడు మెతుకులు రాచుకోవడం  మొదలు పెట్టింది  నెయ్యిలేదు. పెరుగులేదు స్వీట్లు లేవు నూనెతిళ్లు లేవు.  ఆరునెలలకే సగానికి సగం తగ్గింది.  ఇరవయ్యేళ్ళకే అరవయ్యేళ్ళ వృద్దులా తోళ్లు వేళ్లాడబడ్డాయి!  చెంపలు జారిపోయాయి.  కళ్ల క్రింద యేదో జబ్బు చేసినట్లుగా నలుపులు, కాంతి తరిగిన కళ్లు శరీరం బలహీనమయ్యేసరికి అంత  ఒత్తు జుట్టూ వూడిపోవడం మొదలుపెట్టింది. ఒత్తుగా వున్న తలకట్టుకు బదులు యిప్పుడు తలమీద రెండుపోచలు మిగిలాయి. డైటింగ్ చేసి నాజూగ్గా తయారయ్యానని అది మురుస్తూంది. కాని పిల్ల బలహీనమై ఏం జబ్బు పట్టుకొంటుందోనని నేను హడలి చస్తుంటాను. బొద్దుగా వున్నప్పుడే అందంగా వుండేది! ఇప్పుడు శరీరానికి ఆ ఛాయలేదు కాంతిలేదు. యవ్వనం  సడలిపోయినట్టుగా కనిపిస్తూంటే దీన్నెవరు చేసుకుంటారా అని బెంగపడి చస్తున్నాను!"

    సుధ గట్టిగా చప్పట్లు కొట్టింది. "నేను మీతో ఏకీభవిస్తున్నానండీ "తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలిగితే గుండె కలదోయ్.... అన్నాడు ఓ మహాకవి! శరీరాలను ఇలా కృశింపజేసుకోవాలని ఏ దేవుడు చెప్పాడు? నేను మాత్రం కడుపునిండా తింటాను. నలుగురు మగవాళ్లు వచ్చినా తన్న గలను."

    "తను కరాటే ఫైటరండీ! ఆహూఁ అని ఒకసారి చెయ్యి ఆడించిందంటే అర్దసేరు బియ్యం తిరిగిపోతాయి" చెప్పింది శాలిని.

     "మంచిదే! ప్రతి ఆడపిల్లా తనను తాను రక్షించుకోడానికి ఏదో ఒకటి నేర్చుకొని వుండాల్సిన కాలం వచ్చిందమ్మా!ఆడపిల్ల బయటికి వెళ్లిందంటే తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేవరకు గుండెలు పీచు పీచు మంటూనే వుంటాయి!" అంది సుగుణమ్మ.

     "ఈ కాస్త పెళ్లి అయిపోనీ, అమ్మా! ఇప్పుడు కడుపు కాల్చుకొన్న దంతా అప్పుడు తినేస్తాది. అప్పుడు లావైతే  పెళ్లికాదన్న బెంగ వుండదు! ఒకరిద్దరు పిల్లల తరువాత  లావెక్కితే  హుందాగా వుంటుంది కూడా!" అంది వనజాక్షి.

     వనజాక్షి అన్న వాళ్ల సంభాషణ వింటున్నాడు ఇంతసేపు నిశ్శబ్దంగా చెల్లెలి మాటవిని గుమ్మం దగ్గరికి వచ్చి అన్నాడు. "ఇదన్నమాట సంగతి? పెళ్లప్పుడు మీ వదిన బొమ్మలా వుండేది కదా. ఇప్పుడు ఇంత బొజ్జవచ్చేసి పీపాలా ఎలా తయారైపోయిందాని తెగ ఆశ్చర్యపోతున్నాను!" పెళ్లి కాకముందు పెళ్లికొడుకులను బుట్టలో పెట్టడానికి స్మార్ట్ గా వుంటారు. పెళ్లయ్యాక ఇహ అడిగేవాడుండడని  ఊకబస్తాలా ఊరిపోతారా? ఇది చాలా అన్యాయం అమ్మాయ్! అబ్బాయిల్ని ఇలా మోసగించడం!"

    "పెళ్ళయ్యేసరికే నోరు కట్టి ఛస్తాం. ఇహ పెళ్లయ్యి పిల్లలయ్యాక కూడా  పేగుల్ని ఎవరు మాడుస్తారన్నయ్యా? నేనుమాత్రం ఇప్పుడు కడుపుని ఎంతెంత మాడుస్తున్నానో అంతకు రెట్టింపు  బదులు తీర్చుకొంటాను. పెళ్లికూతుళ్లు లావుంటే వద్దంటారుగాని, భార్యలావైతే లావైందని వదిలేసే  మగవాళ్లు లేరు కదా?"

 Previous Page Next Page