Previous Page Next Page 
ప్రేమ...పెళ్ళి....విడాకులు పేజి 11

 

అగ్ని సాక్షిగా లేకపోతే ఆ వివాహం ధర్మ సమ్మతం కాదంటారు. 
ఐతే వివాహానికి, అగ్నికి ఉన్న సంబంధం ప్రాచీన వేదాల్లోనూ, పురాణాల్లోనూ ఉంది. 
అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. 
అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం బుగ్వేదంలో వివరించారు.
‘‘సోమ: ప్రధమో వివిధే, గంథర్వో వివిధ ఉత్తర:'' త్రుతీయాగ్నిష్టే పతి: తురీయప్తే మనుష్య చౌ:'' అని వివాహ సమయంలో వరుడు స్త్రీతో అంటాడు. అంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడూ, తర్వాత గంధర్వుడూ ఆ తర్వాత అగ్నీ ఏలారు. ఇహ నాల్గవ వానికి గా నేను నిన్ను ఏలుతాను అని అర్ధం.
అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసినది సోముడు(చంద్రుడు). ఎన్ని సార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసి పాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన.
కొంత వయస్సు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళిపోతాడు. ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరిస్తాడు.‘‘లావణ్యవాన్ గంధర్వ:'' అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమయిన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని, చందాన్ని ఇచ్చేసి నాపనయిపోయింది, ఇక నీదే పూచీ అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళ్ళిపోతాడు.
ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు. ‘‘అగ్నిర్వై కామ కారక:'' అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని (కామాగ్ని) ప్రవేశ పెడతాడు.
ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది.
ఇప్పుడు ఆమె వివాహానికి యోగ్యురాలైనది. ఇప్పుడు అగ్ని, వాయు, చంద్రు, ఆదిత్య, వరుణులను పిలిచి "దదా మీ త్యగ్ని ర్వదతి" - అంటే ఇంక ఈ కన్యను వరునికి ఇవ్వదలచుకున్నానయ్యా అంటాడు అగ్ని. వెంటనే వాయు, చంద్రాదిత్యవరుణులు తమ అంగీకారాన్ని తెలుపుతాడు. అంటే అమ్మాయి వివాహానికి యోగ్యురాలైనది. ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్లాలి కనుక కళ్యాణ సమయంలో ఆమెను నరునికి ఇస్తాడు. అలా ఆమెను ‘‘అగ్ని సాక్షిగా'' వరుడు స్వీకరిస్తాడు.
చంద్రసాక్షిగా గంధర్వుడూ, గంధర్వసాక్షిగా అగ్ని, అగ్నిఆమెను రక్షించగా, అగ్నిసాక్షిగా వరుడు గ్రహిస్తాడు ఆ అమ్మాయిని. అందుకని "అగ్నిసాక్షిగా పెళ్ళి" అనే మాట వచ్చింది. ఇలా మన సంస్కృతిలో అగ్నికి చాలా ప్రాముఖ్యత ఉంది.  
ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని ప్రథమసూక్తం అగ్నిసూక్తం. అగ్నిమీళేపురోహితం అనేది ప్రథమ మంత్రం. ఇలా వేదాలలోని ప్రథమ శబ్దం అగ్ని అంగా పరబ్రహ్మ స్వరూపుడైన అగ్నినే ఋషులు గుర్తించి అగ్రస్వరూపునిగా కీర్తించారు.
ఆ ప్రథమస్వరూపుని ఆరాధన వల్ల మనం తరిస్తాం. నిరాకార బ్రహ్మ జ్యోతి (అగ్ని) స్వరూపం. ఆ బ్రహ్మం సాకారమయితే ఆ సాకార దేవతారూపాలు అగ్నిరూపాలే. సృష్ఠిలో మనకు ఏదైనా గోచరం కావలనంటే దానికి రూపం కావలయును. రూపమిచ్చేది అగ్ని. రూపరహతుడు అగ్నే.
ఆగ్ని, ఇరాకార జ్యోతిర్మయ బ్రహ్మం అగ్ని. సాకార విశ్వమూ అగ్నే. మన దేహంలో జఠరాగ్ని, కంటిలో ప్రకాశం, శరీరంలో ఉష్ణత్వం, సూర్యుడు, నక్షత్రాలు, జ్ఞానాగ్ని, వనాగ్ని అంటూ సమస్తం అగ్నిమయం.
మన మానసిక భావాలు కూడ అగ్నులే. క్రోధాగ్ని, కామగ్ని, తపోగ్ని... ఇలా సర్వం అగ్నిమయం జగత్. ఈశ్వరుని 'బ్రహ్మజ్యోతి స్వరూపంచ' అని అన్నారు. మహోన్నతమయి సర్వత్రా నిండిన జ్యోతి (అగ్ని) స్వరూపుడన్నది స్పష్టం.
                                                                 ****
తెల్లవారు ఝాము వరకు పెళ్ళి కార్యక్రమం సాగుతోంది. 
టీలు గంట గంటకు తాగడంవలన అందరూ నిద్రను ఆపుకొని కూర్చోనున్నారు. 
పురోహితుల వేదమంత్రాలు వీనుల విందుగా హాయి గొలిపాయి. 
సంజయ్ క్లోజ్ ఫ్రెండ్స్ అమెరికా నుంచి వచ్చిన నలుగురు అబ్బాయిలు వాడిని అంటిపెట్టుకుని కూర్చుని హుషారు చేస్తున్నారు. 
వెబ్కాస్టింగ్ ద్వారా ఫ్రెండ్స్ కి ఇంటర్నెట్ లో పెళ్లి సన్నివేశాలు చూపిస్తున్నారు.
శృతి, తన ముఖ్య ఫ్రెండ్స్ కూడా ఓపిగ్గా కూర్చుని పెళ్లి తతంగం చూస్తున్నారు భక్తితో. 
మధ్య మధ్యలో జోక్ వేస్తూ అందరిని నవ్విస్తున్నారు. 
సందర్భానుసారంగా చక్కటి హమ్మింగ్ చేస్తూ పాటలు పాడుతున్నారు. 
నేటి యువత చాలా ఫాస్ట్. అద్భుతమైన తెలివితేటలున్న వాళ్ళు. 
వాళ్ళని అందుకోవడం, వాళ్ళతో తర్కించడం చాలా కష్టం. 
వారి మేధస్సును సరియైన బాటలో నడిపిస్తే ప్రపంచాన్నే మార్చేయొచ్చు. అంతటి సమర్ధవంతులు. 
మాంగళ్య ముహూర్తం ఎనిమిదిగంటలు కావున అందరం రెండు గంటలు రెస్ట్ తీసుకున్నాం పురోహితుల పర్మిషన్ తో.
 పురోహితుల వారు కూడా అలసిపోయారు కావున వారు కూడా కొంచెం సేపు విశ్రమించారు.
ఇక అసలు ముహూర్తం దగ్గరపడింది. 
పొద్దున్నేమాంగళ్య ముహూర్త వేళకు చాలా మంది ఆహూతులు వచ్చారు, ఓపిగ్గా వధూ వరులను ఆశీర్వదించేందుకు. 
ముహూర్త సమయానికి మధు, ప్రవల్లిక కూడా కొంత  ఉద్విగ్నతకు లోనయ్యారు ఆనందం పట్టలేక.
ప్రవల్లిక మంజరి కోసం డైమండ్ ముక్కు పుడక చేయించి ముహూర్తానికి అలంకరించింది. 
నగలు చాలా చేయించింది కోడలు కోసం. తనవి కూడా కొన్ని ఇచ్చింది. అన్నిటి అలంకరణతో మహాలక్ష్మిలా వెలిగిపోతోంది మంజరి. 
అసలే పచ్చని మేని ఛాయ. అందూలోనూ చక్కటి రూపం. వెరసి అపరంజిలా మెరిసిపోతోంది. 
మీవదిన చూడవే గోల్డెన్ గర్ల్ అంటూ ఆటపట్టిస్తున్నారు శృతి ఫ్రెండ్స్.
మంజరి ఫ్రెండ్స్ కూడా ముహూర్తానికి చాలా మందే వచ్చారు. 
విజయవాడ లోనే పుట్టి, పెరిగి, ఎం టెక్ వరకు చదువుకున్నందువలన చాలామందే వచ్చారు. 
మంజరికి కూడా తన స్నేహితురాళ్ళని చూసి మొహం మతాబులా వెలిగిపోయింది.   
అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్లు అతి వైభవంగా సంజయ్ మంజరిల వివాహం జరిగింది. 
మంజరి తండ్రి ముకుందరావు బాగానే ఖర్చుపెట్టారు. 
అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసాడు. 
ప్రతి ఒక్క విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. 
అందరికి సంతృప్తి కలిగింది. 
అంతే కాదు, పెళ్ళికి రాలేకపోయిన పెద్ద, ముసలి వాళ్లకు వారి ఊళ్లకు, ఇళ్లకు వెళ్లి బట్టలు అవి పెట్టాలి అని చెప్పాడు. 
అతని ఓపికకి, మర్యాదకి మనసులోనే మెచ్చుకున్నాను.
ముందే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో అప్లై చేసినందువలన ముహూర్తం టైం కి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ స్టాఫ్ ఒకతను వచ్చి రిజిస్టర్ లో వధూవరుల సంతకం చేయించుకున్నాడు. 
సో  మ్యారేజ్ సర్టిఫికెట్ పొందడానికి  అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 
ఇక మధ్యాహ్నం భోజనాలు చేసుకుని వధువు మంజరిని, ఆమె పిన్ని, మేనత్త వెంటరాగా అన్ని బస్సులు తిరుగు ప్రయాణం అయ్యాయి హైదరాబాద్ కి. 
ఇక మధు వాళ్ళింట్లో ఆ సాయంత్రం నూతన వధూవరులు గృహప్రవేశం, ప్రక్కరోజు సత్యనారాయణ వ్రతం, అదే రోజు సాయంత్రం హైదరాబాద్ బంధువులకు, మిత్రులకు, తెలిసినవాళ్లకు విందు ఏర్పాటు చేసాడు.
అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నం గా జరిగాయి. 
****
మధు ఫామిలీ అంతా కలిసి తిరుమల మొక్కు తీర్చుకునేందుకు వెళ్లారు కోడలితో.
మంజరికి షిర్డీ సాయిబాబా చూడాలని ఉందంటే తిరుపతి నుంచి సంజయ్ మంజరి ఇద్దరూ కలిసి ఫ్లైట్ లో షిర్డీ వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకున్నారు.  
ముకుందరావు శోభనం ముహూర్తం నిర్ణయించడంతో షిర్డీ నుంచి విజయవాడ వెళ్లారు.
అన్నీ చక చక జరిగిపోయాయి. 
మంజరి వీసా స్టాంపింగ్ కంప్లీట్ అయ్యింది ప్రాబ్లెమ్ లేకుండా.
మంజరి ఒక వారం మధు వాళ్ళింటిలో ఉంది. 
అందరూ సరదాగా ఆ వారం ఎంజాయ్ చేశారు. 
బంధువులను పిలవడం, వాళ్ళ ఇళ్లకు వీళ్ళు వెళ్లడం అలా మంజరికి అందరూ పరిచయం అయ్యారు. 
సంజయ్ ఫ్రెండ్స్ కూడా చాలా సార్లు కలిశారు. 
కాలం చాలా వేగంగా ఆనందంగా గడిచిపోయింది అందరికి. 
ఇక సంజయ్, మంజరి అమెరికా వెళ్లే రోజు దగ్గరపడింది.
ఆ రోజు విజయవాడ నుంచి మంజరి పేరెంట్స్, హైదరాబాద్ లో వాళ్ళ బంధువులు అందరూ మధు వాళ్ళింట్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసుకుని ఈవెనింగ్ ఫ్లైట్ కి  సంజయ్ మంజరి ఇద్దరినీ ఫ్లైట్ ఎక్కించారు.
హమ్మయ్య అని ఇరువైపులా ఊపిరి పీల్చుకున్నారు. 
ఎక్కడా ఇబ్బందులు లేకుండా అంతా సజావుగా సాగినందుకు ఎంతో సంతృప్తిచెందారు. 
****
గతంలోంచి ప్రస్తుతంలోకి వస్తే గణ గణమని అలారం మోగించింది గడియారం.
 

 

 Previous Page Next Page