Previous Page
Next Page
అమృతం కురిసిన రాత్రి పేజి 18
వాన కురిసిన రాత్రి
చినుకు చినుకుగ వాన కురిసినటు
నిశికి
సన్న చీకటి దోమ తెర కట్టినటు
చలి చలిగ గాలి
చెట్ల ఆకులదూరి కప్ప బెకబెకల తేలి
చూరులో నిదుర తూలి
గుండె కొసలకు మెల్లగా జారినటు
కప్పుకొని దళసరి దుప్పటిలో
వెచ్చవెచ్చని మనసులో పొరలివచ్చు
నిదురలో చినుకు రాలినటు
కలలు జారు సవ్వడి
ఆ రోజు సాయంత్ర మమ్మిన మల్లెపూలు
ఆమె సిగదాల్చి నవ్వినటు
నా యొడలు తగిలినటు
కాలమే కరిగినటు
ఆకసము వణికినటు
ఏదో అనిపించి సగము తెరచిన కనుల
కెదురుగా
గదిలోన దీపశిఖ కదలునీడల నడుమ
మదిలోన తొలి కోర్కె మసక నిద్దుర నడుమ
చినుకు చినుకుగ వాన కురిసినటు
నిశి
సన్న చీకటి దోమ తెర కట్టినటు
గదిలోన దీపశిఖ కదలు నీడల నడుమ
ఎర్రనై ఏకాంత సరస్సున విరిసిన
ఎర్రకలువ యటు
తీరని కోరికటు
తెరచిన విరహిణి నయనమటు
కదలు నీడల మధ్య గదిలోన దీపశిఖ
కదలు కలల బంగరు వలల
రంగురంగుల బొరుసు లాడించు చేప
చేపలకు తగిలి మెరిసిన నీరు
నీరువిడిచి చినుకు చినుకుగ వాన కురిసినటు
నిద్రవిడి చినుకు చినుకుగ వాన కురిసినటు
నిద్రవిడి మినుకు మినుకుగ స్పృహ మెరిసినటు
* * *
Previous Page
Next Page