Previous Page Next Page 
దుప్పట్లో మిన్నాగు పేజి 13


                                    నేను చెప్పిన కథ : అంతర్నేత్రం
    అరుధంతి వరండాలో కుర్చీలో కూర్చుని అసహనంగా అటూ ఇటూ కడులుతూంది. భర్త ఆపరేషన్ ధియేటర్ లో టేబిల్ మీద వుంటే, భార్య బయట కూర్చుని దేవుణ్ణి ప్రార్థించటం, మాటిమాటికీ మంగళసూత్రాల్ని తీసి కళ్ళకి అద్దుకోవటం మీరు చాలా సినిమాల్లో చూసే వుంటారు. ప్రస్తుతం అరుంధతి అలాంటి పనులు ఏమీ చేయటంలేదు గానీ ఆందోళనగానే వుంది. భర్తతో ఏమాత్రం సుఖం అనుభవించని భార్యలు కూడా భర్త పోతే ఆ రోజు తప్పక ఏడుస్తారు. తరువాత భవిష్యత్తులో ఎప్పుడైనా అమ్యయ్య పోయాడు కదా" అని సంతోషిస్తారేమో నాకు తెలీదు (మొగవాణ్ణి కనుక).
    అరుంధతిని భర్త అంత కష్టపెట్టలేదుగానీ, ఆమెని సుఖపెట్టను కూడా  లేదు. అతడి ప్రపంచం అతడిది. రోజూ తాగేవాడు. అదేమిటని అడిగితే 'నువ్వూ తాగు డియర్' అనేవాడు. అందమయిన అమ్మాయిల్తో ఎలా కలిసేవాడో తెలీదు కానీ, పది నిముషాల్లో మంచి చేసుకొనేవాడు. అతడికి ఇష్టమయింది పేకాట బయట గదిలో పేకాడుతూ గంటకొకసారి అయిదు కాఫీలు ఆర్డర్ చేసేవాడు. ఆమె  మారు మాట్లాడకుండా అన్నీ  సాహించింది. ఆడదాని మనసు అఖాతం అంటారు కవులు. కానీ అది అగ్నిపర్వతం అంటాను నేను. అదృష్టవశాత్తు అది ఆమె భర్త బ్రతికి వుండగా పగల్లేదు. లోపల భర్తకి జరుగుతున్న ఆపరేషన్ తాలూకు వార్తకోసం వేచి వుంది. అతడు చచ్చిపోతే అరుంధతి ఏడుస్తుందా? నిశ్చయంగా మొదటిరోజు ఏడుస్తుంది.
                          *    *    *
    "మిసెస్ అరుంధతీ" అన్నాడు లాయర్. "ఐయామ్ సారీ......."
    అరుంధతి మాట్లాడలేదు. కొంగు చివర్లని చేతివేళ్ళ మధ్య తిప్పుతూ తల వుంచుకుని కూర్చుంది. పోయిన భర్త తాలూకు జ్ఞాపకాలతో విచారంగా వుందేమో అనుకున్నాడు లాయరు. పోయేటప్పుడు రంగారావు పెద్ద ఆస్థినేమీ వెనక వదిలిపోలేదు. ఉన్నదంతా ఎలాగో ఒక్కతే భార్య అయిన అరుంధతికే దక్కుతుంది.
    లాయరు డ్రాయరులోంచి ఒక పెద్ద కవరు ఆమెకి ఇస్తూ, "ఇది మీకిమ్మని రంగారావు నాకు చెప్పాడు" అన్నాడు.
    అంతలో అతడికి తన పాత పేకాట స్నేహితుడు గుర్తొచ్చినట్టున్నాడు. కళ్ళు తుడుచుకుంటూ, "పాపం చాలా మంచి వాడు. అర్థాయుష్షుతో వెళ్ళిపోయాడు" అన్నాడు.
    అవును మరి, ప్రతి ఆదివారమూ శలవురోజు వస్తే చాలా- ఇంటికి పిలిచి  జీడిపప్పు ఉప్మా చేయించి పేకాడేవాళ్ళు ఎవరుంటారు?
    ఈ లోపులో లాయరు సర్దుకొని, "ఇది బహుశా మీకు ఆయన వ్యక్తిగతంగా వ్రాసిన ఉత్తరం అయివుంటుంది అరుంధథిగారూ! ఇన్సూరెన్స్ విషయం నాకువదిలిపెట్టండి. దాని గురించి మీరేమీ చింత పెట్టుకోవద్దు. వృత్తిరీత్యా కాకపోయినా స్నేహితుడిగానైనా అది చేయటం నా ధర్మం....."
    వెళ్ళొస్తానని చెప్పి కుర్చీలోనుంచి లేచింది. అతడు గుమ్మంవరకూ వచ్చి సాగనంపాడు.
    అరుంధతి వీధిలోకి వచ్చి రక్షాలో కూర్చుంది. రిక్షా కదులుతుంటే ఆమె మనసులో లక్ష ఆలోచనలు. చేతిలో కవరు లావుగా తగులుతూంది. తనకి  తన మాజీ భర్త చాలా పెద్ద ఉత్తరం వ్రాశాడు. (చనిపోయిన భర్తని మాజీ భర్త అంటారా.....ఏమో!) అయినా ఇందులో  ఏం వ్రాసి ఉంటాడు?".....నా ఆస్తంతా చట్ట ప్రకారం నీకు దక్కినా, మన ఇంటికి అప్పుడప్పుడొచ్చే శ్యామల, విమల, కమలక్కూడా వాటా ఇవ్వటం నావిధి. మానవతా దృక్పథంతో నీకు తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టి యాభైవేలు తీసుకెళ్ళి తగలేశాను. దాన్ని తీర్పు" అంటాడా? "నాఫోటో నిలువెత్తుది చేసి ముందుగదిలో పెట్టి ప్రతిరోజు దీపం వెలిగించు" అని కోరతాడా?
    లేకపోతే-
    బ్రతికున్నప్పుడు తను పెట్టిన కష్టాలన్నిటికీ పశ్చాత్తాపం వెలిబుచ్చిక్షమాపణ కోరుకుంటాడా?
    ఆ ఆలోచన రాగానే అతడి నిలువెత్తు విగ్రహం ఆమె కళ్ళముందు కదలాడింది. మనిషి స్ఫూరద్రూపుడు. ఎప్పుడూ చీకూచింతా లేకుండా నవ్వుతూ వుండేవాడు. బ్రతకటం హాయిగా  అనుభవించటానికే అన్నట్టు జల్సాగా కనబడేవాడు.
    అదీగాక ఆయనకీ రచనల  పిచ్చి  ఉంది. ప్రతీనెల ఇంట్లో చిన్నసైజు కవి సమ్మేళనం జరుగుతూ వుండేది. ఆ పక్క నాలుగయిదు  వీధుల్లో వుండే వాళ్ళందరూ వచ్చి, తాము  వ్రాసిన  వచన కవిత్వము చదువుతూ ఉండేవారు. విప్లవ చర్చలను ఘాటుగా చర్చించుకొనేవారు. ఈ లోపులో సాయంత్రమై చీకటి పడితే మందులోకి దిగేవారు. తన భర్త జీవితం పంచరంగులు సినిమా! అటువంటి భర్త తనకేం ఉత్తరం వ్రాసి వుంటాడు?
    భార్యగా పదిహేను సంవత్సరాలపాటు అయిదువేలసార్లు పడకసుఖం ఇచ్చినందుకూ, పదివేలసార్లు వంటచేసి పెట్టినందుకూ కృతజ్ఞతలు చెప్పుకుంటూన్న ఉత్తరమేమో.....
                                              *    *    *
    "ఒక్క నిముషం ఆగు" అన్నాడు విజ్జూ.
    సీరియస్ గా చెప్పుకుపోతున్న వాడినల్లా కథని ఉలిక్కిపడి ఆపుచేశాను.
    "సైంటిఫిక్ ఫిక్షన్ అంటూ ఇదేదో మొగుడూ, పెళ్ళాల లెక్కల కథ చెబుతున్నావెంటి" అన్నాడు.
    కోపం వచ్చినా తమాయించుకున్నాను. "కథ ప్రారంభంచటమే..... 'ఆ  విగ్రహం గంభీరమైన గొంతుతో మాట్లాడటం ప్రారంభించింది' -అని మొదలుపెట్టి, చివరివాక్యంగా, 'ఆ విగ్రహంలో మైక్రోఫోనూ, టేప్ రికార్డరూ వున్నాయి" అని వ్రాస్తే తప్ప సైంటిఫిక్ ఫిక్షన్ అవడా? ఏ రచనలోనయినా పాత్రల్ని ముందు పాఠకులకి దగ్గర చెయ్యాలి. అయినా మిగతా నలుగురూ కథ చెప్పేటప్పుడు శ్రద్ధగా విని, నేను చెప్పేటప్పుడు ఇలా అడ్డుపడి నా కథకి మార్కులు తక్కువ పడేటట్టూ చేయటం కేవలం కక్ష సాధింపుచర్యే" అని అభ్యంతరం తెలిపాను. అతడు క్షమాపణలు తెలుపుకున్నాక తిరిగి కొనసాగించాను.
    అరుంధతి ఇంటి తలుపు తాళం తీసి తొందర తొందరగా లోపలి వెళ్ళి సోఫాలో కూర్చుంది. చేతిలోని కవరు చింపి లోపలి కాగితాలు బైటకి తీసింది. మొత్తం పదహారు కాగితాలు వరసగా నంబర్లు వేసి వున్నాయి. గ్రాఫాలజీ ప్రకారం చాలా విలాస ప్రియుడూ, రాసికుడూ అయినా భర్త చేతివ్రాతతో ఆ కాగితాలు  నింపబడి ఉన్నాయి.
    ఆమెని ఒక్కసారిగా నిస్సహాయత ఆవిరించింది. చేతులు వణకసాగాయి. తలెత్తి గదంతా కలయజూసింది. భర్త ఎప్పుడూ కూర్చుని వీదివైపు చూస్తూ సిగరెట్లు తాగే రివాల్వింగు కుర్చీ నెమ్మదిగా వూగుతూ వుంది. అందులో భర్త కూర్చుని, తను ఉత్తరం చదవడాన్ని చూస్తున్నట్టు భ్రమ కలిగింది. అందులో భర్త కూర్చుని, తను ఉత్తరం చదవడాన్ని చూస్తున్నట్టు భ్రమ కలిగింది. ఆమెకి భయం వేసింది. పదిహేను సంవత్సరాలలోను ఒక్కసారి కూడా సినిమాకి తీసుకెళ్ళక పోయినా ఆమెకి భయం ఎక్కువ. మనసులో కుతకుత ఉడికిపోయేదే తప్ప ప్రకటించేది కాదు.
    భర్త పోయిన తర్వాత, ఈ వారంరోజులూ ఒక్కతే ఇంటిలో ఉండటానికి నెమ్మది నెమ్మదిగా అలవాటుపడ్డ తర్వాత, మళ్లీ ఇన్నాళ్ళకి ఆమెకి తిరిగి భయం వేయటం ప్రారంభించింది. భర్త ఆమెని ఎప్పుడూ కట్టడిలో పెట్టలేదు. ఆమెగానీ  'నేనూ మీలాగా విచ్చల విడిగా తిరుగుతానూ; అని ఉంటే ఏం చేసి  వుండేవాడో చెప్పలేంగానీ 'నువ్వూ ఏ వనితా మండలిలోనో చేరకూడదోయ్' అనేవాడు. కానీ ఆమె బాగా జ్ఞాపకం- పక్కింటి పిన్నిగారితో కలిసి మాట్నీకి వెళ్ళి వచ్చినప్పుడు ఇదే రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని అతను చూసిన చూపు....
    ఇలాంటి ఆలోచనలతో చెదిరిపోయిన మనసును కూడదీసుకుని ఆమె  నెమ్మదిగా ఆ ఉత్తరాన్ని చదవటం ప్రారంభించింది.
    "ప్రియమైన అరుంధతి-
    ఈ ఉత్తరం కేవలం నీ కోసమే వ్రాశాను. నేను పోయిన వారంరోజులకి మన లాయరు ఈ ఉత్తరాన్ని నీకు అందచేస్తారు. పూర్తిగా ఓపికతో చదవగలవు. ఇంత పెద్ద ఉత్తరాన్ని నీకు అందజేస్తారు. పూర్తిగా ఓపికతో చదవగలవు. ఇంత పెద్ద ఉత్తరాన్ని చూసి కంగారుపడకు. ఆపరేషను పేరిట డాక్టర్ విలియమ్స్ నన్ను ఏం చెయ్యబోతున్నాడో నీకు తెలియాలంటే ఇంత వివరంగానూ, విపులంగానూ వ్రాయటం అవసరం. ఇంకొక గంటలో నాకు ఆపరేషను జరగబోతూ వుంది. మొత్తం జరిగినదేమిటో వివరంగా వ్రాయటానికి ఈ ఒక్క గంటా చాలు. తర్వాత ఆపరేషన్ ధియేటర్ లో మత్తుమందు నిద్రలో నేను, బయట వరండాలో నా గురించిన ఆత్రుతతో నువ్వూ వుంటావు. ఆ తర్వాత జరిగేది మనకు  తెలీదుకదా.
    నేనేదో డాక్టర్ విలియమ్స్ మీద కక్షతో ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాననుకోకు. ఆపరేషన్ కు ముందే అతడు అందులో కష్టనష్టాలన్నీ నాకు చెప్పాడు. అన్నీ విని ఒప్పుకున్నాను. కానీ నా జీవిత సహధర్మచారిణిగా, పదిహేను సంవత్సరాలు నాతో కలిసి మెలసి వున్నదానివిగా, నీకీ విషయాలన్నీ చెప్పటం నా ధర్మం. అంతా చదివి నీవు భయంతో కెవ్వున అరవవచ్చు, లేదా వెన్నులో ఒక్కసారిగా చలిపుట్టి స్పృహ తప్పిపోవచ్చు. అందుకే మరీ భయంవేస్తే అక్కడ చదవటం ఆపుచేసి మళ్ళీ చదువు.
    ఇదంతా నీ భర్తకు జరిగింది అన్న విషయం మర్చిపో.
    కానీ ఏం జరిగిందో తెలుసుకోవటానికి భార్యగా నీకు హక్కుంది.
    గత కొద్దిరోజులుగా ఈ విషయం నీకు చెబుదామని ప్రయత్నిస్తూ వచ్చాను. కానీ, నేను బ్రతికి వున్నప్పుడు చెప్పే దానికంటే, ఉత్తరంద్వారా చెపితే, నువ్వు మరింత శ్రద్ధతో విషయాన్ని తెలుసుకుంటావని అనుకుంటున్నాను.
    నిజంగా చాలా గొప్ప విషయం జరగబోతూ వుంది అరుంధతీ! ఇదంతా చదివాక ఇఅలాటి భర్తను పొందినందుకు నువ్వు తప్పక గర్వపడతావు.
    నువ్వు ఇది చదువుతున్నప్పుడు మాటిమాటికీ నన్ను క్షమించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత దారుణమైన విషయాన్ని ఇంత  కామ్ గా- కూల్ గా  వ్రాసినందుకు నన్నుక్షమించు. కానీ అంతగా ఇలా నేను ముందే ప్రిపేర్ కాకపోతే, ఇంకో అరగంట గడిచాక టెన్షన్ మరింత ఎక్కువయి అసలేమీ వ్రాయలేక పోవచ్చు. మెదడు తీసెయ్యబడుతుందీ అంటే మరి ఎవరికయినా టెన్షన్ కదా.
    అన్నిటికన్నా ముందు నన్ను నీకు కృతజ్ఞతలు చెప్పుకోనీ! నాతో ఇన్నాళ్ళు కాపురం చేసినందుకు మన ఇన్నేళ్ళ కాపురంలో నిన్ను ఒక్కసారైనా బజారుకిగానీ, సినిమాకిగానీ తీసుకెళ్లనందుకు మన్నించు. అయినా సినిమాలలో ఏముంది అరుంధతీ! హీరోకో, హీరోయిన్ కో బ్లడ్ క్యాన్సర్  వస్తుంది. అక్కణ్ణుంచి బరువైన డైలాగులు వస్తాయి. ఆ సినిమా మనింట్లోనే సంవత్సరం నుంచీ చూస్తున్నావు కదా- గోపాలకృష్ణుడిలా వెలిగిన నేను బాటసారిలా మారటాన్ని.
    ఈ సంవత్సరం ప్రతిక్షణమూ నరకమే అనుకో. మరణాన్ని వూహించుకుంటూ బతకటం!!
    అందులోనూ సినిమా వాళ్ళకి ఉపయోగపడటం కోసం కనీసం ఒక వ్యాధి అయినా వుండాలనేమో అనే కాబోలు బ్లడ్ క్యాన్సర్ కి ఇన్నాళ్ళనుంచీ! ఏ మందూ కనుక్కోబడలేదు రోజులు లెక్కపెట్టుకుంటూ గడుపుతున్న నేను మరణం నన్ను చెరక ముందే నేనే భయంతో వెళ్లిదాని చేరుకునేవాణ్ణి.
    ఆ రోజు డాక్టర్ విలియమ్స్ కానీ నన్ను కలవకపోతే......

 Previous Page Next Page