6. అక్షరాల కూర్పు:
దీన్ని రెండు రకాలుగా విభజించవచ్చు.
కొందరు అక్షరాలని దూరదూరంగా లేదా పదాలని దూరదూరంగా విడివిడిగా వ్రాస్తారు. మరికొందరు వాక్యం మొదలుపెడితే అలా వ్రాసుకుంటూపోతారు. ఈ పద్దతిలోఅక్షరానికి అక్షరానికీ మధ్య చిన్న లింక్ కూడా వుంటుంది. దస్తావేజులు వ్రాసేవారి చేతివ్రాతలు ఈ విధంగా వుండటం మనం గమనిస్తాం. పొద్దున్ననుంచి సాయంత్రం వరకు వ్రాసే పనినే వృత్తిగా పెట్టుకున్న వాళ్లు వీలైనంత వరకూ తొందరగా తమ స్క్రిప్ట్ పూర్తి చెయ్యటానికి ఈ విధానాన్ని అవలంభిస్తూ వుంటారు.వీరు ఒక వాక్యం పూర్తి చెయ్యటానికి ఏమాత్రం కష్టపడరు. అలాగాకుండా, అక్షరాలని, పదాలని దూరంగా వ్రాసేవాళ్లు కొందరు పదాలని శిల్పం చెక్కినట్లుగా చెక్కుతారు.
అయిదోఛాప్టర్లో చెప్పిన 'ఒద్దిక' కీ ఆరోఛాప్టర్లో చెప్పిన - 'కూర్పుకీ' తేడా వుంది.
కొంత మంది ఒద్దిక సరగా లేకపోయిన కూడా అక్షరాలని దూరదూరంగా వ్రాస్తారు. అవి అందంగా లేకపోవచ్చు. ఇక్కడ ఈ ఛాప్టర్లో మనం గమనించవలసిందల్లా అక్షరానికి అక్షరానికీ మధ్యవున్నతేడా, పదానికి పదానికీ మధ్యవున్న తేడా, అలాగే వాక్యానికి వాక్యానికీ మధ్యవున్న దూరం అంతేతప్ప వ్రాత ఎలా వుందని కాదు.
ఈ క్రింది రెండు చేతి వ్రాతలూ గమనించండి.
నోట్: మీ చేతివ్రాత ప్రతిలో ఏరెండు అక్షరాలు కలిసివున్నా చాలు మీరు రెండోవిభాగానికి చెందుతారు.
1. అక్షరాలని విడివిడిగా వ్రాసేవాళ్లు ఎప్పుడూ క్రిందివారిలో తప్పులు ఎంచుతూ వుంటారు.
జీవితంలో పైకి వచ్చేవారుగాని, వచ్చినవారుగానీ అయి వుంటారు.
ఒక అక్షరానికి మరో అక్షరానికి మధ్యఎంత తేడా మొదట్లో ఎంత వదులుతున్నారో, అలాగే స్క్రిప్ట్ పూర్తయ్యే చివరివరకూ వదిలితే, సాధారణంగా ఎటువంటి పరిస్థితులలోనూ బ్యాలన్సు తప్పిన మనుషులై వుంటారు. అలాకాకుండా చేతివ్రాత ప్రారంభంలో ఒక విధమైన స్పేసింగ్ ఇస్తూ, తర్వాత అధి మారిపోతే, పనిలో ముందుకు సాగేకొద్దీ మరింత ఏకాగ్రతతో పనిచేసే వాళ్ళై వుంటారు. మరోరకంగా చెప్పాలంటే, చేతివ్రాతకన్నా కమ్యూనికేషన్ మీద మీకు ఎక్కువ ఇంట్రస్ట్ కలిగిందన్నమాట. అనవసరమైన విషయాలకి మీరు ప్రాముఖ్యతనివ్వని వ్యక్తులై వుంటారు.
కొందరు వ్రాత ప్రారంభంలో లైనుకిలైనుకీ మధ్య ఎక్కువ ఖాళీ వదిలి చివరికి వచ్చేసరికి లైనులో లైనుని ఇరికించి వ్రాస్తారు. ఇటువంటివాళ్ళకి కూడా పై విశ్లేషణే వర్తిస్తుంది.
పదానికీ, పదానికీ మధ్య ఎక్కువ తేడా వదలడమనేది 16- 25 మధ్యవయస్సు వాళ్లలో మనం ఎక్కువగా చూస్తూవుంటాం. 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా వాళ్లీ విధంగా ఇంకా స్పేస్ వదిలితే, వాళ్లు మనసులో ఇంకా చిన్న పిల్లలే అన్నమాట.
ఈ విధంగా కాకుండా ఒక అక్షరంలోకి మరో అక్షరం చొచ్చుకుపోవటం. ఒక అక్షరం తాలుకా దీర్ఘం మరో అక్షరంలోకి కలిసి పోవటం మనిషి యొక్క అస్థిర భావాన్ని సూచిస్తుంది. ఇటువంటి వాళ్లు అవతల వాళ్లు ప్రభావానికి తొందరగా లోనవుతారు.
2) గొలుసు వ్రాత:
మీరు లాజిక్ కి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు.
మంచి మాటకారి అయివుంటారు.
ఏ విషయం పట్ల అయినా తొందరగా అవగాహనకి వచ్చే శక్తి కలిగి వుంటారు.
అమాయకత్వమైన నవ్వు అమితమైన స్నేహాన్ని ఆకాక్షించే స్వభావం మీ వ్యక్తిత్వానికి పట్టుగొమ్మలు.
మీరు అన్యాయాన్ని, అక్రమాన్ని జరిగిన చోటే ఖండించడంలో మొదటివాళ్లు. అభిప్రాయాలను చెప్పటానికి మొగమాటపడరు. వీరు నమ్మిన సిద్దాంతాన్ని వ్యతిరేకించేవాళ్లను అతి భయంకరంగా ఎదుర్కోవటమే కాకుండా అవసరమైతే తెగతెంపులకి సిద్దపడతారు.
చేతిలో మిషన్ గన్ పట్టుకుని వున్న మనిషైనాసరే, పట్టుపరికిణీలో మెరిసి పోతున్న అమ్మాయి అయినా సరే మీకు, ఇబ్బంది కలిగిస్తే మాత్రం 'మీ వల్ల నాకు కష్టం కలుగుతోంది' అని స్పష్టంగా చెప్పేస్తారు. అలా చెప్పటం వల్ల వచ్చే కష్టనష్టాలకు తర్వాత బాధ పడ్డా అసహనాన్ని మాత్రం అణచుకోలేరు.
ఉన్నది వున్నట్లుగా తెలుసకోవటానికి, తిరిగి చెప్పటానికి మీరు ఇష్టపడతారు.
చిన్న పిల్లలు ఎలాగైతే తమకు కావలసినది పొందటానికి అల్లరిచేసి అరిచి గీపెడతారో, మీరు కూడా వీరికి అవసరమైనవి పొందటానికి కొంచెం అటూఇటూగా అవే పద్దతులిని అనుసరిస్తారు అయితే కావలసినది పొందటానికి అడ్డదార్లు తొక్కటం మీ స్వభావం కాదు.