Previous Page Next Page 
ష్....మాట్లాడొద్దు పేజి 12

    ఓ వైపు నుంచి పోలీసు ఫోర్స్.  మరో వైపు నుంచి తను  వాళ్లని  ఛేజ్ చేయాలి.
    ఈ ఆలోచనలో  అతనుండగానే రైట్ సైడ్  నుంచి ఓ వ్యాన్ వస్తూ కనిపించింది.
      వ్యాన్ లో భార్గవ,  మరో యిద్దరు మనుష్యులు వున్నారు.  ఆ యిద్దరు జేమ్స్ డేవిడ్ తాలూకు  మనుష్యులు.
    సిటీ బ్యాంకును దోచుకోవడానికి ప్లాన్ ఎప్పుడో పూర్తయింది. భార్గవ సిటీ బ్యాంకు లోపలికి ప్రవేశించడానికి అన్ని మార్గాలూ కనుక్కున్నాడు.
    సిటీ బ్యాంకు తాళాలకు డూప్లికేట్ చేయించి పెట్టాడు.  ఎటునుంచి వెళ్లాలి...ఎలా వెళ్లాలి? సెంట్రీని ఎలా దెబ్బతీయాలి? ఎమర్జన్సీ అలారం ఎలా ఆఫ్ చేయాలి? స్ట్రాంగ్ రూమ్ ఎలా తెరవాలి? లాంటివన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాడు.
    ఈ రాబరీ అయిపోగా తనకు రావలసిన ఐదు లక్షలు తీసుకుని తను వెళ్లిపోతాడు.  ఈ ఆంధ్రా పోలీసులతో తనకు పేచి వద్దు.
    అతను  మధ్యప్రదేశ్ లో వుండగానే కృపాల్ గురించి తెలుసుకున్నాడు.
    చాలా భయంకరమైన పోలీసాఫీసర్ అని,  సాప్ట్ గా  కనిపించే రఫ్ ఆఫీసర్ అని విన్నాడు. కండబలమే గాక బుద్ధిబలం దండిగా వున్న వ్యక్తి అని తెలిసింది.
    అలాంటి వ్యక్తితో తను జాగ్రత్తగా వుండాలి. అతనికి లేడీ కానిస్టేబుల్ సరిత గుర్తొచ్చింది.  ఆవిడ లేచి వుంటుందా? స్పృహలోకి  రాగానే ఈ విషయం కృపాల్ కు చెబితే...అసలే చిచ్చరపిడుగు...పైగా  డేంజరస్  పర్సన్...తనని ఎటాక్ చేయడానికి అతనికి ఐదు నిమిషాలు చాలు.
    అతనికి చికాగ్గా వుంది. ప్రణవి అందాలను తన స్వంతం  చేసుకోలేకపోయానే అని బాధ కూడా వుంది.  అతను సెక్స్ మానియాక్. అతని మీద వున్న కేసుల్లో ఎక్కువగా రేప్ కు  సంబంధించినవే.  అమ్మాయిలను ఘోరంగా రేప్ చేసి చంపిపారేసేవాడు.
    వ్యాన్ క్రాస్ రోడ్స్ ని   సమీపించింది.
    'స్ట్రయిట్ గా  పోనివ్వు'   డైవర్ తో  చెప్పాడు భార్గవ.
      డైవర్ స్ట్రయిట్ గా  పోనిచ్చాడు.
     సిటీ  బ్యాంకు బోర్డు పెద్దగా  వుంది.  బ్యాంకు ముందు సెంట్రీ వున్నాడు.
    నగరంలో అతి పెద్ద బ్యాంకుల్లో  అదొకటి.
    అర్దరాత్రి రెండు దాటింది.
    సెంట్రి నిద్రలో  జోగుతున్నాడు.
    మామూలుగా  సెంట్రీ నిద్రపోతూనే  వుంటాడు.  నగరానికి నడిబొడ్డులో వున్న ఈ బ్యాంకును  దోచుకునే ధైర్యం  ఎవరికుంతుందనే  ధీమా?
    వ్యాన్ ని   ఓ  చెట్టు దగ్గర ఆపాడు   డైవర్ .
    భార్గవ చుట్టూ చూసాడు.
    జనసంచారం లేదు.  నిర్మానుష్యంగా వుంది.  తమ ప్రతీ కదలికా సృష్టంగా కనిపిస్తుంది. చాటు కూడా లేదు.  వ్యాన్  ను  డైరెక్టు గా  బ్యాంకు ముందాపితే,వ్యాన్ సౌండ్ విని సెంట్రీ నిద్ర లేచే ప్రమాదం వుంది.
    భార్గవ సీటుకింద  వున్న  రివాల్వర్ తీసుకున్నాడు.  మిగతా ఇద్దరు రివాల్వర్స్  ప్యాంటు జేబుల్లో పెట్టుకున్నారు.
    పెద్ద బ్యాగు వుంది.  డబ్బు,  బంగారం అందులో వేయడానికి పనికొస్తుంది.
    భార్గవ సైగా చేసాడు కదలమన్నాట్లు.
    వాళ్లు కదలబోయేంతలో...పెద్దగా సైరన్ కు  ఉలిక్కిపడ్డాడు భార్గవ.
    వెంటనే  వ్యాన్ లోకి  వెళ్లి కూర్చున్నాడు. అతని మనసేదో కీడిను శంకించింది.
    బ్యాంకు వెనకవైపు  వున్న పోలీసులు ఒక్క సారిగా బిలబిలమంటూ బయటకువచ్చారు.
    వ్యాన్ ను  సమీపిస్తూ చుట్టుముట్టెసారు.
    భార్గవ అనుకోని ఈ పరిణామం చూసి బిత్తరపోయాడు.
    వెంటనే   డైవర్ తో  చెప్పాడు  "కమాన్...క్విక్...పోనీ."
      డైవర్ భయంగా అన్నాడు "పోలీసులు చుట్టుముట్టారు."
    "యూ స్టుపిడ్...అయినా సరే...వాళ్లకి దొరికితే చంపిపారేస్తారు"అంటూ అతడ్ని తొందరపెట్టాడు.
    వ్యాన్ ముందుకురికింది.
    తాము  వ్యాన్ ని   చుట్టుముట్టుగానే  లోపల వున్న మనుష్యులు సరెండర్ అవుతారని ఎక్స్ పెక్టు చేసిన  పోలీసులు  అనుకోకుండా  వ్యాన్ ను  స్టార్ట్ చేసేసరికి కంగారుపడి పక్కకు తప్పుకున్నారు.
    వ్యాన్ వేగంగా కదిలింది.  రైట్ సైడ్ కు కట్ చేసి స్ట్రయిట్ గా పోనిచ్చాడు.
    దూరం నుంచి ఏదో  గొడవ కనిపించగానే కృపాల్ ఎలర్టయ్యాడు.  అతనికి వెంటనే అర్ధమైంది.
    తన రివాల్వర్ ని  చేతిలోకి తీసుకొని జీపు స్టార్ట్ చేసాడు.
    ధైర్యంగా  క్రాస్ రోడ్సు  వైపు వస్తున్న భార్గవ ఎదురుగా కృపాల్ జీపు కనిపించేసరికి  ఉలిక్కిపడి...
    "లెప్ట్...లెప్ట్ కు   కట్ చెయ్"  అన్నాడు కంగారుగా.
    ఈ లోగా సిటీ బ్యాంకు దగ్గర వున్న పోలీసులు జీపులో వ్యాన్ వెంటపడ్డారు.
    క్షణాల్లో ఛేజింగ్ మొదలైంది. ఓ వైపు నుంచి కృపాల్,   మరోవైపు నుంచి పోలీసులు...
    "షిట్  ఎక్కడో ఏదో జరిగింది" భార్గవ మొహంలో ఆందోళన.
    తమ రివాల్వర్స్ బయటకు తీసారు వ్యాన్ లో  వున్నవాళ్లు.  తలలు కొద్దిగా బయటకు పెట్టి, రివాల్వర్స్ గురిపెట్టి కాల్చసాగారు
    కృపాల్ కు  పరిస్ధితి  అర్ధమైంది. ఇలాగే వదిలిపెడితే, వాళ్లు పారిపోవడంఖాయం...ఏదో ఒకటి చేయాలి.
    వెంటనే దగ్గర్లో వున్న అన్ని పోలీసుస్టేషన్లకు  మెసేజ్ పంపించాడు.
    కొద్ది నిమిషాల్లోనే  దిగ్బంధనం  స్టార్ట్  అయింది.
    సరిగ్గా అప్పుడు ఎంటరయ్యాడు  జేమ్స్ డేవిడ్. తన అనుచరులు కృపాల్ చేతికి చిక్కడం ఖాయం. అదే జరిగితే కృపాల్ పెట్టె టార్చర్ భరించలేక వాళ్లు నిజం చెబుతారు.
    అది జరక్కూడదు.
    థర్ట్ స్ట్రీట్  లోకి  భార్గవ వ్యాన్ రాగానే బిల్డింగ్ పైన వున్న జేమ్స్ డేవిడ్ బాంబును వ్యాన్ మీద వదిలాడు.
    ఒక్కసారిగా పెద్ద విస్పోటనం.
    ఏం జరిగిందో అర్ధమయ్యేలోగా  జరక్కూడని దారుణం జరిగిపోయింది.
    పెద్ద శబ్దంతో వ్యాన్ పేలిపోయింది.
    వ్యాన్ లో  వున్న వాళ్ల శరీరాలు తునాతునకలయ్యాయి.
    ఊహించని సంఘటన ఒక్క క్షణం ఊహాతీతం అయింది.
    ఆ వ్యాన్ ఫాలో అవుతూ వస్తోన్న పోలీసు వెహికల్స్ అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి.
    కృపాల్ జీపులో నుంచి దిగాడు.
    స్పాట్ డెడ్...శరీరం నుంచి మొండాలు   వేరయ్యాయి. దుస్తులను బట్టి భార్గవ రూపంగా వున్న వ్యక్తి శవాన్ని  గుర్తుపట్టాడు. ఓ కాలు తెగిదూరంగా పడిపోయింది.
    చుట్టుపక్కల ఇళ్లలో వున్న వాళ్లు ఉలిక్కిపడి భూకంపం  వచ్చిందేమోనన్నంత భయపడిపోయి బయటకు వచ్చారు.
    కొన్ని నిమిషాల క్రితం నిశ్శబ్దంగా వున్న స్ట్రీట్, ఒక్కసారి శ్మశాన నిశ్శబ్దంగా మారిపోయింది.
    జనం బయటకు వచ్చి ఆ దారుణం చూసి భయపడిపోయారు.
    పోలీసులను చూసిన కొందరు మెల్లగా ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. లేనిపోని గొడవలెందుకని.
    చాలా కామన్ ఫీలింగ్ అది.
    ఎవరు రిస్క్ ని  ఫేస్ చేయలేరు.
    కృపాల్ చాలా తీక్షణం ఆలోచిసువుండి పోయాడు.
    ఒకేసారి బాంబు ఎలా పేలింది? వ్యాన్  లో  బాంబువుందా?  ఫిక్స్ చేసి వుంచారా?
    బాంబు ఎక్కడ పేలి వుండవచ్చో అంచనా వేస్తున్నాడు.  ఒకవేళ ఎవరైనా బాంబు విసిరారా? విసిరితే ఎక్కడ్నుంచి?
    క్షణాలమీద బాంబింగ్ స్క్వాడ్ వచ్చింది.  పోలను  జాగిలాలు వచ్చాయి.  రొటీన్ ఫార్ములా ప్రారంభమైంది.
    చనిపోయిన వాళ్లలో భార్గవ రూపంలో వున్న వ్యక్తి వున్నాడు కానీ విషయం తనకు తప్ప మరెవరికీ తెలియదు.
    తను ఎటువంటి పరిస్ధితుల్లోనూ  ఆ విషయాన్ని బయటకు చెప్పడు చెప్పకూడదు కూడా...
    ఎవరో తలుపుతట్టిన శబ్దం వినిపించడంతో బద్ధకంగా నిద్రలేచాడు కృపాల్.
    రాత్రి జరిగిన బ్లాస్టింగ్ లో  వ్యాన్ పేలిపోవడం, ఆ ఫార్మల్టీస్  అయిపోయే వరకు  తను వుండి యింటికొచ్చేసరికి తెల్లవారుజామున నాలుగైంది.
    అలాగే బట్టలు కూడా విప్పకుండా సోఫాలోనే  నిధ్రపోయాడు.
    తలుపు తీసాడు.  ఎదురుగా  ప్రణవి.  ఆమె కళ్లన్నీ ఎర్రగా  ఉబ్బివున్నాయి. కంటిన్యూగా ఏడుస్తూనే వున్నట్టున్నాయి ఆ కళ్లు...
    "మీరా...రండి" అంటూ తను పక్కకు జరిగి, ఆమెకు దారియిచ్చాడు.
    ప్రణవి  మౌనంగా వచ్చి పోఫాలో కూచుంది.
    "ఏం  తీసుకుంటారు?  కాఫీనా?  టినా? సారీ...బ్రహ్మచారిని కదా అంటూ ఫ్రిజ్ దగ్గరికి వెళ్లి లోపల వున్న పాలపాకెట్  తీసి కిచెన్ రూము వైపు వెళ్లాడు.
    స్టౌ వెలిగించి, గిన్నెలో పాలు పోసాడు.  ఫిల్టర్ తీసి చెక్ చేసుకున్నాడు.
    అతనికి ఆశ్చర్యంగా వుంది. ప్రణవి రాక.  బహుశా ఆవిడకు నిజం తెలిసి వుండొచ్చు.  తనని నిలదీయడానికి వచ్చి వుండొచ్చు.
    తనేం సమాధానం చెప్పాలి?  తననెలా ఓదార్చి ధైర్యం చెప్పాలి? ఓ పోలీసాఫీసర్ గా  అది తన బాధ్యతకాకపోవచ్చు.  కానీ ఓ మనిషిగా...
    పాలు పొంగుతోన్న చప్పుడు విని మంట తగ్గించి పాలలో ఫిల్టర్ లోని డికాషన్ పోసి రెండు నిమిషాలుంచి దింపి రెండు కప్పుల్లో కాఫి పోసి హాలులోకి వచ్చాడు.
    "కాఫీ "   అంటూ ప్రణవి కి  ఓ కప్పు యిచ్చి,  తనో కప్పు తీసుకున్నాడు.
    ప్రణవి మౌనంగా అలాగేవుంది.
    "కాఫీ..చల్లారుతోంది.  తీసుకోండి"
    "నా భర్త బ్రతికేవున్నాడా?"  సూటిగా అడిగింది ప్రణవి.
    ఒక్క క్షణం మౌనంగా వుండిపోయాడు కృపాల్.
    "చెప్పండ్సార్...నా భర్త బ్రతికే వున్నాడా? నేను ఈ బొట్టు వుంచుకో వచ్చా... తీసివేయానా?" ప్రణవి మాటలు కృపాల్ గుండెల్ని, శరాల్లా తాకాయి.
    "ప్లీజ్ రిలాక్సవ్వండి...మీ భర్తకు ఏమీ కాదు"
    నవ్వింది బాధగా ప్రణవి..
    "ఎవరో ఓ వ్యక్తి , నా భర్త రూపురేఖల్లో  నా దగ్గరికి  వచ్చి నువ్వే నా భార్యవని అంటే, ఆ విషయం తెలిసికూడా ఎందుకు సార్ చెప్పలేదు?"
    బాధగా కళ్లు మూసుకున్నాడు కృపాల్.  ఆ పరిస్ధితిలో ఎవరున్న అలాగే నిలదీస్తారు.
    "సార్...మీమీద నాకు కోపంలేదు,  అపరిమితమైన  గౌరవం తప్ప.  ఎందుకంటే,   నాకోసం,   మీ వృత్తి ధర్మం కాకపోయినా, రిస్క్  చేసి  సరితను    పంపిచారు.  పోలీసులంటే రాతి   మనుష్యులని విన్నాను.  కానీ ఈ రోజు మీరు చేసిన గొప్ప పని తలుచుకొని పొంగిపోయాను. మీరే కనుక ఆ పని చేసి వుండకపోతే, రేపు నా భర్తముందు శీలం చెడిన  భార్యగా తల దించుకోవాల్సి  వచ్చేది".
    "రిలాక్స్ ప్రణవిగారూ...భార్గవ రూపురేఖల్లో వున్న వ్యక్తి అసలు భార్గవ కాదని నాకు అనుమానం వచ్చింది. అయితే అది కూడా రూఢీ అయ్యేవరకు మీకు చెప్పకూడదనుకున్నాను.   అది రుజువు చేసుకోవడానికి చాలా సమయం పట్టింది.  భార్గవ పిసినారి...అతి పొదుపరి...అంతే తప్ప, నేరం చేసే మనస్తత్వం వున్నవాడు కాడు. కానీ అతని వేషంలో వచ్చిన వ్యక్తి బ్యాంకు డూప్లికేట్ తాళాలు చేయించాడు.  మీ కోసం నెక్లెస్ కొన్నాడు. అంటే అతనికి మీమీద కోరిక వుందని అర్ధమైంది.  నేను ఎంక్వయిరీ మొదలెట్టాను.

 Previous Page Next Page